“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

15, ఆగస్టు 2022, సోమవారం

మూడవ అమెరికా యాత్ర - 5 (కోవిడ్ తో ఆడుకున్నాం)

ఏంటి టైటిల్ తప్పు పెట్టినట్టున్నారు? 

'ప్రస్తుతం గురువుగారు అమెరికాలో ఉన్నారు కదా. కాబట్టి డేవిడ్ తో ఆడుకున్నాం అనాలి కదా?' అన్న అనుమానం వచ్చిందా? డేవిడ్ కాదు కోవిడే. సాక్షాత్తు కోవిడ్ తోనే సరదా ఆటను ఆడుకున్నాం.

ఆ కథను వినండి.

నా రిటైర్మెంట్ చాలా విచిత్రంగా జరిగింది. జూలై నెలలో 30, 31 శని ఆదివారాలయ్యాయి గనుక 29 నాకు లాస్ట్ వర్కింగ్ డే అయింది. అందుకని 27 న రైల్ నిలయంలోని మా ఆఫీసులో లంచ్ పార్టీ ఇచ్చాను. ఆ సమయంలోనే నాకు కోవిడ్ ఎటాక్ అయింది.

గత నాలుగు నెలలక్రితం వరకూ నేను కోవిడ్ వాక్సిన్ వేసుకోలేదు. కానీ గత రెండేళ్లుగా వందలాదిమందితో కలసి తిరుగుతూ పని చేసుకుంటూనే ఉన్నాను. నా చుట్టుప్రక్కల ఎంతోమంది కోవిడ్ తో చనిపోయారు.  కానీ గత రెండేళ్లుగా నాకు కోవిడ్ ఎటాక్ కాలేదు. మా ఆఫీసు మొత్తానికీ నేనొక్కడినే వాక్సిన్ వేసుకోనివాడిని.  నాకవసరం లేదని వారికి చెప్పేవాడిని. వాక్సిన్ వేసుకోని వారి లిస్ట్ GM గారికి ప్రతినెలా వెళుతూ ఉండేది. అందులో  నా పేరు మాటిమాటికీ కనిపిస్తూ ఉండేది. ప్రతివారూ అడుగుతూ ఉండేవారు, 'ఏంటి సార్ మీరింకా వాక్సిన్ వేసుకోలేదా? ఫ్రీనే. మన కార్లో వెళ్లి లాలాగూడ హాస్పటల్లో వేయించుకుని రండి' అని పోరు పెట్టేవారు. అదీగాక, నాలుగు నెలలలో అమెరికా వెళ్ళాలి.  వాక్సిన్ సర్టిఫికెట్ లేనిదే విమానం ఎక్కనివ్వరు గనుక నాలుగు నెలలక్రితం, నాకవసరం లేదని తెలిసినా, చచ్చినట్టు వాక్సిన్ వేయించుకున్నాను. ఆ తర్వాత పదిరోజుల క్రితం నాకు కోవిడ్ సోకింది. నాకేకాదు, నా నుంచి నా కుటుంబం అందరికీ సోకింది.

సడన్ గా చలి, ఒళ్ళు నొప్పులు, నడుం నొప్పి, జ్వరం, దగ్గు మొదలయ్యాయి. కోవిడ్ టెస్ట్ చేయిస్తే పాజిటివ్ వచ్చింది.  తీవ్రమైన నడుం నొప్పితో ప్రక్కమీద పడుకుని ఉండి, జస్ట్ పక్కకు దొర్లడం కూడా నరకం లాగా ఉండేది.  లేచి కూర్చోవడం అంటే ఇక గగనమే. టాయిలెట్ కు వెళ్లాలంటే నరకం కనిపించేది. ఈ విధంగా రెండు రోజులు బాధపడ్డాను. 

కోవిడ్ మీద హోమియో ఎలా పనిచేస్తుందో నా బాడీలోనే సరదాగా చూద్దామని అనుకున్నాను.  లక్షణాలు గమనించాను. మందులు ఇండికేట్ అయ్యాయి. ఈలోపల మా అమ్మాయికి, మా శ్రీమతికి కూడా నానుంచి కోవిడ్ సోకింది. వాళ్ళూ జ్వరంతో, ఒళ్లునొప్పులతో, ఇతరలక్షణాలతో అడ్డం పడ్డారు. అందరికీ మందులేసుకుంటూ, నాలుగు రోజుల్లో కోవిడ్ ను తరిమికొట్టాము.

బ్రయోనియా, జెల్సిమియం, నేట్రంమూర్ ఇవే మేము వాడిన మందులు. కోవిడ్ పారిపోయింది. ఏ ఆస్పత్రికీ మేము వెళ్ళలేదు. ఏ ఇంగ్లీషు మందులూ మింగలేదు. కోవిడ్ తో ఆడుకున్నాం. జయించాం.

మేము ముగ్గురమూ కోవిడ్ తో అడ్డం పడి వారం రోజులున్నాము. అదే ఇంట్లో మాకు సేవలు చేస్తూ ఇంకో ఇద్దరు వ్యక్తులున్నారు. వాళ్ళు మూర్తి, సంధ్య. వాళ్ళు కూడా నాలాగే వాక్సిన్ వేయించుకోలేదు. నేనంటే అమెరికా వెళ్ళాలి కాబట్టి కొద్దినెలలక్రిత్రం వాక్సిన్ వేయించుకున్నాను. కానీ వాళ్ళు ఈనాటికీ వాక్సిన్ వేయించుకోలేదు.  కోవిడ్ విలయతాండవం చేసిన గుంటూరు దగ్గర ఒక ఊరిలో వారుంటారు. వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఎంతోమంది కోవిడ్ తో గత రెండేళ్లతో చనిపోయారు. కానీ కోవిడ్ వాళ్ళను ఈనాటికీ తాకలేదు. అదికాదు అసలు సంగతి. 

వాళ్ళు మాతోనే మా ఇంట్లోనే నెలరోజులున్నారు. కోవిడ్ తో అడ్డంపడిన మాకు సేవలు చేశారు. అందరం ఒకే హాల్లో నిద్రించేవాళ్ళం.  ఇంటికి పెద్దగా వెంటిలేషన్ లేదు. అవే బాత్రూములు, ఆదే కిచెన్, అదే వస్తువులు వాళ్ళూ వాడారు, ముగ్గురు కోవిడ్ పేషంట్లతో ఒకే ఇంట్లో రెండువారాలున్నారు. కానీ వాళ్లకు కోవిడ్ సోకలేదు. మాకు కోవిడ్ వచ్చింది, తగ్గింది. వాళ్లకు మాత్రం సోకలేదు. అచంచలమైన గురుభక్తితో కోవిడ్ ను దరిదాపులక్కూడా రాకుండా తరిమికొట్టారు మూర్తి సంధ్య దంపతులు.  ఈ సంఘటన ఎప్పుడో ఇక్ష్వాకుల కాలంలో జరగలేదు. కేవలం పదిరోజులక్రితమే హైద్రాబాద్  KPHB కాలనీలో జరిగింది.

ఏవో సాయిబాబా పుస్తకాలలో మహిమలను చదివి చెక్కభజనలు చెయ్యడం కాదు, అద్భుతాలు మీ కళ్ళ ముందే జరుగుతున్నాయి. చూచే చూపుంటే చూడండి.