“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

12, ఆగస్టు 2022, శుక్రవారం

మూడవ అమెరికా యాత్ర -2 (నిజమైన గురులక్షణం)

పదేళ్లనాడు నాకొక శిష్యురాలుండేది. ఆమె పేరు 'ప'. చాలా చంచల మనస్కురాలు. అన్నీ తనకు తెలుసనుకుంటుంది. దూకుడు నిర్ణయాలు తీసుకుంటుంది. నేటి అనేకమంది లాగా, నెట్ లో నాలుగు సైట్లు చూసేసి అదే ji ఆధ్యాత్మికత అనుకునేవారిలాగా తనుకూడా ఉండేది. తన దూకుడు నిర్ణయాలవల్ల జీవితంలో చాలా నష్టపోతూ ఉంటుంది. కానీ తెలివి తెచ్చుకోదు. ప్రతిసారీ ఇదేవిధంగా చేస్తూ ఉండేది. ఇవన్నీ కరెక్ట్ కాదని నేను చెప్పేవాడిని. నీ పధ్ధతి మార్చుకోవాలని చెబుతూ ఉండేవాడిని.

ఈమె తల్లిగారు బ్రహ్మకుమారి సంస్థలో చాలా సీనియర్ సభ్యురాలు. అసలు 'ప' ఆధ్యాత్మికజీవితం దారితప్పి ఎటో వెళ్లిపోవడానికి ఈ తల్లే కారణం. ఆధ్యాత్మికజీవితం వేరు, లౌకిక జీవితం వేరు అని నేను ఎప్పుడూ చెప్పను. ఉన్నది ఒకటే జీవితం. కానీ మాటవరసకు ఈ పదాన్ని వాడాను. తన తల్లివల్ల ఈ అమ్మాయి లౌకికజీవితం కూడా నాశనమైపోయింది. కొంతమంది తల్లిదండ్రులు ఇంతే. పిల్లల జీవితాలను వాళ్ళే నాశనం చేస్తారు. ప్రస్తుతం సమాజంలో ఈ ట్రెండ్ చాలా ఎక్కువగా ఉంది.

బ్రహ్మకుమారి సంస్థలో చేరి వాళ్ళ బోధలు తలకెక్కితే మనుషులు ఒక విధమైన పిచ్చిలోకి వెళ్ళిపోతారు. చాలా పెడగా తయారౌతారు. ఛాందసపు బ్రాహ్మలలాగా, పిడివాద క్రైస్తవుల లాగా, ఇంకా చెప్పాలంటే చిన్నసైజు తీవ్రవాద ముస్లిములలాగా తయారౌతారు. కూతుర్ని బ్రెయిన్ వాష్ చెయ్యాలని తల్లి శతవిధాలా ప్రయత్నిస్తూ ఉండేది. 'ప' నా బోధలలో  పడటం ఆమెకు ఇష్టం ఉండేది కాదు. ఆఫ్ కోర్స్, నా బోధలను 'ప' ఎప్పుడూ సరిగ్గా అర్ధం చేసుకోలేదు. తాను ఎక్కడెక్కడో నేర్చుకున్నవీ, నెట్లో వెదికి పట్టుకున్నవీ, యూట్యూబులో చూసినవీ అన్నీ కలగలిపి ఆచరిస్తూ ఉండేది. ఊరకే నా బోధలు వినేది కానీ ఏదీ తలకెక్కించుకునేది కాదు. ఇది సరైనదారి కాదని నేను చాలా చెప్పేవాడిని. కానీ తను వినేది కాదు. దీనికి కారణం తన జాతకంలో పంచమంలో ఉన్న నీచ శనియోగం. 

పాతకాలంలో ఒక వ్యక్తిని శిష్యునిగా అంగీకరించాలంటే, అసలైన గురువులు అతని జాతకాన్ని తప్పకుండా పరిశీలించేవారు. ఆ జాతకంలో ఉన్న యోగాలను బట్టి, అతను ఆధ్యాత్మిక సాధనామార్గంలో నిలబడగలడా, నడవగలడా, లేదా, వారికి వెంటనే తెలిసిపోయేది. ఆ తరువాతే అతడిని శిష్యునిగా తీసుకునేవారు. జాతకం మంచిది కాకపోతే, అతని గతకర్మ బలీయంగా ఉంటే, అవసరార్ధం ఆ సమయానికి అతడెంత మంచిగా మాట్లాడినప్పటికీ, అతడిని తిరస్కరించేవారు. ప్రాచీన సాంప్రదాయ గురువులలో ఇది ఒక ఆచారంగా ఉంటూ ఉండేది. ఈ నాటికీ ఉంది.

నేనీ అమ్మాయి జాతకాన్ని చూచినప్పటికీ, అందులోని చెడు యోగాలను చూచినప్పటికీ, పోనీలే పాపమని తనను  కొన్నేళ్ళపాటు భరించాను. ప్రతివారికీ ఒక అవకాశం ఇచ్చిచూడటం నా విధానం. మనం కాదంటే వాళ్ళు తప్పుదారిలో పడిపోతారని నాకు బాగా తెలుసు. అందుకని, జాతకం బాగాలేకపోయినా, వారికి సాయం చేద్దామని, వారి చెడుకర్మను క్షాళనం చేద్దామని  భావిస్తాను. ఈ అమ్మాయి విషయంలో కూడా అలాగే భావించాను. 

నిజమైన గురులక్షణం ఇదే.

పంచమంలో నీచశని ఉన్న జాతకులు, సంతానం ద్వారా చాలా నష్టపోతారు. వారి జీవితమంతా  సంతానం కోసమే ఖర్చయిపోతుంది. వారి జీవితాన్ని పిల్లలే శాసిస్తారు. ఎంతగా అంటే,  వారికింక పర్సనల్ జీవితం ఏమాత్రమూ ఉండనంతగా ఈ బంధం ఉంటుంది. వీరి జీవితాలకు సంతానమే శాపం అవుతుంది. వీరికి మనసు కూడా  చాలా ఊగిసలాటగా ఉంటుంది. పఞ్చమం బుద్ధిస్థానం గనుక, దాదాపుగా స్కిజోప్రినియా లక్షణాలు వీరిలో ఉంటాయి. అమావాస్యకూ పౌర్ణమికి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు.  ఇవన్నీ ఈమెలో ఉన్నాయి. కానీ ఈమెకు సరియైనదారిని  చూపిద్దామని, తన కర్మను జయింపజేద్దామని నేను భావించాను. కానీ ఈమె గతకర్మ చాలా బలీయంగా ఉంది. 

గత అయిదేళ్లుగా ఈమె నాతో టచ్ లో లేదు. దూరమైంది. సొంతనిర్ణయాలు తీసుకుని జీవితంలో ముందుకెళుతోంది.  'మంచిదే' అని నేనూ ఊరుకున్నాను. ప్రస్తుతం అమెరికాలో అడుగుపెట్టాను గనుక, ఒకసారి తనను పలకరిద్దామని భావించాను. అందుకే నిన్న సాయంత్రం ఈమె ఇల్లు వెతుక్కుంటూ మరీ వెళ్ళాము. తాను ఇంట్లో లేదు. లేదా, ఉండికూడా, కావాలనే తలుపు తియ్యలేదో తెలియదు. రెండుసార్లు కాలింగ్ బెల్ కొట్టి చూచాము. పలకలేదు. వెనక్కు వచ్చేశాము.

మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా, ఎవరు గేట్  ముందుకొచ్చి కాలింగ్ బెల్ కొట్టారో, మనం  ఎక్కడున్నప్పటికీ, మన  ఫోన్ లోనుంచి చూచుకోవచ్చు. అలాంటి టెక్నాలజీ ఇక్కడ ఉంది. ఆ విధంగా ఆమె చూచింది.  కాల్ చేసింది.

'నేను వేరే దారిలో ముందుకెళ్లాను. వేరే గురువుల దగ్గర దీక్షలు తీసుకున్నాను. నా పిల్లలకు, మా కుటుంబసభ్యులకు, నేను మీ మార్గంలో నడవడం ఇష్టం లేదు. ఇప్పుడిప్పుడే నా సంసారం దారినపడుతోంది. నా పిల్లలతో నా సంబంధాలు బాగుపడుతున్నాయి. కనుక దయచేసి నన్ను కాంటాక్ట్ చెయ్యాలని ప్రయత్నించకండి' అనేది ఆమె మాటల సారాంశం.

నవ్వుకున్నాను. తనమీద జాలి కలిగింది. సంసారం వద్దని నేనెప్పుడూ చెప్పలేదు. భర్తతో విడిపోతానని తాను గొడవ చేసిన ప్రతిసారీ ఒద్దని ఎంతో నచ్చచెప్పాను. కానీ ఆమె వినలేదు. చిన్నప్పుడే సన్యాసాన్ని త్యాగం చేసిన నేను, సంసారం చెడగొట్టుకోమని ఇతరులకు ఎందుకు చెబుతాను? సక్రమంగా జీవించమని, ఆధ్యాత్మికం, లౌకికం అంటూ రెండు లేవని, ఉన్నది ఒకటే జీవితమని, అర్ధం చేసుకుని, నీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ బ్రతకమని, ధర్మంగా జీవించమనే నేనెప్పుడూ  నా  శిష్యులకు చెబుతాను. 

ఈమె ఇంటినుండి వెనుకకు తిరిగి వచ్చేస్తుంటే, మహాభారతం నుండి ఒక సన్నివేశం గుర్తొచ్చింది.

రాయబారం కోసం శ్రీకృష్ణుడు హస్తినాపురం వెళ్ళినపుడు అందరి ఇళ్లకూ వెళ్ళాడు. దుర్యోధనుడి ఇంటికీ వెళ్ళాడు, విదురుడి ఇంటికీ వెళ్ళాడు, కుంతీదేవి ఇంటికీ వెళ్ళాడు. ఒక్కొక్కచోట ఒక్కొక్క విధమైన మర్యాదలు ఆయనకు జరిగాయి. కొన్నిచోట్ల అవమానాలు ఎదురయ్యాయి. కొన్నిచోట్ల తలుపులే తెరుచుకోలేదు. సత్కారమైనా, ఛీత్కారమైనా, పరమాన్నమైనా, పరాభవమైనా అన్నింటినీ సమంగా స్వీకరించాడు శ్రీకృష్ణుడు. నవ్వుకున్నాడు. వెనక్కు వెళ్ళిపోయాడు. ఆయనకేం తక్కువైంది?

సాక్షాత్తు భగవంతుడే ఇంటిముందుకొచ్చి నిలబడ్డాడు. తలుపు తీసి లోపలకు అహ్వానించే అదృష్టం వారికి లేదు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, ఆయనను అవమానించారు. అవసరార్ధం ఆయనతో నటించారు. ఫలితాన్ని అనుభవించారు. కానీ, విదురుడు, కుంతి ఆయనను సాదరంగా ఆహ్వానించారు. భక్తితో సేవించారు. ధన్యాత్ములయ్యారు.

మనం అర్ధం చేసుకున్నా, అర్ధం చేసుకోకపోయినా, ఆహ్వానించినా, తిరస్కరించినా,  పూజించినా, అవమానించినా, ఏం చేసినా ఆయనకేం తక్కువౌతుంది? మన కర్మను బట్టి మన ఖర్మ తయారౌతుంది. అంతే !

అదే విధంగా, ఈ అమ్మాయి ఇంటిని వెదుక్కుంటూ నేను అమెరికాలో వెళ్ళడానికి వెనుక ఉద్దేశ్యం ఏముంది? ఏమీ లేదు. ఎవరినుంచీ నేనేదీ ఆశించను. అలా, మంది డబ్బుల మీద బ్రతికేవాడినైతే, నలభై ఏళ్ళపాటు ఉద్యోగం చెయ్యను. 1982 లోనే ఒక గురువుగా మారి, డొనేషన్లు దండుకుని,  ఈ పాటికి నేటి గురువులకు అందనంత లౌకికస్థాయిలో ఉండేవాడిని. ఇతరుల సొమ్మును తాకను గనుకనే, నలభైఏళ్ళపాటు ఒక కుళ్ళు వ్యవస్థలో ఉద్యోగం చేసినప్పటికీ, దానిని అంటించుకోకుండా, స్వచ్ఛంగా బ్రతికాను.

నలభైఏళ్ళనాడు తనదగ్గర బ్రహ్మచారిగా చేరమని మహాతపస్వి శ్రీమత్ నందానందస్వామి నన్ను కోరినప్పుడు, నేను తిరస్కరించడానికి ఒకే ఒక్క కారణం, 'ఇతరుల డొనేషన్ల మీద ఆధారపడే స్వామీజీగా బ్రతకడం నాకిష్టం లేకపోవడమే'. 

'లౌకికంగా ఉంటూనే ఆధ్యాత్మికమార్గంలో నేను నడుస్తాను. నా సంపాదన మీదే నేను బ్రతుకుతాను. దీనికోసం, మీ ఆజ్ఞను పాటించలేకపోతున్నాను. సన్యాసం స్వీకరించలేను. నన్ను క్షమించండి' అని ఆయన కాళ్ళు పట్టుకుని మరీ చెప్పాను. ఈ సంఘటన 1982 లో జరిగింది.

వారి హృదయాన్ని బట్టి, వారి ప్రేమను బట్టి నేను దగ్గరౌతాను గాని ఏదో ఆశించి కాదు. అవి ప్రస్తుతం వారిలో లేకపోయినా కూడా, ఎప్పుడో వారు చేసిన ఒక చిన్నపనిని, సేవను, నా పట్ల చూపించిన చిన్నపాటి ప్రేమను గుర్తుంచుకుని వారిని మళ్ళీ పలకరిస్తాను. నేనే వారిని వెదుక్కుంటూ వెళతాను.

ఇదంతా చెయ్యడంలో నాదొక్కటే ఉద్దేశం. అసలైన వెలుగుదారిని వారికి చూపించాలన్న, ఒకేఒక్క సంకల్పంతో నేను మనుషులకు దగ్గరౌతాను. మరొక్క అవకాశాన్ని వారికి మళ్ళీ ఇచ్చి చూస్తాను. ఇది తప్ప, ఎవరికైనా సరే దగ్గరవ్వాల్సిన పని నాకేముంది? మనుషులతో నాకెందుకు?

శ్రీ రామకృష్ణులు, గురువులను మూడు రకాల వైద్యులతో పోల్చారు.

మొదటి రకం గురువు, సాధారణ వైద్యునివంటి వాడు. మందిచ్చి వెళ్ళిపోతాడు. పట్టించుకోడు. శిష్యుని పురోగతిని గురించి వాకబు చెయ్యడు.రోగి యొక్క రోగం తగ్గిందా లేదా పట్టించుకోడు.

రెండవరకం గురువు, అప్పుడప్పడూ రోగి క్షేమసమాచారాలు కనుక్కుంటూ ఉండే మధ్యరకం వైద్యునివంటి వాడు.  తనకు వీలున్నప్పుడు శిష్యుని ఆధ్యాత్మిక పురోగతిని గురించి పైపైన కనుక్కుంటాడు.

మూడవరకం గురువు,  ఉత్తమ వైద్యుని వంటి వాడు. మందు వేసుకోనని మొండికేస్తున్న రోగిని, నేలపైన పడేసి, అతని ఛాతీమీద తన మోకాలితో అదిమిపట్టి, నోరు పగలదీసి, చేదుమందును బలవంతాన మింగిస్తాడు. అంత బాధ్యతను అతను ఫీలౌతాడు. కారణం? నేటికాలపు సెల్ఫిష్ డాక్టర్లలాగా రోగిని దోపిడీ చేద్దామని కాదు. ఆ రోగం ఎలాగైనా తగ్గించాలన్నదే అతని సంకల్పం గనుక ఈ విధంగా ప్రవర్తిస్తాడు.

ఉత్తమగురువులను ఈ మూడవరకపు వైద్యులతో పోల్చారు శ్రీ రామకృష్ణులవారు. అటువంటి గురువు, తన శిష్యుని ఎన్నటికీ మర్చిపోడు. శిష్యుడు మర్చిపోయినా అతను మర్చిపోడు. కారణం? అలాంటి గురువులో స్వార్ధపరమైన ఆలోచనలేవీ ఉండవు.  కోరికలూ ఉండవు. శిష్యుని ఆధ్యాత్మిక పురోగతి ఒక్కటే అతను కోరుకుంటాడు. అలాంటివాడు ఉత్తమగురువు.

గతపు పాపఖర్మ వదలనిదే ఎవ్వరూ వెలుగుదారులలో నడవలేరు. తప్పును చేస్తూ ఒప్పుగా అనుకోవడం, తప్పుగా భ్రమించి ఒప్పును చెయ్యకపోవడం  -- ఇంతేగా సామాన్యుని జీవితం !