“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

24, ఆగస్టు 2022, బుధవారం

మూడవ అమెరికా యాత్ర - 9 (మళ్ళీ UG)

ఇక్కడికొచ్చాక చదివిన మంచి పుస్తకం, మహేష్ భట్ వ్రాసిన U.G. Krishnamurti, A Life. ఇది మా అబ్బాయి లైబ్రరీలో ఉంది. తనే నాకిచ్చి, 'నాన్నా ఈ పుస్తకం చదివావా?' అన్నాడు.

'గతంలో చంద్రశేఖర్ గారు అన్నారు "మహేష్ చాలా మంచిపుస్తకం వ్రాశాడ"ని. వీలైతే చదవాలనుకున్నాను. ఇప్పుడు చదువుతాను' అన్నాను.

ఇలాంటి పుస్తకం దొరికితే మనకు విందుభోజనమే కదా! ఇంక వేరే తిండి అక్కర్లేదు. చదివేశాను. అందులో చాలా భాగాలు మిగతాచోట్ల ఇప్పటిదాకా చదివినవే. కానీ మహేష్ భట్ వాడే ఇంగ్లీష్ భాష చాలా బాగుంటుంది. మంచి ఇంగ్లిష్ ఒకటి, పుస్తకం సబ్జెక్ట్ మరొకటి. రెండూ కలిస్తే ఇక విందుభోజనం కాక మరేముంది?

UG గారు సహజసమాధిని అందుకున జీవన్ముక్తుడు. జిడ్డు, ఓషో, పరమహంస యోగానంద మొదలైన వారికంటే ఉన్నతస్థితిని పొందినవాడు. అంతేకాదు, నిజమైన కుండలినీ జాగృతిని పొంది, ప్రయాణం చివరివరకూ నడిచినవాడు. అమనస్కస్థితిని పొందినవాడు. 
వీళ్లందరినీ కూలంకషంగా చదివినమీదట, వీరి మార్గాలు క్షుణ్ణంగా తెలుసుకున్న మీదట, ఈ మాటను నేను చెబుతున్నాను.

అయితే, మన ఆంధ్రా పిచ్చి జనానికి అసలైన రత్నాలు అక్కర్లేదు కదా ! వీళ్లకు గులకరాళ్లే కావాలి. అందుకే అవే వాళ్లకు దొరుకుతున్నాయి. ఏం చేస్తాం? ఎవరి ఖర్మ వారిది.

కోరికలు తీరడం, పనులు కావడం మొదలైన చీప్ జిమ్మిక్స్ కోసం సాయిబాబాను, అయ్యప్పను పూజిస్తూ, నలభైరోజుల పిచ్చిదీక్షలు చేసే మన తెలుగుజనాలకు, రెండు ఆసనాలు, మూడు ప్రాణాయామాలు నేర్చుకుని యోగంలో తీరాలు దాటామని విర్రవీగే సోకాల్డ్ యోగా కల్ట్ మనుషులకు UG ఎప్పటికి అర్ధమయ్యేను?

అమెరికా కొచ్చాక, UG గారు నా మనసులో నిరంతరం తిరుగుతున్నారు ఎందుకో తెలీదు. ఇంతలో ఆయన పుస్తకమొచ్చింది. చదవడం అయిపోయింది. ఈ పుస్తకం చదివాక, మహేష్ భట్ అంటే నాకు గౌరవం పెరిగింది. బాంబే సినీ ఫీల్డులో అన్ని ఏళ్ళనుండీ ఒక కదారచయితగా, దర్శకుడిగా ఉంటూ, టాప్ హీరోయిన్లతో తిరుగుతూ, గ్లామర్ ప్రపంచంలో బ్రతుకుతూ, అంత లోతైన భావజాలం కలిగి ఉండటం అనూహ్యం. అటువంటి పుస్తకాన్ని మన తెలుగు సినీపక్షులలో ఎవ్వరూ వ్రాయలేరని ఘంటాపధంగా చెప్పవచ్చు. అలాంటి పుస్తకాన్ని వ్రాయాలంటే జీవితమంటే లోతైన చింతన ఉండాలి. అలాంటి చింతన, బాంబే గ్లామర్ సినీ ఫీల్డ్ లో గత నలభై అయిదేళ్లుగా తలమునకలుగా ఉన్న మహేష్ భట్ వంటి వ్యక్తికి ఉండటం వింతల్లో వింత !

చంద్రశేఖర్ గారు నాతో చెప్పింది నిజమే.

'మహేష్ పెరిగిన ప్రపంచం వేరు. అది సినీ గ్లామర్ ప్రపంచం. UG గారితో ఆయన కలిసున్నది కూడా తక్కువే. కానీ ఆ కొద్దికాలంలోనే ఆయన్ను చాలావరకూ అర్ధం చేసుకుని, తన పుస్తకంలో చాలా కరెక్ట్ గా ఆయనను ప్రెజెంట్ చెయ్యడంలో మహేష్ కృతకృత్యుడయ్యాడు' అన్నారు చంద్రశేఖర్ గారు నాతో.

ఈ పుస్తకం చదివాక అది నిజమే అనిపించింది. UG గారున్న స్థితిని అర్ధం చేసుకోలేకపోయినా, కనీసం ఆయన్ను చెడగొట్టకుండా, ఉన్నదున్నట్లు ప్రెజెంట్ చేశాడు మహేష్ భట్. దానికి ఆయన్ను అభినందించాలి. కరోనా తగ్గాక బాంబే వెళదామని, మహేష్ భట్ ని కలిపిస్తానని చంద్రశేఖర్ గారు గతంలో అన్నారు. ఇండియా వచ్చాక బాంబే వెళ్లినపుడు, మహేష్ భట్ ని కలిసి అభినందించాలని నిశ్చయించుకున్నాను.

UG వంటి వ్యక్తి తెలుగునేలమీద పుట్టడం ఆ నేల చేసుకున్న అదృష్టం. ఆయన్ను గుర్తించలేకపోవడం, అది చేసుకున్న ఘోరమైన దురదృష్టం.

ఇంతకంటే ఏం చెప్పగలం?