“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

18, ఆగస్టు 2022, గురువారం

మూడవ అమెరికా యాత్ర - 8 (ప్రేతాత్మతో మూడేళ్లు)

2019 సెప్టెంబర్ లో నేను మెట్టుగూడలోని రైల్వే ఆఫీసర్స్ క్వార్టర్స్ లో చేరాను. అనేక క్వార్తర్స్ చూచినమీదట ఒక పాతకాలం నాటి బంగళాను నేను ఎంచుకున్నాను. దానికి కారణం పిల్లల పెళ్లిళ్లు అక్కడైతే సౌకర్యంగా చేయవచ్చన్న ఒక్క ఉద్దేశ్యమే.

అది బంగాళా నంబర్ 100 ప్రక్కనే ఉంటుంది. 2003 లో, బంగళా నంబర్ 100 లో సామూహిక హత్యలు జరిగాయి. B.R.Seth అనే రైల్వే చీఫ్ ఇంజినీర్ కుటుంబాన్ని వాళ బంగళా ప్యూన్ దారుణంగా చంపేశాడు. అదంతా అప్పుడు పేపర్లో కూడా వచ్చింది. టీవీలో తెగ చూపించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వచ్చి ఈ హత్యాస్థలాన్ని చూచివెళ్ళాడు. ఆ క్వార్టర్స్ ప్రక్కనే నేను దిగిన బంగళా ఉంది.

నెట్లో చూడండి. ఆ వార్తలు ఇంకా ఉన్నాయి. వివరాలు మీకు లభిస్తాయి.

నేను సెలక్ట్ చేసుకున్న బంగళా  దాదాపు 80 ఏళ్ళనాడు కట్టిన పాతబంగళా. ఎవడో బ్రిటిష్ ఇంజనీర్ తన మందీమార్బలంతో అందులో ఉండేవాడు. అయన నాటిన ఒక ముసలి చింతచెట్టు ఆ బంగళా ఆవరణలో ఉంది. రెండు  రావిచెట్లున్నాయి. పెద్ద ఉసిరిచెట్టు ఉంది.  అప్పటివే  నాలుగు  మామిడిచెట్లున్నాయి. వేపచెట్లయితే ఒక పది ఉంటాయి. సీతాఫలం చెట్లు, సపోటాచెట్లు ఉన్నాయి. దాదాపు ఎకరంన్నరలో ఆ బంగళా ఉంటుంది. ఎంట్రన్స్ గేట్ నుండి ఇంటి ముఖద్వారం దాదాపు 200 మీటర్ల దూరం చెట్లలో నడుచుకుంటూ పోవాలి. తోటమధ్యలో ఒక ఉయ్యాల ఉంది. రాత్రిపూట చూస్తే అచ్చం ఒక భూత్ బంగళా లాగే ఉంటుంది.  ఒక హర్రర్ మూవీకి మంచి సెట్టింగ్.

బంగళా లోపల కూడా పెద్దపెద్ద గదులు. నాలుగు బెడ్ రూమ్స్, ఒక గదిలో నుంచి పిలిస్తే ప్రక్కగదికే వినిపించదు, అంత పెద్ద గదులతో ఒక మహల్ లాగా ఉంటుంది. ఉండబోయేది ఇద్దరం.

ఈ బంగళాలో నేను దిగబోతుండగా నా కొలీగ్ ఆఫీసర్ రమేష్ ఇలా అన్నాడు, 'ఆ  క్వార్టర్ ఎంచుకున్నారా? అందులో ఒక పెద్ద....' అని మధ్యలో ఆగిపోయాడు.

నేనేమీ రెట్టించలేదు. 80 ఏళ్ల బంగళాలో ఏవో కధలు లేకుండా ఎలా ఉంటాయి? అని నాలో అనుకున్నాను.

'త్రి బెడ్ రూమ్ మోడ్రన్ క్వార్ట్రర్ లో నేను ఉండవచ్చు. కానీ, ఇద్దరు పిల్లల పెళ్లిళ్లు చేయాలి. అందుకోసం ఈ బంగళా అయితే బాగుంటుందని దీనిని సెలక్ట్ చేసుకున్నాను' అని రమేష్ తో అన్నాను.

తను నవ్వి ఊరుకున్నాడు.

ఈ బంగళాకి మారిన కొద్దిరోజులకు కొన్ని సంఘటనలను గమనించడం మొదలుపెట్టాను. మనం ఒక గదిలో ఉంటే, ప్రక్క గదిలో ఎవరో నడుస్తున్న చప్పుడు వినపడేది. ఒక గదినుంచి ఇంకో గదికి ఎవరో టక్కున వెళ్లినట్లు నీడలు కదిలేవి. చూస్తే ఎవరూ ఉండేవారు కారు. మనతోబాటు ఇంకా ఎవరో ఇంట్లో ఉన్నట్లు, మనల్ని చూస్తున్నట్టు ఫీలింగ్ వచ్చేది. తలుపులు వాటంతట అవే తెరుచుకునేవి.మూసుకునేవి.నవ్వుకుని ఊరుకునేవాడిని.

ఒకరోజున రాత్రిపూట సరదాగా గార్డెన్లో చెట్లల్లో నడుస్తున్నా. మంటల్లో కాలిపోతూ ఒక పాతికా ముప్పై ఏళ్ల అమ్మాయి, సర్వెంట్ క్వార్ట్రర్స్ నుండి మా బంగళా వైపు పరిగెత్తుకుంటూ వచ్చి మాయమైపోయింది. సడన్ గా ఈ దృశ్యాన్ని చూచాను. ఆ సమయంలో నేను  మహావిద్యా మంత్రజపం చేస్తూ గార్డెన్లో నడుస్తున్నాను. ఉన్నట్టుండి ఈ దృశ్యం కనిపించింది. గతంలో అక్కడేదో జరిగిందని అర్ధమైంది. ఎవరితోనూ ఏమీ చెప్పకుండా మామూలుగా నా పనులు చేసుకుంటూ ఉన్నాను.

ఆ బంగళాలో నైరృతి మూలన ఒక బెడ్రూమ్ ఉంటుంది. అందులో పడుకున్నవారికి సరిగ్గా నిద్ర పట్టేది కాదు. పీడకలలు వచ్చేవి. నేనూ ఒకరోజున అందులో పడుకున్నా. ఉన్నట్టుండి కప్పుకున్న దుప్పటి లేచి ప్రక్కన పడటం, ప్రక్కమీద ఎవరో కూర్చున్నట్టు అనిపించడం, ఎవరో మనల్ని తాకినట్టు అనిపించడం ఇవన్నీ నేను గమనించాను. చూసీ చూసీ ఒకరోజున 'ఎవరితో ఆటలాడుతున్నావ్ నువ్వు? తమాషాలుగా ఉందా?' అని గద్దించాను. ఆ తరువాత అలాంటి కోతిచేష్టలు ఆగిపోయాయి.

ప్రతి అమావాస్యకూ పితృతర్పణాలు చేసే సమయంలో ఆఖర్న అనాధప్రేతాలకు కూడా తర్పణం విడిచేవాడిని. ఒకరోజున అలా విడుస్తుండగా, గార్డెన్లోని చింతచెట్టు పెద్దకొమ్మ ఒకటి ఫెళ్ళున విరిగి పడిపోయింది. అప్పుడే నాకర్ధమైంది ఆ బంగళాలో ప్రేతాత్మలున్నాయని.

పూజామందిరంలో శ్రీచక్రాన్ని ప్రతిష్టించి నిత్యమూ మా శ్రీమతి యధావిధిగా అర్చన చేస్తూ ఉండేది. తనకెప్పుడూ ఈ విషయాలను నేను చెప్పలేదు. కానీ ఒకసారి మూడురోజుల పాటు క్యాంప్ కెళ్ళాల్సి వచ్చింది. అంతపెద్ద కొంపలో శ్రీమతి ఒక్కతే ఉండాలి. అందుకని తనతో జాగ్రత్తలు చెబుతూ, ఏవైనా కనిపిస్తే కంగారుపడకు. అవి మనల్నేమీ చెయ్యవు' అని సూచనప్రాయంగా చెప్పాను. దానికి తను చెప్పిన సమాధానానికి నేను నిర్ఘాంతపోయాను.

'భయపడటానికి ఏముంది? ఒకమ్మాయి ఉంది. ఇంట్లో తిరుగుతూనే ఉంటుంది. పూజామందిరం దాపులకు మాత్రం రాదు. నేను చాలాసార్లు చూశాను. నాకేమీ భయం లేదు. మీరు దైర్యంగా క్యాంప్ కెళ్ళి రండి' అంది.

'చూచావా?' అన్నాను నేను ఆశ్చర్యంగా.

'అవును. తోటలో దాదాపు నాలుగైదు పిల్లులు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. దొడ్డివైపున చెట్లలో పాములున్నాయి. అవీ కనిపిస్తుంటాయి. అలాగే ఈ అమ్మాయి కూడా ఉంది. వాటిమానాన అవి బ్రతుకుతాయి. మన మానాన మనం ఉంటాం. భయమేముంది?' అంది శ్రీమతి. 

తన ధైర్యానికి నేను చాలా ఆశ్చర్యపోయి, మనసులోనే తనని మెచ్చుకున్నాను.

క్యాంప్ కెళ్ళి వచ్చాను. 'ఏమైనా అసౌకర్యంగా ఉందా?' అని శ్రీమతిని అడిగాను.

'ఏమీ లేదు. పిల్లులు, పాములు, ఆత్మలు అన్నీ ఉన్నాయి. వాటిపని వాటిది, నా పని నాది' అంది శ్రీమతి కూల్ గా.

తరువాత ఒకరోజున శ్రీమతి గార్డెన్లో దండేనికి ఉతికిన బట్టలు ఆరేస్తోంది. పదడుగుల ఎత్తున్న ప్రహరీగోడ మొత్తం హఠాత్తుగా కూలిపోయి తనకు మూడడుగుల దూరంలో రాళ్లు రప్పలు అన్నీ పడ్డాయి. పెద్ద ప్రమాదం తనకు తృటిలో తప్పింది.

తోటలో ఒకచోట ఉడెన్ డమ్మీని పాతి, వింగ్ చున్ కుంగ్ ఫూ అభ్యాసాలు, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసేవాడిని. మస్కిటో కుంగ్ ఫూ అంటూ ఒక వీడియో కూడా పెట్టాను గతంలో. ఒకరోజున రాత్రిపూట వచ్చిన సుడిగాలికి ఒక పెద్దచెట్టు కూకటివేళ్ళతో సహా లేచిపోయి ఆ డమ్మీ మీద వచ్చి పడింది. పగటిపూట నేను అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అది పడినట్లైతే సరిగ్గా నా తలమీద పడి ఉండేది. ఏమయ్యేదో చెప్పనవసరం లేదు కదా !

ఇలాంటి సంఘటనలను చాలా చూచినమీదట, ఆ ఆత్మనుద్దేశించి ఇలా చెప్పాను.

'చూడు. నీ మానాన నువ్వుండు. మా జోలికి రాకు. మాకు హాని చేయాలని చూడకు. ఎంత పాపం చేశావో ఈ స్థితిలో తిరుగుతున్నావు. ఇంకా పాపాన్ని ఎక్కువ చేసుకోకు. నీకు సహాయం చేసే స్థితిలో మేమున్నామని గుర్తించు. నీ కోతిచేష్టలు మా దగ్గర ప్రదర్శించకు'

ఆ తర్వాతనుంచీ ఆ సంఘటనలు ఆగిపోయాయి. కానీ ఆ అమ్మాయి నాక్కూడా కనిపించడం మొదలుపెట్టింది. మంటల్లో కాలిపోయినట్లుగా ఉంటుంది. ఎప్పుడూ భయపెట్టలేదు గాని, ఏడుస్తూ దిగాలుగా ఉండేది. ఒక గదినుంచి మరో గదికి తిరుగుతూ కనిపించేది. మూడోనెల గర్భవతిలాగా ఉన్నట్లు కనిపించేది.

రాత్రిపూట అప్పుడప్పుడూ హర్రర్ సినిమాలు చూడటం నాకలవాటు. అంతపెద్ద బంగళాలో లంకంత హాల్లో ఒక్కడినే కూచుని అర్ధరాత్రి సమయంలో ఇంగ్లిష్ హర్రర్ సినిమా చూస్తున్నా ఒకరోజున, ఉన్నట్టుండి ఎదురు సోఫాలో తనుకూడా కూచుని సినిమా చూస్తోంది. ఆ వాతావరణం, ఆ సమయం, దెయ్యంతో కలసి హర్రర్ సినిమా చూడటం, ఇవన్నీ భలే నవ్వు పుట్టించాయి. ఇదంతా కామెడీగా తీసుకుని నేను నవ్వడం చూచి ఆ అమ్మాయి కూడా నవ్వుతూ మాయమైపోయింది.

తోటలో ఉన్న ఉయ్యాల, గాలిలేకపోయినా చాలాసార్లు ఊగుతూ కనిపించేది. కొన్నిసార్లు ఆ అమ్మాయి  ఉయ్యాలమీద కనిపించేది. కొన్నిసార్లు ఉత్త ఉయ్యాల ఊగేది. ఆ ఉయ్యాల మా బెడ్ రూము  బయటే రావిచెట్టు క్రింద ఉంటుంది. అర్ధరాత్రి సమయంలో ఉయ్యాల ఊగడం మా బెడ్ రూమ్ కిటికీ లోనుంచి స్పష్టంగా కనిపించేది.

ఒకసారి మా కొలీగ్ ఆఫీసర్ రవి సతీసమేతంగా మా ఇంటికొచ్చాడు. తనొచ్చేసరికి ఆ ఉయ్యాల ఊగుతోంది. తాను చూచి ఆశ్చర్యంగా 'ఆ ... ' అన్నాడు. 'గాలికి అలా ఊగుతుందిలే' అని నేను నచ్చచెప్పాను.

రాత్రి పదకొండు దాటాక గజ్జెలచప్పుడు తరచుగా ఆ ఇంట్లో వినేవాళ్ళం. మేమేకాక, మమ్మల్ని చూడటానికి వచ్చిన శిష్యులు కూడా ఈ గజ్జెలచప్పుడు చాలాసార్లు  విన్నారు. ఎవరో గజ్జెలు కట్టుకుని ఒక గదిలోనుంచి ఇంకో గదిలోకి నడుస్తున్నట్లు వినిపించేది. కొన్నిసార్లు  మంచం ప్రక్కనే వినిపించేది, కొన్నిసార్లు దూరంగా వినిపించేది.

'అది కీచురాళ్ళ ధ్వని, తోటలో చాలా పురుగులుంటాయి. అవి అలా అరుస్తాయి. భయపడకండి' అని ఇంటికొచ్చినవారికి నచ్చచెప్పేవాడిని.

కానీ వారిలో ఒక తెలివైన శిష్యురాలు మాత్రం పట్టేసింది.  'కీచురాళ్లకూ, గజ్జెలచప్పుడుకూ మాకు తేడా తెలియదని మీరనుకుంటున్నారా?' అని నన్నడిగింది. నేను నవ్వేసి ఊరుకున్నాను.

అమావాస్య అర్ధరాత్రిపూట అదే తోటలోని చింతచెట్టు క్రింద నేను కూచుని కాళీమహామంత్రాన్ని జపించేవాడిని. మహావిద్యా పారాయణం చేసేవాడిని. దానికి కావాల్సిన ఏర్పాట్లు ఆ చింతచెట్టు క్రింద నేను చేసుకున్నాను. తోటలో దోమలు విపరీతంగా ఉండేవి. అందుకని ఒక దోమతెరను ఆ చెట్టుక్రింద కట్టి దానిలో కూచుని రాత్రిళ్ళు జపం చేసేవాడిని. జపసమయంలో తంత్రోక్తమైన అష్టదిగ్బంధనం ఉంటుంది గనుక, ఏ దుష్టశక్తీ దానినిదాటి లోపలకు రాలేదు సరికదా, మనవైపు తేరిపార చూడను కూడా చూడలేదు. 

ఈ విధంగా అనేక అనుభవాలతో మూడేళ్లపాటు ఆ బంగళాలో ఉన్నాము. చివరిరోజున, అంటే గతనెల జూలై 16 న బంగళాను ఖాళీ చేసి KPHB కాలనీకి మారాము. ఆ రోజు రాత్రి సామానులన్నీ వెళ్ళిపోయాక నేనక్కడే ఉన్నాను. ఆ రాత్రి కూడా బెడ్రూమ్ తలుపు దగ్గర నిలబడి కనిపించింది. ఎప్పటిలాగే దిగాలుగా చూస్తోంది.

ఉదయం నాలుగుకు నిద్రలేచి, స్నానం కానిచ్చి, ఆ ఇంటికి తాళం వేసి KPHB కాలనీకి బయల్దేరాను. అయిదింటికి స్కూటర్ తీస్తుంటే ఉయ్యాలమీద కూచుని తను కనిపించింది. ఒక్క క్షణం ఆగి కళ్ళు మూసుకుని, 'ప్రభూ ! నీకిష్టమైతే, ఈ దీనాత్మకు విముక్తిని ప్రసాదించు' అని నా ఇష్టదైవాన్ని ప్రార్ధించాను. కళ్ళు తెరిచి చూస్తే ఉయ్యాల ఖాళీగా ఉంది.

తలుపు తాళం వేసి నా దారిన నేను బయల్దేరి, ఉదయం ఆరింటి కల్లా KPHB కాలనీకి చేరుకున్నాను.

జూలై 27 న ఆఫీసు నుండి ఇంటికి బయల్దేరాను. ఆఫీసులో అదే నా ఆఖరిరోజని ఊహించలేదు. నాతోబాటు క్రిందదాకా నా ప్యూన్ బాలస్వామి వచ్చాడు. తను క్రిస్టియన్, కానీ విశాలభావాలు కలిగినవాడు. చాలా మంచివాడు. సికింద్రాబాద్ లోనే గత  20 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. నడుస్తూ ఉండగా తననొక మాట అడిగాను.

'బాలస్వామి ! మా బంగళాకు ఏమైనా చరిత్ర ఉన్నదా? నువ్విక్కడ గత 20 ఏళ్లుగా ఉన్నావు కదా? అందులో ఒకమ్మాయి తిరుగుతూ ఉంది. నేను చూచాను. మా శ్రీమతి కూడా చూచింది. నీకేమైనా తెలిస్తే వివరాలు చెప్పు'

నడుస్తున్న బాలస్వామి హఠాత్తుగా ఆగిపోయాడు. చేతులు జోడించాడు.

'సార్ ! మీరు భక్తిపరులు కాబట్టి బ్రతికి బయటపడ్డారు. ఆ అమ్మాయి ఎవరో కాదు. మా ఫ్రెండ్ కృష్ణ కూతురే. మీ బంగళా అవుట్ హౌస్ లో వాళ్ళుండేవారు. ఆ అమ్మాయికి పెళ్లయింది.  భర్తతో ఏవో గొడవలతో కాల్చుకుని చనిపోయింది. మీ బంగళా ఆవరణలోనే ఇది జరిగింది. తెలిసి తెలిసి ఎవరూ ఆ బంగళాలో దిగరు. దేవుని ఆశీస్సులతోనే మీరు క్షేమంగా మూడేళ్లు అందులో ఉండి బయటపడ్డారు, అమ్మగారి పూజలే మిమ్మల్ని రక్షించాయి' అన్నాడు.

'చనిపోయేటప్పటికీ ఆ అమ్మాయి గర్భవతా?' అడిగాను.

'అదేమో నాకు తెలీదు సార్. కానీ భార్యాభర్తల మధ్య గొడవలతో కాల్చుకుని చనిపోయింది. ఆమె తండ్రి నా ఫ్రెండ్. అతనే నాకీ విషయం చెప్పాడు' అన్నాడు బాలస్వామి.

తనకు నా ఆధ్యాత్మిక కోణం గురించి తెలీదు. తనకే కాదు, మా ఆఫీసులో గాని, నా ఫ్రెండ్స్ సర్కిల్లో గాని ఎవరికీ తెలీదు. అంత లోప్రొఫైల్లో నేనుండేవాడిని. అస్సలు బయటపడేవాడిని కాదు. ఎవరైనా నా దగ్గర జ్యోతిష్యమని, ఆధ్యాత్మికమని మాట్లాడినా కూడా ఏమీ తెలీనివాడి లాగా వినేవాడినిగాని ఏమీ చర్చించేవాడిని కాదు. ఈ విధంగా 40 ఏళ్లపాటు చాలా లోప్రోఫైల్లో నేను జీవించాను.

నవ్వుకుని, 'అంతే బాలస్వామి. నా జీవితంలో నేనెవరికీ హాని చెయ్యలేదు. చేతనైతే సహాయం చేశాను గాని, కీడు చెయ్యలేదు. దేవుడు మనల్ని కాపాడతాడు కదా' అన్నాను. అవునన్నట్లు అతను తలాడించాడు.

మెట్రో  రైలెక్కి JNTU College స్టాప్ లో దిగాను. ఇంటికి చేరాను.      

ఇంతకీ ఆ ఆత్మకు విముక్తి లభించిందా లేదా అనే కదా మీ సందేహం !

వెల్ ! అన్నీ చెప్పేస్తే ఇక నా ప్రత్యేకత ఏముంటుంది మరి !

మీకంతగా తెలుసుకోవాలని బాగా దుగ్దగా ఉంటే, ఆ బంగాళా అక్కడే ఉంది. మెట్టుగూడ మీదుగా తార్నాక వెళ్లే మెయిన్ రోడ్డులో రోడ్డుప్రక్కనే రాత్రిపూట టిఫిన్ బండ్లు పెడతారు. ఆ ప్రక్కనే నేను మూడేళ్లపాటు నివసించిన బంగళా ఉంటుంది. ఒకరాత్రి పూట వెళ్లి అక్కడ నిద్రించి చూడండి.  మీకే ప్రత్యక్షంగా తెలుస్తుంది !