“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

11, డిసెంబర్ 2019, బుధవారం

ప్రపంచ రేపుల రాజధాని

మొన్న కొందరు నాయకులు పార్లమెంట్ లో మాట్లాడుతూ, 'ఇండియాకు ప్రపంచ రేపుల రాజధాని అని పేరోస్తోంది' అన్నారు. Make in India బదులు Rape in India అంటే సరిపోతుంది అని కూడా అన్నారు. కొత్త సినిమా టైటిల్ భలే ఉంది కదూ An evening in Paris, Love in Tokyo లకి సీక్వెల్ లాగా Rape in India!  సినిమావాళ్ళు ఎవరైనా ఈ టైటిల్ ని ఆల్రెడీ రిజిస్టర్ చేశారో లేదో నాకైతే తెలీదు మరి !!

అసలూ, ఈ పేరు మన దేశానికి ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు. సీతాదేవిని రావణుడు బలాత్కారంగా ఎత్తుకుపోవడం దగ్గరే ఇది ఉంది. నిండు సభలో ద్రౌపదికి బట్టలు విప్పడం నుంచే ఇది ఉంది. ఆడదాన్ని ఒక విలాసవస్తువుగా, ఒక ప్రాణమూ మనసూ లేని commodity గా చూడటం అతి ప్రాచీనకాలం నుంచే మన దేశంలో ఉంది. కాకపోతే, అలా చూసిన వాళ్ళను విలన్లు అన్నాం. వ్యతిరేకంగా పోరాడినవాళ్ళను హీరోలన్నాం. విషయం మాత్రం మొదటినుంచీ ఉంది. అంతే తేడా !

అయితే ఈ పోకడకి కారణం ఏంటో ఇంతవరకూ ఏ సైంటిస్టూ కనుక్కోలేక పోయాడు. ఫస్ట్ టైం నేనే కనుక్కుని చెబుతున్నా ! దీనికంతటికీ కారణం 'మషాలా' ! ఇది విన్నాక 'మాషా అల్లా' అని మాత్రం అనకండి. మళ్ళీ తేడాలొస్తాయి.

సమాజపు కట్టుబాట్లూ, చట్టమూ న్యాయమూ లేని దేశంలో - ఎవరూ మనల్ని చూడటం లేదన్నపుడు - ఏకాంతం దొరికినప్పుడు - ఎంతమంది మనుషులు - వాళ్ళు మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా - పవిత్రులుగా ఉంటారన్నది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న ! అసలు 'పవిత్రత' అంటే ఏమిటి? దాని నిర్వచనం ఏమిటి? అది మానసికమా? శారీరికమా? లేక రెండూనా? లేక రెండూ కాదా? అన్నది ఇంకో భయంకరమైన ప్రశ్న ! మౌలికమైన అనేక ప్రశ్నలకులాగే వీటికీ జవాబులు చెప్పడం అంత సులభసాధ్యం కాదు మరి !

'ఇండియాలో ప్రజలకు కామం చాలా ఎక్కువ. వాళ్ళ జనాభాని చూస్తె ఈ విషయం ఎవరికైనా తేలికగా తెలుస్తుంది' అని చాలామంది తెల్ల మేధావులు ఎప్పుడో అనేశారు. ఈ మాటల్లో నిజం ఎంతుందా? అని నిన్నటినించీ తెగ ఆలోచిస్తుంటే, అకస్మాత్తుగా కర్ణపిశాచి స్వరం వినిపించింది.

'నేను చెప్పనా దీనికి జవాబు?'

'అబ్బా ! మా తల్లే ! చాన్నాళ్ళకి వినిపించావ్ గాని, చెప్పు' అన్నా.

'మీ దేశంలో అందరూ మషాలాలు ఎక్కువగా వాడతారు. అందుకే మీకు కామం ఎక్కువ' అంది పిశాచి.

'అదేంటి? మషాలాలకీ, కామానికీ లింకుందా?' అడిగాను తెగ హాశ్చర్యపోతూ.

'ఎందుకు లేదు? మాంసమూ, మషాలాలూ, కామాన్ని బాగా ఉద్రేకిస్తాయని మీ ఆయుర్వేదమే చెబుతోంది. 'మేకమాంస లేహ్యం' పేరు ఎప్పుడైనా విన్నావా లేదా? అది మీ ఆయుర్వేదంలో మంచి aphrodisiac. తెలీదా?' అంది పిశాచి.

'ఆ ప్రయోగాలు చేసే అవసరం ఇంకా రాలేదులేగాని, ఇది నిజమా?' అడిగాను సీరియస్ గా.

'నేను చచ్చినంత ఒట్టు' అంది పిశాచి.

నాకు డౌటోచ్చింది.

'అదేంటి? చస్తేనే కదా పిశాచిగా మారేది. మళ్ళీ 'నేను చచ్చినంత ఒట్టు' అంటుందేంటి?' అనుకుని ఇలా అడిగా.

'చూడూ ! నీ వాలకం నాకేదో అనుమానంగా ఉంది. ఇందాక మీ దేశంలో అన్నావ్ ! ఇప్పుడేమో మీ ఆయుర్వేదం అంటున్నావ్ ! ఇంతకీ నువ్వేక్కడున్నావ్? ఎక్కణ్ణించి నాతో మాట్లాడుతున్నావ్? ఇండియా నుంచి కాదా?' అడిగా.

'కాదు. ప్రస్తుతం అమెరికా నుంచి నీతో మాట్లాడుతున్నా' అంది తను.

నాకు మతిపోయింది.

'అదేంటి? అలా కూడా చెయ్యగలవా?' అడిగా భయపడుతూ.

'ఎలాగైనా చెయ్యగలను. మాది యూనివర్సల్ నెట్వర్క్. నో ప్రాబ్లం' అని నవ్విందది.

'అయినా నీకక్కడెం పని? అమెరికాలో ఎక్కడున్నావ్? డెట్రాయిట్ సమీపంలోనా?' అడిగా మళ్ళీ భయం భయంగా.

'అవున్లే. నీ భయాలు నీవి ! అయినా మీకు అమెరికా అంటే, USA ఒక్కటే గుర్తొస్తుంది. నేనున్నది లాటిన్ అమెరికాలో' అంది తను.

'ఓ, అక్కడున్నావా? ఎన్నాల్లేంటి ట్రిప్?' అడిగా.

'మా బాస్ ఇక్కడ ఒక ద్వీపం కొనేశాడు. అందుకని కొన్నాళ్ళు ఇక్కడ వెకేషన్ కనీ వచ్చా' అంది.

తనేం చెప్తోందో అర్ధమైంది.

'యూ మీన్ Parama Shivam?' అడిగా.

'ఎస్. మేమంతా భూతాలం కదా. ఆయనెక్కడుంటే మేమక్కడే ఉంటాం' అంది తను.

'ఐసీ ! ఈ మధ్యనే మీ భూతాల ఫోటోలు కొన్ని చూశా. మీలో కూడా మాంఛి అందగత్తెలున్నారు సుమీ !' అన్నా చనువుగా.

'ఎందుకుండరు? మాకు ప్రతిరోజూ నాన్ వెజ్జూ, మషాలా కూరలూ లేందే ముద్ద దిగదు. అందుకని మాకు అందమూ ఎక్కువే, అన్నీ ఎక్కువే' అందది వికటంగా నవ్వుతూ.

'ఎలాగైనా మీ బాస్ భలే లక్కీఫెలో కదా ! ' అన్నా అసూయగా.

'ఎందుకో?' అంది తను దీర్ఘం తీస్తూ.

'మరి మీలాంటి అందమైన భూతాల మధ్యన తన దేశంలో తనున్నాడు. న్యాయమూ చట్టమూ అన్నీ మీవే. మిమ్మల్ని అనేవాడూ లేడు, అడిగేవాడూ లేడు. రోజూ మషాలా కూరలు. కేసులుండవు. భలే ఉంది మీ పని' అన్నా.

'ఇదుగో అంటేగింటే మమ్మల్ని ఏమైనా అను, ఊరుకుంటా, మా బాస్ ని ఏమైనా అన్నావో నీ సంగతి చెప్తా' అంది తను కోపంగా.

నాకు నిజ్జంగా భయమేసింది.

'బాబోయ్. అనన్లే. ఇక చాలు చెప్పకు. వినగావినగా నాకూ మీరు తినేవన్నీ రోజూ  లాగించాలనిపిస్తోంది. వద్దులేగాని, మీ ఐలెండ్ లో ఏం జరుగుతోంది అసలు?' అడిగా.

'చూడూ ! కూపీలు లాగాలని చూడకు. నీ ఫస్ట్ డౌట్ గురించి మాత్రమే నువ్వడుగు. అంతేగాని, మా బాస్ గురించి కూపీలు లాగావో చూడు నిన్నేం చేస్తానో?' అని బెదిరించింది అది.

'సర్లే ఆయనేం చేస్తే నాకెందుకులే గాని, అయితే, ఇండియాలో జరుగుతున్న రేపులన్నిటికీ మషాలాలే కారణం అంటావ్?' అన్నా.

'ముమ్మాటికీ అంతే, వాటికి తోడు మద్యం, మాంసం, ఇవి రెండూ కలిస్తే రేపులు కాక ఇంకేం జరుగుతాయి మరి?' అంది తను కాన్ఫిడెంట్ గా.

'ఇక చాలు. నువ్వేమీ చెప్పకుండానే, మీ ద్వీపంలో ఏం జరుగుతుందో నాకు బాగా అర్ధమైపోయింది. కాకపోతే, అక్కడ దాన్ని 'రేప్' అనరేమో? అంతేనా?' అడిగా నవ్వుతూ.

'అవును. ఇక్కడ రేప్ చేసినవాళ్ళమీద కేసుండదు. చెయ్యకపోతే మాత్రం 'ఫలానా సిటిజెన్ మషాలాలు సరిగా తినడం లేదు' అంటూ మా బాస్ కి కంప్లెయింట్ చేస్తాం. అప్పుడు కేసౌతుంది.' అందది.

చచ్చే నవ్వొచ్చింది నాకు.

'అంతా మషాలా మహిమ ! అయితే, మా దేశంలో ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఏం చెయ్యాలి మేం?' అడిగా.

'మందూ, మాంసం, మషాలాలు - మూడూ మానుకొని, రోజూ పచ్చిమొలకలు తింటూ యోగా చెయ్యడం మొదలుపెట్టండి. అందరూ శాంతిగా ఉంటారు. అప్పుడు చూడండి నేను చెప్పేది నిజమో కాదో?' అంది.

'యూ మీన్ sprouts?' అడిగా అమాయకంగా.

'యూ ఫూల్ ! What else could I mean? సర్లే, నీతో ఈ వాదన తెగదులే గాని, నేనొస్తా. పనుంది' అంది మాయమైపోబోతూ.

'ఆగాగు. ఎక్కడికి? అంత అర్జెంట్ పనేముంది?' అన్నా.

'కూరల్లోకి మషాలాముద్ద నూరుకుని రమ్మన్నాడు బాస్. ఈ లోపల నీ బాధ చూడలేక నీ నెట్వర్క్ లోకి అడుగుపెట్టా. త్వరగా వెళ్ళకపోతే ఈ పూటకి చప్పిడికూరలు తినాల్సి వస్తుంది. అప్పుడు జరిగే నష్టానికి నేనే జవాబుదారి. నేనిలాగే లేట్ చేస్తే, మా సిటిజెన్స్ పెర్ఫామెన్స్ లెవల్స్ పడిపోతాయి. సాటి భూతాలనుంచి ఎన్ని కంప్లెయింట్స్ వెళ్తాయో మా బాస్ కి రేపు? నాకొద్దు ఆ పనిష్మెంట్. వస్తా. బై' అంటూ మాయమై పోయింది తను.

'హా పరమశివమ్ ! ఇదా అసలు సీక్రెట్?' అనుకుంటూ కుర్చీలోంచి పైకి లేచా.