“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

15, డిసెంబర్ 2019, ఆదివారం

షష్ఠగ్రహ కూటమి - 2019

ధనూరాశిలో షష్ఠగ్రహకూటమి రాబోతోంది. అంటే ధనూరాశిలో ఆరుగ్రహాలు కలవబోతున్నాయి. ఇది ఈ నెల 25, 26, 27 తేదీలలో ఉంటుంది. అవి, గురు, శని, కేతు, సూర్య, చంద్ర, బుధులు. ఆరు గ్రహాలు కలవడం వల్ల లోకమేమీ బద్దలై పోదు. అక్కడక్కడా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతాయి. రక్తపాతం, ప్రాణనష్టం, దేశాల వ్యవస్థలు కూలడం, ప్రకృతి ప్రమాదాలు జరుగుతాయి. కొందరు జ్యోతిష్కులు చెబుతున్నట్టు ప్రపంచం తల్లక్రిందులు ఏమీ కాదు. కాలగమనంలో ఇలాంటివి  చాలా జరిగాయి. ప్రతిసారీ ఏవో ఒక గొడవలు ఉపద్రవాలు మాత్రం జరుగుతుంటాయి.

28-12-2019 నుంచి 12-1-2020 వరకూ చంద్రుడు తప్ప మిగతా అయిదు గ్రహాలు కలసి ధనూరాశిలో ఉంటాయి. ఆ 15 రోజులు కూడా ఇవే ఫలితాలు వర్తిస్తాయి. తరువాత రెండురోజులకు బుధుడు కూడా మకరానికి మారిపోతాడు.  ఆ తరువాత నాలుగు గ్రహాలు కలసి కొంతకాలం ధనూరాశిలో ఉంటాయి. అప్పటివరకూ లోకమంతా ఇదే గోల రకరకాలుగా సాగుతుంది. 

ఈ కూటమిలో ముఖ్యమైన కూడిక గురు శనులది. వీరిద్దరూ దాదాపు ఇరవై ఏళ్ల కొకసారి ఒక రాశిలో కలుస్తారు. పోయినసారి 1999-2000 సంవత్సరంలో కలిశారు. ఇప్పుడు 2019 లో కలుస్తున్నారు. వీరు కలిసిన ప్రతిసారీ ప్రపంచవ్యాప్తంగా మేజర్ మార్పులు ఉంటాయి. గతంలో జరిగాయి. ఇప్పుడూ జరుగుతాయి. మనుషుల కర్మవలయం అంతా ఈ రెండు గ్రహాల మధ్యనే నియంత్రించబడుతూ ఉంటుంది. ఏ జాతకంలో నైనా, ముఖ్యమైన మేజర్ గ్రహాలు ఇవి రెండే. మనిషి జాతకంలో  ఏమి జరగాలన్నా వీరిద్దరి పాత్ర లేనిదే జరుగదు.

ప్రస్తుతం వీరు కలుస్తున్న ధనూరాశి, భారతదేశాన్ని సూచించే మకరరాశికి ద్వాదశరాశి. మనకు స్వతంత్రం వచ్చిన వృషభరాశికి అష్టమరాశి. అంటే ఇండియాలో, కుట్రలు కుత్రంత్రాలు బాగా జరుగుతాయి. ప్రజాజీవితంలో భారీ మార్పులు జరుగుతాయి. నష్టం జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న Citizenship Amendment Act గొడవలు అవే. ఈశాన్యభారతం అట్టుడుకుతూ ఉండటం, మిగతా దేశానికి కూడా ఈ గొడవలు పాకడం వీరి చలవే.

ఇకపోతే ఈసారి జరుగబోతున్న అసలైన పెద్దమార్పు మాత్రం అమెరికాలో ఉంటుంది. ఎందుకంటే, అమెరికాను సూచించే మిధునరాశి సరిగ్గా ధనుస్సుకు ఎదురుగా ఉంటుంది, ఇంకా చెప్పాలంటే, ప్రస్తుతం మిధున - ధనూరాశుల ఇరుసులో రాహుకేతువులు ఉఛ్చస్థితిలో ఉన్నారు. అందుకనే, ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్ ఇంపీచ్ మెంట్ ను ఎదుర్కొంటున్నాడు. దీని ఫలితంగా మిడిల్ ఈస్ట్ లో కూడా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతాయి. బ్రిటన్  లో అధికార మార్పు కూడా వీరి కూడిక ఫలితమే.

ప్రపంచవ్యాప్తంగా అనేకదేశాలలో అనేక రకాలైన మార్పులు ప్రమాదాలు గొడవలను ఈ గురుశనుల కూడిక సూచిస్తుంది. అవన్నీ నేను ఏకరువు పెట్టబోవడం లేదు. ప్రపంచ రాజకీయ ముఖచిత్రాన్ని గమనిస్తే, ఆయా  లింకులు స్పష్టంగా మీకు కనిపిస్తాయి. ఆసక్తి ఉన్నవాళ్లు ప్రయత్నించండి.

వ్యక్తిగత జాతకాలలో ఈ యోగం చేసే విధ్వంసాన్ని, మాత్రమే ఇక్కడ చెబుతున్నాను. జాగ్రత్త పడండి.

వృషభంలో సూర్యుడు, లేదా చంద్రుడు, లేదా లగ్నం ఉన్నవారు

జీవితంలో పెద్ద నష్టాన్ని చవిచూస్తారు. మానసికంగా అత్యంత డిప్రెషన్ కు గురౌతారు. దీర్ఘరోగాలు బాధిస్తాయి.

మిధునంలో సూర్యుడు, లేదా చంద్రుడు, లేదా లగ్నం ఉన్నవారు

వివాహజీవితం లేదా బిజిజెస్ అతలాకుతలం అవుతుంది. జీవితభాగస్వామి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుంది. లేదా అతనికి/ ఆమెకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. మానసికంగా తీవ్ర అలజడికి గురౌతారు. పార్ట్నర్స్ మోసం చేస్తారు.

కర్కాటకంలో సూర్యుడు, లేదా చంద్రుడు, లేదా లగ్నం ఉన్నవారు

అనారోగ్యం పాలౌతారు. మనస్సు భయాందోళనలకు గురౌతుంది. శత్రుబాధ పెరుగుతుంది. రుణాలు అవుతాయి. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి.

సింహరాశిలో సూర్యుడు, లేదా చంద్రుడు, లేదా లగ్నం ఉన్నవారు

మనస్సు అతలాకుతలం అవుతుంది. ప్రేమలో తీవ్ర ఆశాభంగానికి గురౌతారు. సంతానం చర్యలు బాధిస్తాయి. లేదా సంతానానికి తీవ్రనష్టం కలుగుతుంది.  షేర్ మార్కెట్లో ఘోరంగా నష్టపోతారు.

కన్యలో సూర్యుడు, లేదా చంద్రుడు, లేదా లగ్నం ఉన్నవారు

కుటుంబంలో కలతలు చికాకులు ఎక్కువౌతాయి. మనస్సు అదుపు తప్పి తీవ్ర డిప్రెషన్లో పడుతుంది. చదువు చట్టుబండ లౌతుంది. పరీక్షలలో తప్పుతారు.

ధనుస్సులో సూర్యుడు, లేదా చంద్రుడు, లేదా లగ్నం ఉన్నవారు

అన్నీ ఎదురౌతాయి. గందరగోళంలో పడతారు. అన్ని వైపుల నుంచీ అందరూ రకరకాలుగా ఊపుతారు. పరిస్థితులు గజిబిజిగా ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మనసు మారుతుంది.

మకరంలో సూర్యుడు, లేదా చంద్రుడు, లేదా లగ్నం ఉన్నవారు

డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది. ఆస్తులు కోల్పోతారు. ఆస్పత్రి పాలౌతారు. స్థానచలనం ఉంటుంది. ఉన్నఊరు వదలి వేరే ఊరికి మారవలసి వస్తుంది. పరువు పోతుంది. ఒంటరితనానికి గురౌతారు.

ముఖ్యంగా ధనుస్సు, మిధున - రాశులు, లగ్నాలకు - ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. గమనించండి.