“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

28, డిసెంబర్ 2019, శనివారం

నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (ఋషులు పెట్టిన ముహూర్తాలు)

ముహూర్తంలోనే అన్నీ ఉన్నాయి అది చాలా ముఖ్యం అనే వాళ్లకు నాదొక ప్రశ్న.

సప్తఋషులలో ఒకరైన వశిష్టమహర్షి పెట్టిన శ్రీరామ పట్టాభిషేక  ముహూర్తం ఎందుకు తప్పిపోయింది? బ్రహ్మఋషి అయిన ఆయనకు మనంత జ్యోతిష్యం రాదా? లేక కావాలనే తప్పిపోయే ముహూర్తం పెట్టాడా?

దీనికి మన పురోహితజ్యోతిష్కులూ పురాణపండితులూ రకరకాల బుకాయింపు   కబుర్లు చెబుతారు.

ఆ ముహూర్తం తప్పిపోతేగాని శ్రీరాముడు అడవికి పోడు. అప్పుడుగాని రావణసంహారం జరగదు. అందుకని అలాంటి తప్పుడు ముహూర్తం పెట్టాడు వశిష్ట మహర్షి - అంటారు వాళ్ళు.

నా జవాబు : అంటే, వశిష్టుని వంటి బ్రహ్మర్షి కూడా అబద్దాలు చెబుతాడన్నమాట ! అబద్దపు ముహూర్తం పెడతాడన్న మాట ! అలాంటాయన బ్రహ్మర్షి ఎలా అవుతాడు?

రావణసంహారం జరగడమే పరమార్ధం అయితే, దానికోసం శ్రీరాముడూ సీతాదేవీ వనవాసం చెయ్యడం ఎందుకు? ఈ మొత్తం గొడవతో ఏ సంబంధమూ లేని లక్ష్మణుడిని కూడా తోడు తీసికెళ్ళి ఆయన్ను హింస పెట్టడం ఎందుకు? సరాసరి రావణుడిమీద యుద్ధం ప్రకటించి అతని యుద్ధంలో చంపెయ్యవచ్చు కదా ! దానికోసం ఇంతమంది ఇంత హింస అనుభవించాలా? సీతమ్మతల్లి అన్ని బాధలు పడాలా?

కనుక ముహూర్తం అనేది జాతకాన్ని అధిగమించలేదు అని స్పష్టంగా తెలుస్తున్నది. అంతేకాదు, ఆ కార్యక్రమం సజావుగా జరగడానికి కూడా ముహూర్తం ఏమాత్రమూ సహాయం చెయ్యదు. అలా చేసే పనైతే, శ్రీరామ పట్టాభిషేకం ముహూర్తం ఎందుకు తప్పింది?

అందుకనే జిల్లెళ్ళమూడి అమ్మగారు - "పెట్టినది ముహూర్తం కాదు, జరిగినదే ముహూర్తం" - అన్నారు. 

ఇకపోతే, రెమెడీలతో అన్ని పనులూ సజావుగా జరిగే పనైతే, పాండవులు అన్నేళ్లు అన్ని బాధలు ఎందుకు పడ్డారు? వారి దగ్గర ధౌమ్యుడు ఉన్నాడు కదా ! ఆయనకు జాతకాలు చూపించుకుని రెమెడీలు చేసేసి, తమ రాజ్యాన్ని తాము పొందవచ్చుఁ కదా? అన్నేళ్లపాటు అన్ని బాధలు పడటం ఎందుకు? వాళ్ళు తలచుకుంటే వేళ్ళకు ఉంగరాలు పెట్టుకోలేరా? మెడలో గొలుసులు వేసుకోలేరా?

కనుక వశిష్టమహర్షికి, ముందుముందు జరుగబోయేది తెలియదు అని అర్థమౌతోంది. అలాగే పాండవుల విషయంలో చూస్తే, రెమెడీలు కర్మను తీర్చలేవు అని స్పష్టంగా అర్థమౌతోంది.

ఇంగిలీషు వారి పాలనాసమయంలోనూ, అంతకుముందు తురుష్కుల పాలనా సమయంలోనూ, ఉన్న రాజులూ, సంస్థానాధీశులూ హోమాలు చేయించలేరా? ఉంగరాలు పెట్టుకోలేరా? ప్రదక్షిణాలు చేయలేరా? రెమెడీలు చేయలేరా? వాళ్ళ దగ్గర పురోహితులు లేరా? అన్నీ ఉండి,  పరాయి పాలకుల చేతిలో అన్ని బాధలు ఎందుకు పడ్డారు?

వశిష్టమహర్షి వంటి ప్రాచీన మహర్షుల విషయంలోనే ఇలా  ఉంటే,  మరి నేటి పురోహితులెంత? పంచాంగాలెంత? వీటిల్లో ఒక పంచాంగానికీ ఇంకో పంచాంగానికీ సరిపోదు. ఎవరి ముహూర్తాలు  వారివే. ఎవరి విధానాలు వారివే. కొంతమందికి అమావాస్య చాలా మంచిది. మరికొంతమందికి అమావాస్య చెడ్డది. సాయన విధానానికీ నిరయన విధానానికీ చుక్కెదురు. నిరయనంలో కూడా ఎవరి అయనాంశ వారిదే. అయనాంశ తేడాలవల్ల నక్షత్రాలు మారిపోతాయి. తిధులు మారిపోతాయి. ముహూర్తాలు కూడా మారిపోతాయి. నార్త్ ఇండియాలో ముహూర్తాలు వేరు. సౌత్ ఇండియాలో ముహూర్తాలు వేరు. ఈస్ట్ లో వేరు. వెస్ట్ లో వేరు. మరి, నేటి పంచాంగాలలో ఏ పంచాంగం కరెక్ట్? ఎవరి  ముహూర్తం కరెక్ట్? ఎవరి విధానం కరెక్ట్?

ఇకపోతే, ఇంకొక పాయింట్ ! ప్రపంచ జనాభాలో హిందువుల శాతం ఎంత? 15% కదా? మరి మిగతా 85% ప్రజలు ఏ ముహూర్తాలు చూసి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు? ఏ పంచాంగాలను  అనుసరిస్తున్నారు? ఆ పెళ్లిళ్లు అన్నీ పెటాకులు అవుతున్నాయా? లేదు కదా? ఇంతకుముందు అయితే, 'విదేశాలలో విడాకుల శాతం చాలా ఎక్కువ' అనేవారు. ఇప్పుడు ఇండియాలో కూడా అవి ఎక్కువగానే ఉంటున్నాయి. యూరప్ లో, అమెరికాలో, ఇతర దేశాలలో కూడా ఒకరికొకరుగా జీవితాంతసంసారం సాగిస్తున్న జంటలు చాలామంది ఉన్నారు. అక్కడి కన్సర్వేటివ్ కుటుంబాలలో వివాహవ్యవస్థ కూడా మనలాగే పటిష్టంగానే ఉంటుంది.  అల్లరి చిల్లరగా ఏమీ ఉండదు.

మరి ముహూర్తాలు పెట్టి చేసిన పెళ్ళిళ్ళూ, పెట్టకుండా చేసిన పెళ్ళిళ్ళూ రెండూ ఒకేలాగా ఉన్నప్పుడు, ఫెయిల్యూర్ శాతం రెండింటిలోనూ సమానంగానే ఉన్నపుడు, మనం పెడుతున్న ముహూర్తం విలువ ఎంత? నేటి జ్యోతిష్కులు చెబుతున్న ముహూర్తాలకూ, రెమెడీలకూ విలువ ఎంత? విధిని ఇవన్నీ అధిగమించగలవా? అంత శక్తి వాటిల్లో ఉందా?

ఆలోచించండి !