“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

1, డిసెంబర్ 2019, ఆదివారం

నవంబర్ 2019 అమావాస్య ప్రభావం - దిశ దారుణ హత్య - విశ్లేషణ

ప్రతి ఏడాదీ నవంబర్ నెలలో వచ్చే అమావాస్య ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయని ఇంతకు ముందు ఎన్నోసార్లు వ్రాశాను. కావాలంటే, మనుషుల మీద అమావాస్య పౌర్ణమి ప్రభావాల గురించి నా పాతపోస్టులు చదవండి. మీకు చాలా స్పష్టంగా అర్ధమౌతుంది.

ఈ అమావాస్యలలో కూడా, నవంబర్ లో వచ్చే అమావాస్య చాలా చెడ్డది. దీనికి కారణం ఈ సమయంలో చంద్రుడు వృశ్చికరాశిలో ఉండటమే. ఇది చంద్రునికి నీచస్థానం. అంటే చందుని బలం పూర్తిగా క్షీణించి ఉంటుంది. చంద్రుడు మనస్సుకు కారకుడు గనుక మనుషుల మనసులు నీచపు ఆలోచనలతో నిండిపోతాయి. బలహీనంగా మారుతాయి. ఇంపల్సివ్ అవుతాయి. లాజిక్, రీజన్ కోల్పోతాయి. అందుకే ప్రతి ఏడాదీ ఈ సమయంలో వచ్చే అమావాస్య చాలా చెడ్డ ఫలితాలను ఇస్తుంది. మీరు గతంలో ఏ సంవత్సరమైనా చూడండి. నవంబర్ లో వచ్చే అమావాస్య పరిధిలో అనేక ఘోరాలు నేరాలు యాక్సిడెంట్లు చావులు జరిగినట్లు స్పష్టంగా చూడవచ్చు. అంతేకాదు, మీమీ జీవితాలలో పరిశీలించుకుంటే, ఈ అమావాస్య పరిధిలో మీమీ కుటుంబాలలో, గొడవలు, వాదప్రతివాదాలు, అలగడాలు, కోపతాపాలకు లోనుకావడాలు ఎన్నో జరిగి ఉంటాయి. గమనించండి.

జ్యోతిశ్శాస్త్ర ప్రకారం - టీనేజ్ లో ఉన్న ఆడపిల్లలకు, అమాయకంగా ఉండే ఆడపిల్లలకు చంద్రుడు సూచకుడు. అందుకే ఈ సమయంలో అలాంటి వాళ్ళే ఎక్కువగా బలైపోతూ ఉంటారు. ఇది ప్రతి ఏడాదీ జరుగుతున్న తిరుగులేని నిజం.

ఈ అమావాస్య పరిధిలో దిశ ఉదంతం ఒక్కటే కాదు, అనేకం జరిగాయి. హైదరాబాద్ కే చెందిన రూత్ జార్జ్ అనే అమ్మాయి చికాగోలో రేప్ చెయ్యబడి చంపబడింది. ఇది కూడా సరిగ్గా నాలుగు రోజుల క్రితమే UIC - University of Illinois Chicago లో జరిగింది. ఈ పనిని చేసింది అప్పటికే ఇంకో నేరం చేసి పెరోల్ లో బయట తిరుగుతున్న డోనాల్డ్ తుర్మన్ అనే అమెరికన్ క్రిమినల్. అంతేకాదు, తమిళనాడులోని కోయంబతూర్ లో ఇంకో ఉదంతం ఇలాంటిదే జరిగింది. నిన్నటికి నిన్న, హైదరాబాద్ లో, నిజాంపేట్ అనే ఏరియాలోని ఒక అపార్ట్మెంట్ లో అత్యాచారం ఒకటి వెలుగు చూసింది. ఇవి బయటకు వచ్చినవి. బయటకు రానివి, రిపోర్ట్ కానివి ఎన్నో? ఇంకెన్నో ??

ఇక ఈ అమావాస్య పరిధిలో జరిగిన యాక్సిడెంట్లకు లెక్కే లేదు. బ్రిడ్జికి గుద్దుకొని ప్రమాదానికి గురైన ఆరంజ్ కంపెనీ ట్రావెల్ బస్సు నుంచి, కెనడాలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయి దాదాపు పదిమంది అమెరికన్స్ ని, కెనడియన్స్ ని చంపేసిన విమానం వరకూ చిన్నా పెద్దా ప్రమాదాలు అనేకం ప్రతిచోటా జరిగాయి. ఒక్క హైదరాబాద్ లోనే, ఈ అయిదురోజులలో ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి.

అసలు, ఒకే టైం స్లాట్ లో ఇన్నిన్ని దారుణాలు ఎందుకు జరుగుతాయి? ఈ దారుణాల వెనుక మానవ తప్పిదాలున్నప్పటికీ, ఆ తప్పిదాల వెనుక పనిచేసిన యూనివర్సల్ శక్తులు ఏమిటి? ఇంతమంది మనస్సులు కూడబలుక్కున్నట్లుగా ఒకేసారి ఎందుకు గాడి తప్పుతాయి?ఆలోచించండి. నేను చెబుతున్నది నిజమే అని మీరూ ఒప్పుకుంటారు. అయితే, మరి రెమేడీలు చెయ్యడం ద్వారా ఈ ప్రమాదాలు తప్పవా? అని మీకు సందేహం రావచ్చు. తప్పుతాయి. కానీ అన్నీ తప్పవు. కొన్నింటిని తప్పించడం సాధ్యం కాదు. కొన్ని remedies నయితే అసలు చెయ్యడమే సాధ్యం కాదు. ఏయే కర్మలు పరిహారాలకు లొంగుతాయి? ఏవి లొంగవు? అనే సూక్ష్మాలు ఈ శాస్త్రపు లోతుపాతులే గాక, ఆధ్యాత్మిక లోకపు లోతుపాతులు చూచినవారికే అర్ధమౌతాయి గాని, డబ్బుకోసం ఏ పనైనా చేసే నేటి మిడిమిడిజ్ఞానపు జ్యోతిష్కులకు అర్ధమయ్యే విషయాలు కావు. పైగా, పరిహారాలు చెప్పినా వాటిని అందరూ చెయ్యలేరు. ఈ విషయం నా శిష్యులలో చాలామందికి అనుభవపూర్వకంగా తెలుసు.

రేమేడీలే కాదు, జీవితంలో ఏది చెయ్యాలన్నా అందరూ చెయ్యలేరు. కొందరు మాత్రమే కొన్ని చెయ్యగలరు. అందరూ అన్నీ చెయ్యలేరు. అదే పూర్వకర్మ బలం అంటే. అందుకే ' మనిషి స్వతంత్రుడు కాదు. తన కర్మ చేతిలో బానిస' అని వ్రాశాను.

మనిషి జీవితంలో సాధారణంగా జరిగే పనులు వారివారి పూర్వకర్మానుసారం నెట్టుకొని జరుగుతూ ఉంటాయి. ఆగమన్నా ఆగవు. వద్దన్నా తప్పవు. పూర్వకర్మను జయించాలంటే సాధన కావాలి. సాధన చెయ్యాలంటే సరియైన గురువు దొరకాలి. ఆ గురువును అంటిపెట్టుకుని ఉండే పరిపక్వతా, సంకల్పశక్తీ, నిలకడ కలిగిన మనస్సూ ఉండాలి. ఇవన్నీ లేనప్పుడు కర్మ తీరదు. జీవితం మారదు. టైం మాత్రం ఏళ్ళకేళ్ళు గడచిపోతూ ఉంటుంది. నెట్టింట్లో జీవితం ఆవిరైపోతూ ఉంటుంది.

ప్రస్తుత అమావాస్య చక్రాన్ని పైన ఇచ్చాను గమనించండి.

ఇందులో సూర్యచంద్రులు వృశ్చికరాశిలో కలిశారు. ఇదే వృశ్చిక అమావాస్య. ఈ కుండలిలో, ఒక్క రాహువు తప్ప, మిగతా గ్రహాలన్నీ, సూర్యచంద్రులను అప్పచ్చి (Sandwitch) చేశాయి గమనించండి. వీరిలో కుజబుధుల కలయిక, మొండితనానికీ, మూర్ఖత్వానికీ సూచిక. శని గురువుల కలయిక గట్టి పూర్వకర్మకు, అనుభవించవలసిన అగత్యానికీ సూచిక. శుక్ర కేతువుల కలయిక ఆడవారిమీద అఘాయిత్యాలకు సూచిక. పైగా ఉచ్చరాహువు ఆర్ద్రా నక్షత్రంలో ఒంటరిగ్రహం (lonely planet) గా మారాడు. అంటే విపరీత దూకుడు ప్రవర్తనను ఇస్తాడు. కనుక, మనస్సుకు కారకుడైన చంద్రుని మీద ఇన్ని గ్రహాల ప్రభావం పడింది. అసలే బలహీనుడు. మతిపోయి ఉన్నాడు. ఇక అలాంటి స్థితిలో ఉన్న అతని మీద ఇన్ని గ్రహాల ప్రభావం పడితే ఏమౌతుంది. రీజన్ లోపిస్తుంది. లాజిక్ కనుమరుగౌతుంది. చేస్తున్న పనికి ఫలితం ముందు ముందు ఎలా ఉంటుంది అన్న విషయం గుర్తుకు రాదు. ఈ లోపల జరగాల్సింది జరిగిపోతుంది. ఇలాంటి మానసిక స్థితిలో ఉన్నవారే నేరాలు చేస్తారు. ఘోరాలు చేస్తారు, యాక్సిడెంట్లు చేస్తారు. ఆత్మహత్యలకు ప్రయత్నిస్తారు. ఇంకా ఎన్నో చేస్తారు. అవే ఇపుడు జరిగాయి.

ఈ జ్యోతిశ్శాస్త్ర కోణాలను, ఆధ్యాత్మిక కోణాలను పక్కన ఉంచి, దిశ దారుణ ఉదంతంలో ఉన్న సామాజిక కోణాలను రాబోయే పోస్టులలో గమనిద్దాం.

(ఇంకా ఉంది)