“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

25, డిసెంబర్ 2019, బుధవారం

నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (జాతకమా - ముహూర్తమా?)

గత పోస్టులో నేను చెప్పిన నిజాలను చాలామంది జీర్ణించుకోలేరు. ఆత్మస్తుతి పరనింద దిశలో నేను చేస్తున్న ప్రయత్నంగా దీన్ని చాలామంది అనుకోవచ్చు. వాళ్ళు నా పాయింట్ ను సరిగ్గా అర్ధం చేసుకోవడం లేదు.

ఈ నా వాదనకు వ్యతిరేకంగా పంచాంగ ముహూర్తాలను సమర్ధించే పురోహితులు, పంచాంగజ్యోతిష్కులు చెప్పే లాజిక్స్ కొన్ని ఉంటాయి. అవేమిటో వరుసగా చూద్దాం.

1. అబ్బాయి అమ్మాయి జాతకాలను బట్టి వారి జీవితం నడుస్తుంది గాని, ముహూర్తాన్ని బట్టి కాదు. కనుక ముహూర్తం లేదని అనకూడదు.

నా జవాబు: జాతకమే సర్వస్వం  అయినప్పుడు ముహూర్తం ఎందుకు? దానికింత ప్రాధాన్యత ఎందుకు? ఏ ముహూర్తానికి పెళ్ళిచేసినా, ఎవరి జాతకాన్ని బట్టి వారికి జరుగుతుంది కదా? మరి ముహూర్తం చూడకుండా పెళ్ళి ఎందుకు చెయ్యకూడదు? పైగా, ఎవరి జాతకాన్ని బట్టి వారికి సరిపోయే ముహూర్తం పెట్టాలిగాని, అందరికీ ఒకే ముహూర్తానికి పెళ్లిళ్లు ఎలా చేస్తారు?

2. ముహూర్తం పెట్టేది, వాళ్ళ జీవితాలు మార్చడానికి కాదు. ఆ కార్యక్రమం సరిగ్గా జరగడానికి మాత్రమే. ముహూర్తం విలువ, ఆ కార్యక్రమం వరకే. అంతేగాని వధూవరుల జీవితాలను అది మార్చలేదు.

నా జవాబు: అలా అయితే, ముహూర్తానికి చతుర్ధశుద్ధి, సప్తమ శుద్ధి, అష్టమశుద్ధి ఎందుకు చూస్తున్నారు? లగ్నశుద్ధి ఒకటే చాలుకదా? కానీ ఎవరూ ఒక్క లగ్నశుద్ధితో ఊరుకోవడం లేదు. కనుక మీరు చెప్పేది కరెక్ట్ కాదు. వాళ్ళ జీవితాలు కూడా అన్నివిధాలుగా బాగుండాలనే ముహూర్తం పెడతారు. మరి అలా ఎందుకు ఉండటం లేదు? కనుక ఈ మొత్తం విషయంలో మీకు అర్ధం కానివి ఇంకా చాలా ఉన్నాయని తెలుసుకోండి. పంచాంగ ముహూర్తాలు కరెక్ట్ కాదు. ఆ ముహూర్తాలకు అందరికీ పెళ్లిళ్లు చెయ్యకూడదు.

3. ఎప్పటినుంచో వస్తున్న సాంప్రదాయాన్ని మీరు ఎలా కాదంటారు? మీరు అంత గొప్పవారా?

నా జవాబు: నేను సాంప్రదాయ విరోధిని కాను. సత్యాన్వేషిని మాత్రమే. మీరు గుడ్డిగా పాటిస్తున్న అనేక ఆచారాలలో అర్ధం ఏమాత్రమూ లేదని నేను చెబుతున్నాను. మీరు పాటిస్తున్న ఆచారాలు అనేకం, ప్రాచీన వేదకాలంలో లేవు. మధ్యయుగాలలో అవి పుట్టుకొచ్చాయి. అలా పుట్టడానికి, ముస్లిం దండయాత్రల వంటి అప్పటి సామాజికకారణాలు అనేకాలు ఉన్నాయి. ఆయా పరిస్థితులు ఇప్పుడు మన సమాజంలో లేవు. కనుక ఆ ఆచారాలను ఇప్పుడు కూడా పాటించడం అవివేకం.

4. పంచాంగ కర్తల కంటే మీరు గొప్పవారా?

నా జవాబు: పంచాంగ గణితం వేరు. ఫలిత జ్యోతిష్యం వేరు. పంచాంగ కర్తలకు, గణితం మాత్రమే తెలుస్తుంది. ఆ గణితం ప్రకారం లెక్కలు వేసి, వాళ్ళు పంచాంగాలు వ్రాస్తారు. కానీ వ్యక్తిగత జ్యోతిష్యం వారికి రాదు. నిరంతరం పరిశోధిస్తూ, పరిశీలిస్తూ, దానినుంచి నేర్చుకుంటూ ఉండే ప్రక్రియ వారిలో ఉండదు. కనుక వారు వ్రాసే ముహూర్తాలకు విలువ లేదు.

ఫలిత జ్యోతిష్యం తెలిసినవారు తగ్గిపోయి, పురోహిత జ్యోతిష్యం చెప్పేవారు సమాజంలో ఎక్కువ కావడంవల్ల మాత్రమే నేడు మీరు చూస్తున్న ఈ పరిస్థితి వచ్చింది. కనుక గుడ్డిగా పంచాంగ ముహూర్తాలను అనుసరించడం తప్పు. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ముహూర్తం పెట్టుకోవాలి. అంతేకాదు, పెళ్ళిలో చేస్తున్న తంతులలో కూడా చాలావాటికి అర్ధం లేదు. వాటిని తీసెయ్యాలి.

5. అలాంటప్పుడు అందరూ వాటిని ఎందుకు పాటిస్తున్నారు? ఎవరికీ మీరు చెప్పేవి తెలియవా?

నా జవాబు: కొంతమంది ఆలోచనాపరులు నాలా ఆలోచించేవారు గతంలోనూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు. కానీ, లోకం అంతా భయంతో నిండిపోయి ఉంది. 'ఏమో? ఎదుటివాళ్ళు చేస్తున్నారు, మనం చెయ్యకపోతే ఏ చెడు జరుగుతుందో?' అన్న భయంతో, పనికిరాని వాటిని సాంప్రదాయం అంటూ అందరూ పాటిస్తున్నారు. ఈ పోకడకు కారణం 'భయం' తప్ప ఇంకేమీ కాదు.

నేటి జ్యోతిష్కులందరూ 'భయం' కార్డు వాడుతూ జనాల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కానీ సత్యాన్ని చెప్పడం లేదు. చెప్పాలంటే, ముందు వారికి తెలియాలి కదా ! వారికే సత్యజ్ఞానం లేనప్పుడు లోకానికి ఎలా చెప్తారు? డబ్బు మీద ఆశ ఉన్నప్పుడు నిస్వార్ధంగా ఉన్నదున్నట్టు ఎలా చెప్పగలుగుతారు? 

(ఇంకా ఉంది)