నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

21, ఏప్రిల్ 2017, శుక్రవారం

రెండవ అమెరికా యాత్ర -14 (డెట్రాయిట్ ముసురు పద్యాలు)









రెండు రోజుల నుంచీ ఇక్కడ ముసురూ, వర్షం. నిన్నంతా సూర్యుడు లేడు, ఇవ్వాలన్నా కనీసం సూర్య దర్శనం అవుతుందా అనుకుంటే ఈరోజు లేచేసరికి ఉరుములు మెరుపులతో వాన పడుతున్నది. ఇంకేం చేస్తాం?  వాతావరణం ఇలా ఉంటె మనకు మాంఛి రొమాంటిక్ మూడ్ వచ్చి పద్యాలు రాయాలనిపిస్తుంది!!ఆగకుండా పడుతున్న వర్షంలా ఆశుపద్యాలు ధారలుగా వచ్చేస్తాయి.

రెండ్రోజులనుంచీ ఈ ఎడతెరిపిలేని వర్షాన్ని చూస్తుంటే చిన్నప్పుడు చదువుకున్న ఈ పద్యం స్పురించింది.

కం|| అహములు సన్నములయ్యెను
దహనము హితమయ్యె దీర్ఘ దశలయ్యె నిశల్
బహుశీతోపేతంబయి 
ఉఁహుహూ యని వడకె లోకముర్వీనాథా ! 

ఇది వ్రాసినది తిక్కనో లేక పోతనో గుర్తులేదు గాని, ఇది చలికాలపు పద్యం. ప్రస్తుతం ఇక్కడ వర్షం ఏకధాటిగా కురుస్తున్నప్పటికీ చలి రెంటికీ సమానమేగా. కనుక సరిపోతుంది.

మీకూ నాకూ తప్పదుగా మరి.

చదవండి డెట్రాయిట్ చలివాన పద్యాలు !! 
---------------------------------
కం|| పెట్రేగి పోయె శీతము
ఎట్రాసిటి జేయుచుండె ఎడమిక లేకన్
నిట్రాయి లాగ వర్షము
డెట్రాయిటు వెదరు జూడ డేంజరు సత్యా

అసలే 8 డిగ్రీల చలి. దానికి తోడు రెండ్రోజులనుంచీ ఆగని వర్షం. ఈ వెదరు నాలాంటి వాడికి బానే ఉంటుంది గాని మామూలు మనుషులైతే బెంబేలెత్తి పోరూ?

ఆ|| ఉల్లిపాయ లున్న ఉష్ణంపు పాకోడి
వేడి వేడి ఛాయి ఎదురు నుండ
ఇట్టి వెదరు నందు ఇంకేమి వద్దురా
అమెరికమ్మ వెదరు అద్భుతంబు

బయట వర్షం పడుతున్నది. చలిచలిగా ఉన్నది. ఇలాంటి వెదర్లో వేడి వేడి ఉల్లి పకోడీలూ, వేడి వేడి అల్లం చాయ్ ఉంటే అద్భుతంగా ఉండదూ?

ఆ|| రెండునాళ్ళ నుండి నిండైన వర్షమ్ము
కురియు చున్నదయ్య కుదురు గాను
చలికి  తాళలేక చద్దర్లు ముసుగేసి
వణకుచుంటి మిచట యుహుహు యనుచు

ఈ చలినీ వర్షాన్నీ తట్టుకోలేక లావుపాటి దుప్పట్లు ముసుగేసుకుని వణుకుతూ కూచున్నాం ఇక్కడ.

ఆ|| భారతమ్ము లోన భగభగా ఎండంట
ఇచట జూడబోవ ఈకువయ్యె 
వదలకుండ దంచు వానన్న భయమేసి
తిరుగులాట మాని తిక్క కుదిరె

ఇండియా శిష్యులేమో ఫోన్లు చేసి ఎండలు మండిపోతున్నాయి అంటున్నారు. ఇక్కడేమో చలీ వానా వణికిస్తున్నాయి. ఏంటీ విచిత్రం?

కం|| వేడిగ ఏదొక టిమ్మని
ఆడంబరముగ యడిగిన అమ్మడు కసరెన్
పాడుకొనుము కరవోకెలు
అడుగకుమీ అవ్వి ఇవ్వి యన్నది లలితా !

ఏదైనా వేడిగా తిందామని అడిగితే, "నీకెప్పుడూ తిండి ధ్యాస తప్ప ఇంకేమీ లేదు. పోయి ఆ పాటలు పాడుకో పో"- అని శ్రీమతి కసిరింది. ఏం చేస్తాం? నోర్మూసుకుని కిటికీ లోంచి వర్షాన్ని చూస్తూ బిక్కముఖం వేసుకుని కూచున్నా.

కం|| బయటకు బోవుట గుదురదు
నియతమ్ముగ ఇంటిలోన నిల్వగ వలెరా
పయనమ్ములు బందులవగ
శయనించితి రోజంతయు చక్కగ లలితా !

ఈ వానలో చలిలో బయటకు పోలేము. తిరగలేము. అందుకే చక్కగా బాసింపట్టు వేసుకుని హాయిగా నాలోనేను ఉన్నా.

ఆ|| పనియు పాట లేదు పైపెచ్చు రొద లేదు
టీవి లేదు ఇచట ట్రెయిను లేదు
తినుట పండుకొనుట తిక్కొచ్చి పడునయా
పరమ బోరు గొట్టు పొద్దుబోక

ఇక్కడ పనీ పాటా ఉండదు. ట్రాఫిక్ రొద లేదు. హారన్ సౌండ్స్ లేవు. దుమ్ము లేదు. చక్కని గాలి. మంచి నీళ్లు. చల్లని వెదరు. మాకు రోజూ కనిపించే రైళ్లు లేవు. ఏం చెయ్యాలో తెలియదు. తినడం పడుకోవడం. మామూలు మనుషులకైతే పరమబోరు కొడుతుంది ఇక్కడ.

కం || టపటప రాలెను చినుకుల్
విపరీతపు చలికి యొళ్లు విధిగా వణకెన్ 
నెపమేయుచు వర్షముపై
ఉపయోగము లేని ముసుగు వేసితి లలితా !

ఈ వర్షానికి చలికి హాయిగా ముసుగేసుకుని పడుకుంటే ఎంత బాగుంటుందో??

కం || ధ్యానము నెరిగిన వాడన్ 
మౌనంబుగ దినము నంత మప్పెడి వాడన్
కానల నైనన్ నాదగు
యానంబున నేను బోదు నెప్పుడు లలితా !

ఇవన్నీ ఎలా ఉన్నా నన్నేం చెయ్యలేవు. చిన్నప్పటినుంచీ అభ్యాసం చేసిన ధ్యానం నన్ను ఆదుకుంది. మౌనంగా రోజంతా నాలో నేను ఉండగలను. పక్కన ఉండి నన్ను చూచే వారికి పిచ్చెక్కాలి గాని నాకేమీ అవదు. అడవిలో నన్ను పడేసినా సరే నా మార్గంలో నేను పోతూ ఉంటా గాని లోకాన్నీ లోకుల చీప్ మనస్తత్వాలనీ ఏమాత్రమూ లెక్క చెయ్యను. అలాంటి నన్ను ఈ వాతావరణమూ ఈ పనిలేని జీవితమూ ఏం చేయగలవు?

ఆ|| హాటు చాకిలెట్టు హాయిగా త్రాగేసి
నాటు పాను వేసి నోరు పూసి
అమెరికన్ల తిండి ఆసహ్య మేసెరా
మనది తిండి మేలు మహిని జూడ

వాన కాస్త తగ్గాక ఒక శిష్యురాలితో కలసి బుద్ధిలేక మళ్ళీ స్టార్ బక్స్ కెళ్ళాం. అక్కడ హాట్ చాకోలెట్ త్రాగా. మధ్యాన్నం ఇంట్లో తిన్న హోమ్ మేడ్  కలకత్తా పాన్ లో మషాలా ఎక్కువై నోరంతా పూసింది. ఆ పూతమీద ఈ హాట్ చాకోలెట్ త్రాగితే బ్రతుకు మీద విరక్తి వచ్చేసింది.

ఆ|| కేజి ఫ్రీల ఎగ్గు కేసేంటి యనినంత
నాటు కోడి యనుచు నచ్చ జెప్పె
టర్కి ఏమిటన్న స్టుపిడ్డు క్వెశ్చన్కు
ఇచటి కోడి యనుచు ఇచ్చగించె

అక్కడ ఒకచోట cage free egg white  అని వ్రాసింది. అదేంటో అర్ధం గాక శిష్యురాలిని అడిగా. ఏమీ లేదు బయట తిరిగే నాటు కోడి సరుకని చెప్పింది. ఇంకొక మెనూలో 'టర్కీ' అని ఉంది. అదేంటి అనడిగితే - 'అది ఒకరకమైన కోడి ఇక్కడ దాన్ని తింటారని చెప్పింది.' 

ఏదేమైనా చక్కగా మన ముద్దపప్పు ఆవకాయ గోంగూర పచ్చడి చింతకాయ పచ్చడి పప్పుచారు పెరుగన్నం ఆ రుచులే వేరు. ఈ అమెరికన్ల తిండి ఛండాలంగా ఉంది.