“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

8, ఏప్రిల్ 2017, శనివారం

రెండవ అమెరికా యాత్ర -2 (స్టార్ బక్స్ కాఫీ పద్యాలు)

ఒక మంచు కురిసిన ఉదయం

పేవ్ మెంట్ మొక్కలపైన మంచు

ఆకుల్లేని చెట్లు - మొక్కలపైన మంచు


గడ్డిపైన మంచు


స్టార్ బక్స్ లో కూచుని కాఫీకోసం వెయిటింగ్
 

కారులోనుంచి ఆకాశం

దారిపక్కన చెట్లు

వాల్మార్ట్ లో షాపింగ్ చేస్తూ
వాల్మార్ట్ లో సెల్ఫీ

ఎలక్ట్రానిక్ వస్తువులను పరిశీలిస్తూ

పనోరమా వ్యూ


వ్యాఖ్యను జోడించు

అమెరికాకు వచ్చాక స్టార్ బక్స్ కెళ్ళి కాఫీ త్రాగక తప్పదు కదా ! అందుకని ఒకరోజు ఉదయాన్నే తీరిగ్గా పనులు ముగించుకుని బయటకొచ్చి కారుకు పట్టిన మంచును దులుపుకుని బయలుదేరాం. ఒద్దొద్దని మావాళ్లు వారిస్తున్నా వినకుండా ఉత్తచేత్తో మంచును దులిపినందుకు వేళ్ళు కొంకర్లు పోయాయి. వాటిని బాగా రుద్ది వేడి పుట్టించి మళ్ళీ మామూలు స్థితికి తెచ్చాను. ఇకమీదట గ్లోవ్స్ వేసుకోకుండా మంచును క్లిన్ చెయ్యకూడదని నిశ్చయానికి వచ్చా.

బయట ఎండా ఉంది. టెంపరేచర్ చూద్దామా అంటే జీరో డిగ్రీస్ ఉంది. ఒకపక్క ఎండా ఒకపక్క మంచి చలీ కలసి వాతావరణం భలేగా ఉంది.

స్టార్ బక్స్ లో కూచుని కాఫీ త్రాగాక కొన్ని పద్యాలు వ్రాద్దామని స్పురించింది. అప్పుడు ఉద్భవించినవే ఈ పద్యాలు.

చదవండి మరి . 

కం || కాఫీ కాఫీ యనుచున్
ట్రాఫిక్కును చూచుకొనక ట్రక్కును నడుపన్
మాఫీ లేదని నుడువుచు
బేఫికరుగ కాపువాడు వేసెను ఫైనే

స్టార్బక్స్ కెళ్ళి కాఫీ త్రాగే తొందరలో ట్రాఫిక్ సిగ్నల్స్ చూసుకోకపోతే కాపుగాడొచ్చి టికెట్ ఇచ్చే ప్రమాదం ఉన్నది తస్మాత్ జాగ్రత్త మరి !!

ఆ|| స్టార్ బక్సు కేగి స్టార్టింగ్ ట్రబులొచ్చి
ఆర్దరివ్వలేక అలసి సొలసి
వెర్రి మొగములేసి వేసారి కూర్చుండి
ఫోను జేసిరపుడు ఫ్రెండు కొరకు

మనకు తెలిసినది ఒకటే కాఫీ. ఇక్కడేమో వెధవది తొంభై రకాలున్నాయి. స్టార్బక్స్ కైతే స్టైలుగా వచ్చాముగాని ఏమి ఆర్దరివ్వాలో తెలీకపాయె!! అందుకని అక్కడ కూచుని ఒక ఫ్రెండ్ కి ఫోన్ చేసాం. అమ్మా వచ్చి కాఫీ అర్ధరివ్వు తల్లీ అని. 
  
కం || చెన్నై కాఫీ రుచితో
తిన్నని కాఫీలు చేసి తెమ్మని యడుగన్
అన్నా ! ఏమని చెప్పుదు
మిన్ను కదలు చేదు విషపు మోకా నిచ్చెన్

కాఫీ అంటే మన చెన్నై ఫిల్టర్ కాఫీ రుచితో అద్భుతంగా ఉంటుందని అనుకుని చూస్తుంటే ఏంటో 'మోకా' అంట, దాని దుంపతెగ ! మోకాళ్ళు కదిలిపోయేటంత చేదుగా ఉంది. దాన్ని తెచ్చి ఇచ్చారు.

ఆ|| న్యూసు పేపరొకటి న్యూయార్కు టైంసంటు
స్టాండు నుంచి దెచ్చి స్టైలుగాను
చదవబోయినంత చైనీసు ప్రెసిడెంటు
వచ్చె నిచటి కంచు వార్త దోచె

అక్కడ ష్టాండులో ఉన్న న్యూస్ పేపర్ చదువుదామని న్యూయార్క్ టైమ్స్ చేతిలోకి తీసుకున్నా. చైనీస్ ప్రెసిడెంట్ ఇక్కడకు వచ్చాడని ఒకటే హెడ్ లైన్స్ లో వేశారు. ఏది ఏమైనా అమెరికాను కూడా భయపెడుతున్న చైనాను అభినందించక తప్పదు కదా !!

కం|| ఆఫీసున కూలబడుచు
కాఫీ త్రాగగ వలదను కూతురు బోధన్
లైఫున విననందుకు ఈ
ట్రైఫుల్సుతొ బాధపడెడు ట్రబులొచ్చెనుగా !!

మా అమ్మాయి ఎప్పుడో చెప్పింది. నాన్నా ఆఫీసులో కూచుని టీలూ కాఫీలూ త్రాగకు. గ్యాసు ట్రబులు వస్తుంది. జాగ్రత్త అని. నాకు కాఫీ అలవాటు లేదు. కానీ టీలు త్రాగుతా రోజుకు రెండు. అమ్మాయి చెప్పిందని అవీ మానేశా ఒక నెలనుంచీ. ఈరోజు మాత్రం ఈ బ్లాక్ కాఫీ త్రాగే ఖర్మ పట్టింది.

ఆ|| అమెరికాకు వచ్చి అత్యంత మోజుతో
కాఫి త్రాగబోవ కళ్ళు దిరిగి
చేదు విషము లాగ ఛీకొట్టి నోరంత
పాడు యయ్యెనయ్య పంకజాక్ష

ఇదేం కాఫీరా బాబూ. చేదు విషంలాగా ఉంది. లొట్టలేసుకుంటూ ఎలా త్రాగుతున్నారో ఈ అమెరికన్స్ దీనిని? ఛీ ఛీ అనిపించింది. 

కం || మదరాసున కాఫీలను
మది నిండుగ ద్రావినంత మత్తులు దొలఁగున్
ఎదయే యుప్పొంగు నపుడు
వదవదమని వాగుడంత వచ్చుఁను వడిఁగా

చక్కగా మన చెన్నై కాఫీని పొద్దున్నే త్రాగితే రోజంతా ఎంతో హుషారుగా ఉంటుంది. ఒక కప్పు పడిందంటే ఒకటే వాగుడు మొదలౌతుంది. ఇక్కడ అమెరికాలో నైతే ఒక పెద్ద గ్లాసు పడిందంటే టాయిలెట్ కి పెరిగెత్తాల్సి వస్తుంది. అదీ మన కాఫీకీ అమెరికా కాఫీకీ తేడా. 

ఆ|| అమెరికాకు వచ్చి అనుకూల సమయాన
మందు త్రాగకుండ మరచిపోయి
కాఫి త్రాగువాడు కష్టాల కడగండ్ల
పాల బడుట నిజము పిచ్చివాడ !!

అసలు అమెరికాకి వచ్చి మందు త్రాగకుండా కాఫీ త్రాగే నాలాంటివాడు పిచ్చివాడు కాక మరెవరు?

ఆ|| అమెరికన్సు ముందు అంత్యంత ఇష్టాన
మందు పుచ్చుకొంద్రు మరుగులేక
కడమ రాంకు నిత్రు కాఫీకి  జూడంగ
వినుడు సత్యవాక్కు వీనులలర

ఇక్కడ అమెరికన్స్ చక్కగా రకరకాల మందులు పుచ్చుకుంటారు. ఆ తర్వాత స్థానం కాఫీకి ఇస్తారు. అదీ వీళ్ళ ప్రిఫరెన్స్.

ఆ|| బ్లాకు కాఫి త్రాగి బేదులందగనేల?
గ్యాసు ట్రబులు బుట్టి గుములనేల?
స్వచ్ఛమైన నీరు సుఖసౌఖ్య మివ్వదా?
పొట్టపాడు గాదె పొద్దు కాఫి?

అసలీ బ్లాక్ కాఫీ పొద్దున్నే త్రాగి టాయిలెట్ కి పరిగెత్తడం ఎందుకు? హాయిగా పొద్దున్నే రెండు పెద్ద గ్లాసులలో నిమ్మకాయ రసమూ తేనే కలుపుకుని త్రాగితే ఎంత హాయిగా ఉంటుంది?

కం || త్రాగకుమీ సారాయము
త్రాగకు కాఫీలనెపుడు స్టార్బక్సులలో
వాగకుమీ అతివాగుడు
వీగకుమీ మత్తునబడి వీకెండులలో 

అందుకే మిత్రులారా ! ఆల్కహాలు ముట్టుకోకండి. కాఫీ జోలికి పోకండి. వాటిని త్రాగి వాగకండి. వీకెండ్స్ పార్టీలలో తప్పత్రాగి మత్తులో మునగకండి. మీ మీ ఆరోగ్యాలు చెడగొట్టుకోకండి. ఇదే సత్యోపదేశం. షివాస్ రీగల్ సాక్షిగా చెబుతున్నా వినుకొండి నాయనలారా !!