“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

19, ఏప్రిల్ 2017, బుధవారం

రెండవ అమెరికా యాత్ర - 11 (మాయా ప్రపంచం)



'సూర్యుడు కనిపించని రోజొక దుర్దినం' అని వేదం అంటుంది. ఈ మాట డెట్రాయిట్ కు అక్షరాలా వర్తిస్తుంది. అసలే ఇక్కడ టెంపరేచర్ చాలా తక్కువలో ఉన్నది. దీనికి తోడు పొద్దున్నే మబ్బులు పట్టి సూర్యుడు రాకుండా వర్షం పడుతూ ఉంటే ఇంకెలా ఉంటుంది? మామూలు మనుషులకైతే దుప్పటి ముసుగేసుకుని హాయిగా పడుకోవాలనిపిస్తుంది. నాకైతే మనస్సు అప్రయత్నంగా ధ్యానోన్ముఖం అవుతుంది. రోజంతా అలాగే ఉండిపోవాలనిపిస్తుంది.త్రాగకపోయినా చాలా మత్తుగా ఉంటుంది.

ఉదయాన్నే ఇక్కడ టెంపరేచర్ 3 లేదా 4 డిగ్రీల సెల్సియస్ ఉంటున్నది. మన అదృష్టం బాగుండి సూర్యుడు వస్తే మధ్యాన్నానికి 10 లేదా 11 డిగ్రీలకు వస్తుంది. మళ్ళీ సాయంత్రానికి 4 లేదా 5 డిగ్రీలకు పడుతున్నది.అర్ధరాత్రికి 0 డిగ్రీలకు పోతుందేమో మరి మనకు తెలీదు, మనం బయటకు పోయి చూడము కదా ఆ టైంలో? ఇక వర్షం పడుతుంటే రోజంతా ఆ 4 లేదా 5 డిగ్రీలు అలాగే ఉంటుంది. ఇంకో విషయం !! ఇక్కడ ఏడాది పొడుగునా ప్రతి మూడు రోజులకొకసారి వర్షం పడుతూనే ఉంటుంది.

ఇండియాలో ఉన్న బంధువులతో స్నేహితులతో మాట్లాడుతుంటే ఎంతో విచిత్రంగా ఉంటున్నది. ఇక్కడేమో నేను స్వెటర్ వేసుకుని రగ్గు కప్పుకుని కూడా ఒక్కొక్కసారి గజగజా వణుకుతూ వాళ్ళతో మాట్లాడుతున్నాను. వాళ్లేమో, 43 డిగ్రీల వేడికి చెమటలు కక్కుతూ, డీ హైడ్రేట్ అయి నీరసపడిపోతూ మాట్లాడుతున్నారు. గుంటూరులో అప్పుడే 43 డిగ్రీల వేడి ఉన్నదట. ఉదయం 6 గంటలకే చెమటలు కారిపోతున్నాయట. ఇక మే నెల వస్తే 50 డిగ్రీలు దాటుతుంది అంటున్నారు. అప్పుడు ఏసీలు కూడా పనిచేయవు. ముసలీ ముతకా ఉంటే ఆ వేడికి హరీ మంటారు. ప్రతి ఏడాదీ గుంటూరులో ఇది మామూలే. వేసవి వేడికి కనీసం ఒక 100 మంది ప్రతేడాదీ లేచిపోతుంటారు. ఇప్పుడు హైదరాబాద్ కూడా అలాగే తయారైంది.

ఏంటో ఈ విచిత్రం? ఇదే భూమ్మీద ఒకవైపు చలికి గడ్డ కట్టుకుని పోతుంటారు. ఇంకోవైపు ఎండ వేడికి సొమ్మసిల్లి ప్రాణాలు పోతుంటాయి. ఒక చోట నీళ్ల చుక్క దొరకక మైళ్లకు మైళ్ళు పోయి బిందె తో నీళ్లు తెచ్చుకుంటూ ఉంటారు. మరోచోట ఎక్కడ చూచినా నీళ్లతో విచ్చలవిడిగా పారబోసుకుంటూ ఉంటారు. ఒకచోటేమో పేదరికం. ఇంకో చోటేమో పిచ్చి డబ్బు. ఒకచోటేమో మినిమమ్ సౌకర్యాలు కూడా ఉండవు. మరోచోట అడుగు తీసి అడుగు పెడితే ఎక్కడలేని విలాసాలు !!

ఎంత మాయా ప్రపంచమో కదా ఇది? ఇంతా చేస్తే ఈ మాయా ప్రపంచమే సత్యమనుకుని దానికోసం వెంపర్లాడుతూ ఉంటారు లోకులు. ద్వంద్వాలతో కూడిన ఈ ప్రపంచం ద్వంద్వాతీతుని తన మనస్సుకు స్పురింప చెయ్యడమేగా నిజమైన సాధక లక్షణం?

ఈ మాయను దాటి అసలైన సత్యాన్ని చేరుకోవడమే కదా నిజమైన మనిషి కర్తవ్యం?