“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

18, జులై 2016, సోమవారం

మా అమెరికా యాత్ర - 31 (గౌరీమా అద్భుత జీవితం - గురువై దిగివచ్చిన దైవం)

నిజమైన భక్తుడిని భగవంతుడు ఎప్పుడూ విడిచి పెట్టడు. అతనికి తెలిసినా తెలియకపోయినా నిరంతరం అతన్ని కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటాడు.అయితే మనకు ఆ విషయం తెలియవచ్చు తెలియకపోవచ్చు.అలా తెలియకపోవడానికి కారణాలు అనేకం ఉంటాయి.కొన్ని సార్లు అది అజ్ఞానమై ఉంటుంది.కొన్నిసార్లు ఆ జీవితంలో అలా జరగాలని ఉంటుంది గనుక అలా జరుగుతుంది.ఆ జన్మలో స్క్రిప్ట్ అలా వ్రాయబడి ఉంటుంది గనుక అలా జరుగుతుంది.

మృడానికి పదేళ్ళు వచ్చాయి.అందరి పిల్లల పరిస్థితి వేరు.ఈ అమ్మాయి పరిస్థితి వేరు.వారి ఆటలు ఈ అమ్మాయి ఆడదు.మౌనంగా కూచుని వారు ఆడుకుంటూ ఉంటె చూస్తూ ఉంటుంది.ఆ అమ్మాయి మనసులో ఏదో చెప్పలేని సంఘర్షణ చెలరేగుతూ ఉండేది.

'నేనెందుకు పుట్టాను? ఈ జన్మకు సార్ధకత ఏమిటి? అందరిలా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కని అందరిలాగే సంసారం సాగించి చివరకు నిరర్ధకంగా చావడమేనా నా జీవితం? అలాంటి జీవితానికి అర్ధమేముంది? అంతకంటే ఉన్నతమైన గమ్యం బ్రతుక్కి లేదా? ఒకవేళ ఉంటే దానిని నేనెలా చేరుకోవాలి? నాకు దారి చూపేవారు ఎక్కడున్నారు? నేను అతన్ని కలుసుకోగలనా? లేక అలా కలుసుకోకుండానే ఈ జన్మ ముగుస్తుందా?' - ఇలాంటి ఆలోచనలు ఆమెను చుట్టుముట్టి శాంతిగా ఉండనిచ్చేవి కావు.

తమ కూతురిలోని ఈ వింత ప్రవర్తనను తల్లిదండ్రులు గమనించకపోలేదు.కానీ వారు ఆమెను ఏమీ అనకుండా ఊరుకున్నారు.ఎందుకంటే - ఉన్నతమైన వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయో తరతరాలుగా చూస్తున్నవారు గనుక వారు ఆ ప్రవర్తనను విపరీత ప్రవర్తనగా ఏమీ భావించలేదు.

నిజమైన భక్తులంటే భగవంతునికి చాలా ప్రీతి ఉంటుంది.వారికి ఏ సమయంలో ఏది చెయ్యాలో ఆయనకు తెలుసు.ముందుగానే ఆ ప్లాన్ అంతా నిశ్చయం అయి ఉంటుంది.వారిని ఆయన నిరంతరం గమనిస్తూనే ఉంటాడు.వారి మనస్సులలో రేగుతున్న సంఘర్షణను ఆయన ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. వారు బాధపడితే ఆయనకూడా శాంతిగా ఉండలేడు.

శ్రీరామకృష్ణులకు, మృడానికి వయస్సులో 21 సంవత్సరాల తేడా ఉంది.శ్రీ రామకృష్ణులు 1836 లో జన్మించారు.మృడాని 1857 లో పుట్టింది.18 సంవత్సరాలు ఆ పైనగల తేడా ఎప్పుడూ కూడా రాహుకేతువుల ఆవృత్తిలో గల తేడావల్ల వస్తూ ఉంటుంది. ఒకే కర్మబంధం కలిగిన జీవులు పుడితే ఒకే సమయంలో పుడతారు.కుదరకపోతే 18 నుంచి 20 ఏళ్ళ తేడాతో పుడతారు.ఎందుకంటే అప్పటికి గాని రాహుకేతువులు రాశిచక్రంలో ఒక ఆవృత్తిని పూర్తిచేసి మళ్ళీ అదే స్థానాలకు రారు. ఇది రాహుకేతువుల చేతిలో ఉన్న కర్మ రహస్యం.

మామూలు మనుషుల జీవితాల లో మాత్రమే కాదు. మహనీయుల జీవితాలలో కూడా గ్రహప్రభావం తప్పకుండా ఉంటుంది. ఈ భూమి మీద గ్రహ ప్రభావానికి లొంగని మనిషీ లేడు, అవి గీచిన గీత ప్రకారం నడవని జీవితమూ లేదు.

మృడానికి పదేళ్ళ వయస్సు ఉన్నప్పుడు ఒక దైవ సంఘటన జరిగింది.భవానీ పూర్ అని కలకత్తా శివారులో ఒక గ్రామం ఉన్నది.అది జూలై ఆగస్టు సమయం.వర్షాలు పడుతూ ఆ పల్లెటూరి వాతావరణం అంతా చాలా ఆహ్లాదంగా ఉన్నది. తన స్నేహితులు అందరూ ఆరుబయట ఆడుకుంటూ ఉన్నారు. మృడాని తన ఇంటి బయట కూచుని వారిని చూస్తూ ఉన్నది. బహుశా అది గురుపూర్ణిమ సమయమే కావచ్చు.

ఆ సమయంలో 30 ఏళ్ళ వయస్సున్న ఒక యువకుడు ఆ దారిన నడుస్తూ పోతున్నాడు.అతని ముఖం ఎంతో ఆనందంతో వెలిగిపోతూ ఉన్నది.ఆ ఆనందం ఈ లోకపు ఆనందం కాదు. అది ఒక వెలుగులాగా అతని లోనుంచి బయటకు విరజిమ్ముతూ ఉన్నది.అతను నడుస్తుంటే ఆ దారంతా ఏదో తెలియని వెలుగు పరుచుకుంటున్నట్లుగా ఉన్నది.

ఆ యువకుడు సరాసరి వరండాలో కూచుని ఉన్న మృడాని వద్దకు వచ్చి ఆగాడు. చిరునవ్వు మోముతో ఆ అమ్మాయిని ఇలా ప్రశ్నించాడు.

'ఏమ్మా? నీ స్నేహితులందరూ ఆడుకుంటుంటే నువ్వెందుకు ఇలా ఒక్కదానివే కూచుని ఉన్నావు?'

ఇతరులను మంత్రముగ్ధులను చేసే ఆ స్వరంలో ఏ మాయ ఉన్నదో? తన ఆలోచనలో తానున్న మృడాని తలెత్తి చూచింది.

అలా తలెత్తి చూచిన క్షణంలో, ఆ పిల్ల ఏదో తెలియని వివశత్వానికి గురైంది. అకస్మాత్తుగా ఎన్నో భావాలు ఆ చిన్నపిల్లలో ఉవ్వెత్తున చెలరేగాయి.

'ఈయన నాకు ఎన్నో జన్మలుగా తెలుసు.ఏదో విడదియ్యరాని బంధం మా ఇద్దరి మధ్యన ఉన్నది.నాకు దారి చూపగల గురువు ఈయనే.అంతేకాదు నా ఇష్టదైవమూ ఈయనే, నా సర్వస్వమూ ఈయనే.ఎన్నో ఏళ్ళ ఎడబాటు తర్వాత మళ్ళీ ఈయనను నేను చూస్తున్నాను.' అన్న బలమైన భావాలు ఆ చిన్నపిల్లను నిలువెల్లా ఊపేశాయి.అవి ఉత్త భావాలు కావు, ఎన్నో జన్మల నుంచి వెంటాడుతూ మధ్యలో మరచిపోగా మళ్ళీ ఇప్పుడు హటాత్తుగా గుర్తొచ్చిన జ్ఞాపకాలలా అవి తోచాయి.

తనేం చేస్తున్నానో తెలియని స్థితిలో మృడాని లేచి నిలబడింది.ఆమెకు తెలియకుండానే ఆ అమ్మాయి కళ్ళవెంట నీరు ధారలుగా కారిపోతున్నది. ఏం చేస్తున్నదో తెలియని స్థితిలో అతని పాదాల మీద వాలిపోయి తన కన్నీటితో ఆ పాదాలను అభిషేకించింది.

అదే చిరునవ్వుతో ఆ యువకుడు తన కుడిచేతిని ఆ అమ్మాయి తలమీద ఉంచి తన మధురస్వరంతో ఇలా అన్నాడు.

'నీవు కృష్ణభక్తిలో ధన్యురాలవు అవుతావు గాక'

ఆ యువకుడు అంతకంటే ఇంకేమీ మాట్లాడలేదు.మళ్ళీ తనదారిన తాను నవ్వుతూ వెళ్ళిపోయాడు. చేష్టలు దక్కిన మృడాని అతను వెళుతున్న వైపే అలా చూస్తూ నిలబడి పోయింది.

ఇది జరిగిన కొన్నాళ్ళకు ఇంకొక సంఘటన జరిగింది.

మృడాని అన్నగారు అక్కడకు దగ్గరలోనే ఉన్న వరాహ నగర్ అనే ఊరిలో ఉన్న తన మేనత్త దగ్గరకు వెళుతూ, తన చెల్లెలిని కూడా తోడు తీసికెళ్ళాడు.ఆమె కూడా సంతోషంగా అన్నగారితో ఆ ఊరికి వెళ్లి కొన్నాళ్ళు మేనత్తగారింట్లో ఉన్నది.

అక్కడ ఉండగా ఒకరోజున ఆ అమ్మాయికి ఒక దర్శనం కలిగింది.

తనను ఆశీర్వదించిన ఆ యువకుడు ఒక అరటితోట మధ్యలో గల ఒక చిన్న పాకలో కూచుని ధ్యాన సమాధిలో ఉన్నట్లు, ఆ యువకుని నుంచి వెలువడుతున్న తెల్లని పాలవెలుగు ఆ పాకను దాటి లోకమంతా నలువైపులా వ్యాపిస్తున్నట్లు ఒక దివ్యమైన దర్శనాన్ని ఆ అమ్మాయి హటాత్తుగా చూచింది.

ఆ దర్శనాన్ని చూచిన తర్వాత ఆ అమ్మాయి ఎంతమాత్రం తట్టుకోలేక పోయింది.

ఆ ఊరి చుట్టూ అరటి తోటలు దండిగా ఉన్నాయి. ఇక ఆ తోటల్లో పడి వెదకడం మొదలు పెట్టిందా అమ్మాయి.కనిపించిన ప్రతివారినీ ఆ యువకుని గురించి అడిగేది.అలా వెదకగా వెదకగా ఒకచోట కొందరు ఇలా అన్నారు.

'అవును.అదుగో అక్కడ తోటలో ఒక పాక ఉన్నది కదా. అందులోనే ఒకాయన ఉన్నాడు.ఆయన బయటకు రాడు. ఎప్పుడు చూచినా ధ్యానసమాధిలోనే ఉంటాడు.బహుశా నువ్వు వెదుకుతున్నది ఆయన కోసమేనేమో.వెళ్లి చూడు.'

దడదడా కొట్టుకుంటున్న గుండెతో ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ ఆ పాక దగ్గరకు వెళ్లి మెల్లిగా తలుపు తోసి చూచింది.

ఆ గది మధ్యలో శాంతంగా కూచుని చిరునవ్వు నవ్వుతూ ధ్యాన సమాధిలో ఉన్న అదే దివ్యమూర్తిని ఆ అమ్మాయి చూచి అప్రతిభురాలై పోయింది. తాను దర్శనంలో చూచిన దివ్యమూర్తి అతడే.అతని చుట్టూ ఏదో దివ్యకాంతి ఆవరించి ఉండటం ఆ అమ్మాయి అమాయక నేత్రాలకు కనిపించింది. తాను నిత్యమూ పూజించే శివుడే ఆ రూపంలో ఎదురుగా ప్రత్యక్షమైనట్లుగా ఆ అమ్మాయికి అనుభవం కలిగింది.

ఏమీ మాట్లాడలేక ఆ పాకలో ఒకమూలగా కూచుని అతన్నే చూస్తూ ఉండిపోయింది ఆ పిల్ల.

అలా కొన్ని గంటలు గడిచాయి.ఆయన కళ్ళు తెరవలేదు.ఈ అమ్మాయి కళ్ళు ఆర్పలేదు.సంభ్రమ నేత్రాలతో ఆయన్ను చూస్తూ ఆ పాకలో ఒంటరిగా అలా కూచుండిపోయింది ఆ పిల్ల.

కొన్ని గంటల తర్వాత అదే చెక్కు చెదరని చిరునవ్వుతో ఆయన మెల్లిగా కళ్ళు తెరిచి ఈ అమ్మాయి వైపు దృష్టి సారించాడు.

ఒకే ఒక్క మాటను మెల్లిగా పలికాడాయన. 

'వచ్చావా?'

ఒక్కసారిగా భావోద్వేగం ఆ పిల్లలో కట్టలు త్రెంచుకుంది. వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ అతని పాదాలపైన పడిపోయి రోదించ సాగింది. అలా చాలాసేపు ఏడ్చి శాంతించాక, 'తనను శిష్యురాలిగా స్వీకరించమని,దారి చూపించమని' ఆయనను అడిగింది మృడాని.

సరేనని చెప్పిన ఆయన, ఆ దగ్గరలోనే ఉన్న తన బంధువుల ఇంటిలో ఆ అమ్మాయి ఆ రాత్రికి బస చేసే ఏర్పాటు చేసి, మర్నాడు ఉదయం స్నానం చేసి ఏమీ తినకుండా రమ్మని అప్పుడు ఉపదేశం ఇస్తానని చెప్పి ఆ అమ్మాయిని వెనక్కు పంపించేశాడు.

మర్నాడు రాస పూర్ణిమ.

బృందావనంలో రాసలీల జరిగిన మహోన్నతమైన రోజది. జీవుడు,తనను వెనక్కు పట్టి లాగుతున్న సమస్త బంధాలనూ వదిలించుకున్నవాడై, ప్రేమ అనే మహోన్నత సాధనను రుచి చూచినవాడై,తన హృదయేశ్వరుడూ, ప్రేమస్వరూపుడూ, సచ్చిదానంద ఘనుడైన శ్రీకృష్ణుని కలుసుకుని,తన అస్తిత్వాన్ని కోల్పోయి,ఆయనలో సంపూర్ణంగా కరగిపోయే మహత్తరమైన రోజది.

ఆ రోజునే భూవాతావరణాన్ని 'ప్రేమ' అనే దివ్యమైన మత్తు మొదటిసారిగా తాకింది.జీవుల మాయామోహాలను వదిలించి వారికి దివ్యమైన ప్రేమోన్మాదాన్ని మొదటిసారిగా రుచి చూపించింది.

ఆ రోజున పొద్దున్నే లేచి స్నానం చేసి ఏమీ తినకుండా శుచిగా మళ్ళీ ఆ పాక దగ్గరకు వచ్చింది మృడాని. యధావిధిగా ఆ అమ్మాయికి మంత్రోపదేశం గావించాడాయన.

ఆయన చెప్పిన విధంగా ధ్యానానికి కూచున్న ఆ అమ్మాయి వెంటనే చాలా గాఢమైన సమాధిస్థితి లోకి వెళ్ళిపోయింది. లోలోపల ఎంతో ఆనందాన్ని అనుభవించింది.సహజంగానే పరిశుద్ధమైన ఆమె మనస్సు క్షణంలో భవబంధాలను అధిగమించి తన ఇష్టదైవాన్ని చేరుకుంది.ఆయనలో కరగి పోయింది.కాలం ఆగిపోయిన ఆ స్థితిలో ఎన్నో గంటలు నిశ్శబ్దంగా గడిచాయి.

ఈ లోపల నిన్నటి నుంచీ చెల్లెలి కోసం వెదుకుతున్న అన్నగారు, పల్లెప్రజల ద్వారా ఆమె ఇక్కడుందని తెలుసుకుని వెదుక్కుంటూ వచ్చాడు.

పాకలో ప్రవేశించి చూస్తే ఏముంది? 

గది మధ్యలో దివ్యతేజస్వి అయిన ఒక యువకుడు ధ్యాన సమాధిలో కూచుని ఉన్నాడు. ఒక మూలగా తన చెల్లెలు అదే స్థితిలో ధ్యానసమాధిలో కూచుని ఉన్నది. ఇద్దరికీ శరీర స్పృహ లేదు.

ఈ దృశ్యాన్ని చూచిన అన్నగారు బిత్తర పోయాడు.కానీ తన చెల్లెలి మనస్సు చిన్నప్పటినుంచీ తెలిసిన వాడు గనుక త్వరలోనే తేరుకున్నాడు.చాలా సేపు ఓపికగా వారు కళ్ళు తెరవడం కోసం వేచి చూచాడు.

కొన్ని గంటలు అలా గడిచాక వారిద్దరూ కళ్ళు తెరిచారు.

ఆ యువకుడు మృడానితో ఇలా అన్నాడు.

'ప్రస్తుతం మీ అన్నగారితో వెళ్ళు. పదిహేనేళ్ళ తర్వాత మళ్ళీ గంగానదీ తీరంలో నువ్వు నన్ను కలుస్తావు. ఇప్పటికి వెళ్ళు.'

దివ్య స్వరూపుడైన ఆ యువకుడే శ్రీరామకృష్ణుడని వేరే చెప్పనవసరం లేదు కదా !!

ఆ విధంగా పదేళ్ళ వయస్సులోనే మృడాని సాక్షాత్తు దైవం యొక్క అవతారమైన శ్రీ రామకృష్ణుల చేతిలో దీక్షను పొందిన భాగ్యవంతురాలైంది.

శీ రామకృష్ణుల వారిచ్చే దీక్ష విలక్షణంగా ఉండేది. 'ఇదుగో నీ ఇష్ట దైవం చూడు' అని ఆయన అనేవారు. అంతే ! భక్తుని ఎదురుగా అతని ఇష్టదైవం మహా తేజస్సుతో వెలిగిపోతూ ప్రత్యక్షమయ్యేది.ఆ దైవాన్ని అలా చూస్తూ అందులో కరగిపోవడమే భక్తుని పని.ఈ విధమైన దీక్షను ఇవ్వడం ఒక్క భగవంతుని అవతారానికే సాధ్యం అవుతుంది గాని మహాయోగులకు మహాజ్ఞానులకు కూడా సాధ్యం కాదు.

ఆయన ఇచ్చే దీక్షలో తంతులు ఉండవు.హోమాలు ఉండవు. పునశ్చరణలు ఉండవు.ఆయన ఆజ్ఞను శిరసావహించి, సరాసరి నీ ఇష్టదైవం నీ ఎదురుగా నిలబడి నీకు దర్శనం ఇస్తుంది. అంతే.

చదువరులకు ఒక అనుమానం రావచ్చు.

నేడు మేము ఎంతో తపన పడి ఎంతో వెదికినా కూడా మాకు సరియైన గురువు లభించడం లేదు కదా? మరి ఆ చిన్నపిల్లకు పదేళ్ళ వయస్సులో సాక్షాత్తు భగవంతుడే గురువుగా ఎలా లభ్యమయ్యాడు? అని.

సరియైన సమర్ధుడైన గురువు లభించడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు.అది అంత తేలికగా అందరికీ దక్కే వరం కాదు. దానికి చాలా పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఎంతో పుణ్యం మన ఎకౌంట్లో ఉండాలి.అన్నిటినీ మించి స్వచ్చమైన పవిత్రమైన నిష్కల్మషమైన మనస్సు ఉండాలి. అప్పుడే అది సాధ్యం అవుతుంది.వీటిలో ఏది లోపించినా బాధగురువే లభిస్తాడు గాని బోధగురువు లభించడు, సిద్ధగురువు అసలే లభించడు.ఇక సాక్షాత్తు భగవంతుడే గురువుగా లభించడం అనేది అసంభవం.అది ఎక్కడో కోటిమందిలో ఒక్క మహాభాగ్యవంతుడికి మాత్రమే దక్కే అరుదైన వరం.

సరియైన మొగుడే ఈ రోజుల్లో దొరకడం లేదు.ఇక సరియైన గురువు ఎక్కడ దొరుకుతాడు?

తర్వాత కాలంలో శ్రీ రామకృష్ణులు ఇలా అనేవారు.

'గౌరి అందరిలాంటి మామూలు మనిషి కాదు. తను బృందావన గోపిక. ఈ జన్మలో ఇలా పుట్టింది.జన్మజన్మలుగా తను కృష్ణుని ప్రేమికురాలు.ఆయనతో అవినాభావ సంబంధాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉన్న పవిత్రమైన ఆత్మ ఆమె.'

అందుకేనేమో రాసపూర్ణిమ నాడు, శరీరంతో ఉన్న కృష్ణుని (శ్రీ రామకృష్ణుని) ఆమె కలుసుకోగలిగింది. ఆయన వద్ద దీక్షను పొంది ఆనంద సమాధిలో తనను తాను మరచిపోయి కృష్ణ దర్శనంలో ఓలలాడింది !

మహనీయుల జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో కదా !

(ఇంకా ఉంది)