“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

11, ఆగస్టు 2014, సోమవారం

ఇరాన్లో కూలిన విమానం - పౌర్ణమి ప్రభావానికి మరొక్క ఋజువు

నిన్న ఉదయం ఇరాన్లో ఇంకొక ప్రయాణీకుల విమానం కూలిపోయింది.38 మంది ఆ ప్రమాదంలో చనిపోయారని అంటున్నారు.

సరిగ్గా పౌర్ణమి ప్రభావంలో ఇది జరిగింది.

ఉదయం 9.20 కి టెహరాన్ లో బయలుదేరిన విమానం కొద్దిసేపట్లోనే జనావాస ప్రాంతాలలో కూలింది.

ఆ సమయానికి ఉన్న గ్రహస్థితిని ఇక్కడ చూద్దాం.

ఈ విమానం HH 5915 అనే నంబర్ ను కలిగి ఉన్నది.


HH 5915

అంటే 88-20.

దీనిని గ్రహముల లోకి మారిస్తే,

శని-శని-రాహువు అవుతుంది.

ఇకపోతే,దీని రూట్ నంబర్ 9 అవుతుంది.పాశ్చాత్య విధానంలో ఈ అంకె కుజునికి సూచిక.

నేను వ్రాస్తున్న గత కొన్ని పోస్ట్ లు చదువుతున్న వారికి ఇంతకంటే ఇంకే వివరణా అవసరం లేదనుకుంటాను.మళ్ళీమళ్ళీ అవే శని రాహు కుజులు ప్రత్యక్షం కావడం స్పష్టంగా గమనించవచ్చు.

నేను వ్యక్తిగతంగా నమ్మే విధానంలో 9 చంద్రుడిని సూచిస్తుంది అని నమ్ముతాను.చాలా పరిశోధన మీద ఈ నమ్మకానికి నేను వచ్చాను.ఇప్పుడు ఇంకొక విచిత్రాన్ని వినండి.

ఉదయం 9.20 కి టెహరాన్ లో సరిగ్గా చంద్రహోర జరుగుతున్నది.అంతేకాదు నడుస్తున్న నక్షత్రం కూడా శ్రవణం(చంద్ర నక్షత్రమే).

9.20=11=2 (మళ్ళీ రాహువే)

ఈ ప్రమాదంలో చనిపోయినది 38 మంది.

అంటే 38=11=2 (మళ్ళీ రాహువే)

ఈ విశ్లేషణను ఇలా ఉంచి,ఈ సంఘటన వెనుక ఉన్న జ్యోతిష్యపరమైన వివరాలు చూద్దాం.

లగ్నం కన్య 12 డిగ్రీలలో ఉండి రాహుప్రభావానికి లోనై ఉన్నది.లగ్నంలో రాహువు ఉండటం స్పష్టంగా చూడండి.అక్కడనుంచి కుంభంలో ఉన్న నెప్ట్యూన్ తో ఖచ్చితమైన షష్టాష్టక దృష్టిలో ఉన్నది.ఇక్కడ ఇంకొక్క విచిత్రం ఉన్నది.నెప్ట్యూన్ రాహునక్షత్రంలో ఉన్నది.కనుక ఈ సమయం పూర్తిగా భయంకరమైన రాహుప్రభావానికి లోనై కనిపిస్తున్నది. అందుకే ఈ ప్రమాదం జరిగింది.

జీవకారకుడైన గురువు కర్కాటకం 11 డిగ్రీలలో ఉంటూ ధనుస్సులో మూలా నక్షత్రంలో ఉన్న మాందీగ్రహంతో ఖచ్చితమైన షష్టాష్టక దృష్టిలో ఉన్నాడు. గురువు శనినక్షత్రంలో ఉన్నాడన్న విషయం గమనార్హం.అంటే ఈ ఘడియలో కొంతమంది మానవసమూహాలకు మూడింది అన్న సూచన స్పష్టంగా ఉన్నది.

గురువు ఈ సమయంలో ఇంకా మూడు గ్రహాలతో  కూడి ఉన్నాడు.అవి రవి,బుధ,శుక్రులు.ఈ నలుగురిలో గురు శుక్రులు పుష్యమీ(శని) నక్షత్రంలోనూ రవిబుధులు ఆశ్లేషా(రాహు) నక్షత్రంలోనూ ఉన్న విషయం గమనిస్తే రాహుశనులు తెరవెనుక ఉండి నడిపించిన నాటకం అర్ధమౌతుంది.

వాయుతత్వరాశిలో ఉన్న వాయుగ్రహమైన శనితో సూర్యునికి ఖచ్చితమైన కోణదృష్టి ఉండటం గమనిస్తే ఈ వాయుయాన ప్రమాదం ఎందుకు జరిగిందో అర్ధమౌతుంది.ఈ రోజు ఆదివారం అన్న విషయం కూడా గమనార్హం.

నవాంశలో శని నీచస్థితిలో కుజక్షేత్రంలో ఉంటూ అక్కడే ఆ సమయలగ్నం ఖచ్చితంగా పడటం ఒక వాయుయాన ప్రమాదాన్ని సూచించడం లేదూ?

ఈ సమయానికి చంద్ర శని బుధ రవిదశ జరుగుతున్నది.రాహుప్రభావంలో ఉన్న రవిబుధులపైన ఉన్న శని దృష్టి ఎంత ఖచ్చితంగా ఉన్నదో గమనించండి.ఇకపోతే చంద్రనక్షత్రం నడుస్తున్న రోజున చంద్ర హోరలో చంద్రునితో రవిబుధులకు సప్తమ కేంద్ర దృష్టి ఉన్నది.ఇంతకంటే అద్భుతమైన గ్రహసమ్మేళనం దీనిని తప్ప ఇంక దేనిని సూచిస్తుంది?

HH 5915 అనే విమాన నంబర్లో ఏయే గ్రహాలున్నాయో చూద్దామా?

8=శని(రెండుసార్లు).వాయుసూచకుడు.వాయుతత్వరాశిలో ఉన్నాడు.
5= బుధుడు(రెండుసార్లు).ఆ సమయానికి బుధుడే ఆత్మకారకుడు.
9=చంద్రుడు.
1=సూర్యుడు.పౌర్ణమి రోజుగనుక సూర్యచంద్రుల పాత్ర ఉన్నది.

శని బుధ సూర్య చంద్రుల గురించేగా పై పేరాలో మనం అనుకుంటున్నది? వారిదశయేగా అప్పుడు జరుగుతున్నది.చూచారా దశాసంతకం విమాన నంబర్లో ఎలా ఖచ్చితంగా సరిపోయిందో?అప్పుడు జరుగుతున్న దశ ఆ విమాన నంబర్ తో ఖచ్చితంగా సరిపోయింది గనుకనే అదే విమానం కూలిపోయింది.

చూచారా జ్యోతిష్యమూ సంఖ్యాశాస్త్రమూ ఎలా ఖచ్చితంగా సరిపోతాయో?

మరి ఉచ్ఛస్థితిలో ఉన్న గురువు వల్ల ఏమి మేలు జరిగింది? అని మన సందేహ సుందరాలకు అనుమానం రావచ్చు.

విమానం జనావాస ప్రాంతంలో పడినా కూడా పౌరులకు ఏ విధమైన ప్రమాదమూ జరగకపోవడమూ, ఆ విమానంలో ఉన్నవారిలో కూడా 9 మంది బ్రతికి బట్ట కట్టడమే గురు అనుగ్రహం.నేను పైన చెప్పినట్లు 9 అంకె చంద్రుని సూచించడమూ ఆ పూర్ణచంద్రునిపై గురువు యొక్క దృష్టి ఉండటమూ ఇది గజకేసరీయోగం కావడమే ఇంత ప్రమాదంలో కూడా కొందరు బ్రతికి బట్టకట్టడానికి కారణాలు.

ఆత్మకారకుడైన బుధుడు అస్తంగతుడై రాహుప్రభావంలో ఉండటం ఈ ప్రమాదం అంతటికీ కొసమెరుపు.

ఏతా వాతా చూస్తే,శని రాహు కుజుల ప్రభావమూ పౌర్ణమి ప్రభావమూ మరొక్క సారి ఋజువైంది.

నా వీరాభిమానులు మళ్ళీ వారి గళం వినిపించవచ్చు.

"అన్నీ జరిగిపోయిన తర్వాతనే మీరు వ్రాస్తారు.ముందే చెప్పచ్చుగా?" అని.

"అన్నీ ముందే తెలుసుకోవాలని అంత దుగ్ధ మీకెందుకు?తెలుసుకుని ఏం చేస్తారు?"అని నేను ప్రశ్నిస్తాను.

"మీ జీవితాలు మీరు బాగుచేసుకోలేరు.లోకంలో జరిగే జరగబోయే ఉపద్రవాలు ముందుగా తెలుసుకోవాలనీ వాటిని తప్పించాలనీ ఎందుకంత ఆరాటం?" అని కూడా ప్రశ్నిస్తాను.

"జరగబోయేది ముందే తెలిస్తే అదిచెప్పి వాడెవడో నాస్తిక శిఖామణి ఎనౌన్స్ చేసిన ప్రైజ్ మనీ కొట్టేయ్యచ్చుగా" అని వారంటారు.

అదీ వారి అసలైన బాధ!!!

"ప్రతిదానినీ మీలాగా డబ్బుతో కొలిచే పాడలవాటు నాకు లేదు"-అని నేనంటాను.

"మరి ఇదంతా వ్రాయడం ఎందుకు?" అని వారంటారు.

"మానవుల మీద ఉన్న గ్రహప్రభావాన్ని అర్ధం చేసుకోవడానికి మాత్రమే ఇదంతా వ్రాస్తున్నాను"-అని నేను బదులిస్తాను.

"ఈ మాట చాలా సార్లు వినీవినీ విసుగొచ్చింది.ఇక ఆపండి"- అని వారంటారు.

"ఆపను.నాకూ మీరడిగే ప్రశ్నను వినీవినీ విసుగొచ్చింది.ఎలాగూ నేను చెబుతున్నదాన్ని అర్ధం చేసుకునే తెలివీ వివేకమూ మీకు లేవు.మీరే ఆపండి"-అని నేనంటాను.

వారూ ఆపరు.నేనూ ఆపను.

చివరికి "కధ కంచికి మనం ఇంటికి".

కొసమెరుపుగా ఇంకొక్క సంగతి.

ఇరాన్ లోనే ఎందుకు ఇది జరగాలి? ఇంకో దేశంలో ఎందుకు జరగకూడదు? అని మళ్ళీ కొందరు అడుగుతారు.

వారికి మాత్రం చిన్న క్లూ ఇస్తాను.

TEHERAN

అనే దానిని అంకెలలోకి మార్చి చూడండి.

2058518114

దీని రూట్ నంబర్ 8 అవుతుంది.

అంటే శనీశ్వరుడిని సూచిస్తున్నది.

IRAN

అనే దానిని అంకెలలోకి మార్చండి.

918114

దీని రూట్ నంబర్ 6 అవుతుంది.

అంటే కుజుడు.

అంటే కుజ శనుల కలయిక.

ఇప్పుడైనా కనీసం అర్ధమైందా? ఈ యాక్సిడెంట్ ఇరాన్ లోని టెహరాన్ సమీపంలోనే ఎందుకు జరిగిందో?

నా వీరాభిమానులు అడగబోయే ప్రశ్నలు కూడా నాకు ముందుగానే తెలిసిపోవడమే జ్యోతిష్యం నిజం అనడానికి ఇంకొక సూచన.

అదీ సంగతి!!!