“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

11, ఆగస్టు 2014, సోమవారం

అశ్వత్థామ - పాండవ శిబిరంలో ప్రళయ తాండవం

నిశిరాత్రి.

కటిక చీకటి.

అక్కడక్కడా వెలుగుతున్న దివిటీలు ఆ చీకటిని పారద్రోలలేక పోతున్నాయి.

పాండవ శిబిరంలో అందరూ గాఢనిద్రలో ఉన్నారు.అప్పటివరకూ అందరూ విజయోత్సాహంతో విందులు వినోదాలలో మునిగితేలి మదిరామత్తులై ఆనందంలో ఒళ్ళు మరచి నిద్రిస్తూ ఉన్నారు.చివరకు ఏనుగులూ గుర్రాలూ కూడా ఇన్నాళ్ళ యుద్ధశ్రమను మరచిపోవడానికా అన్నట్లు గాఢనిద్రలో ఉన్నాయి.అంతా నిశ్శబ్దంగా ఉన్నది.వాకిలి కాపలాదారులు కూడా నిద్రలో ఉన్నారు.

వారు నిద్రలోనే పెనునిద్రలోకి పంపబడ్డారు వీరిచేత.

కృపాచార్యునీ కృతవర్మనూ ముఖద్వారం వద్ద కాపలాగా ఉండమని చెప్పిన అశ్వత్థామ పాండవశిబిరాలలోనికి నిశిరాత్రిలో మృత్యువులాగా నిశ్శబ్దంగా ప్రవేశించాడు.

గుర్తులను బట్టి నిశ్శబ్దంగా వెదుకుతూ ముందుగా దృష్టద్యుమ్నుని శిబిరం వైపు కదిలాడు అశ్వత్థామ.

అతని మనస్సులో తన తండ్రి వధాదృశ్యమే కదులుతున్నది.నిరాయుధుడైన తన తండ్రిని దృష్టద్యుమ్నుడు తలనరకడమే అతని మనస్సులో మెదులుతున్నది.మహాగురువూ మహాతపస్వీ బ్రాహ్మణోత్తముడూ అయిన తన తండ్రిని అలా కిరాతకంగా చంపుతాడా ఒక గర్వితుడైన సామాన్య క్షత్రియుడు?

శిబిరంలోకి ప్రవేశించి చూచాడు.

రాజభోగంతో కూడిన ఒక ఉన్నతమైన తల్పం మీద దృష్టద్యుమ్నుడు చేతులు బారజాపుకుని హాయిగా నిర్భయంగా నిద్రపోతున్నాడు.

అశ్వత్థామలోని యముడు మేల్కొన్నాడు.

ఆదమరచి నిద్రిస్తున్న దృష్టద్యుమ్నుని ఎగిసి తన కాలితో ఒక్క తాపు తన్నినాడు అశ్వత్థామ.

ఉలిక్కిపడి లేచిన అతన్ని జుట్టు పట్టుకుని తల్పం నుంచి నేలకు ఒక్క ఊపున జారలాగి తేరుకునే వ్యవధి ఇవ్వకుండా అతని మర్మస్థానాల మీద చేతులూ కాళ్ళతో బలమైన దెబ్బలు కొట్టడం ప్రారంభించాడు.

దృష్టద్యుమ్నునికి ఏమి జరుగుతున్నదో అర్ధం కాలేదు.ఎవరు తనను కొడుతున్నారో ఎందుకు కొడుతున్నారో ఒక్కక్షణం పాటు ఏమీ తెలియలేదు. ఇదంతా పీడకలేమో అనుకున్నాడు.కాని అశ్వత్థామ కొడుతున్న భయంకరమైన చావుదెబ్బలు సృష్టిస్తున్న నొప్పి 'ఇదంతా కలకాదు నిజమే' అని చెబుతున్నది.

అతనికి లేవడానికి అవకాశం ఇవ్వకుండా 'జానుబంధం' అనే మల్లయుద్ధ ప్రక్రియలో అతన్ని నేలకు బిగించి అణచి పెట్టాడు అశ్వత్థామ.వెనక్కు బాణంలా అతని వెన్నును వంచిపట్టి 'కంఠ చక్రబంధం' అనే ప్రక్రియతో అతని ఊపిరిని ఆడకుండా బిగించినాడు.

'ఎవరు? ఎవరు? ఏ రాక్షసుడవు నీవు?' సర్వశక్తులూ కూడగట్టుకుని అరిచాడు ద్రుష్టద్యుమ్నుడు.

అతను అరిచానని అనుకున్నాడు.కాని ఆ గొంతు పీలగా బేలగా పలికింది.

'అవును రాక్షసుడనే.బ్రహ్మరాక్షసుడను.అశ్వత్థామను.ఈ ఘడియలో నీ చావు నా చేతిలో మూడుతున్నది.నీ పాపానికి తగిన శిక్షను పొందడానికి సిద్ధపడు' ఆగ్రహంతో ఊగిపోతూ అశ్వత్థామ బదులిచ్చాడు.

దృష్టద్యుమ్నునికి విషయం అర్ధమైంది.అప్పటికే మర్మస్థానాలు చితికిపోయి అతను ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నాడు.చావు తప్పదని అతనికి తెలిసిపోయింది.

'అశ్వత్థామా.నన్నిలా కాళ్ళతో చేతులతో తొక్కి ఒక జంతువును చంపినట్లు చంపకు.నాకు ఉత్తమగతులు కలగవు.ఒక వీరునివలె నన్ను శస్త్రాస్త్రాలతో వధించు.కనీసం నాకు మరణం తర్వాత స్వర్గం ప్రాప్తిస్తుంది.'అతికష్టం మీద గొంతు పెకలించుకుంటూ ప్రాధేయపడ్డాడు దృష్టద్యుమ్నుడు.

మహోగ్రరూపంలో ఉన్న అశ్వత్థామ కరగలేదు.అతడు వీరవిద్యలలో నిష్ణాతుడు.ఏ నాడీకేంద్రం మీద ఏ విధంగా కొడితే ఎంతసేపట్లో ప్రాణం పోతుందో అతనికి బాగా తెలుసు.

'నిరాయుధుడై ధ్యానంలో ఉన్న మహాగురువు ద్రోణాచార్యుని వధించిన నీవు మానవుడవు కావురా నీచుడా! నీవు పశువువే!! కనుక నీకు పశుమరణమే సరియైనది. నిన్ను శస్త్రాస్త్రాలతో వధించి అంత మర్యాదను ఇవ్వలేను.నీకు స్వర్గార్హత లేదు.నరకమే నీకు గతి.'అంటూ ఇంకా బలమైన ముష్టిఘాతాలతో ద్రుష్టద్యుమ్నుని కళ్ళలోనూ, కణతలమీదా, మెడా గొంతులలో ఉన్న నాడీకేంద్రాల మీదా,జననేంద్రియాలమీదా కొడుతూ ఉత్తచేతులతోనే అతన్ని క్షణాలలో చంపేశాడు.ఇదంతా అతని రాణులూ పరివారమూ గుడ్లప్పగించి చూస్తుండగానే జరిగిపోయింది.

అప్పటివరకూ హాయిగా నిద్రిస్తున్న దృష్టద్యుమ్నుడు క్షణాలలో విగతజీవియై శవంగా మారిపోయాడు.

పెద్దగా పెడబొబ్బలు పెడుతూ దృష్టద్యుమ్నుని శవాన్ని ఒక పక్కకు విసరి కొట్టాడు అశ్వత్థామ.తన తండ్రి వధకు ప్రతీకారం తీరిందన్న సంతోషంతో అతని రౌద్రం ఇంకా రెండింతలు అయింది. మానవరక్తం రుచిమరిగిన పులివలె అతిక్రూరంగా అతను కనిపిస్తున్నాడు.

ఈ లోపల ఆ కేకలకు శిబిరం అంతా మేలుకొన్నది.

ఆ సందడికి ఇంకా రౌద్రరూపం దాల్చాడు అశ్వత్థామ.

అందినవారిని అందినట్లు రుద్రఖడ్గంతో ఊచకోత కొయ్యడం ప్రారంభించాడు. అన్ని యుద్ధనియమాలనూ అతను గాలికొదిలేశాడు.ఇక్కడ కొట్టవచ్చు ఇక్కడ కొట్టరాదు ఈవిధంగా దాడి చెయ్యవచ్చు ఈవిధంగా దాడి చెయ్యకూడదు అన్న నియమావళిని పూర్తిగా వదలిపెట్టి అడ్డు వచ్చినవారిని అడ్దోచ్చినట్లుగా ఇష్టం వచ్చినట్లు రుద్రఖడ్గంతో నరుకుతూ వీరవిహారం మొదలుపెట్టాడు.వాళ్ళు దాసీలా రాణులా పరిచారకులా సేవకులా సైనికులా యోధులా స్త్రీలా పిల్లలా అనే విచక్షణ లేకుండా ఎదురు పడినవారిని పడినట్లే నరికేస్తూ ముందుకు సాగాడు.క్షణాలలో ఆ శిబిరం అంతా రక్తంతో తడిసి ముద్దగా మారింది.శవాల గుట్టలూ మాంసపు ముద్దలూ పోగుపడ్డాయి.

ఎక్కడ వారక్కడ గోలగోలగా లేచారు.

'ఏదో జరుగుతున్నది!! లేచి ఆయుధం అందుకుందాం' అనుకునే లోపు వారి తలలు తెగి ఎగిరి పోతున్నాయి.

మనుషుల తలలను మొండాలను నడుములను కాళ్ళను చేతులను ఎక్కడ బడితే అక్కడ స్త్రీలా పురుషులా చూడకుండా సొరకాయలను నరికినట్లు నరకడం ప్రారంభించాడు అశ్వత్థామ.

అతనికి ఎదురైనవారు ఎదురైనట్లు నేలకూలిపోతున్నారు.వారి దేహాలనుంచి రక్తం రివ్వుమని లేచి అశ్వత్థామను తడిపేస్తున్నది.

ఈ లోపల శిబిరంలోని మిగతా గుడారాలలో అందరూ మేల్కొన్నారు.ఎవడో రాక్షసుడు వచ్చి నిశిరాత్రిలో అందర్నీ చంపుతున్నాడని వార్త ప్రబలి యోధులందరూ లేచి ఆయుధధారులై బయటకు వచ్చారు.వారిలో ఉపపాండవులూ ఉన్నారు.

మొత్తం ఒళ్లంతా రక్తంతో తడిసి ఒక ఖడ్గాన్నీ డాలునూ పట్టుకుని ఉన్న అశ్వత్థామను వాళ్ళు గుర్తించలేక ఎవడో రాక్షసుడని అనుకున్నారు.

తనమీదకు వచ్చిన ఉపపాండవులను(పాండవుల తనయులు) ఒక్కొక్కరినీ ఒక్కొక్క రకంగా నరికి పోగులు పెట్టాడు అశ్వత్థామ.వారందరూ అశ్వత్థామను ఎదుర్కొని తమదైన శైలిలో ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా ఆయుధాలతో అతన్ని దెబ్బలు కొట్టారు.కానీ కత్తియుద్ధంలో అశ్వత్థామ యుద్ధ నైపుణ్యం ముందూ రుద్రఖడ్గపు ధాటి ముందూ వారు పనికిరాని వారయ్యారు.

చాలామంది అనుకుంటారు.నిద్రపోతున్న చిన్న పిల్లలైన ఉపపాండవులను అశ్వత్థామ నిద్రలోనే చంపాడు అని.అది నిజంకాదు.వారు నిద్రలేచి అతనితో యుద్ధం చేశారు.అతనితో తలపడ్డారు.యుద్ధంలోనే వారిని చంపాడు అశ్వత్థామ.

పాంచాలదేశపు యోధులూ,సంజయులనే యోధవర్గం వారూ,మిగిలిన పాండవపక్షంలోని వీరులందరూ ఒకటై అశ్వత్థామను గుంపుగా చుట్టు ముట్టారు.అన్నిపక్కలనుంచీ బాణాలతోనూ కత్తులతోనూ బల్లాలతోనూ గదలతోనూ అతన్ని ఎదుర్కొన్నారు.కాని అతనిలో ఉన్న రుద్రశక్తి ముందు వాళ్ళు నిలవలేక పోతున్నారు.

అశ్వత్థామ చేస్తున్న ఒక్కొక్క ఖడ్గప్రహారానికి పది తలలు తెగి పడిపోతున్నాయి.అతను చేస్తున్న వీరవిన్యాసాలూ పాదక్రమములూ వారు అప్పటివరకూ కనీవినీ ఎరుగనివి.చిత్రవిచిత్రములైన గమనగతులతో యుద్ధనైపుణ్యంతో అందినవారిని అందినట్లు నరికి పారేస్తూ విజ్రుమ్భించాడు అశ్వత్థామ.

అంతలో అతనికి శిఖండి ఎదురొచ్చాడు.అతన్ని చూడగానే అశ్వత్థామ కోపం పదింతలు పెరిగింది.

'దుర్మార్గుడా!పేడివెధవవై ఉండి ఎక్కడో అంత:పురంలో పూలు అల్లుకుంటూ కాలం గడపక,భీష్మపితామహుడినే నీ మోసంతో చంపుతావురా? ఇప్పుడు నా చేతిలో నిన్ను ఎవరు రక్షిస్తారో పిలవరా!' అంటూ శిఖండి చేస్తున్న ఖడ్గప్రహారాలను  తన డాలుతో కాచుకుంటూ రుద్రఖడ్గంతో ఒక్క విసురున ప్రహారం చేశాడు. మెరుపులా మెరిసిన రుద్రఖడ్గం శిఖండిని నిలువునా రెండు ముక్కలుగా చీల్చి పారేసింది.అతని శరీరం రెండు నిలువుముక్కలుగా చీలిపోయి చెరో వైపునా పడిపోయింది.నిలువెత్తున చిమ్మిన రక్తం అశ్వత్థామను పూర్తిగా అభిషేకించింది.

అశ్వత్థామ ఆ రాత్రి ఎవరినీ వదలలేదు.

మనుషులను సరే సరి,చివరకు ఏనుగులను గుర్రాలను కూడా వదలకుండా తన దారికి అడ్డం వచ్చిన వాటిని కూడా నరికి పారేశాడు.గాయాల పాలై బ్రతికి ఉన్న కొన్ని ఏనుగులూ గుర్రాలూ ఆ చీకటిలో పిచ్చేత్తినట్లు ఇష్టం వచ్చినట్లు పరుగెత్తి ఎంతోమంది సైనికులనూ యోధులనూ వాటి కాళ్ళతో తొక్కి చంపేశాయి.

అసలే చీకటి.ఏమి జరుగుతున్నదో తెలియదు.ఎవడో రాక్షసుడు నిశిరాత్రిలో అకస్మాత్తుగా తమమీద దాడిచేసి చంపుతున్నాడన్న భయంలో ఆ వీరులు ఎవరు ఎవర్ని చంపుతున్నారో తెలుసుకోకుండా ఒకరినొకరు నరుక్కుని చాలామంది వాళ్ళలో వాళ్ళే చచ్చారు.భయంకరమైన దొమ్మీ అక్కడ జరిగింది.

కొందరు అతితెలివితో చనిపోయినట్లు నటించి కింద పడుకున్నారు. అశ్వత్థామ అలాంటివారిని కూడా వదలలేదు.కాళ్ళతో తొక్కుతూ పరీక్షించి మరీ వాళ్ళను చంపాడు.ఇంకొందరు తప్పించుకుందామని పరుగెత్తారు. వారు పారిపోవడానికి ముఖద్వారం వద్దకు పరిగేట్టగా అక్కడ కాచుకుని ఉన్న కృపాచార్యుడూ కృతవర్మా వారిని గుమ్మంలోనే నరికేశారు.ఆ విధంగా ముఖద్వారం వద్ద కొన్ని శవాల గుట్టలు పేరుకు పోయాయి.

చూస్తుండగానే ఆ శిబిరం అంతా పీనుగులతోనూ రక్తపు మడుగులతోనూ మాంసం ముద్దలతోనూ తెగిపడిన కాళ్ళూ చేతులూ తలలూ మొండాలూ ఇతర శరీరభాగాలతోనూ నిండిపోయింది.ఎక్కడ చూచినా మనుష్యుల ఏడుపులూ మూలుగులూ,గోలగోలగా అరుపులూ,గాయపడిన ఏనుగుల ఘీంకారాలూ,గుర్రాల సకిలింపులూ తప్ప ఇంకేమీ అక్కడ వినబడటం లేదు. వేలమంది ఆ చీకటిలో అటూ ఇటూ పరిగేట్టగా లేచిన దుమ్ముతో అక్కడ ఇంకా కటికచీకటిగా మారి ఎవరికీ ఏమీ కనపడని స్థితి అక్కడ నెలకొన్నది.ఆ భయంతో చాలామంది యోధులైన సైనికులు వారిలో వారే ఒకరినొకరు నరుక్కొని వందలాది మంది చచ్చారు.

ప్రళయకాలంలో విలయతాండవం చేసి సమస్త లోకాలనూ విధ్వంసం గావించే రుద్రుని తేజస్సు తనను ఆవహించడం చేత వేలాది యోధులను తానొక్కడే ఎదుర్కొని ఆరాత్రి పూట వధించగలిగాడు అశ్వద్ధామ.అదే ఒక్క మానవ ప్రయత్నంతో మాత్రమే దీనిని సాధించగలిగేవాడా అంటే అనుమానమే.

తనకు తెలిసిన మంత్రపూరిత అస్త్రాలను వేటినీ వాడకుండా ఖడ్గవిద్యా నైపుణ్యంతోనే వేలాదిమందిని తానొక్కడే ఎదుర్కొని వారినందరినీ సంహరించి అజేయునిగా నిలిచాడు అశ్వత్థామ.ఒక్క బ్రహ్మశిరోనామకాస్త్రమే చాలు ఇంత కష్టపడకుండా దానిని ప్రయోగిస్తే అందరినీ క్షణంలో భస్మం గావించి ఆ ప్రదేశాన్ని మరుభూమిగా మార్చి ఉండేది.కాని అతనా పనిని  చెయ్యలేదు.

ఇలా కొంతసేపు గడిచాక అంతా మళ్ళీ శాంతించింది.మళ్ళీ మౌనం అక్కడ రాజ్యమేల సాగింది.అయితే మొదట ఉన్న మౌనం వేరు.ఇప్పటి మౌనం వేరు.మొదటిదీ విశ్రాంతితో కూడిన మౌనమే.ఇదీ విశ్రాంతితో కూడిన మౌనమే.అయితే మొదటిది జీవంతో ఉన్న విశ్రాంతి.ఇది మరణంలో విశ్రాంతి.

ఆ మారణహోమం మధ్యలో అక్కడి వేలాదిమంది యోధులందరూ నేలకూలి పోయారు.అశ్వత్థామ ఒక్కడే చేతిలో రుద్రఖడ్గం ధరించి ఆ శవాల గుట్టల మధ్యలో నిలబడి ఉన్నాడు.నిలువెల్లా రక్తంతో స్నానం చేసినట్లు కనిపిస్తున్న అతను నిజంగానే రుద్రుడిలా ఊగిపోతూ ఉన్నాడు.

ఈలోపల,రక్తపు వాసన పట్టి ఆ శవాలను పీక్కు తినడానికి అక్కడకు వేగంగా వచ్చిన అడవిమృగాలూ,భూతపిశాచాలూ కూడా అశ్వత్థామను చూచి భయంతో దూరంగా తొలగిపోతున్నాయి.అంత భయంకరంగా అతను కనిపిస్తూ వాటికే దడ పుట్టించేటట్లుగా ఉన్నాడు.

క్రమంగా అతను శాంతించడం ప్రారంభించాడు.అప్పటివరకూ అతన్ని ఆవేశించి ఉన్న రౌద్రం అతన్ని వదలిపోవడం మొదలు పెట్టింది.అతన్ని ఆవహించిన రుద్రశక్తి అంతర్ధానం కావడం మొదలైంది.అతనికి ఒళ్ళు తెలియడం ప్రారంభించింది.వివేచన తిరిగి మేలుకొనసాగింది.చుట్టూ పరికించి చూచాడు. అతనికి పరిస్థితి అర్ధమైంది.

తను వచ్చిన పని అయింది.అనుకున్నది సాధించాడు.తన తండ్రి వధకు ప్రతీకారం తీర్చుకున్నాడు.తన మిత్రుడైన సుయోధనుని అన్యాయపు ఓటమికి ప్రతీకారం చేశాడు.పాండవ వంశాన్ని నిర్వంశం గావించాడు. అశ్వత్థామకు మహానందం కలిగింది.తన సంకల్పానికి బాసటగా నిలిచి తనకు విజయాన్ని కలిగించినందుకు 'నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమ:..'అంటూ రుద్రుని తన మనస్సులో భక్తిపూర్వకంగా స్మరించాడు. నెమ్మదిగా నడుస్తూ ముఖద్వారం వద్దకు చేరుకున్నాడు.అక్కడ కృపాచార్యుడూ కృతవర్మా తనకొరకు వేచి చూస్తున్నారు.ఇద్దరూ అతన్ని కౌగలించుకుని తమ ఆనందాన్ని ప్రకటించారు.

అందరూ కలసి ఒక్కసారి మళ్ళీ శిబిరం అంతటినీ పరికించారు.ఎక్కడా చడీ చప్పుడూ లేదు.ఎక్కడ చూచినా శవాల గుట్టలూ మాంసపు ముద్దలూ రక్తపు మడుగులూ తప్ప ఇంకేమీ అక్కడ కనపడటం లేదు.ఒక్క మృత్యువు మాత్రమె అక్కడ రాజ్యమేలుతున్నది.ముగ్గురూ తృప్తిగా తలలు పంకించారు.

ఇంతలో తెలతెలవారుతున్న సూచనలు కనిపించసాగాయి.

'పదండి.యుద్ధభూమికి వెళ్ళి చూద్దాం.ఒకవేళ సుయోధనుడు ఇంకా ప్రాణాలతో ఉంటే ఈ సంతోషకర వార్తను అతనికి వివరించి కుములుతున్న అతని మనస్సుకు ఆనందాన్ని కలిగిద్దాం.' అనుకుంటూ ముగ్గురూ యుద్ధభూమి వైపు వేగంగా దారితీశారు.

(ఇంకా ఉన్నది)