“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

13, ఆగస్టు 2014, బుధవారం

అశ్వత్థామ--కృష్ణుని శాపం

సుయోధనుడు తొడలు విరిగి రణరంగంలో పడి ఉన్నాడు.

అతని శరీరం అంతా వజ్రకాయమే.కాని తొడలు మాత్రం కాదు.తల్లి ఎదురుగా నగ్నంగా నిలబడటానికి సిగ్గుపడి అంతవరకూ కప్పుకున్న ఫలితంగా ఆ భాగం మాత్రం మానవ సహజమైనదిగా ఉండిపోయింది.మిగతా శరీరం అంతా గాంధారి పాతివ్రత్య బలంతో కూడిన దృష్టి సోకి వజ్రకాయం అయ్యింది.

కృష్ణుని సూచనతో భీముడు అక్కడే గదాఘాతం చేశాడు.సుయోధనుడు తొడలు విరిగి నేలకూలిపోయాడు.

అశ్వత్థామ పాండవశిబిరంలో మారణహోమం చేసిన రాత్రంతా సుయోధనుడు దిక్కులేని పక్షిలా చావుకోసం ఎదురుచూస్తూ రణరంగంలో పడి ఉన్నాడు.

తెలతెలవారబోతున్నది.

అశ్వత్థామా కృపాచార్యుడూ కృతవర్మా హుటాహుటిన రణభూమికి చేరుకున్నారు.సుయోధనుడు ఎప్పుడు మరణిస్తాడా ఎప్పుడు అతని దేహాన్ని పీక్కు తిందామా అని క్షుద్రమృగాలూ రాబందులూ అతని చుట్టూ మూగి దగ్గరకు రాబోతున్నాయి.అతనికి వాటిని అదలించే శక్తి కూడా లేదు.

ఒకప్పుడు మహారాజులు అతని సమక్షంలోకి రావాలంటే భయపడేవారు. అతని ఆజ్ఞను శిరసావహించడానికి ఎల్లప్పుడూ వందలాది దాసదాసీ జనం సిద్ధంగా ఉండేవారు.అతను కనుసైగ చేస్తే, చేసంజ్ఞ చేస్తే, వెంటనే ఏది కావాలంటే అది సిద్ధం అయ్యేది.

ఇప్పుడో,తన చుట్టూ మూగుతున్న క్షుద్ర మృగాలనూ పక్షులనూ తోలడానికి కూడా అతని చెయ్యి లేవడంలేదు.అతని శరీరంలో శక్తి ఇసుమంతైనా లేదు. రాత్రంతా రక్తం కారిపోయిన దేహంతో నీరసం ఆవహించి మరణానికీ జాగ్రదావస్థకీ మధ్యన గల ఒక అయోమయ స్థితిలో అతడు ఊగులాడుతున్నాడు.

ముగ్గురూ సుయోధనుని స్థితిని చూచారు.

భోరున విలపించారు.

రారాజుకు ఎంతటి గతి పట్టింది?ఒకప్పటి మహావైభోగం ఎక్కడ? ఈ దుర్గతి ఎక్కడ?కాలం ఎవరినీ కలకాలం చల్లగా చూడదు కదా.మహారాజులైనా సరే కాలం కన్నెర్ర జేస్తే మట్టిలో కలసి కనుమరుగు కాక తప్పదు.అమేయమైన కాలప్రభావానికి తలోగ్గని ప్రాణి ఈ సృష్టిలో లేనేలేదు.కాలం కలసి వస్తున్నంత వరకే ఎవరి అహాలైనా.అది గతి తప్పిన మరుక్షణం రాజులైనా సరే తరాజులు కాక తప్పదు.

ముగ్గురూ ఎంతో సేపు పిలిచీ కుదిపీ రకరకాల పాట్లు పడిన తరువాత అతికష్టం మీద సుయోధనుడు కళ్ళు తెరిచాడు.కళ్ళు తెరవడమే అతనికి బ్రహ్మప్రళయం అయ్యింది.శరీరంలోని రక్తమంతా పోవడం చేత అతడు మరణానికి అతి చేరువలో ఉన్నాడు.అసలా క్షణంలో అతడు మరణించేవాడే.వీరు పిలుస్తున్న పిలుపులు లీలగా వినబడి,పోతున్న ప్రాణాలను ఎంతో కష్టంతో కూడగట్టుకుని పళ్ళబిగువున కళ్ళు తెరిచాడు.

'మిత్రమా.పాండవపక్షంలో అందరినీ వధించాను.మనవైపు మేము ముగ్గురం మిగిలాము.వారివైపు పంచపాండవులూ కృష్ణుడూ సాత్యకీ మిగిలారు.ఇన్ని అక్షౌహిణుల సైన్యంలో చివరకు మిగిలినది మేమే.వారు దొరికితే వారినీ వదిలేవాడిని కాను.కానీ వారు కనపడలేదు.ఎటో పారిపోయారు.బహుశా ఇది ఆ మాయావి కృష్ణుని పన్నాగమే అయి ఉంటుంది.నీకు ఈ వార్త చెబుదామని హుటాహుటిన వచ్చాము.' అన్నాడు అశ్వత్థామ.

ఆరిపోబోతున్న సుయోధనుని ముఖంలో చిరునవ్వు మెదిలింది.ఒక్క క్షణం అశ్వత్థామ కళ్ళలో కళ్ళు కలిపాడు సుయోధనుడు.ఆ కళ్ళలో అనంతమైన కృతజ్ఞతాభావం అశ్వత్థామకు గోచరించింది.

అశ్వత్థామ కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి.

'మిత్రమా.నీ ఋణం తీర్చుకున్నాను.నా తండ్రి ఋణం తీర్చుకున్నాను.మా కుటుంబాన్ని నీవు ఆదుకున్నావు.దరిద్రంలో అలమటిస్తున్న మా తండ్రిగారిని నీవు ఆదరించి ఉన్నతమైన స్థానాన్నిచ్చావు.మాకు ఏ లోటూ లేకుండా జీవితాంతమూ రాజభోగాలతో పోషించావు.నీకు మేము ఋణపడి ఉన్నాము.నీవు మాకు చేసిన మేలును మరచిపోతే మేము కృతఘ్నులము అవుతాము.మాకు ఉత్తమ గతులు కలగవు.అందుకే ప్రాణాలకు తెగించి నీ ఋణం తీర్చుకున్నాను.యుద్ధంలో మిగిలిన వేలాదిమంది పాండవ పక్షపు యోధులను ఈ చేతులతో అంతం చేశాను.' అన్నాడు అశ్వత్థామ.

సుయోధనుడు మాట్లాడలేకున్నాడు.మౌనంగా కళ్ళతోనే చిరునవ్వు నవ్వినాడు.

'మిత్రమా.మరొక్క మాట.నీవు కొద్ది క్షణాలలో స్వర్గాన్ని చేరుకుంటావు. మాకు అర్ధమౌతున్నది.అక్కడ మా తండ్రిగారూ,భీష్మ పితామహులూ, కర్ణుడూ,ఇంకా నీ సోదరులూ ఇతర యోధులూ నీకు స్వాగతం చెప్పడానికి ఎదురుచూస్తూ ఉంటారు.వారిని ఇంకొద్ది క్షణాలలో నీవు కలుసుకుంటావు.

నా తండ్రికి నా మాటగా ఒక్క విషయం చెప్పు.'నీ సుతుడు అప్రయోజకుడు కాడు.నీ దుర్మరణానికి కారకులైనవారిని అతడు అంతం చేసినాడు.నీ ఋణం తీర్చుకున్నాడు.నీ గోత్రఋషుల ఋణం అతడు తీర్చుకున్నాడు.అతన్ని చూచి నీవు గర్వించేలా చేసినాడు.' అని నా మాటగా మా నాన్నగారికి చెప్పు.' అని అడిగినాడు అశ్వత్థామ.

సుయోధనుడు 'నీ కోరిక తీరుస్తాను.అలాగే చెబుతాను' అన్నట్లు చూస్తూనే ఉన్నాడు.మెల్లగా అతని కనురెప్పలు వాలిపోయాయి.అతని కళ్ళు నిర్జీవంగా మారిపోయాయి.అప్పటివరకూ పోదామా వద్దా అన్నట్లు కొట్టుకుంటున్న అతని ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి.అతని ఆత్మ శరీరం నుంచి విడివడి స్వర్గం వైపు తేలిపోయింది.

మహాభారత యుద్ధంలో చివరి ఘట్టం ముగిసింది.విజయం పాండవుల పరమైంది.కానీ,ఆ సామ్రాజ్యంలో యువకులు మిగిలిలేరు.వయస్సులో ఉండి శరీరశక్తి ఉన్న మగవారందరూ యుద్ధంలో చనిపోయారు.ఉన్న మగవారందరూ ముసలివారు.ఇక మిగిలింది స్త్రీలు.వయసులో ఉన్న స్త్రీలందరూ విధవలయ్యారు.స్త్రీలూ పిల్లలూ ముసలివారితో కూడిన రాజ్యం ధర్మరాజు పరమైంది.అంత యుద్ధం చేసి విజయాన్ని అందుకున్నా కూడా పాండవులకు దాని అసలైన ఫలం దక్కలేదు.వీరులు లేని రాజ్యం అంటే అండ లేని స్త్రీవంటిదే.

ముగ్గురు వీరులూ ఒకరినుంచి ఒకరు బాధాతప్త హృదయాలతో వీడ్కోలు తీసుకున్నారు.

కృతవర్మ యాదవసైన్యం లోని వాడు.యుద్ధ పంపకాలలో కృష్ణుడు పాండవులవైపు ఉన్నాడు.అతని సైన్యం కౌరవుల పక్షాన యుద్ధం చేసింది.ఆ బృందంలోని వాడే కృతవర్మ.కనుక అతను తిరిగి ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు.

ఇక మిగిలింది మేనమామా మేనల్లుడూ అయిన కృపాచార్యుడూ అశ్వత్థామా.ఇద్దరూ చిరంజీవులే.ఇద్దరికీ చావులేదు.

అశ్వత్థామను ఆవహించిన రుద్రశక్తి వదిలిన తర్వాత అతని ఆలోచనలో మార్పు రాసాగింది.తను చేసిన మారణహోమం ఒప్పేనా అని అతనిలో అంతర్మధనం మొదలైంది.ఎంతైనా రుషిపుత్రుడు కదా.ఎంత కాదన్నా ధర్మం అతని రక్తంలోనుంచి పోదు.

అతను తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురికావడం మొదలుపెట్టాడు. అతని మనస్సే అతన్ని ప్రశ్నించడం సాగించింది.

'సుయోధనుని పక్షాన యుద్ధం చేశావు బాగానే ఉంది.మిత్రధర్మం కాబట్టి, కృతజ్ఞత చూపాలి కాబట్టి,విశ్వాసం ఉండాలి కాబట్టి అలా చేశావు.అది సరే.కానీ రాత్రిపూట అంతమందిని అలా చంపడం సరియైన పనేనా? అందులో చిన్నపిల్లలైన ఉపపాండవులను అలా కిరాతకంగా చంపడం న్యాయమేనా?పోనీ దృష్టద్యుమ్నుని చంపావంటే,నీ తండ్రి వధకు ప్రతీకారం అనుకోవచ్చు.కానీ ఉపపాండవులేం చేశారు?మిగతా సైన్యం ఏం చేసింది?జంతువులేం పాపం చేశాయి?వాటిని కూడా వదలకుండా వధించావు కదా?ఇది ధర్మమేనా?ఎంత క్షత్రియ ధర్మాన్ని పాటించినప్పటికీ నీలో బ్రాహ్మణ రక్తం ప్రవహిస్తున్నది కదా?ఈ విధంగా చెయ్యడం నీకు సరియేనా?' అన్న ప్రశ్నలు అతనిలో సుడులు తిరగడం ప్రారంభించాయి.

అశ్వత్థామలో మనిషి మేల్కొన్నాడు.ఒకవైపు బాధ్యతా ఇంకోవైపు ధర్మమూ అతన్ని చిత్రహింస పెట్టసాగాయి.అతనా మానసిక సంఘర్షణను తట్టుకోలేక పోయాడు.తనకు ఆశ్రయం ఇచ్చేవారూ తన బాధను అర్ధం చేసుకునేవారూ ఎవరున్నారా? అని ఆలోచించాడు.

ఎవ్వరివైపూ మొగ్గకుండా తటస్థంగా ఉంటూ న్యాయం మాత్రమే మాట్లాడే మహర్షి వ్యాసుడు అతనికి గుర్తొచ్చాడు.వెంటనే వ్యాసమహర్షి ఆశ్రమానికి దారితీశాడు.

వ్యాసమహర్షి మహాజ్ఞాని.సర్వవేత్త.జగత్తుకే ఆయన గురువు.అశ్వత్థామ తన ఆశ్రమంలోకి ప్రవేశించడాన్ని ఆయన చూచాడు.సాదరంగా ఆహ్వానించాడు.

తన మనస్సులోని బాధను అశ్వత్థామ ఆయనకు వివరించాడు.ఆనాటి రాత్రి తనలోనికి ప్రళయకాల రుద్రాంశ ప్రవేశించడమూ తాను ఏ విధంగా పాండవ శిబిరాలలో ప్రవేశించి వారిని అందరినీ ఏ విధంగా అంతం చేసినదీ ఏదీ వదలకుండా అంతా వివరించాడు.

అంతా చెప్పిన మీదట ఈ విధంగా ప్రశ్నించాడు.

'మహాత్మా! నీవు సర్వజ్ఞుడవు.ఏ శక్తి నాచేత ఆ కార్యం చేయించిందో నీకు తెలుసు.అది అంతా గతంగా మారిపోయింది.ప్రస్తుతం నన్ను పశ్చాత్తాపం దహిస్తున్నది.మిత్రధర్మం కోసం ఆ విధంగా విలయతాండవం గావించాను. కానీ ఆ క్రమంలో మహాపాపాన్ని మూటగట్టుకున్నాను.ఏం చేస్తే ఈ పాపం పోతుంది?నాకేమీ దిక్కు తోచడం లేదు.నీవే నాకు దారిచూపాలి.నీవే నన్ను రక్షించాలి.' అని ఏడుస్తూ వ్యాసమునీంద్రుని పాదాలపైన పడి విలపించాడు.

వ్యాసమహర్షి నారాయణాంశ సంభవుడు.ఆయన దృష్టికి ముల్లోకాలలోనూ అడ్డులేదు.సమస్త ధర్మ కర్మ రహస్యములనూ ఆయన ఎరిగినవాడు.

పశ్చాత్తాపంతో బాధపడుతున్న అశ్వత్థామను ఆయన వీక్షించాడు.అశ్వత్థామ తన ప్రాణం గురించి భయపడటం లేదు.తాను చేసిన మారణహోమం తెలుసుకున్న పాండవులు కృష్ణసమేతంగా వచ్చి తనను చంపుతారేమో అని భయపడటం లేదు.తాను చేసిన పనిని గురించీ,తద్వారా మూటగట్టుకున్న పాపం గురించీ బాధపడుతున్నాడు.తన ప్రాణాన్ని రక్షించమని అడగడం లేదు.తన పాపాన్ని పోగొట్టే మార్గం చూపమని అడుగుతున్నాడు.అతనిలోని బ్రాహ్మణత్వం మేలుకుంటున్నది.కనుక ఇతనికి దారి చూపాలి అని తలచాడు.

'అశ్వత్థామా.భయపడకు.మార్గం ఉన్నది.సమస్త పాపాలనూ భస్మం చేసే ఒకేఒక్క మార్గం ఉన్నది.చెబుతాను విను.అదే తపస్సు.

పూర్వంకూడా ఇంతకంటే ఎన్నో ఘోరమైన పాపాలు చేసిన ఎందరో ఆ తర్వాత పశ్చాత్తాప పడి తపస్సులో పునీతులై ఆ పాపాలను కడిగివేసుకుని కడిగిన ముత్యాలవలె స్వచ్చంగా ప్రకాశించారు.

తప్పు చెయ్యడం మానవసహజం. అది తప్పుకాదు.కానీ చేసిన తప్పును తప్పు అని గ్రహించలేక అహంతో విర్రవీగడమే అతి పెద్దతప్పు.

తప్పు చేసిన తర్వాత తెలుసుకుని ఆ తప్పును దిద్దుకోవాలనే సంకల్పం ఉన్నవారి కోసమే దయామయుడైన పరమాత్మ 'తపస్సు' అనే మార్గాన్ని సృష్టించాడు.దిద్దుకోగలిగితే చేసిన తప్పును దిద్దుకోవడమే అసలైన మార్గం.ఆ మార్గం లేనప్పుడూ,నీవు చేసినది దిద్దుకోలేని తప్పు అయినప్పుడూ తపస్సును మించిన మార్గం లేదు.

నీవు ఋషిపుత్రుడవు.తపస్సు నీ రక్తంలోనే ఉన్నది.కనుక బాధపడకు.నా ఆశ్రమంలో నీకు ఆశ్రయం ఇస్తాను.ఇక్కడ ఉండి తపస్సులో పునీతుడవు కా.' అంటూ కరుణతో కూడిన చల్లని చూపులతో చూస్తూ బోధించాడు వ్యాసమునీంద్రుడు.

'మహర్షిసత్తమా! మీ ఆజ్ఞ నాకు శిరోధార్యమైనట్టిది.మీ సమక్షమే సర్వతపస్సుల నిలయం.సచ్చిష్యుడైన వాడికి సద్గురుసాన్నిధ్యం కంటే వేరే గొప్పదైన తపస్సు లేదు.మీరు చెప్పినట్లే మీ సమక్షంలో ఉంటూ తపస్సులో నా కాలం గడపుతాను.' అంటూ కన్నీళ్ళతోనే తన అంగీకారం తెలిపాడు అశ్వత్థామ.

ఇదిలా ఉండగా,అక్కడ శ్రీకృష్ణుడూ పాండవులూ తెల్లవారుతూనే తిరిగి తమశిబిరాలకు వచ్చారు.జరిగిన ఘోరం చూచారు.విషయం గ్రహించారు.

అశ్వత్థామ వ్యాసమునీంద్రుని ఆశ్రమంలో ఉన్నాడన్న విషయం వారికి తెలిసింది.అగ్రహోదగ్రులై అందరూ ఆయుధాలు ధరించి వ్యాసాశ్రమం వైపు వేగంగా బయలుదేరారు.

ఋషుల సమక్షంలో కూర్చుని ఉన్న అశ్వత్థామకు వారు రావడం దూరం నుంచే కనిపించింది.వారు ఎందుకు వస్తున్నారో కూడా అర్ధమైంది.వ్యాసాది మహర్షులకు కూడా వారెందుకు వస్తున్నారో అర్ధమైంది.

చూస్తూండగానే వారి రధాలు ఆశ్రమ సమీపంలో ఆగాయి.అందరూ దిగి ఆశ్రమంలోకి వచ్చారు.అశ్వత్థామను చూస్తూనే వారి కోపాలు సహస్ర గుణములయ్యాయి.

'పట్టుకోండి.వధించండి దుర్మార్గుడిని' అంటూ వారు అశ్వత్థామను చుట్టుముట్టబోయారు.

చిన్ననాటి నుంచీ తాను అవలంబించిన క్షత్రియధర్మం అశ్వత్థామను వశం చేసుకుంది.తాను తపస్సును ఆచరిస్తానని వ్యాసునికి ఇచ్చిన మాటను ఆ క్షణంలో మరచిపోయాడు.శత్రువులు తనపైకి వస్తున్నారు.వారిని ఎదుర్కోవాలి.అంతే.

అతనికా క్షణంలో అదే గుర్తున్నది.ఇంకేమీ గుర్తురాలేదు.

వెంటనే పక్కనే ఉన్న ఒక గడ్డిపరకను చేతిలోకి తీసుకున్నాడు.వేదోక్తమైన విధానంతో మంత్రపఠనం చేస్తూ భయంకరమైన 'బ్రహ్మశిర'మనే అస్త్రాన్ని స్మరించి 'ఈ అస్త్రం పాండవులనందరినీ ఒకేసారిగా సంహరించుగాక' అని సంకల్పిస్తూ పాండవులపైనా కృష్ణునిపైనా ప్రయోగించాడు.

మంత్రప్రభావంతో ఆ గడ్డిపరక భయంకరమైన 'బ్రహ్మశిరాస్త్రం' గా మారి నిప్పులు కక్కుతూ వారివైపు దూసుకురాసాగింది.

అదొక భయంకరమైన మారణాస్త్రం.దానిఫలితంగా ఆ ప్రదేశం అంతా మాడిపోవటమే గాక పన్నెండేళ్ళ పాటు అక్కడ భయానకమైన కరువు తాండవిస్తుంది.అంటే,అక్కడ ఉన్నచెట్టు చేమలూ జంతువులూ అన్నీ మాడిపోతాయి.అంతే కాదు,అక్కడ ఉన్న నీటివనరులు అన్నీ ఆవిరై పోతాయి.ఆ భూమి అంతా ఎడారిగా బీడుభూమిగా మారిపోతుంది.నేటి ఆటం బాంబ్ వంటిదే ఈ అస్త్రం కూడా.అయితే శబ్దతరంగాలతో(sound vibrations) అది జాగృతం చెయ్యబడి ప్రయోగింపబడుతుంది.ఆ శబ్ద తరంగాలనే 'మంత్రం' అంటాము.

భయంకరమైన శక్తితో తమమీదకు దూసుకువస్తున్న ఆ బ్రహ్మశిరాస్త్రాన్ని చూచి వారు దిక్కుతోచక భయకంపితులై శ్రీకృష్ణుని వెనుకకు చేరారు.

ఆయన చిరునవ్వుతో వారిని చూచి-'ఎందుకు భయపడుతున్నారు?అర్జునా! నీకూ ఈ అస్త్రజ్ఞానం ఉన్నది కదా.నీవూ ఇదే అస్త్రాన్ని సంధించి విడచిపెట్టు.ఎందుకంటే దీనిని ఇదే విరుగుడు.ఇది తప్ప ప్రపంచంలో ఇంక ఏదీ దీనిని ఆపలేదు.' అని బోధించాడు.

వెంటనే అర్జునుడు తన గురువైన ద్రోణాచార్యుని స్మరించి మంత్రపురస్సరంగా తానూ బ్రహ్మశిరాస్త్రాన్ని అభిమంత్రించి ప్రయోగించాడు.

రెండు అస్త్రాలూ అనేకవందల సూర్యుల కాంతితో దిక్కుల్ని వెలిగిస్తూ ఒకదానిని ఒకటి గుద్దుకొనబోయాయి.అప్పుడు జరిగే మహావిస్ఫోటనంతో భూగోళమే బద్దలై పోతుందా అన్నంత ఉత్పాతం సంభవించబోయింది.

జరుగబోయే మహావిపత్తును గమనించాడు వ్యాసమహర్షి.తత్క్షణమే ఆ రెండు అస్త్రాల మధ్యలో నిలిచి తన తపోశక్తితో వాటిని ఎక్కడిదానినక్కడ ఆపివేశాడు.

వ్యాసమహర్షి వేదస్వరూపుడు.సమస్త వేదమంత్రములనూ వాటి అర్ధములనూ ఎరిగిన మహోన్నతుడైన దైవాంశసంభూతుడు.కనుకనే ఆ రెండు భయంకర మారణాస్త్రాలను తన శక్తితో నిలురించ గలిగాడు.ఇతరులకు అది అసాధ్యం.

'వీరులారా! మీ యుద్ధం ప్రపంచ నాశనాన్ని కొని తెచ్చేట్లున్నది. ఆపండి.ఇద్దరూ మీమీ అస్త్రాలను ఉపసంహరించండి.ఇది నా ఆజ్ఞ.' అని గద్దించాడు ఆయన.

అర్జునుడు శ్రీకృష్ణుని వంక చూచాడు.ఆయన అనుజ్ఞ ఇవ్వగా తన అస్త్రాన్ని ఉపసంహరించాడు అర్జునుడు.కానీ అశ్వత్థామకు ఉపసంహారవిధానం తెలియదు.

ద్రోణాచార్యుడు ప్రయోగ ఉపసంహార వివరాలను తన ప్రియశిష్యుడైన అర్జునునికే నేర్పించాడు గాని తన కుమారుడైన అశ్వత్థామకు నేర్పలేదు.ఎందుకంటే అశ్వత్థామ ఉద్రేకస్వభావం ఆయనకు చిన్ననాడే తెలుసు.ఎందుకంటే పుత్రుని కోసం ద్రోణాచార్యుడు ఎంతోకాలం పరమేశ్వరుని ప్రార్ధిస్తూ తపస్సు చేశాడు.ఆ వరప్రసాదంగా అశ్వత్థామ జన్మించాడు.కనుక అతనిలో రుద్రుని అంశ ఉన్నదని ద్రోణాచార్యునికి తెలుసు.ఇటువంటి రౌద్రస్వభావం కలిగిన వానికి ఈ అస్త్రం ఇవ్వరాదని ఆయన ఉద్దేశ్యం.

కోపధారియైన వాని చేతులలో భయంకర మారణాయుధం ఉంచితే ఎంత విపత్తు వాటిల్లుతుందో ఆయనకు తెలుసు.విచక్షణ లేకుండా దానిని ఎవరిమీద బడితే వారి మీద ప్రయోగిస్తే అప్పుడు జరిగే నాశనం ఊహకందనట్లుగా ఉంటుంది. 

కానీ శిష్యుడైన అర్జునునికి దానిని చెప్పడం చూచి,అశ్వత్థామ ఎంతో పోరుపెట్టి అలిగి తనూ ఆ విధానాన్ని నేర్చుకున్నాడు.అయితే,ద్రోణాచార్యుడు ప్రయోగవిధానాన్ని అశ్వత్థామకు నేర్పించాడుగాని ఉపసంహార విధానాన్ని నేర్పలేదు.ఎందుకంటే అలా చేస్తే ఆ అస్త్రం ఒక్కసారే ఉపయోగిస్తుంది.అది దాని నియమం.తన జీవితంలో ఆ అస్త్రాన్ని ఒక్కసారి మాత్రమే వాడగలనన్న విషయం అశ్వత్థామకూ తెలుసు.

ఆ విధంగా అతనికి ఆ అస్త్రపు సంపూర్ణమైన జ్ఞానం ఇవ్వబడలేదు.అలా చెయ్యడం ద్వారా అశ్వత్థామ జీవితంలో ఎన్నో ఘోరాలు జరుగకుండా ద్రోణాచార్యుడు నిరోధించినవాడయ్యాడు.


ప్రాచీనకాలంలో బ్రాహ్మణఋషులు ఎంతటి నియమాలను పాటించేవారో ఈ ఒక్క ఉదాహరణతో గమనించవచ్చు.అర్హత లేదు అనిపిస్తే సొంత కుమారునికి కూడా ఆ రహస్యాలు నేర్పేవారు కారు.అర్హత ఉంటె పరాయివారికి కూడా నేర్పేవారు.

అదీ నిజమైన బ్రాహ్మణధర్మం.

నేడు బ్రాహ్మణులను విమర్శించేవారు ఈ ఉదాత్తమైన విలువలను ఒక్కసారి అర్ధం చేసుకుని తమకు ఈ విలువలలో కనీసం ఒక లక్షో శాతం అయినా ఉన్నాయా లేవా ఆలోచించుకుంటే ఆ విమర్శించే నోళ్ళు మూతపడతాయి.

అనుక్షణం స్వార్ధంతో దురాశతో అసూయతో ధనాశతో ఇంద్రియలాలసత్వంతో కుళ్లిపోతూ స్వలాభం కోసం ఎవరినైనా వంచించడానికి వెనుదియ్యని నేటి మనుషులు ప్రాచీన బ్రాహ్మణఋషుల నియమపూరిత జీవితాన్నీ నిత్యజీవితంలో వారు పాటించిన విలువలనూ ఊహించనుకూడా ఊహించలేరు.

ఇటువంటి ఉదాత్తమైన నియమయుతమైన జీవితాన్ని గడిపాడు గనుకనే తన కుమారునికి చిరంజీవిత్వాన్ని వరంగా ఇవ్వగలిగాడు ద్రోణాచార్యుడు.

ఋషులు శాపానుగ్రహ సమర్ధులు కదా!

'ఈ అస్త్రాన్ని ప్రయోగించడమే నాకు తెలుసు.దానిని ఉపసంహరించే విద్య నాకు తెలియదు.నా తండ్రి దానిని నాకు నేర్పలేదు.' చెప్పాడు అశ్వత్థామ.

అప్పుడు వ్యాసమునీంద్రుడు ఒక సూచన చేసాడు.

'అయితే ఒక పని చెయ్యి.ఆ అస్త్రాన్ని దారి మళ్ళించు.ఏ ప్రాణీ లేని ఒక నిర్జనభూమిలోకి దానిని ప్రయోగించు.అప్పుడు సరిపోతుంది.' అన్నాడు వ్యాసమునీంద్రుడు.

'అది వీలుకాదు మహాత్మా!! ఒక్కసారి పాండవనిర్వంశం చెయ్యమని నేను సంకల్పించి ఆ అస్త్రాన్ని వదిలాను.అస్త్రసంకల్పాన్ని మార్చుకోవడం సాధ్యం కాదు.ఒకవేళ నేను అలా చెప్పినా ఆ అస్త్రం దాని దిక్కు మార్చుకోదు.కాని మీ ఆజ్ఞను కూడా నేను ధిక్కరించలేను.కనుక ఉభయతారకంగా ఒకపని చేస్తున్నాను.ఈ అస్త్రాన్ని గర్భవతి అయిన ఉత్తరలో పెరుగుతున్న పిండం మీదకు పంపడమే ప్రస్తుతం నేను చెయ్యగల పని.ఎందుకంటే అదికూడా ఒకరకంగా పాండవనిర్వంశం చెయ్యడమే గనుక, అలా చేస్తే నా అస్త్రప్రయోగ సంకల్పమూ సిద్ధిస్తుంది.మీరు చెప్పినట్లు పాండవుల నుంచి ఆ అస్త్రాన్ని దారిమళ్లించినట్లూ అవుతుంది.ఇంతకంటే ప్రస్తుతం మార్గం లేదు.' వివరించాడు అశ్వత్థామ.

ఈ పరిణామానికి అందరూ నిశ్చేష్టులైనారు.

నిజమే!

అదితప్ప ఆ పరిస్థితిలో ఇక మార్గం లేదు.ఒక సంకల్పసహితంగా ప్రయోగింపబడిన మహాస్త్రం ఎట్టి పరిస్థితిలోనూ దాని పనిని అది చెయ్యకుండా ఊరుకోదు.దాని దారి మళ్ళించడం అసాధ్యం.

పాండవులా పాండవబీజమా ఏదో ఒకటి మాత్రమే మిగిలి ఉండటానికి ఆ క్షణంలో అవకాశం ఉన్నది.

చూస్తుండగానే అశ్వత్థామ మళ్ళీ సంకల్పసహితంగా ఆ అస్త్రాన్ని దారి మళ్లించి ఉత్తరాగర్భం వైపు దానికి దారిచూపించాడు.మహోగ్రంగా నిప్పులు కక్కుతున్న ఆ అస్త్రం ఉత్తరాగర్భంలో పెరుగుతున్న అభిమన్యుని బిడ్డను క్షణాలలో విగతజీవిని గావించి మాయమై పోయింది.

ఈ ఊహించని పరిణామానికి పాండవులు నోటమాటరాక నిలబడి పోయారు.

ఒకటి చెయ్యబోతే ఇంకొకటి అయ్యింది.

ఈ మొత్తం ప్రహసనానికి అమాయకురాలైన ఉత్తర బలైపోయింది.

వారిలో కోపం కట్టలు తెంచుకుంది.

"భ్రష్టుడా! నీవు గురుపుత్రుడవని గౌరవిస్తుంటే ఇదా నీవు చేసేది? నీకు ఈ క్షణమే చావు మూడింది."అని అందరూ కలసి ఒక్కుమ్మడిగా అశ్వత్థామను చుట్టుముట్టి అతన్ని రకరకాల ఆయుధాలతో తీవ్రంగా కొట్టి వధించ బోయారు.అశ్వత్థామ శరీరం అంతా గాయాలతో రక్తశిక్తమైంది.

'ఆగండి' గద్దించాడు వ్యాసమహర్షి.

ఎక్కడివారక్కడే ఆగిపోయారు.మహర్షి ఎందుకు తమను ఆపుతున్నాడో వారికి అర్ధం కాలేదు.

''పాండుపుత్రులారా! వినండి.అశ్వత్థామను మీరు కొట్టి బాధించవచ్చు.కాని అతనిని మీరు చంపలేరు.ఎందుకంటే అతడు చిరంజీవి.ఆ వరం అతనికి మీ గురువైన ద్రోణాచార్యుడు ఇచ్చాడు.అతనికి చావు లేదు.కనుక మీ ప్రయత్నాలు వృధా అన్న విషయం ముందుగా గ్రహించండి.

ఆ తర్వాత ఇంకొక్క విషయం చెబుతాను.శ్రద్ధగా వినండి.కర్మరహస్యం మీకు విశదం చేస్తాను.ఈ ప్రపంచంలో ఏదీ కారణం లేకుండా జరగదు.ప్రతి కర్మ వెనుకా ఒక కారణం ఉంటుంది.కారణమే కర్మకు కారణం అవుతుంది.మళ్ళీ ఆ కర్మ ఇంకొక కర్మకు కారణాన్ని సృష్టిస్తుంది.ఈ వలయం నిరంతరమైనది. ఇదే సృష్టి వలయం.దీనికి ఎవ్వరూ అతీతులు కారు.

గురువు అంటే తండ్రితో సమానం.తండ్రికంటే కూడా ఎక్కువ.ఎందుకంటే తండ్రి శరీరాన్ని ఇస్తాడు.గురువు జన్మరాహిత్యాన్ని ఇచ్చి దైవాన్ని చేరే మార్గం చూపిస్తాడు.కనుక తండ్రి కంటే గురువు అధికుడు.కానీ మీరేం చేశారు? మీకు సమస్త విద్యలూ నేర్పించి,తన కుమారుడైన ఈ అశ్వత్థామకు కూడా నేర్పించని రహస్య అస్త్రాలను మీకు నేర్పించిన బ్రాహ్మణోత్తముడైన ద్రోణాచార్యుని మీరు వధించారు.బ్రాహ్మణహత్య అనేది మహా పాతకం.అది తరతరాలు వెంటనంటి వంశనాశనం  గావిస్తుంది.అది కూడా ఆయన్ను మీరు ఎలా వధించారు?మోసంతోనూ అబద్దపు కుట్రతోనూ ఆ పనిని చేశారు.కనుక ఆ పాపమే ఇప్పుడు మీ పిల్లల చావులకు కారణమైంది. 

శాంతంగా వినండి.బ్రహ్మహత్యాపాతకమూ గురుహత్యా పాతకమూ ఎంతటివారినీ ఎన్నటికీ వదలవు.మీరు రెండూ చేశారు.మీ వంశం నాశనం కాకుండా ఎందుకు బాగుంటుంది?ఆలోచించండి. 

ఇప్పుడు ఈ కోపంలో ఇంకొక ఘోరమైన పాపం చేసి నిష్కృతి లేనంత పాపం మూటగట్టుకోకండి.కోపమూ అసూయా సమస్త పాపాలకూ హేతువులు. గురుపుత్రుడు గురువుతో సమానుడే.ఈ విషయం మీకు తెలియనిది కాదు.మళ్ళీ ఇప్పుడు ఇంకో బ్రహ్మహత్య చేస్తారా?ఇది తగునా?

ధర్మజా!నీవు సమస్తధర్మాలనూ ఎరిగినవాడవు.నీవు చెప్పు.ఇది ధర్మమేనా?' ప్రశ్నించాడు వ్యాసభగవానుడు.

యుధిష్ఠిరుడు మౌనం వహించాడు.

వ్యాసమహర్షికి ఎదురు నిలిచి ఆయన ఏమి చెప్పగలడు?

'మరి మేము చేసిన తప్పుకు ఉత్తర ఎందుకు బలికావాలి?ఆమె చేసిన తప్పేమిటి? మా కోడలు కావడమే ఆమె చేసిన నేరమా?చిన్నపిల్లలను బలిచేసిన ఈ దుష్టుడిని ఇలా వదలవలసినదేనా?' ప్రశ్నించాడు అర్జునుడు.

'వదలమని నేనూ చెప్పడం లేదు.దీనిని ఒక పరిష్కారం నేను చెబుతాను.' అంటూ అప్పటిదాకా మౌనంగా ఉన్న శ్రీకృష్ణుడు ముందుకు వచ్చాడు.

'జాతిసర్పానికి తన శిరస్సుపైన ఉన్న మణియే ప్రాణం.అది పోతే ఆ పాము జీవచ్చవం అయిపోతుంది.అది బ్రతికీ చచ్చినదానితో సమానమే.అశ్వత్థామ నొసటిలో ధగధగా మెరుస్తున్న మణిని చూచారా?అదే అతని వరం.ఆ మణిని పెకలించండి.అతను బ్రతికినా శవంతో సమానుడే అవుతాడు.ఆ మణి వల్లనే అతడు అన్ని భయాలకూ అతీతుడుగా ఉంటున్నాడు.అది ఉన్నంతవరకూ అతన్ని సర్పవిషం ఏమీ చెయ్యలేదు.అలాగే భూత ప్రేత రాక్షస గ్రహాలూ ఏవీ కూడా అతని దరిదాపులకు రాలేవు.పరమశివుని కటాక్షంతో అది అతనికి ప్రాప్తించింది.పరమేశ్వరునికి మూడవనేత్రం ఎలాంటిదో ఇది ఇతనికి అలాంటిది.కనుక దానిని పెకలించండి.అదే అతనికి తగిన శిక్ష' ఆజ్ఞాపించాడు శ్రీకృష్ణుడు.

శిక్ష అమలు జరిగింది.

అశ్వత్థామ జీవచ్చవం అయిపోయాడు.

అప్పుడు కృష్ణుడు నోరు విప్పాడు.


'అశ్వత్థామా!నీవు గురుపుత్రుడవనిన ఒకే ఒక్క కారణంతో మేము నిన్నుపేక్షిస్తున్నాము.అక్కడ నిద్రిస్తున్న శిబిరంపైన దాడి చేసి చిన్న పిల్లలను రాత్రిపూట రాక్షసునివలె వధించావు.ఇప్పుడు అన్నెం పున్నెం తెలియని అమాయకురాలైన ఉత్తరాగర్భంలో పెరుగుతున్న పిండం మీదకు నీ మారణాస్త్రాన్ని ప్రయోగించావు.బాలహత్యకూ భ్రూణహత్యకూ పాల్పడ్డావు. చిన్నపాపలమీదా నిస్సహాయులైన ఆడవారిమీదనా నీ ప్రతాపం?

నీకున్న చిరంజీవిత్వ వరం చూచుకునే కదా నీ గర్వం?నీవు ప్రయోగించిన అస్త్రాన్ని నీవు తెలివిగా ఎలాగైతే దారిమళ్ళించినా కూడా దానిపనిని అది చేసేటట్లు ఎలా చేశావో,అలాగే నేనూ చేస్తాను చూడు.నీ చిరంజీవిత్వ వరాన్నే నీకు శాపంగా మారుస్తాను.

సక్రమంగా బ్రతికితే కదా చిరంజీవిత్వం వరమయ్యేది? నీ తండ్రి నీకు చిరజీవితాన్ని ఇచ్చాడు.కాని ఆ జీవితాన్ని అనుక్షణమూ దుర్భరంగా ఎలా గడపాలో నేను నిర్దేశిస్తాను.

నిన్ను పాండవులు ఉపేక్షించినా వ్యాసుడు నిన్ను రక్షించబూనుకున్నా నేను వదలను.నా కోపం నుంచి నిన్ను ఈ ప్రపంచంలోని ఏశక్తీ రక్షించలేదు.

ఇదిగో విను నా శాపం.

శ్లో||'త్వాం తు కాపురుషం పాపం విదు: సర్వే మనీషిణ:
అసకృత్ పాపకర్మాణం బాలజీవితఘాతకమ్

శ్లో||తస్మాత్త్వమస్య పాపస్య కర్మణ: ఫలమాప్నుహి:
త్రీణి వర్ష సహస్రాణి చరిష్యసి మహీమిమాం
అప్రాప్నువన్ క్వచిత్ కాంచిత్ సంవిదం జాతు కేనచిత్

శ్లో||నిర్జనాన్ అసహాయస్త్వం దేశాన్ ప్రవిచరిష్యసి
భవిత్రీ నహితే క్షుద్రజన మధ్యేషు సంస్థితి

శ్లో||పూయ శోణిత గంధీచ దుర్గకాంతార సంశ్రయ:
విచరిష్యసి పాపాత్మన్ సర్వవ్యాధి సమన్విత:

(సంస్కృత మహాభారతం- సౌప్తికపర్వం)

(నిన్ను దుర్మార్గుడవని పాపాత్ముడవని చిన్నపిల్లలను చంపినవాడవని లోకం అంతా అసహ్యించుకుంటుంది.నీచాత్ముడా! నీ పాపానికి ఫలం విను. 

ఎక్కడా శాంతి అనేది లేకుండా మూడువేల సంవత్సరాలు ఈ భూమిపైన సంచరించు.ఎవరూ లేని నిర్జన ప్రదేశాలలోనూ క్షుద్రులైన మనుష్యుల దేశంలోనూ సంచరించు.నీకు ఏ సహాయమూ ఎవ్వరూ చెయ్యకుందురు గాక.నీకు ఇప్పుడు తగిలిన ఈ గాయాలూ నీ నొసటను చెయ్యబడిన పెద్ద గాయమూ ఈ మూడువేల ఏండ్లూ మానవు.

ఆ గాయాలనుంచి కారుతున్న చీమూ నెత్తురులతో కారడవులలో ఏకాకిగా తిరుగుతూ సమస్త వ్యాధులతో పీడింపబడుతూ మూడువేల సంవత్సరాలు దుర్భరంగా బ్రతుకు. ఇదే నా శాపం.)'

అవతారమూర్తి అయిన శ్రీకృష్ణుని నోటివెంట వెలువడిన ఆ భయంకరమైన శాపాన్ని విని వాసమహర్షితో సహా అందరూ అప్రతిభులై నోటమాట రాక శిలాప్రతిమల వలె నిలబడిపోయారు.

అశ్వత్థామ దారుణమైన కృష్ణశాపానికి గురియై,తన నొసటిమణిని పోగొట్టుకుని నిర్భాగ్యుడిగా రోగిష్టిగా నిస్సహాయుడిగా మిగిలిపోయాడు. మిత్రధర్మానికి కట్టుబడిన పాపానికీ తండ్రివధకు ప్రతీకారం చేసిన పాపానికీ ఆ విధంగా దారుణ శాపానికి గురయ్యాడు.

ఆయన కధ అలా ముగిసింది.
----------------------------------------------------------

మనం మాట్లాడుకుంటున్నది అశ్వత్థామ గురించే గనుక మిగిలిన మహాభారత కధ గురించి మనకు అవసరం లేదు.ఉత్తరా గర్భంలో ఉన్న మృతపిండాన్ని కృష్ణుడు మళ్ళీ ప్రాణం పోసి బ్రతికించగా ఆ బాలుడే పరీక్షిత్ మహారాజుగా పాండవుల తర్వాత రాజ్యం చేశాడు.

పాండవులు దాదాపు 30 ఏళ్ళు రాజ్యం చేసి హిమాలయాలలో సంచరిస్తూ స్వర్గారోహణం చేశారు.ఆ తర్వాత పరీక్షిత్ చక్రవర్తీ,జనమేజయ చక్రవర్తీ ఆయన సంతతి వారూ రాజ్యం చేశారు.

ఇది అందరికీ తెలిసిన కధే.  

కానీ ఎవరికీ తెలియని కధ ఒకటి ఇప్పటికీ జరుగుతున్నది.

అశ్వత్థామ నేటికీ బ్రతికి ఉండటమే ఆ కధ.

నర్మదాతీరంలోని గుజరాత్ అడవులలోనూ మధ్యప్రదేశ్ లోని అడవీప్రాంతపు శివాలయాల్లోనూ వాటి సమీపంలోనూ చాలామందికి నేటికీ ఆయన కనిపిస్తూ ఉండటమే ఆ కధ.

దానిని గురించి వచ్చే పోస్ట్ లో చూద్దాం.

(ఇంకా ఉన్నది)