The secret of spiritual life lies in living it every minute of your life

7, ఆగస్టు 2020, శుక్రవారం

U.G (Uppaluri Gopalakrishna Murti) - Astro analysis - 7 ( శనిచంద్రయోగం - సాధనలు)


జాతకంలో నిజమైన ఆధ్యాత్మిక చింతనకు సూచిక - శనిచంద్ర యోగం. ఒకమనిషి జీవితంలో ఇది లేనిదే నిజమైన ఆధ్యాత్మికసాధన జరుగనే జరుగదు. అయితే, ఇదే యోగం  జీవితంలో చాలా బాధలను, వేదనను కూడా ఇస్తుంది. ఇవి లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో నడక  కుదరనే కుదరదు. అదే విచిత్రం మరి !

బాధల చీకటిరాత్రి నుంచే దివ్యత్వపు సూర్యోదయానికి దారి ఉంటుంది. బాగా గుర్తుంచుకోండి ! ఒకరి జీవితం చిన్నప్పటినుంచీ కులాసాగా, దేనికీ లోటు లేకుండా సాగిపోతుంటే అలాంటివ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించడం ఎప్పటికీ సాధ్యం కానేకాదు. అలాంటివారికి కుహనా ఆధ్యాత్మికత, నకిలీ మతవేషాలు, రకరకాల దీక్షలు, సాంప్రదాయాలు, సాధనలు  వంటబట్టచ్చేమోగాని నిజమైన యోగసిద్ధి కలగడం మాత్రం కల్ల. మహనీయుల అందరి జాతకాలలోనూ బాధాపూరితమైన ఈ శనిచంద్రయోగం ఉంటుంది. అయితే, రకరకాల తేడాలతో ఉంటుంది. దాని బలాన్ని బట్టి వారికి కలిగే సిద్ధి కూడా ఉంటుంది.

ఇదే యోగం వల్ల జాతకుని తల్లికి చాలా బాధలు కలుగుతాయి. లేదా తల్లి మరణిస్తుంది. నిజమైన ఆధ్యాత్మికతకు ఇది ఇంకొక సూచన. అయితే, కష్టాలు పడిన ప్రతివారూ, తల్లి చనిపోయిన ప్రతివారూ గొప్ప జ్ఞానులు, సిద్ధులు అవుతారని అర్ధం చేసుకోకూడదు. కడుపులో చల్ల కదలకుండా వేళకు పూజలు చేసుకుంటూ, జపాలు చేసుకుంటూ ఉండేవారు ఆధ్యాత్మికంగా ఉన్నతులని అనుకోకూడదు. వారిలో చాలామంది మహా దురహంకారపూరితులై ఉంటారు. 'మేము చాలా ఆచారపరాయణులం, మహాభక్తులం' అనే అహంకారం పెరగడానికి మాత్రమేగాని ఇతరత్రా అవి ఎందుకూ ఉపయోగపడవు.

జ్ఞానసిద్ధికైనా, దైవసాక్షాత్కారానికైనా ఎంతో అంతరికసంఘర్షణ అవసరమౌతుంది. ఎంతో అంతరికవేదనను పడవలసి వస్తుంది. లోలోపల ఎంతో మారవలసి ఉంటుంది. ఇవేవీ లేకుండా ఊరకే మొక్కుబడిగా పూజలు, జపాలు, ధ్యానాలు చేస్తూ, దేవుడిని కోరికలు కోరుకుంటూ ఉండేవారు ఎన్నేళ్ళైనా అలాగే ఉంటారుగాని వారికి సిద్ధి లభించదని మాత్రమే నేను చెబుతున్నాను.

నేను గుంటూరులో ఉన్న రోజుల్లో, అంటే 1997 ప్రాంతాలలో, నా స్నేహితుడొకడు ఒక శ్రీవిద్యోపాసకుని గురించి తెగ ఊదరగొట్టేవాడు. ఆయన చాలా గొప్ప సాధకుడని, రోజుకు ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు  జపం చేస్తూనే ఉంటాడని చెప్పాడు. నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. కానీ మావాడి పోరు పడలేక ఒకసారి మారుతీనగర్లో ఉన్న ఆయన దగ్గరకు వాడితో కలసి వెళ్ళవలసి వచ్చింది. ఒక్క పది నిముషాలు ఆయనతో మాట్లాడాక 'ఓకే అండి! ఉంటాను మరి' అంటూ ఆయన జవాబుకోసం కూడా ఎదురుచూడకుండా బయటకొచ్చేశాను.

నా వెనుకే హడావుడిగా బయటకొచ్చిన మావాడు 'ఏంటి? అలా వచ్చేశావ్? ఆయన శక్తిని తట్టుకోలేకపోయావా?' అన్నాడు భక్తిగా.

'నీ మొహం ! ఇంకోసారి నీమాట అస్సలు నమ్మను. ఎందుకురా  ఇలాంటివాళ్ల దగ్గరకు నన్ను తీసుకొస్తావ్?' అంటూ ముక్కచీవాట్లు  పెట్టాను వాడికి.

'నా ప్రశ్నకు జవాబు చెప్పు' రెట్టించాడు వాడు.

'ఆచారపరాయణుడే గాని శక్తిహీనుడు. అనుభవశూన్యుడు. నీలాంటి వాళ్లకి బాగా సరిపోతాడు. ఆయన దగ్గర ఉపదేశం తీసుకో. నీ జన్మ ధన్యమౌతుంది' అన్నాను.

ఆ కధ అంతటితో ముగిసింది. ఇలాంటి 'మడికంపు' గాళ్ళను చాలామందిని చూచాను. బయటవేషం తప్ప, ఉత్త పనికిమాలిన తంతులు తప్ప, అంతరిక ఔన్నత్యం ఎక్కడా వీరిలో ఉండదు. వారి నిత్యజీవితంలో అయితే అస్సలు కనపడనే కనపడదు. లోకం ఇలాంటివాళ్ళను చూచి చాలా మోసపోతుంది. లోకం నిండా నకిలీ మనుషులే గనుక, ఇలాంటి నకిలీ మహాత్ములే లోకానికి నచ్చుతారు. సహజమే !

యూజీగారి జాతకంలో కుటుంబస్థానంలో శనిచంద్రయోగం ఉన్నది. ఇది తల్లిగారికి మరణాన్ని కొనితెచ్చింది. అదే విధంగా యూజీగారికి  జీవితమంతా స్థిరత్వం లేకుండా ప్రయాణాలు చెయ్యడాన్నిచ్చింది. మానసికంగా లోతైన సంఘర్షణను అంతర్మధనాన్ని ఇచ్చింది. కుండలినీ జాగృతి కలిగి దేహంలో భరించలేని నరకబాధల్ని పెట్టింది.

యూజీగారు పుట్టినపుడున్న గురుమహర్దశా శేషం 2 సం || 2 నెలలు. అది 1920 ఆగస్టుతో అయిపోయింది. సెప్టెంబర్ నుంచీ 19 సంవత్సరాల శనిమహర్దశ మొదలైంది. ఇది ఆయనకు 21 ఏళ్ళు నిండేవరకూ నడిచింది. ఆ సమయంలోనే ఆయనకు ఆధ్యాత్మిక పునాదులు పడ్డాయి. లేదా, అప్పటిదాకా పెంచుకున్న నమ్మకాలు కూలిపోయాయి. శనిమహర్దశ అనేది మనిషిని మనిషిగా నిలబెడుతుంది.

చాలామంది 'శని' అంటే భయపడతారు. కానీ నా దృష్టిలో శనిని మించిన శుభగ్రహం లేదంటాను. ఎందుకంటే, జీవితమంటే ఏంటో మనిషికి అర్ధమయ్యేది ఆయనవల్లనే. ఆయన దశలో కష్టాలు, కన్నీళ్లు, బాధలు, చికాకులు  తప్పకుండా వస్తాయి. కానీ, అవే మనిషి జీవితానికి పరిపూర్ణతనిస్తాయి. వాటిని చవిచూడకుండా, ఎప్పుడూ సుఖాలలో తేలుతూ ఉండేవాడికి జీవితం అర్ధం కాదు.  ఉన్నతమైన జీవితం అసలే అర్ధం కాదు. మనిషికి కలిగే నిజమైన ఆధ్యాత్మికపురోగతి కూడా శనిదశలోనే కలుగుతుంది.

యూజీగారికి 3 ఏళ్ళనుంచి 8 ఏళ్లవరకూ, అంటే, 1921 నుండి 1926 వరకూ ఆయనకు పురాణాలు, వేదాంతగ్రంధాలు, శాస్త్రాలు పరోక్షంగా నేర్పించబడ్డాయి. ఆయనకిలాంటి శిక్షణ ఇవ్వడం కోసం తాతగారు తన లాయరు ప్రాక్టీస్ మానుకున్నారు. ఎనిమిదేళ్లకే ఆయనకు చాలా శ్లోకాలు కంఠతా వచ్చేశాయి. కానీ, ఆచారపు ఆధ్యాత్మికత అంటే మొహం మొత్తడం మొదలైంది.

ఆధ్యాత్మికంగా ఎదగడమనేది ఎన్నో జన్మలనుంచీ సాగుతున్న ఒక ప్రయాణం. అది సజీవనదిలాగా గలగలా పారుతూ ఉండాలి. అంతేగాని దానిని కృత్రిమంగా తయారుచెయ్యలేం. బోధలద్వారా, ట్రయినింగ్ ఇవ్వడంద్వారా దానిని మనిషికి నేర్పలేం. అది జరిగే పని కాదు. అందుకనే, చిన్నప్పటినుంచీ మతాచారాలు, పూజలు, పద్ధతులు నేర్పించబడిన పిల్లలు, ప్లాస్టిక్ మొక్కలలాగా అందంగా తయారౌతారు గాని వారిలో జీవకళ ఉండదు. చిన్నప్పటినుంచీ నిష్టగా వేదం నేర్చుకున్న  పురోహితులందరూ ఆధ్యాత్మికతకు దూరమైపోయేది  అందుకే. వారికి తంతులొస్తాయి. కానీ సహజంగా లోలోపల సాగవలసిన సాధనాజలం వారిలో ఉండదు. అది మాత్రం ఎండిపోయి ఉంటుంది. జీవితంలో డబ్బొక్కటే పరమావధి అయి కూచుంటుంది. సాంప్రదాయబద్ధమైన మార్గంలో ఉంటూ, నిజమైన సాధన కూడా దానితోపాటు సాగించిన మనిషిని ఇంకా నేను చూడవలసి ఉంది. కొన్ని వందలమందిని ఇప్పటికి చూచాను, కానీ అలాంటివాడు ఒక్కడుకూడా ఇప్పటికి నాకు తారసపడలేదు. అది జరగదని నాకర్ధమైపోయింది.

మతాన్ని బలవంతంగా నేర్పడం ద్వారా, మనిషిని దైవానికి దూరం చేస్తున్నామని నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే అది నిజం కాబట్టి !

ఆ సమయంలో యూజీగారికి శని మహర్దశలో శని, బుధ, కేతు అంతర్దశలునడిచాయి. బుధుడు శనితోనే కలసి ఉన్నాడు. కేతువు ద్వాదశంలో ఉన్నాడు. కేతువు ద్వాదశంలో ఉన్నపుడు, అది ఉఛ్చగాని, నీచగానీ అయితే గొప్ప ఆధ్యాత్మిక యోగాన్నిస్తాడు. 'ఆ జాతకుడికి అదే ఆఖరుజన్మ' అని జ్యోతిష్య గ్రంధాలన్నాయి. అయితే, ఉఛ్చకేతువు ఇచ్ఛే యోగం వేరుగా ఉంటుంది, నీచకేతువు ఇచ్ఛే యోగం వేరుగా ఉంటుంది.

ధ్యానంలో ఉన్నపుడు ఏడ్చి విసిగించిందని తన మనవరాలిని తాతగారు చితక్కొట్టడం, తల్లిగారి తద్దినం రోజున తనతోబాటు ఉపవాసం ఉండవలసిన తద్దినం బ్రాహ్మలు చక్కగా వీధిచివరి హోటల్లో భోజనం చేస్తూ యూజీగారికి దొరికిపోవడం, అలవాటు ప్రకారం ఆంజనేయస్వామికి మొక్కుకోకముందే తననుకున్న కోరిక తీరి ఆశ్చర్యానికి గురిచేయడం - లాంటి సంఘటనలన్నీ చిన్నారి యూజీలో ఆలోచనను రేకెత్తించాయి. 'అసలైన ఆధ్యాత్మికత అంటే ఏమిటి?' అని ప్రశ్నించేటట్లు చేశాయి. మాట్లల్లో తప్ప చేతల్లో కనిపించని ఆచారాలంటే ఆయనకు తీవ్రమైన అసహ్యం కలిగి, తాతగారి ఎదుటనే తన జంధ్యాన్ని తెంపి పారేశాడు. యోగకరమైన శనిదశ అనేది అలాంటి ముక్కుసూటి మనస్తత్వాన్నిస్తుంది.

అంత చిన్నవయసులో కూడా, కులనియమాలను ఆయన పాటించేవాడు కాదు. మానవత్వానికి మాత్రమే పెద్దపీట వేసేవాడు.

1932 లో ఆయనకు 14 ఏళ్ల వయసులో, శివగంగ పీఠాధిపతి తన మందీ మార్బలంతో వారింటికి వచ్చారు. అప్పుడు యూజీగారికి సరిగ్గా శని - చంద్రదశ జరుగుతున్నది. ఆయననుసరించి తానుకూడా సన్యాసం తీసుకుంటానని యూజీగారు తన కోరికను వెలిబుచ్చారు. యూజీగారిది మరీ లేతవయసు కావడంతో ఆ శంకరాచార్యస్వామి, యూజీగారి కోరికను మన్నించలేదు. పోతూ పోతూ ఆయన శివమంత్రాన్ని యూజీగారికి ఉపదేశం చేశారు. ఆ రోజునుంచీ కొన్నేళ్లపాటు ప్రతిరోజూ 3000 సార్లు ఆయన శివమంత్రాన్ని క్రమం తప్పకుండా జపించేవాడు. ఈ విధంగా, శనిచంద్ర దశ ఆయన సాధనకు బీజాలు వేసింది.

అప్పటినుంచీ తనకు 21 ఏళ్ళు వచ్చేవరకూ ప్రతి వేసవికాలపు సెలవలలోనూ యూజీగారు హిమాలయాలకు వెళ్లి స్వామి శివానందగారి ఆశ్రమంలో ఉంటూ తీవ్రమైన సాధన చేశాడు. శివానందగారి దగ్గర యూజీగారు  యోగాసనాలు,ప్రాణాయామం, ధ్యానం మొదలైనవన్నీ నేర్చుకున్నాడు. ఋషీకేశ్ లో యూజీగారికి ఒక గుహ ఉండేది. దానిలో కూచుని రోజుకు పదినుంచి పదిహేడు గంటలపాటు జపం, ధ్యానం చేసేవాడు. ఆ సమయంలో తనకు ఎన్నో సమాధిస్థితులు కలిగాయని తర్వాతి కాలంలో ఆయన చెప్పాడు. 

ఆ సమయంలో ఆయన జాతకంలో శని - రాహుదశ నడిచింది. ఆ విధంగా రోజులతరబడి తిండీనీళ్ళూ మానుకొని  ఉపవాసాలుంటూ, హిమాలయగుహలలో తపస్సు చేశాడు యూజీగారు. కొన్నాళ్ళు పచ్చిగడ్డిని ఆహారంగా తింటూ సాధన చేస్తూ ఉండేవాడు. ఇది శపితదశ అన్న విషయం నా వ్రాతలు చదివేవారికి విదితమే. ఇది మనిషిని నానాబాధలు పెడుతుంది. లేదా, ఆ బాధల్ని మనమే పడాలి. అప్పుడు అది శాంతిస్తుంది. సాధకులైనవాళ్లు వాళ్ళను వాళ్ళే హింసపెట్టుకుంటారు గనుక శపితదశ ప్రత్యేకంగా వారిని ఇంకేదో బాధలకు గురిచేసే పని ఉండదు. సాధనకోసం స్వయంగా వాళ్ళే ఆ బాధలు పడతారు. కనుక శపితదశ సాధకులమీద పనిచేయదు.

కానీ, అందరికీ సాత్వికాహారాన్ని ప్రబోధించే శివానందస్వామి, ఒకరోజున ఆవకాయ కలిపిన అన్నాన్ని ఇష్టంగా తింటూ యూజీగారి కంటబడ్డాడు. ఆ దెబ్బతో ఆయనంటే యూజీగారికి  విరక్తి పుట్టింది. 'మమ్మల్నేమో చప్పిడికూడు తినమని  చెబుతున్నాడు, ఈయనేమో తలుపులేసుకుని ఆవకాయ తింటున్నాడు. ఇది కరెక్ట్ కాదు' అనుకున్నాడు. శివానందాశ్రమాన్ని వదిలేశాడు.

శివానందస్వామి తమిళుడు. పెద్ద పొట్టతో ఉండే ఈయన మంచి భోజనప్రియుడు. ఎన్నో పుస్తకాలు వ్రాసి, ఎంతో వేదాంతప్రచారం చేశాడు. ఇప్పటికీ రిషీకేశ్ లో వాళ్ళ ఆశ్రమం ఉంది. అలాంటి చిన్నవిషయం మీద ఆయనతో యూజీగారి బంధం అలా తెగిపోయింది. ఆవకాయకు కారకుడు రాహువన్నది గుర్తుంటే శని - రాహుదశలో అది యూజీగారి జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పిందో అర్ధమౌతుంది.

యూజీగారు చిన్నప్పటినుంచీ మహా ముక్కుసూటి మనిషి. ఒకటి చెబుతూ ఇంకొకటి చేస్తే ఆయనకు చిర్రెత్తుకొచ్చేది. ఇదే  పాయింట్ మీద జిడ్డు కృష్ణమూర్తితో కూడా ఆయన విభేదించాడు. రోసలిన్ తో జిడ్డుకున్న అక్రమసంబంధం థియోసఫీ సర్కిల్స్ లో అందరికీ తెలిసిన విషయమే. కానీ బయటపడేవారు కాదు. చెప్పేదానికి, చేసేదానికి పొంతన లేకపోవడంతో జిడ్డును కూడా యూజీ వదిలేశాడు. అయితే ఇది చాలాఏళ్ల  తర్వాత జరిగింది.

14 ఏళ్ళనుంచి 21 ఏళ్ల వయసువరకూ యూజీగారికి శివానందస్వామితోనూ, మద్రాస్ ధియోసఫీ సర్కిల్స్ తోనూ సంబంధాలున్నాయి. అది 1939 సంవత్సరం. అప్పటికి ఆయనకు 21 ఏళ్ళొచ్చాయి. శివానందస్వామితో తెగతెంపులయింది. ఆయన జీవితంలో బుధమహర్దశ మొదలైంది.

(ఇంకా ఉంది)