“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

3, ఆగస్టు 2020, సోమవారం

U.G (Uppaluri Gopalakrishna Murti) - Astro analysis - 5 (చిన్ననాటి బీజాలు)

ఏ మనిషి జీవితమైనా, అతని బాల్యంలోని మొదటి ఏడేళ్ల కొనసాగింపేనని మనస్తత్వశాస్త్రం అంటుంది. మొదటి ఏడేళ్ల జీవితంలో పడిన బీజాలే తరువాతి జీవితాన్ని నిర్మిస్తాయి. చిన్నప్పుడు అణచివేతకు గురైనవాళ్లు వారి తర్వాతి జీవితంలో తిరుగుబాటు దారులౌతారు. చిన్నపుడు భయభ్రాంతులకు  గురైన వాళ్లు పెద్దయ్యాక సాహసకార్యాలు చేస్తారు. చిన్నప్పుడు ప్రేమకు నోచుకోనివాళ్ళు  తరువాతి జీవితంలో ప్రేమకోసం తపిస్తారు, తమకు ఎదురైన అందరిలోనూ  దానిని వెతుక్కుంటారు.

ఆఫ్ కోర్స్ అందరికీ ఇలా జరగాలని రూలేమీ లేదు. కొంతమందికి జన్మంతా బాల్యంగానే నడుస్తుంది. వారి చిన్నప్పటి బీజాలు చివరిదాకా ఉంటాయి. మరికొంతమందిలో మాత్రం ఒక స్థాయినుంచి వాటికి పూర్తి వ్యతిరేకపోకడలు గోచరిస్తాయి. మనం అందరినీ ఒకే గాటన కట్టలేం. ఎవరి తత్త్వం వారిదే. ఈ సృష్టిలో ప్రతి మనిషీ విభిన్నుడే, విలక్షణుడే. కాకపోతే మానవజాతిని కొన్ని కొన్ని గ్రూపులుగా విభజించవచ్చు. అంతే ! మళ్ళీ ఆ గ్రూపులలో కూడా ఎవరి వ్యక్తిగత ప్రయాణం వారిదే. ఎవరి జీవితమైనా ఇంతే ! ఇంతకంటే భిన్నంగా ఏమీ ఉండదు.

మానవజీవితపు మౌలికసమస్యల పరిష్కారానికి లోతైన చింతనతో సమాధానాలు కనుక్కోవాలని ప్రయత్నించే ప్రతి ఆధ్యాత్మికుడూ నా దృష్టిలో ప్రేమకోసం తపించే ఒక ప్రేమికుడే. అతడు బైటకి బండరాయిలాగా కనిపించవచ్చు. కానీ లోలోపల మాత్రం అతి సున్నితమైన హృదయం అతనిలో ఉంటుంది. దానిని తాకగలిగిన వాళ్లకి మాత్రమే దాని విలువ తెలుస్తుంది. అలా తాకగలగాలంటే ముందుగా మనలో అలాంటి హృదయం ఉండాలి. లేకుంటే అలా చెయ్యడం అసంభవమౌతుంది. మనలో లేనిదాన్ని బయట మనమెలా చూడగలం?

యూజీగారు కూడా ప్రేమకోసం జీవితమంతా తపించిన ఒక ఉన్నతమైన ఆత్మ అని నా భావన. ఆయనను బాగా ఎరిగినవారు నా భావాన్ని అర్ధం చేసుకోగలుగుతారు. పైపైన పుస్తకాలు చదివి ఏవేవో భావాలు ఏర్పరచుకున్నవారికి మాత్రం నేను చెబుతున్నది వింతగా అనిపించవచ్చు. కొంచం వివరిస్తే నా భావమేంటో అర్ధం అవుతుంది.

యూజీగారి తల్లి చనిపోయిన వెంటనే తండ్రిగారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. యూజీగారిని పట్టించుకోలేదు. యూజీగారు తన తాతయ్య సంరక్షణలో పెరిగారు గనుక ఆయనకు తండ్రిప్రేమ తెలియదు. తను పుట్టిన ఏడవరోజునే తల్లి గతించింది గనుక తల్లిప్రేమా తెలియదు. చిన్నప్పుడు తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన పిల్లలు పెద్దయ్యాక తిరుగుబాటుదారులుగా తయారౌతారన్నది సత్యం. దీనిని  ఎంతోమంది జీవితాలలో గమనించవచ్చు.

బాల్యంలో బాధలు పడనివారికి నిజమైన ఆధ్యాత్మికత  ఎంతమాత్రమూ అందదనేది  నేనెప్పుడూ చెప్పే మాట ! ఎందుకంటే, అలాంటివాళ్లకే జీవితం పట్ల లోతైన చింతనా, పరిశీలనా కలుగుతాయి. ఇవి రెండూ లేనప్పుడు మతాచారాలు వంటబట్టవచ్చు, పూజలు చెయ్యవచ్చు, కానీ నిజమైన ఆధ్యాత్మికత మాత్రం అందదు. మతాన్ని అనుసరించడానికీ ఆధ్యాత్మికతకూ ఎలాంటి సంబంధమూ లేదు. ఒకవ్యక్తి జీవితమంతా పూజలు పునస్కారాలు సాధనలు చెయ్యవచ్చు. కానీ నిజమైన ఆధ్యాత్మికతను అందుకోలేకపోవచ్చు. ఇంకొకడు ఇవేవీ చేయకపోవచ్చు. కానీ ఆధ్యాత్మికశిఖరాలను అధిరోహించవచ్చు. వినడానికి వింతగా ఉన్నప్పటికీ, ఇది సాధ్యమే ! ఆసలైతే, చాలాసార్లు ఇలాగే జరుగుతుంది కూడా !

ఇలాంటి బాధాకరమైన స్థితులను చిన్నప్పుడు అనుభవించిన పిల్లలకు ఆధ్యాత్మికచింతన గనుక వారి లోలోపల ఉన్నట్లయితే, పెద్దయ్యాక రెండువిధాలుగా రూపుదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఒకటి - పూర్తిగా ఒంటరిగా, ఎవరితోనూ సంబంధం లేకుండా ఉండే అంతర్ముఖులుగా నైనా అవుతారు. లేదా రెండు - తమచుట్టూ పెద్ద సంస్థలను నిర్మించుకుని ఎంతోమంది అనుయాయులను  చేర్చుకునే  విశ్వమానవులైనా అవుతారు. అంతిమంగా రెండూకూడా,చిన్నప్పుడు తాము పోగొట్టుకున్న ప్రేమను వెదుక్కునే దారులే అవుతాయి. మొదటిదాంట్లో అయితే, తమను తాము తెలుసుకున్న ఆత్మజ్ఞానులై ఆ స్థితిద్వారా విశ్వమంతటికీ మూలమైన చైతన్యంతో మమేకం అవుతారు. రెండవదానిలో అయితే, అన్ని జీవులలోనూ అభివ్యక్తమౌతున్న విశ్వచైతన్యంతొ అనుబంధం ఏర్పరచుకుని అందరికీ తమ ప్రేమను పంచుతారు. యూజీగారిలో ఈ రెండూ విభిన్నమైన పాళ్ళలో జరిగాయని నా నమ్మకం.

అయితే, ఇలాంటి పిల్లలకు వారి జీవితాలలో రెండువిధాలైన సంఘర్షణలుంటాయి. ఒకటి - తాము పోగొట్టుకున్నదాన్ని పట్ల హృదయపు లోతులలో ఉండే బాధ. రెండు - సాటిమనుషుల ప్రవర్తనవల్ల ఇంకా గాయపడే పరిస్థితి. ఇలాంటి పిల్లలు పెరిగే వయసులో, తమ చుట్టూ ఉన్న సమాజంలోని మనుషులు తమను అనే సూటిపోటి మాటలు ఆ పసిమనసులను తీవ్రంగా గాయపరుస్తాయి. వారు చనిపోయేవరకూ మానని గాయాలుగా అవి వారి లోలోపల ఉండిపోతాయి. ఈ రెండురకాలైన బాహ్య, అంతరిక సంఘర్షణలను వారు ఎదుర్కొనే తీరును బట్టి, వాటిని సమన్వయం చేసుకునే తీరునుబట్టి, లోకులతో వారు ప్రవర్తించే తీరు ఆధారపడి ఉంటుంది.

మన చెత్త సమాజంలో సూటిపోటి మాటలకు కొదవేమీ ఉండదు. అందులోను నూరేళ్ళక్రితం లోకులకు పనీపాటా ఏముంది గనుక? అరుగుల మీద కూచోని అందరినీ కామెంట్ చెయ్యడం తప్ప అప్పట్లోని దగుల్బాజీ సమాజానికి వేరేది ఏమి చేతనైంది? ఆఫ్ కోర్స్ ఇప్పుడు కూడా మనుషుల మనస్తత్వాలలో పెద్ద మార్పేమీ లేదనుకోండి. ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో అయితే అస్సలు మార్పే లేదు. గాసిప్ అనేది వారిలోనే ఎక్కువ. మానసిక సమస్యలు కూడా వారిలోనే ఎక్కువ.

తమ అసలైన బాధ్యతను తప్పించుకుంటూ, లోకాన్ని మోసం చేస్తున్న నకిలీగురువులలో - చిన్నప్పుడు తనను బాధ్యతారహితంగా గాలికి వదిలేసిన  తన తండ్రిని యూజీగారు చూచారని నా మనస్తత్వ విశ్లేషణ. అందుకే ఆయన గురుద్వేషిగా తయారయ్యారు. చిన్నప్పటినుంచీ తన తండ్రిమీద గూడుకట్టుకున్న కోపం తనకే తెలియకుండా వారిమీద ప్రతిఫలించింది. అందుకే, గురువుల పేరెత్తితే ఆయన అగ్గిమీద గుగ్గిలం అయిపోయేవారు. వారిలోని అనైతికతనూ, బాధ్యతా రాహిత్యాన్నీ కటువైన పదాలతో తూర్పారబట్టేవాడు. ఆ వీడియోలను చూస్తున్నపుడు, ఆయన అనుభవించిన బాధాకరమైన బాల్యం నా కంటికి కనిపించింది.

జ్యోతిష్యశాస్త్రంలో కూడా నవమస్థానమనేది తండ్రికి, గురువులకు ఇద్దరికీ సూచకమౌతుందనేది జ్యోతిష్యశాస్త్రపు ఓనమాలు తెలిసినవారికి విదితమే కదా ! పాశ్చాత్య జ్యోతిష్యశాస్త్రంలో తండ్రిని దశమస్థానం సూచిస్తుంది. గురువును నవమస్థానం సూచిస్తుంది. కానీ భారతీయజ్యోతిష్యశాస్త్రంలో రెండింటినీ నవమస్థానమే సూచిస్తుంది. ఆఫ్ కోర్స్, నన్నడిగితే మాత్రం, తండ్రే గురువై గాయత్రీఉపదేశం చేసే ప్రాచీనకాలంలో అది నిజం కావచ్చునేమో గాని, నేడు మాత్రం పాశ్చాత్యజ్యోతిష్య భావనే సరియైనదని అంటాను. నేటి తండ్రులలో గురుత్వం ఎక్కడుందసలు? అంతా లఘుత్వం తప్ప ! ఇంకా చెప్పాలంటే, చాలామంది తల్లిదండ్రులైతే తమ పిల్లలచేత ఆధ్యాత్మిక పాఠాలు చెప్పించుకునే దురవస్థలో పడి ఉన్నారు. ఇదీ నేటి తల్లితండ్రుల దుస్థితి !

అయితే, మహనీయుల జీవితాలలో ఇలాంటి అవకతవక పరిస్థితులు ఎందుకు కలుగుతాయి? వారి జీవితం వడ్డించిన విస్తరిగా ఎందుకుండదు? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. ముందే చెప్పినట్లు, సామాన్యుల జీవితమైనా, అసామాన్యుల జీవితమైనా, వారి పూర్వకర్మను బట్టి, పూర్వ సంస్కారాలను బట్టి జరుగుతుంది. ఆ కర్మ ఒకచోటకు పోగుపడి, ఈ జన్మలో వారి జీవితపథాన్ని నిర్దేశిస్తుంది. అలాంటి మనిషికి ఇదే ఆఖరు జన్మ అయినప్పుడు, ఈ జన్మలో అతడు మోక్షాన్ని లేదా జ్ఞానసిద్ధిని పొందుతున్నపుడు, ఆ పోగుబడిన పూర్వకర్మయే అతని సాధనా మార్గాన్ని కూడా చిత్రిస్తుంది. ఆ క్రమంలోనే అతడి భావ వ్యక్తీకరణా, లోకంతో అతడు ప్రవర్తించే తీరులు నడుస్తాయి.

యూజీగారికి ఇదే జరిగిందని నా ఊహ.

ఆయన జాతకంలో తండ్రిని సూచిస్తున్న దశమాధిపతి గురువు లగ్నంలోనే ఉన్నాడు. అయితే మిధున లగ్నానికి గురువు బాధకుడు. మంచిని చెయ్యడు. కనుక తండ్రివల్ల ఆయనకేమీ మంచి జరుగలేదు. కానీ గురువుయొక్క లగ్నస్థితివల్ల తండ్రి నీడ ఆయనను జీవితమంతా వెంటాడిందని చెప్పవచ్చు. విక్రమస్థానానికి అధిపతి అవుతూ, మాటతీరును సూచించే సూర్యుడు కూడా గురువుతో కూడి ఉన్నందున యూజీగారి మాట సూటిగా, పదునుగా, మింగుడు పడనట్లుగా ఉండేది. అదే ఆసమయంలో గురువు యొక్క బాధకత్వం వల్ల గురువుల గురించి ప్రస్తావన వస్తే మాత్రం ఆయనలోని రుద్రస్వరూపం బయట పడేది. యూజీగారిలో రుద్రాంశ ఉన్నదని నా నమ్మకం. ఆయన మొదటగా పొందిన ఉపదేశంకూడా శివమంత్రమే కావడం గమనార్హం. 

రవి గురువులకు పట్టిన పాపార్గళమూ, వారిమీద ఉన్న కుజుని కేంద్రదృష్టీ గుర్తుంటే, వాదనలు పెట్టుకుని రెచ్చగొట్టేవారితో యూజీగారి మాటలు అంత కరుకుగా ఎందుకున్నాయో అర్ధమౌతుంది.

యూట్యూబులో మనకు లభిస్తున్న వీడియోలు చూసి ఆయనకు మహాకోపమని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే. ఆయనను రెచ్చగొడితే అలా మాట్లాడేవాడు గాని, మామూలుగా ఉన్నపుడు ఆయన చాలా శాంతమూర్తి అని, అత్యంత మర్యాదస్తుడని, నిజాయితీకి ప్రతిబింబమని ఆయనను ఎరిగినవాళ్లు వ్రాశారు. ఆయనతో ఎన్నో ఏళ్ళు కలసి జీవించిన వాలెంటైన్ అయితే, ఆయనంత మంచిమనిషిని తన జీవితంలో చూడలేదని అన్నది.

ఒక జ్ఞానికి అంత కోపమేంటని ఆ వీడియోలలోనే కొందరు కామెంట్ చేశారు. ఆ కామెంట్ చదివినప్పుడు నాకు నవ్వొచ్చింది. ప్రతిదానినీ అంచనా వేసినట్లు, తీర్పు తీర్చినట్లు, లోకులు జ్ఞానుల పరిస్థితిని కూడా అంచనా వెయ్యబోతారు. వారెలా ఉండాలో వీరు చెప్పబోతారు. ఎంత హాస్యాస్పదం ! జ్ఞానమంటే ఏమిటో, దానిని పొందినవాని పరిస్థితి ఎలా ఉంటుందో, అదంటే ఏమాత్రమూ తెలియని అజ్ఞానులు తీర్పులు తీరుస్తారు. లోకం ఎంత మాయలో ఉందో, ఎంత చవకబారు మనుషులతో నిండి ఉందో, అని నాకెప్పుడూ అనిపించినా, ఇలాంటి లేకిమనుషుల పిచ్చివ్యాఖ్యలు చదివినప్పుడు ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. గురువంటే ఇలా ఉండకూడదని అనుకుంటూ నన్ను కూడా చాలామంది వదిలేసిపోయారు. వారి అజ్ఞానానికి నవ్వుకోవడం తప్ప నేనేం చెయ్యగలను మరి !

జ్ఞానులంటే చచ్చిన శవాలలాగా పడుండాలని, అందరినీ ప్రేమించాలని, శాంతమూర్తులుగా ఉండాలని అనేకులు భావిస్తారు. ఈ భావాలన్నీ పుస్తకాలు చదివి, సినిమాలు చూసి, మతబోధకులు చెప్పే కాకమ్మకబుర్లు విని లోకులు ఏర్పరచుకునే గాలి అభిప్రాయాలు మాత్రమే. అవి నిజాలు కావు. మానవులలో ఎన్ని రకాలున్నాయో, జ్ఞానులలో కూడా ఉంటాయి. జ్ఞానులలో స్థాయీభేదం లేదని, వారందరి స్థాయీ ఒక్కటిగానే ఉంటుందని  కొందరంటారు. ఇది కూడా అజ్ఞానపూరితమైన పొరపాటు అభిప్రాయమే.

ఒక యువకునిగా యూజీగారు అడిగినప్పుడు కూడా రమణమహర్షి ఇదే చెబుతూ, జ్ఞానంలో భేదాలు లేవన్నారు. కానీ నా ఉద్దేశ్యం వేరుగా ఉన్నది. రమణమహర్షి చెప్పినది పూర్తినిజం కాదని నా ఉద్దేశ్యం. 'రమణమహర్షి కంటే నీకెక్కువ తెలుసా?' అని మీరు నన్నడిగితే ఏమీ చెప్పలేను గాని, బ్రహ్మవేత్తలలో కూడా 'బ్రహ్మవిద్, బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరేణ్య, బ్రహ్మవిద్వరిష్ట' అంటూ నాలుగు భేదాలున్నాయని యోగవాశిష్టాది అద్వైతగ్రంధాలలో చెప్పబడిన విషయాన్ని వారికి గుర్తుచేస్తాను.

'బాలోన్మత్తపిశాచవత్' అంటూ - జ్ఞానియైనవాడు కొన్నిసార్లు బాలునిలా, కొన్నిసార్లు పిచ్చివానిలా, కొన్నిసార్లు పిశాచంలా తిరుగుతూ ఉంటాడని, ప్రవర్తిస్తాడని కూడా మన శాస్త్రాలలో చెప్పబడిందన్న సంగతి వారికి మనవి చేస్తాను.

ఏతావాతా నేను చెప్పేదేమంటే - జ్ఞానులైనా సరే, వారివారి పూర్వ సంస్కారాలను బట్టి, దానికనుగుణంగా ఈ జన్మలో వారి అనుభవాలను బట్టి, ఇంకా మిగిలి ఉన్న వారి కర్మను బట్టే లోకంతో ప్రవర్తిస్తారు. దానిని చూచి వారి జ్ఞానపు స్థాయిని అంచనా వేసే వెర్రి లోకులు  ఘోరంగా మోసపోయి, ఆ జ్ఞానుల నుంచి పొందవలసిన మేలును కోల్పోతూ ఉంటారు. ఇదే మహామాయ ఆడే ఆట !

జ్ఞానియైనవాడి స్థితిని ఎవరుబడితే వారు గుర్తించగలిగితే, వాళ్ళ జన్మలు ధన్యములైపోవూ? అలా ప్రతివాడూ గుర్తిస్తే ఈ సృష్టి ఆట నడిచేదెట్లా మరి ??

(ఇంకా ఉంది)