“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

1, ఆగస్టు 2020, శనివారం

U.G (Uppaluri Gopalakrishna Murti) - Astro analysis - 3 (నాడీజ్యోతిష్యం)

యూజీ గారి ఫిలాసఫీని చెప్పాలంటే కష్టమేమీ కాదు. అసలైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో అనుభవంలో తెలిసినప్పుడు, అతికొద్ది మాటల్లో దానిని చెప్పవచ్చు. అది తెలీనప్పుడు, పుస్తకాలు పుస్తకాలు వ్రాసినా చెప్పలేకపోవచ్చు. అసలు ఆయనకంటూ ఒక ఫిలాసఫీ ఉందా అంటే 'ఉంది ', 'లేదు' అని రెండు రకాలుగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఆయన తనదంటూ ఒక కుంపటిని పెట్టుకోలేదు. ఒక సిద్ధాంతాన్ని ఒక పద్ధతిని ఎక్కడా బోధించలేదు. తన అన్వేషణలో 
తాను పోతూ ఆ అన్వేషణా ఫలితంగా కలిగిన తనదైన సహజస్థితిలో తాను బ్రతికాడు. అదే ఆయన ఫిలాసఫీ అంటే అది నిజమే కావచ్చు. కానీ, దానిని మనం ఆచరించలేం. అనుసరించలేం. అనుకరించలేం. ఆయనలా ఆయన బ్రతికాడు. మనలా మనం బ్రతకగలం. అంతే.  'ప్రతిమనిషీ విలక్షణుడే ఒకడిలా ఇంకొకడు ఉండటం సాధ్యంకాద'ని ఆయనకూడా అనేవారు. 

యూజీగారి ఫిలాసఫీని (అలాంటిదంటూ ఒకటుంటే) వివరించడం నా ఉద్దేశ్యం కాదు. ఆయనతో ఎన్నోఏళ్ళు కలిసి ఉన్నవాళ్లు, ఆయనను బాగా ఎరిగినవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఆయన గురించి పుస్తకాలు వ్రాశారు. వారిలో మహేష్ భట్ ఒకడు. కొల్లిమర్ల చంద్రశేఖరరావు గారు ఒకరు. తెల్లవాళ్లు కూడా ఎందరో ఉన్నారు. యూజీగారిని గురించి, ఆయన జీవితాన్ని గురించి తెలుసుకోవాలంటే వాళ్ళు వ్రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి అవి చదవండి. ఇక్కడ కేవలం ఆయన జాతకాన్ని మాత్రమే నేను విశ్లేషించబోతున్నాను. ఆ క్రమంలో ఆయన జీవితమూ, ఆయన భావాలూ నాకర్ధమైన రీతిలో  వ్రాస్తాను. ఎవరైనా  చెయ్యగలిగింది  ఇంతేకదా ! ఉన్నదేదో అది తానున్నట్టుగా  ఉంటుంది. ఎవరికర్ధమైనట్లు వారు దానిని అర్ధం చేసుకోగలుగుతారు. అంతే !

నాకు యూజీ గారితో పరిచయం లేదు. నాకు ఊహా, ఆర్ధిక స్వాతంత్య్రమూ వచ్చిన తర్వాత దాదాపు 25 ఏళ్ళు ఆయన ఈ భూమిపైన దేహంతో ఉన్నారు. దాదాపు ప్రతి ఏడాదీ ఇండియాకు అందులోనూ బెంగుళూరికి  వచ్చేవారు. కానీ చూడలేకపోయాను. అదొక దురదృష్టం. చూస్తే ఏమౌతుంది? చూచినంత మాత్రాన ఏమి ఒరుగుతుంది? అంటే నాదగ్గర సమాధానం లేదు. మహనీయుల గురించి ఇలా అనుకోవడం వల్ల ఉపయోగం లేదని నేనూ ఇంతకు ముందు వ్రాశాను. కానీ కొంతమంది విషయంలో ఇలా అనుకోకుండా ఉండలేం, ఎంత వద్దనుకున్నా సరే !

యూజీగారు 9-7-1918 న 6.12 నిముషాలకు మచిలీపట్నంలో  పుట్టారు. జాతకచక్రాన్ని పక్కనే చూడవచ్చు. అంటే ఇప్పటికి 102 ఏళ్ళు గడిచాయి.

ఆసమయానికి, ఆషాఢశుక్ల పాడ్యమి, మంగళవారం, పునర్వసు నక్షత్రం 4 వ పాదం, కుజహోర నడుస్తున్నది. ఆధ్యాత్మికంగా గతజన్మలలో ఎదిగినా, కొంత కర్మ మిగిలిపోయి ఈ జన్మలో దానిని తీర్చుకుని, ఆ క్రమంలో మోక్షంగాని, ఎంతో ఆధ్యాత్మిక ప్రగతినిగాని పొందే జీవులు ఆషాఢమాసంలో పుడతారు. ఇది ఎంతోమంది జాతకాలలో నిగ్గుతేలిన సత్యం. పునర్వసు నక్షత్రం  కూడా అలాంటిదే. పునర్వసు నక్షత్రానికి రెండు రాశులున్నాయి. ఒకటి మిథునరాశి రెండు కర్కాటక రాశి. మొదటి మూడు పాదాలూ మిధునరాశిలో ఉంటే, చివరిపాదం మాత్రం కర్కాటక రాశిలో ఉంటుంది.  యూజీగారు 4వ పాదంలో పుట్టారు గనుక ఆయనది కర్కాటక రాశి అవుతుంది.

చంద్రుడు 1 వ డిగ్రీలో ఉంటూ చాలా బలహీనుడుగా ఉన్నాడు. కానీ వర్గోత్తమాంశ బలం ఉన్నది. ఈయన మనస్సు బలమైనది అవదు. ఒకవేళ అయితే మాత్రం, ఆ దోషం ఈయన తల్లికి సోకుతుంది. అందుకే, యూజీగారు పుట్టిన 7 వ రోజుననే తల్లిగారు మరణించారు. దీనికి ఇతర కారణాలు ఈ జాతకంలో ఉన్నాయి.

లగ్నాత్ అష్టమాధిపతిగా మారకుడైన శని, మాతృకారకుడైన చంద్రునితో కలసి మరొక మారకస్థానమైన ద్వితీయంలో ఉండటం ఒక బలమైన మాతృగండయోగం. అదే సమయంలో చతుర్ధాధిపతిగా తల్లిని సూచిస్తున్న బుధుడు కూడా అదే శని చంద్రులతో కలసి కుటుంబస్థానంలో, మారకస్థానంలో ఉండటం పై యోగానికి ఇంకా బలాన్నిచ్చింది.

నాడీజ్యోతిష్యంలో ఉపయోగించే ఒక సూత్రాన్ని ఇక్కడ వర్తింపజేస్తాను. లగ్నం మిధునరాశి 29 డిగ్రీలలో ఉన్నది. మాతృస్థానాధిపతి అయిన బుధుడు కర్కాటకం 6  డిగ్రీలలో ఉన్నాడు. వీరిద్దరి మధ్యనా 7 డిగ్రీల దూరం ఉన్నది. అంటే, ఈ జాతకుడు పుట్టిన 7 వ రోజున తల్లికి గండం రాసిపెట్టి ఉన్నదని అర్ధం. సరిగ్గా, యూజీగారు పుట్టిన 7 వ రోజునే ఈయన తల్లిగారు మరణించారు. ఈ  విధంగా, జ్యోతిష్య శాస్త్రాన్ని మనం నమ్మినా నమ్మకపోయినా అది మన జీవితాలలో పనిచేస్తూనే ఉంటుంది. దీనికి వేలాది రుజువులను నా పుస్తకాలలో నా వ్రాతలలో ఇప్పటికే చూపించి ఉన్నాను. ముందుముందు కూడా చూపిస్తాను,

యూజీగారి తాతగారైన తుమ్మలపల్లి కృష్ణమూర్తిగారు ఆ రోజులలోనే పేరున్న సంపన్న లాయరు. ఆయన సాంప్రదాయ చాదస్తం బాగా ఉన్న పాతకాలపు బ్రాహ్మణుడు కావడంతో ఆయనకూ జ్యోతిష్యంపిచ్చి బాగా ఉండేది. యూజీగారి  చిన్నప్పుడే నాడీజ్యోతిష్యం ద్వారా యూజీగారి జాతకాన్ని వేయించాడాయన. దానిలో ఇలా వచ్చింది.    

"ఈ జాతకుడు తీవ్రమైన అంతరిక సంఘర్షణ ద్వారా ఈ జన్మలోనే మోక్షాన్ని పొందుతాడు. కానీ ఈ అంతరిక సంఘర్షణ మంచిగానే ముగుస్తుంది. ఈయనను ఒక గొప్ప గురువు సరియైన దారిలో పెడతాడు. తన 49 వ ఏట ఇతను పునర్జన్మ నెత్తుతాడు. ఇతను ఏ ప్రదేశంలోనూ ఎక్కువరోజులు స్థిరంగా ఉండడు. తిరుగుతూ ఉంటాడు. తన అనుభవజ్ఞానాన్ని అందరికీ పంచుతూ దీర్ఘాయుష్కుడై బ్రతుకుతాడు".

తనకు పుట్టిన పిల్లవాడు ఒక కారణజన్ముడని, సామాన్యుడు కాడనీ, ఎవరో యోగభ్రష్టుడు ఈ విధంగా తన కడుపున పుట్టాడనీ, యూజీ తల్లిగారికి కూడా గట్టినమ్మకం ఉండేది. ఈ నమ్మకానికి ఆధారాలేమిటో మనకు తెలియదు. యూజీగారిని తన గర్భంలో మోసిన 9 నెలల కాలంలో ఆమెకు కలిగిన అనుభవాలు, అసాధారణమైన స్వప్నాలు ఏవైనా ఉండి ఉండవచ్చు. కానీ వాటిని ఎవరైనా గ్రంధస్తం చేశారో లేదో మనకు తెలియదు. ఏ అనుభవాలూ లేకుండా, ఆ విధమైన నమ్మకానికి ఆమె రావడానికి ఆస్కారం లేదు. కనుక, గర్భవతిగా ఉన్నపుడు ఆమెకు తప్పకుండా అతీతమైన అనుభవాలు కలిగాయని మనం నమ్మవచ్చు.

గతజన్మలలో యోగులైన జీవులు, ముఖ్యంగా కుండలినీ సాధకులైనవాళ్ళు,  తల్లి గర్భంలో ఉన్నపుడు సామాన్యంగా కొన్ని కొన్ని అనుభవాలు ఆ తల్లులకు కలుగుతాయి. అవి దర్శనాలు కావచ్చు, దృష్టాంతాలు కావచ్చు లేదా స్వప్నాలు కావచ్చు. వాటిల్లో ఒకటి, జాతి త్రాచుపాములు ఆ తల్లికి కనపడటం, ఆమె చుట్టు ప్రక్కల సంచరించడం. ఒక్కొక్కసారి ఆమె పడుకున్న మంచం మీదకు ఎక్కి ఆమెను చూస్తూ ఉండటం. ఇలాంటి సంఘటనలు మహనీయుల జీవితాలలో జరిగినట్లు  చరిత్ర చెబుతోంది. యూజీగారి తల్లికి అలాంటి అనుభవాలు కలిగాయో లేదో మనకు తెలియదుగాని, యూజీగారు ఉన్న ప్రతిచోటకూ తాచుపాములు రావడం చూచినవాళ్ళు అనేకమంది ఉన్నారు. పుస్తకాలలో ఆయా సంఘటనలను తేదీలతో సహా వ్రాశారు. చదవండి.

మహనీయులైనవాళ్లు చిన్నపిల్లలుగా ఉన్నపుడు కూడా, త్రాచుపాములు వాళ్ళ చుట్టూ తిరగడం సామాన్యంగా జరుగుతుంది. కొంతమంది మహాయోగులకు చిన్నప్పుడు ఎండ తగలకుండా పాములు పడగవిప్పి గొడుగులా పట్టాయని  చెబుతారు. అవి అబద్దాలు కావు. వాటిలో మనకర్ధం కాని నిజాలున్నాయి.

మామూలు తల్లులకు కూడా గర్భవతిగా ఉన్న 9 నెలలపాటు వచ్చే కలలను బట్టి, ఆలోచనలను బట్టి, లోపలున్న బిడ్డ ఎలాంటిదో తేలికగా ఊహించవచ్చు. దీనిని జాతకచక్రం కూడా అవసరం లేదు. కాన్పు అయ్యే తీరును బట్టి కూడా, ఆ సంతానం వల్ల తల్లికి మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో గ్రహించవచ్చు. ఇవన్నీ నిజాలే. ఇదొక శాస్త్రం. దీనిలో లోతుపాతులు తెలిస్తే, పుట్టబోయే బిడ్డ జీవితాన్ని ముందే చెప్పవచ్చు. పాతకాలంలో ఇవన్నీ స్త్రీలకూ తెలిసి ఉండేవి. వీటిని బట్టి 'గొడ్డొచ్చిన వేళా బిడ్డొచ్చిన వేళా' లాంటి కొన్ని సామెతలు కూడా పుట్టుకొచ్చాయి.  వీటిల్లో తరతరాల  అనుభవం దాగి ఉంటుంది.

యూజీగారు పుట్టిన 7  వ రోజున పిల్లవాడిని తన తండ్రికి అప్పగిస్తూ 'ఈ అబ్బాయి తప్పకుండా కారణజన్ముడే. జాగ్రత్తగా చూచుకోమ' ని చెప్పి తల్లిగారు చనిపోయింది.

యూజీ గారికి జ్యోతిష్యమంటే నమ్మకం లేదు. కానీ, సాంప్రదాయ బ్రాహ్మణకుటుంబాలలో పెరిగిన పిల్లలకందరికీ కొద్దో గొప్పో జ్యోతిష్యం వచ్చినట్లే, ఆయనకు కూడా జ్యోతిష్యం వచ్చు. పెరిగి పెద్దయ్యాక చికాగోలో ఉన్నపుడు ఆయన హస్తసాముద్రికం కూడా నేర్చుకున్నాడు. కానీ వాటిని ఆయన సీరియస్ గా తీసుకునేవాడు కాదు. సరదా కాలక్షేపం కోసం వాటిని చర్చించేవాడు. లేదా తన సమక్షంలో జ్యోతిష్కులు చర్చిస్తుంటే సరదాగా వినేవాడు.

ఆయన మాటల్లో చెప్పాలంటే - 

'నాకు జ్యోతిష్యమంటే నమ్మకం లేదు. కానీ నా జాతకాన్ని ఎవరైనా జ్యోతిష్కులు పరిశీలిస్తే, మొదట్నుంచీ నా జీవితంలో గ్రహప్రభావం ఎలా పనిచేసిందో తెలుసుకోవడానికి వారికి ఉపయోగపడుతుంది. నా వరకు నామీద గ్రహాల ప్రభావం లేదు'.

ఇది నిజమే. మనోభూమికయైన ద్వంద్వస్థితిని  దాటి, అఖండమైన విశ్వచైతన్యంతొ అనుసంధానమైన స్థితిలో ఉన్న వారిమీద గ్రహాల ప్రభావం ఉండదు. కానీ వారి దేహం పంచభూతాత్మకమే గనుక దానిమీద తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే, శ్రీరామకృష్ణుల వంటి అవతారపురుషుల జీవితాలు కూడా వారి జాతకచక్రాన్ని బట్టే జరిగాయి. వారి మనస్సు గ్రహాల ప్రభావానికి, దేహస్పృహకు అతీతంగా ఉండవచ్చు. కానీ దేహం మాత్రం గ్రహప్రభావాన్ని తప్పుకోలేదు. ఈ భూమిమీద పుట్టిన ఎవరికైనా ఇది తప్పదు, అది సామాన్యులైనా సరే, అసామాన్యులైనా సరే !

(ఇంకా ఉంది)