“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

2, ఆగస్టు 2020, ఆదివారం

U.G (Uppaluri Gopalakrishna Murti) - Astro analysis - 4 (గురుద్వేషి)

మనిషి పుట్టిన సమయంలో ఉన్న గ్రహస్థితులు అతని జీవితాన్ని  ప్రతిబింబించినట్లే, ఆ సమయంలో జరుగుతున్న గ్రహదశకూడా అతని జీవితాన్ని సూక్ష్మంగా సూచిస్తుంది. ఆ గ్రహదశలోనే ఆ జాతకుని జీవితం మొత్తం ఒక చిన్న నమూనా 
(capsule) లో నిక్షిప్తం చేయబడి మనకు గోచరిస్తుంది. నా పుస్తకం Medical Astrology Part -1 లో ఈ సూత్రాన్ని విశృంఖలంగా వాడాను. నూరు జాతకాలను విశ్లేషణ చేసిన ఆ పుస్తకంలో ప్రతి జాతకమూ ఈ సూత్రానికి తలొగ్గింది.

యూజీ  గారి జాతకంలో చూస్తే, ఆయన పుట్టినపుడు పునర్వసు నక్షత్రం గనుక గురుమహర్దశ నడుస్తున్నది. అందులోనూ, గురు - రాహు-బుధ - శని దశ నడిచింది. వీటిలో గురు - రాహు సంబంధం గురుఛండాలయోగాన్ని సూచిస్తుంది. అంటే, తీవ్రమైన గురుద్రోహాన్ని చేసినవారు గాని, గురువులతో తీవ్రంగా శత్రుత్వం పెట్టుకునే వారుగాని, గురువుల వల్ల ఘోరంగా మోసపోయేవారు గాని ఈ దశలో పుడతారు.

రాహు-బుధుల యోగం ఎన్నో శాస్త్రాలను తెలుసుకునే అఖండమైన తెలివితేటలను, సాంప్రదాయాన్ని ఏకి పారేసే తిరుగుబాటు ధోరణినీ, కులమతాలకు అతీతమైన  విశాలభావాలనూ  సూచిస్తుంది.

బుధ-శనుల యోగం తల్లికి గండాన్ని, బాధలతో కూడిన దుర్భరజీవితాన్ని, కుమిలిపోయే మనసునూ, అంతర్ముఖత్వాన్నీ సూచిస్తుంది.

గురు-శనుల యోగం దృఢమైన కర్మనూ, తీవ్రమైన కష్టాలతో కూడిన జీవితాన్నీ సూచిస్తుంది.  గురు-బుధయోగం సాంప్రదాయబద్ధమైన నడవడికను సూచిస్తుంది. రాహు-శనుల కలయిక శపితయోగాన్ని సూచిస్తూ, స్థిరమైన ఉద్యోగంగాని, ఆదాయం గాని లేకపోవడాన్ని, ఉన్నదంతా ధ్వంసం కావడాన్ని సూచిస్తుంది.

యూజీగారి జీవితం ఇదిగాక ఇంకేముంది మరి? ఈ విధంగా జననకాలదశను బట్టి ఒకరి జీవితాన్ని క్షుణ్ణంగా ఆ జాతకుడు పుట్టినప్పుడే చెప్పేయవచ్చు. ఇది ప్రాచీనజ్యోతిష్కులకు తెలిసిన అనేక రహస్యాలలో ఒక రహస్యం.

యూజీగారి గతజన్మలలో ఒకదానిలో గురువుల వల్ల ఆయన ఘోరంగా మోసపోయారు. మనస్పూర్తిగా నమ్మిన గురువులు ఆయన కుటుంబాన్ని మోసం చేశారు. వారి అనైతిక ప్రవర్తనవల్ల వారి ఇంటిలో ఘోరమైన పనులు జరిగాయి. వాటిని చూచి ఆయన మనస్సు విరిగిపోయింది. అదే అసహ్యం, గురువులపట్ల కసిగా ఆయన మనస్సులో బలమైన ముద్రగా పడిపోయింది. ఆ సంస్కారం ఈ జన్మకు బదిలీ అయింది. అందుకనే, గురువుల మాటెత్తితే చాలు, ఈ జన్మలో కూడా ఆయన ఉగ్రరూపం దాల్చేవారు.

'ఇదంతా మీకెలా తెలిసింది? ఎలా చెప్పగలుగుతున్నారో ఆయా జ్యోతిష్యసూత్రాలను బహిర్గతం చెయ్యండి' అని మాత్రం నన్నడక్కండి. అన్ని రహస్యాలనూ లోకానికి తెలియజెప్పవలసిన పని నాకులేదు. నమ్మితే నమ్మండి. లేకపోతే మీ ఖర్మ ! నాకు తెలిసినవి బ్లాగులో వ్రాసున్నంతమాత్రాన మిమ్మల్ని నమ్మించవలసిన పని నాకులేదు. ఇప్పటివరకూ నా బ్లాగులో నేను వ్రాసిన జ్యోతిష్యసూత్రాలను కాపీ కొట్టి సమాజాన్ని ఎంతమంది కుహనా కుర్రజ్యోతిష్కులు ఎలా మోసం చేస్తున్నారో, ఎంతెంత డబ్బు సంపాదిస్తున్నారో నాకు బాగా తెలుసు. వారికి ఇంకా కొత్తకొత్త మెటీరియల్ సప్లై చేసి వారి అనైతిక వ్యాపారాన్ని పెంచవలసిన ఖర్మ నాకు లేదు. కనుక ఆ రహస్యాలను వెల్లడించను.

యూజీగారి యూట్యూబ్ వీడియోలను చూస్తే చాలు, గురువులంటే ఆయనకెంత కసి ఉండేదో మీరు అర్ధం చేసుకోవచ్చు. జిడ్డు కృష్ణమూర్తిని పబ్లిగ్గా 'బాస్టర్డ్' అని బహుశా ఇంకెవరూ తిట్టి ఉండరు. ఆయన అలా తిడుతున్న రోజుల్లో ఎందుకు తిడుతున్నాడో తెలీక చాలామంది ' జిడ్డు అంటే ఈయనకు అసూయ. ఆయనలా పేరు సంపాదించ లేకపోయానని ఈయనకు కుళ్ళు. అందుకే అలా తిడుతున్నాడు' అనుకునేవారు. కానీ నిజం అది కాదు. డబ్బు, పేరు ప్రఖ్యాతులు, శిష్యులు ఇలాంటి చెత్తను యూజీగారు ఎప్పుడూ లెక్కచేయ్యలేదు. ఆయన అచ్చమైన అవధూతగా,  స్వచ్ఛమైన జ్ఞానిగా, ఎక్కడా రాజీపడకుండా ఒక ఆధ్యాత్మికసింహం లాగా బ్రతికాడు. ఆయనగాని సమాజాన్ని మోసం చెయ్యాలని అనుకున్నట్లైతే, ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రహ్మాండమైన ఆధ్యాత్మికసంస్థకు అధిపతి అయ్యి ఉండేవాడు. ఎందుకంటే, రమణమహర్షికున్న జ్ఞానమూ, వివేకానందునికున్న వాగ్ధాటీ, నిక్కచ్ఛితో కూడిన నిజాయితీ మనస్తత్వమూ,ఒకరిని మోసంచెయ్యని గుణమూ, కుండలినీ జాగృతీ, నిజమైన ఆధ్యాత్మిక సంపదా ఆయనకున్నాయి. వాటిని ఉపయోగిస్తే, లౌకిక సంపదలలో, పేరుప్రఖ్యాతులలో, ఈనాటి సోకాల్డ్ గురువులకంటే ఎక్కడో చుక్కల్లో ఆయన ఉండగలిగేవాడు. కానీ ఆయన అలాంటి ఛండాలపు పనులను చెయ్యాలని ఎప్పుడూ అనుకోలేదు.

'రాధా రాజగోపాల్ స్లాస్' వ్రాసిన ' Lives in the shadow with j. Krishnamurti' అనే పుస్తకం చదివాక ప్రపంచానికి అర్ధమైంది యూజీగారు జిడ్డుని 'బాస్టర్డ్' అని ఎందుకు తిట్టేవాడో? తన తల్లియైన రోసలిన్ కీ జిడ్డుకీ ఉన్న అక్రమసంబంధాన్ని ఆ పుస్తకంలో రాధా రాజగోపాల్ చాలా రసవత్తరంగా వర్ణించింది. అంతేగాక, తన తల్లికి జిడ్డు మూడుసార్లు అబార్షన్ చేయించాడని స్పష్టాతిస్పష్టంగా వ్రాసింది. అసలు తను, జిడ్డు కూతుర్నే అని తనకు బాగా అనుమానమని కూడా వ్రాసింది. ఇవన్నీ చదివాక జిడ్డుపైన ఏర్పరచుకున్న భ్రమలన్నీ లోకానికి ఒక్కసారిగా ఎగిరిపోయాయి. జనాలకి అప్పుడర్ధమైంది యూజీ జిడ్డుని ఎందుకలా తిట్టేవాడో? నన్నడిగితే ఆ పదం చాలా చిన్నదంటాను.

రజనీష్ ని యూజీ 'పింప్' అనేవాడు. రజనీష్ ఆశ్రమంలో జరిగిన విషయాలను దగ్గరనుంచి చూసినవాళ్లకు ఆ మాట చాలా చిన్నపదంగా తోస్తుంది. 1960 లలో తన దగ్గరకు అప్పుడే రావడం మొదలుపెట్టిన తెల్లవాళ్ళను తరచుగా రజనీష్ ఒక మాట అడిగేవాడని ఆ తెల్లవాళ్లే వ్రాశారు అదేంటంటే - 'నువ్వొచ్చి ఇన్నాళ్లయింది. మా ఆశ్రమంలో నీకు నచ్చిన ఎవరైనా అమ్మాయిని తగులుకున్నావా లేదా?'. ఇలాంటి సంబంధాలను రజనీష్ ప్రోత్సహించేవాడు. అంతేకాదు, తన శిష్యులలో డ్రగ్సు స్మగ్లర్లూ, డబ్బుకోసం పడకసుఖం పంచుకునే తెల్లమ్మాయిలూ ఉన్నారన్న విషయం తనకు తెలిసినా వారిని ఏమీ అనేవాడు కాదు. పైగా, జ్ఞానం పొందటానికి నువ్వేం చేసినా తప్పులేదని ఆయా పనులను సమర్ధించేవాడు. చివరకు రజనీష్ ఆశ్రమం ఏమైందో మనకందరికీ తెలుసు. నేను 1998 లో అక్కడ మూడ్రోజులున్నాను. పైపై నటనలు, వేషాలు తప్ప నిజమైన ఆధ్యాత్మికత అక్కడ ఏ కోశానా నాక్కనిపించలేదు. రజనీష్ పుస్తకాలు చదివి, అక్కడ ఏముందో చూద్దామని వెళ్లిన నేను తీవ్ర ఆశాభంగం చెందాను. ఆధ్యాత్మికత తప్ప మిగిలిన చెత్త అంతా నాకక్కడ కనిపించింది. కనుక రజనీష్ ని యూజీ అలా తిట్టడం సబబే అని నా ఉద్దేశ్యం.

సత్యసాయిబాబాను 'క్రిమినల్' అని యూజీ తిట్టేవాడు. ఆయన చనిపోయిన సమయంలో ఆశ్రమంలో నుంచి ఎంత నల్లధనమూ బంగారమూ లారీలకు లారీలు ఎలా తరలించబడిందో అందరికీ తెలుసు. రాజకీయనాయకులు ఎందుకు ఆయన దగ్గరకు పరుగులెత్తేవారో, చివర్లో ఎందుకు అంత గాభరాపడి, ఆశ్రమానికి పరుగులు తీశారో అర్ధం చేసుకోవడానికి పెద్ద తెలివితేటలేమీ  అక్కర్లేదు, ఆశ్రమంలో జరిగిన విద్యార్థుల హత్యలూ, తెల్లమ్మాయిల రేపులూ హత్యలూ బయటకు రాకుండా ఎలా గప్ చుప్ అయ్యేవో అక్కడి స్థానికులకు, అప్పటి పోలీసు అధికారులకూ బాగా తెలుసు. కానీ లోకానికి జరిగే ప్రచారం వేరుగా ఉండేది. కేవలం మార్కెటింగ్ వల్లనే ఆయనొక 'గాడ్ మేన్' అయ్యాడు. ఆయన చేసిన బూడిదమహిమలన్నీ చిల్లర మేజిక్ ట్రిక్కులని వీడియో కెమెరాలు చివరకు పట్టేశాయి. వెరసి ఒక 50 ఏళ్లపాటు అబద్ధప్రచారంతో లోకం ఘోరంగా మోసపోయింది. ఇంటింటా భజనలు జోరుగా సాగాయి. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, సివిల్ సర్వెంట్లు, మంత్రులు, దేశాధినేతలు అందరూ ఈ బుట్టలో పడ్డారు. అంతెందుకు? మా మేనమామ మద్రాస్ ఐఐటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా పనిచేసేవాడు. ఆయన సత్యసాయికి వీరభక్తుడు. నేను చాలా చిన్నపిల్లవాడిని. కానీ నాకెందుకో ఆయన మూఢభక్తి నచ్చేది కాదు. తర్వాత్తర్వాత బాబాబండారం బయటపడ్డాక లోకానికి అర్ధమైంది యూజీలాంటి నిజమైన జ్ఞానులు సత్యసాయిని అలా ఎందుకు తిట్టేవారో?

ఈ 'గురుద్వేషం' అనిన విషయాన్ని జ్యోతిష్యకోణంలోనుంచి చూచినప్పుడు యూజీగారు పుట్టిన గురు-రాహుదశ ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. దీనినే 'ఛిద్రదశ' అని కూడా జ్యోతిష్యశాస్త్రంలో పిలుస్తారు. అంటే, అన్నింటినీ ధ్వంసం చేసి పగలగొట్టి పారేసే దశ అని అర్ధం. అలాంటి దశలో పుట్టిన వ్యక్తి, అందులోనూ తీవ్ర అంతరిక సంఘర్షణతో జ్ఞానసిద్ధిని పొందిన వ్యక్తి, నకిలీ గురువుల్ని అలా తిట్టాడంటే వింత ఏముంటుంది? తిట్టకపోతే వింతగాని?

(ఇంకా ఉంది)