“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

9, ఏప్రిల్ 2020, గురువారం

అనుబంధపు పూలతావి...

మండుతున్న ఎండనేమొ
నల్లమబ్బు కమ్మింది
ఎండుతున్న నేలనేమొ
చల్లదనం నమ్మింది

పోరుతున్న మనసులోకి
హోరువాన కురిసింది
వాడుతున్న తోటలోన
మల్లెపువ్వు విరిసింది

పిచ్చి మనసు పరుగునాపి
నిలిచి తేరి చూచింది
నిశ్శబ్దపు చీకటిలో
నింగి మెరుపు మెరిసింది

వర్తమాన ఛాయలోకి
గతం అడుగుపెట్టింది
గుర్తులేని జ్ఞాపకాల
గుండె తలుపు తట్టింది

గతంలోని ఆరాటం
నేడు శిధిలమయ్యింది
చెయిజారిన అనుబంధం
లోలోపల మెరిసింది

జ్ఞాపకాల మబ్బులలో
జాడలేని నీకోసం
మూగమనసు సాయంతో
బేలచూపు వెదికింది

బ్రతుకునావ మజిలీలో
దిగిపోయిన నిన్ను తలచి
నడుస్తున్న పడవలోని
వెర్రిమనసు వగచింది

ఒకనాటి నిజాలన్నీ
నేటి కలలు ఔతుంటే
కలలలోన కన్నువిప్పి
ఎదురుచూపు ఏడ్చింది

జనం లేని దారులలో
అంతమవని వీధులలో
వెదుకుతున్న నన్ను చూచి
నిశిరాత్రే నవ్వింది

అర్ధరాత్రి మౌనంలో
ఒక్కనాటి ఉదయాలను
స్మరిస్తున్న నను జాలిగ
చుక్కలన్ని చూచాయి

గురుతురాని జన్మలలో
నాకోసం విలపించిన
నీ ప్రేమను తలచి తలచి
నా మనసే నీరైంది

నా బ్రతుకున బలం నింపి
నా మనసున వెలుగు నింపి
మాయమైన నీ తలపును
మనసు మరువలేకుంది

అనుదినమూ చేజారే
అంతులేని జీవితాన
అనుబంధపు పూలతావి
నన్ను విడచి పోనంది....