“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

22, ఏప్రిల్ 2018, ఆదివారం

గత నెలరోజులుగా యాక్సిడెంట్లు - 2

మానవ జీవితం ఎంత సంక్లిష్టంగా ఉంటుందో గ్రహచలనం కూడా అంతే సంక్లిష్టంగా ఉంటుంది. ఈ రెంటికీ సంబంధాలను గమనిస్తూ అర్ధం చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతమైన విశ్వలీల మనకు అర్ధమౌతుంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో సినీ పరిశ్రమలోనూ రాజకీయప్రపంచంలోనూ దుమారం పుట్టిస్తున్న 'కాస్టింగ్ కోచ్' వివాదంలో అసలు విషయం మరుగునపడిపోయి, ఎవరు ఎవర్ని దూషించారు? అలా ఎందుకు అనాలి? అనే విషయం తెరమీదకు తేబడింది. ఈ వివాదం దారిమళ్ళిన తుఫాన్ లాగా ఎటెటో పోతున్నది. రకరకాల శక్తులు రంగప్రవేశం చేసి దీనిని ఇష్టంవచ్చినట్లు మార్చేస్తున్నాయి. ఈ సందర్భంగా గ్రహప్రభావాన్నిమరొక్కసారి గమనిద్దాం.

20-4-2018 న శుక్రుడు వృషభరాశిలోకి ప్రవేశించినప్పటికి రెండు రోజుల ముందే శనీశ్వరుడు వక్ర స్థితిలోకి వచ్చేశాడు. అంటే నాడీ జ్యోతిష్య సూత్రాల ప్రకారం ఆయన ప్రస్తుతం వృశ్చిక రాశిలోకి వచ్చినట్లు లెక్క. కనుక మళ్ళీ శని శుక్రులమధ్యన సమసప్తక స్థితి ఏర్పడింది. ఇది మంచి సూచన కాదు. పైగా శత్రుక్షేత్రం అయిన వృశ్చికంలో శనీశ్వరుడు శాంతిగా ఏమీ ఉండలేడు. కనుక ఈ సమాజంలో జరుగుతున్న లైంగిక నేరాలు ఆరోపణలు తగ్గకపోగా ఇంకా పెరుగుతాయని చెప్పాలి. పైగా, ఇంతకు ముందులేని కుట్రలు కుతంత్రాలు ఈ మొత్తం వ్యవహారంలో చోటుచేసుకుంటాయి.

అధికార సూచకుడైన సూర్యుడు ఉచ్చస్తితిలో ఉన్నందువల్ల ఉన్నతాధికారులకు రాజకీయ నాయకులకు కూడా ఈ విషయంలో పాత్ర ఉందని స్పష్టంగా తెలుస్తుంది. దీనికి వత్తాసుగా బుద్ధి కారకుడైన బుధుడు నీచస్థితిలో ఉండటం వల్ల, ఈ పరస్పర ఆరోపణలు చేసుకునేవారికి బుద్ది అనేది లోపిస్తుంది. వక్రబుద్ధితో రకరకాలైన నీచారోపణలు చేసుకోవడం ఇందుకే జరుగుతున్నది. ఇదంతా బుధుడు తన నీచస్థితిలోనుంచి బయటపడి రాశి మారేటంతవరకూ అంటే, ఇంకొక రెండు వారాలు కొనసాగుతుంది.

ఇకపోతే ధనూరాశిలో శనికుజుల కలయిక వల్ల దేవాలయాలకూ, ధార్మిక సంస్థలకూ గురువులకూ ప్రమాదాల ముప్పు పొంచి ఉందని తేలికగా అర్ధమౌతున్నది. ఎందుకంటే, ధనుస్సు సహజ నవమస్థానంగా దేవాలయాలకూ ధార్మిక సంస్థలకూ గురువులకూ సూచిక. నిన్న రాత్రి ఈ పోస్ట్ ప్రతిని తయారు చేస్తున్న సమయంలోనే అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలో ఉన్న పరాశక్తి ఆలయంలో హోమం జరుగుతున్నపుడు అగ్నిప్రమాదం జరిగి దేవాలయాన్ని నాలుగురోజులపాటు మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు. త్వరలో మన దేశంలో కూడా ఇలాంటి వార్తలు వినబోతున్నాం.

10-5-2018 న బుధుడు మేషరాశిలోకి మారేవరకూ మన రాష్ట్రంలోని సినిమా/ రాజకీయ రంగంలో ఈ కుట్రలు ఆరోపణలు తప్పవు. అలాగే 15-5-2018 న సూర్యుడు వృషభ రాశికి, శుక్రుడు మిధునరాశికి మారేవరకూ ప్రమాదాలు, సెక్స్ నేరాలు, ఆరోపణలు ఉంటూనే ఉంటాయి. యూ ట్యూబ్, ఫేస్ బుక్, ట్విటర్ లలో ఈ వినోదం కొనసాగుతూనే ఉంటుంది.  గమనించండి.