“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

17, మే 2014, శనివారం

స్వతంత్రం వచ్చిన 66 ఏళ్ళకు దేశానికి అసలైన ప్రధాని నరేంద్రమోడీ

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 66 ఏళ్ళు గడిచాయి.

ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు మాత్రమే దేశానికి అసలైన సిసలైన ప్రధానమంత్రి వచ్చాడని నా ఉద్దేశ్యం.అదికూడా మంచి మెజారిటీతో.ఇంతకుముందు వాజపేయి సమర్ధమైన పాలనను అందించాడు.కాని ఆయనకు మెజారిటీ లేదు.

మనకు ఇప్పటిదాకా వచ్చిన ప్రధాన మంత్రులలో కొద్దిమందినే నేను అసలైన నాయకులుగా లేక్కిస్తాను.వారు లాల్ బహదూర్ శాస్త్రి,వాజపేయి,పీవీ నరసింహారావులు మాత్రమె.చివరకు నెహ్రూను కూడా నేను గొప్పనేతగా అంగీకరించను.ఎందుకంటే ఆయన చేసిన తప్పులకు నేటికికూడా దేశం మూల్యం చెల్లిస్తూనే ఉన్నది.

ఇకపోతే,లాల్ బహదూర్ శాస్త్రి,అటల్ బిహారీ వాజపేయిలు విలువలకు కట్టుబడిన వ్యక్తులు.పీవీ నరసింహారావు నిశ్శబ్దంగా దేశరూపురేఖలు మార్చిన వ్యక్తి.పీవీ ఎన్నో రాజకీయవత్తిళ్ళను ఎదుర్కొంటూ దేశపు ముఖచిత్రాన్ని నిశ్శబ్దంగా మార్చివేశాడు.ఈనాడు మనదేశం ఎంతోకొంత ఆర్ధికప్రగతి సాధించిందంటే దానికి కారకుడు పీవీ నరసింహారావే.కాని ఆయనకు ఎన్నెన్ని అవమానాలు  జరిగాయో మనకు తెలుసు.

నా దృష్టిలో ఈ అరవై ఆరేళ్లలో మన దేశపు నిజమైన ప్రధానులు పై ముగ్గురే.మిగిలినవారంతా కీలుబొమ్మలూ తోలుబొమ్మలూ మాత్రమె.పై ముగ్గురి సరసన ఇప్పుడు నరేంద్రమోడీ ప్రధానిగా వచ్చాడు.ఈ పరిణామంతో ఖచ్చితంగా మన దేశానికి మంచిరోజులు ముందున్నాయని నాకు నమ్మకం బలపడుతోంది.114 ఏళ్ళ క్రితం వివేకానందస్వామి చెప్పిన మాట నిజమవుతోంది.

మన దేశపు సింహాసనం మీద కూర్చోవాలంటే కొన్ని అర్హతలుండాలి.మహాజ్ఞాని అయిన ఒక జనకమహారాజు మాత్రమే అలా కూర్చోగలడు.ధర్మమూర్తి అయిన ఒక శ్రీరాముడు మాత్రమె అలా కూర్చోగలడు.ఈ దేశసింహాసనం మీద ఎవరుబడితే వారు కూర్చోకూడదు.ఇది అగ్నిసింహాసనం.అగ్నిపరీక్షకు నిలబడేవారే దీనిమీద కూర్చోడానికి అర్హులు.అర్హత లేకుండా కూర్చున్నవారిని అది భస్మం చేసి పారేస్తుంది.

అసమర్దులూ,దద్దమ్మలూ,అవినీతిపరులూ,అవినీతికి కొమ్ముకాస్తూ వంతపాడే నయవంచకులూ,దేశద్రోహులూ,కపటస్వభావులూ దీనిమీద అసలే కూర్చోకూడదు.ఎందుకంటే మనదేశం అన్నిదేశాల వంటి దేశం కాదు.ప్రపంచం మొత్తం మీద మన దేశానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి.ఆధ్యాత్మికత మన ప్రాణం.ధర్మం మన ఊపిరి.న్యాయనిబద్ధత మన జీవం.వేలాది సంవత్సరాలుగా మన దేశపు మట్టిలో ఇవి ఇంకిపోయి ఉన్నాయి.

అలాంటి దేశపు సింహాసనం మీద కోతులూ కుక్కలూ తోడేళ్ళూ ఎలుగుబంట్లూ పులులూ మొదలైన రకరకాలైన వికృతజీవులు ఇప్పటివరకూ చాలా కూచున్నాయి. దానిని అపవిత్రం చేసి పారేశాయి.దానికి కారణం ఈ దేశప్రజల అసమర్ధతా,పిరికితనమూ,దురాశా,తెలివితక్కువతనాలే.

దానికి ప్రతిఫలంగా చాలా మూల్యాన్ని మనం భారీగానే చెల్లించాం.ఇప్పటికే చాలా ఆలస్యం అయింది.ఒక దేశ చరిత్రలో 66 ఏళ్ళు అంటే తక్కువ సమయం కానేకాదు. ఇందులో మూడో వంతు సమయంలో అగ్రరాజ్యాలుగా ఎదిగిన దేశాలున్నాయి. సక్రమంగా ప్రయత్నిస్తే మనకూ అది సాధ్యమే.

ప్రపంచంలో ఏ దేశానికీ లేని ప్రకృతి వనరులు మనకున్నాయి.ఇక్కడ నదులున్నాయి.ఖనిజాలున్నాయి.ప్రకృతిసంపద ఉన్నది.మంచి భౌగోళిక పరిస్థితులున్నాయి.తెలివైన ప్రజలున్నారు.కష్టపడి పనిచేసే తత్త్వం మనలో ఉన్నది.అన్నీ ఉన్నాయి.కాని సమర్ధుడైన నాయకుడే కరువయ్యాడు.దేశాన్ని దోచుకునే నాయకులు ఎక్కువయ్యారు.అందుకే మన గతి ఇలా అఘోరిస్తున్నది.

నిజమైన నాయకునికి స్వార్ధం పనికిరాదు.కపటం పనికిరాదు.స్వలాభం పనికిరాదు.వక్రబుద్ధి పనికిరాదు.సంకుచితమైన దృష్టి పనికిరాదు.అతనికి విశాలభావాలుండాలి.అతని జీవితం సచ్చీలతకు ప్రతిబింబంలా ఉండాలి.ఈ దేశపు ధార్మికతా,విలువలూ అతనిలో నిండిపోయి ఉండాలి.సంకుచితమైన భావాలకు అతీతంగా అందరి మంచినీ అతడు కోరుకోవాలి.అలాంటివాడే ఈ దేశపు సింహాసనం మీద కూర్చోడానికి అర్హుడు.ఎవరుబడితే వారికి ఆ అర్హత లేదు.అర్హత లేనివారిని మనం కూర్చోబెడితే దానికి భారీమూల్యాన్ని దేశం చెల్లించవలసి వస్తుంది.ఈ 66 ఏళ్ళలో అటువంటి భారీ మూల్యాలను దేశం ఎన్నో సార్లు చెల్లించింది.ప్రపంచ దేశాల దృష్టిలో నవ్వులపాలైంది.విపరీతమైన దోపిడీకి గురైంది.

నరేంద్రమోడీ ప్రధాని కావడం వెనుక ఉన్న కారణాలను ఎవ్వరు ఎన్ని విధాలుగా విశ్లేషించినా,వారెవ్వరికీ కనిపించని ప్రధానమైన కారణం ఒకటి ఉన్నది.అదేమిటో నేను చెబుతాను.దేశంలోని ప్రస్తుతం అలముకుని ఉన్న చీకటి పోవాలనీ,అవినీతి అంతం కావాలనీ,సత్ప్రవర్తనతో కూడిన ధార్మికపరిపాలన రావాలనీ ఎందఱో సాధకులూ,సిద్ధులూ, ఋషులూ, మహానీయులూ దైవాన్ని ఎన్నాళ్ళుగానో ప్రార్ధిస్తూ వస్తున్న ఫలితమే ఈ పరిణామం.

ఈ దేశాన్ని నడిపిస్తున్నది భౌతికశక్తులు మాత్రమె అని ఎవరినా భావిస్తే వారు పప్పులో కాలేసినట్లే అని నేనంటాను.ఎవ్వరి ఊహకూ అందని ఒక అతీతమైన దివ్యశక్తి ఈ దేశపు భవితవ్యాన్ని నిర్దేశిస్తున్నది.ఆ శక్తికి సహనం  చాలా ఎక్కువ.అది ఎంతోకాలం మన కుప్పిగంతులను సహిస్తుంది.భరిస్తుంది.మనం మారతామేమో అని ఎన్నో అవకాశాలు ఇస్తుంది.కాని ఎల్లకాలమూ అలా చూస్తూ ఊరుకోదు.ఏదో ఒకరోజున అది కళ్ళు తెరుస్తుంది.అప్పుడు ఎవ్వరి ఆటలూ సాగవు.ప్రస్తుతం జరిగింది అదే.

వివేకానందస్వామి భావాలకు ప్రభావితుడై ఆయన అడుగుజాడలలో నడచి ఆత్మసాధనలోనూ దేశసేవలోనూ తరిస్తానని సన్యాసదీక్ష ఇవ్వమని ప్రార్ధిస్తూ శ్రీరామకృష్ణుని శిష్యుడైన స్వామి అఖండానందుల పాదాలు పట్టుకున్నాడు మాధవసదాశివ గోల్వాల్కర్ (గురూజీ). వద్దని వారించారు స్వామి.స్వయానా సన్యాసి అయిన ఆయన,ఒక నిజాయితీపరుడైన యువకుడు సన్యాసం కోరితే తిరస్కరించారు.

'నీ దారి ఇది కాదు.సమాజంలో ఉంటూ దానికి సేవ చెయ్యి.సంఘంలో ఉంటూ దానిని ఉన్నతంగా మార్చడానికి నీ జీవితాన్ని త్యాగం చెయ్యి.ఇదే నీ సాధన.' అంటూ ఆయనకు దారిచూపారు స్వామి అఖండానంద.ఆయన బోధను తూచాతప్పకుండా అనుసరించారు గోల్వాల్కర్.గోల్వాల్కర్ కృషి వల్ల ఒక ఊరికి మాత్రమే పరిమితమైన RSS దేశం అంతటా విస్తరించింది.వేలాది లక్షలాది దేశభక్తులను తయారు చెయ్యగలిగింది.

ఇదే సన్నివేశం కొన్నేళ్ళ తర్వాత మళ్ళీ పునరావృతమైంది.జీవితపు రహస్యాన్ని అన్వేషిస్తూ తనను తాను అన్వేషిస్తూ బయలుదేరిన నరేంద్రమోడీ రామకృష్ణామిషన్ స్వామి అయిన ఆత్మస్థానందగారిని కలిశాడు.ఒకనాడు గోల్వాల్కర్ అడిగిన మాటనే మళ్ళీ ఈ యువకుడూ అడిగాడు.ఈ స్వామి కూడా ఆనాడు గోల్వాల్కర్ కు అఖండానంద స్వామి చెప్పిన మాటనే చెప్పారు.

'నీ గమ్యం సన్యాసం కాదు.నీ దారి వేరు.సంఘంలో ఉంటూ సంఘానికి సేవ చెయ్యి.నిరాడంబరమైన నిస్వార్ధమైన జీవితం గడుపుతూ దేశం కోసం నిజంగా పాటుపడు.'అని స్వామి ఆత్మస్థానంద చెప్పారు.వారు సామాన్య్లులు కారు.ఒక మనిషిని చూస్తూనే అతని దారీ  తెన్నూ ఏమిటో ఈ భూమి మీద అతని గమ్యం ఏమిటో వారు గ్రహించగలరు.సరియైన దారి చూపించగలరు.అలాంటి శక్తి వారికి ఉంటుంది.

తాను కోరుకున్నట్లుగా నరేంద్రమోడీ సంప్రదాయ సన్యాసి కాలేకపోయాడు. కాని నిరాడంబరమైన నిస్వార్ధమైన సన్యాస జీవితాన్నే గడుపుతున్నాడు. ఆయన దేశంకోసమే బ్రతుకుతున్నాడుగాని తనకోసం కాదు.సింహాసనం మీద ఉండికూడా యదార్ధమైన సన్యాసిలాగా ఆయన జీవిస్తున్నాడు.

మూడుసార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన బంధువులు అతి సామాన్య జీవితాలు గడుపుతున్నారు.ఒక సామాన్య కార్పోరేటర్ ఈరోజున అవినీతితో కోట్లు గడిస్తున్నాడు.అలాంటిది మూడుసార్లు వరుసగా ముఖ్యమంత్రి అయిన నరేంద్రమోడీ ఇప్పటికీ అతిసామాన్య జీవితాన్ని గడుపుతున్నాడు.ఈ తేడాను స్పష్టంగా గమనించాలి.అవినీతిరహిత జీవితానికీ సచ్చీలతకూ ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి?

గాంధీని కాంగ్రెస్ వాదులు ఆదర్శంగా చూపిస్తారు.గాంధీని చంపించింది RSS అంటూ పిచ్చిమాటలు మాట్లాడతారు.కాని అదే గాంధీయొక్క జీవనవిధానాన్ని మాత్రం వారిలో ఒక్కరు కూడా ఆచరించరు.గాంధీ అతి నిరాడంబరంగా బ్రతికాడు.కానీ ఆయన చలవతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వారు కోటానుకోట్లు నల్లధనం వెనకేశారు.అత్యంత లగ్జరీ జీవితాలు గడుపుతున్నారు.ఎవరి డబ్బుతో ఇదంతా చేస్తున్నారు?దీనిని దోపిడీ అనక ఇంకేమనాలి?ఇదేనా గాంధేయవాదం?గాంధీ ఫోటోను గోడకు తగిలిస్తే సరిపోదు. ఆయన చెప్పినవాటిని ఆచరించవద్దా?గాంధేయవాదం ఒక జీవనవిధానం. దానిని ప్రస్తుతం ఆయన అనుచరులుగా చెప్పుకునేవారు ఎందరు ఆచరిస్తున్నారు అని ప్రశ్నించుకుంటే ఒక్కరంటే ఒక్కరు కూడా రాజకీయులలో కనిపించరు.

నరేంద్రమోడీలాంటి వారికే ఈ దేశపు సింహాసనాన్ని అధిష్టించే అర్హత నిజంగా ఉన్నది.ఒక జ్ఞాని,ఒక యోగి మాత్రమె ఈ దేశాన్ని నిజంగా పరిపాలించగలడు. ఒక నిజమైన సంపూర్ణమైన దేశభక్తుడు మాత్రమె ఈ సింహాసనం మీద కూర్చోడానికి అర్హుడు.ఆ అర్హత అలాంటి వారికి మాత్రమె ఉంటుంది.

దోపిడీదొంగలు ఈ దేశాన్ని పాలించకూడదు.అది దైవద్రోహం అవుతుంది.దైవం దానిని క్షమించదు.అది వారికీ మంచిది కాదు దేశానికీ క్షేమం కాదు. దానిద్వారా వారు మూటకట్టుకునే ఖర్మ చాలా దారుణంగా ఉంటుంది.అది వెంటనే తెలియక పోవచ్చు.కాని భవిష్యత్తులో తప్పకుండా అది ఫలితం చూపిస్తుంది.ఇంతమంది ప్రజల చెడుకర్మను మూటకట్టుకున్న నాయకుల కుటుంబాలు ఎక్కిరావు.అవి ఏదోరకంగా సర్వనాశనం అవటం తధ్యం.కొందరు దేశనాయకుల కుటుంబాలను చూస్తే నేను చెబుతున్నది సత్యం అని అర్ధమౌతుంది.దీనిని ఎవ్వరూ మార్చలేరు.

ఒక నిజమైన సన్యాసికి మాత్రమె మన దేశాన్ని పాలించే అర్హత ఉన్నది.ఒక నిస్వార్ధమైన,నిరాడంబరమైన,నిజాయితీ కలిగిన ఋషితుల్యునికే అలాంటి అర్హత ఉన్నది.అది ఎవరికీపడితే వారికి లేదు.

ఈలోకంలో ధనం శాశ్వతం కాదు.అందులోనూ అడ్డదారిలో సంపాదించే ధనం అసలే శాశ్వతం కాకపోగా దారుణమైన కర్మను పోగుచేసి పెడుతుంది. పదవులూ శాశ్వతాలు కావు.జీవితమే శాశ్వతం కానప్పుడు ఇక ధనమూ పదవీ ఎలా శాశ్వతం అవుతాయి?

ఉన్నతమైన విలువలతో కూడిన నిస్వార్ధమైన నిరాడంబరమైన ధార్మికమైన జీవితమే సర్వశ్రేష్టమైనది.ఎప్పటికైనా అదే నిలుస్తుంది.లోకానికి మన దేశం ఇచ్చిన ఇస్తున్న సనాతనమైన సందేశం ఇదే.

ఈ సందేశాన్ని పుణికిపుచ్చుకుని జీవితంలో ఆచరిస్తున్న వారే ఈ దేశానికి నాయకులు కావాలి.నరేంద్రమోడీ అలాంటి నేత.పైగా ఆయన వివేకానందుని అనుచరుడు.వివేకానందుని అనుసరిస్తే శ్రీరామకృష్ణుని అనుసరించినట్లే. రామకృష్ణ వివేకానందుల భావాలను అనుసరించే మానవులు మానవులు కారు.వారు దేవతలే.ఇందులో ఎటువంటి సందేహమూ లేదు.

ఈ దేశానికి వివేకానందస్వామి చూపిన మార్గమే శిరోధార్యం.ఎందుకంటే స్వామి తన సొంత భావాలను ఏమీ చెప్పలేదు.వేల సంవత్సరాలుగా ఈ దేశపు ఆత్మలో నిండిఉన్న సనాతనధర్మపు విలువలనే ఆయన బోధించాడు. నవీన కాలానికి అనుగుణంగా వాటిని ఎలా జీవితంలో ఆచరించాలో  ఆయన వివరించాడు.ఈనాడు మనదేశానికి రక్ష వివేకానందుని భావాలే.ఇన్నాళ్ళకు స్వామి భావాలను ప్రేమించి,అనుసరించి,ఆచరించే ఒక నిస్వార్ధ దేశభక్తుడు మనకు ప్రధాని అయ్యాడు.ఇది గొప్ప అదృష్టమని నేను అనుకుంటున్నాను.

మన దేశానికి పూర్తిగా దుర్గతి పట్టలేదు.ఇంకా చాలా పుణ్యఫలం ప్రజలకు మిగిలే ఉన్నది అని ఈ పరిణామం రుజువు చేస్తున్నది.

పరాయిదేశస్తుల పాలనకూ,అవినీతి దోపిడీ పాలనకూ,అన్ని రకాల చెడులకూ నరేంద్రమోడీ యొక్క పరిపాలన చరమగీతం పాడాలనీ,మన దేశం అన్ని రంగాలలో మంచి అభివృద్ధి సాధించాలనీ,అదే సమయంలో మన దేశపు ఆత్మ అయిన సనాతన ధర్మమూ ఆధ్యాత్మికతలను మరచిపోకూడదనీ అలాంటి వరాన్ని మనకు భగవంతుడు ఇవ్వాలనీ ఆశిస్తూ నరేంద్రమోడీగారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.