“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

7, మే 2014, బుధవారం

అనుభవం లేని ఆచరణలు

గుంటూరులో ISKCON టెంపుల్ కొత్తగా వచ్చింది.బాగుందని అందరూ వెళుతుంటే చూద్దామని మేమూ వెళ్ళాము.వాళ్ళ టెంపుల్స్ అన్నీ బాగా రిచ్ గా ఉంటాయి.దేవాలయం బాగానే ఉన్నది.చాలావరకూ పూర్తి అయినా ఇంకా కట్టాల్సింది చాలా ఉన్నది.

వేదికపైన రాధాకృష్ణుల విగ్రహాలు పాలరాతివి కావడంతో చాలా కళగా ఉన్నాయి.పూరీ జగన్నాధుని బొమ్మలూ ఉన్నాయి.కొన్ని సాలగ్రామాలూ ఉన్నాయి.ప్రేమతత్వానికి రాధాకృష్ణులే పరాకాష్ట.ప్రేమకు వారే దైవాలు. ఆధ్యాత్మికమార్గంలో రాధాకృష్ణ తత్వాన్ని మించిన తత్త్వం లేదని నేనూ నమ్ముతాను.

అక్కడ ఉండేది అందరూ బెంగాలీలనుకుంటాను.లేదా ఒరిస్సా వాళ్లైనా అయి ఉండాలి.వాళ్ళ గానంలోనూ ఉచ్చారణలోనూ ఏమాత్రం శ్రావ్యతా సౌకుమార్యమూ ఆహ్లాదమూ ఉండవు.వాళ్ళు భగవన్నామాన్ని పాడుతున్నా కర్ణ కఠోరంగా ఉంటుంది.ఎంతో కేర్లెస్ గా ఎవరినో తిడుతున్నట్లు పాడుతున్నారు.గుండె దడ వచ్చేటట్లు డోలు వాయిస్తున్నారు.ఏ మాత్రం నచ్చలేదు.

భగవన్నామాన్ని తన్మయత్వంతో ఎంతో సహజంగా పాడుతూ అందులో నిమగ్నమై ధ్యానస్థితిలోకి వెళ్ళేవాళ్ళను నేను చూచాను.వాళ్ళలో ఎలాంటి భేషజమూ,కృత్రిమత్వమూ,నిర్లక్ష్యమూ కనిపించవు.

అలాంటి వాళ్ళ సాంగత్యం భగవంతుని దయవల్ల నాకు చిన్నప్పుడే కలిగింది.

అలాంటివారి గానాన్ని ప్రత్యక్షంగా విన్న తర్వాత ఇలాంటివారి గానం వింటే నాకు నవ్వు వస్తుంది.వారి గానం మరపురానిది.అది అత్యంత సహజంగా ఉంటుంది.హృదయపు లోతులలోనుంచి అది పెల్లుబికి వస్తుంది.వినేవాళ్ళను కదిలిస్తుంది.అప్రయత్నంగా ధ్యానాన్ని కలిగిస్తుంది.వీరి గానం కూడా మరపు రానిదే.ఇది నిద్రపోయేవారిని కూడా లేపేస్తుంది.

వారిది సహజం.వీరిది కృత్రిమం.

కాసేపు అక్కడ ఉండి బయటకు రాబోతుండగా ఒకాయన గుమ్మంలో ఎదురై,'కాసేపట్లో ప్రవచనం మొదలౌతుంది విని వెళ్ళండి' అన్నాడు.

నేను సున్నితంగా తప్పించుకుని బయటకు రాబోతుంటే ఆయన దాదాపుగా అడ్డు వస్తూ మళ్ళీ అదే మాట అన్నాడు.బహుశా నాకు చెవుడేమో అని ఆయన అనుకోని ఉండవచ్చు.

ఆయన వైపు ఒక్కసారి చూచాను.

'నిర్వచనం కోరేవారికి ప్రవచనాలెందుకు?' అన్నాను.

ఆయనకు అర్ధం కాలేదు.అలా చూస్తున్నాడు.

ఈలోపల ఆయన్ను తప్పుకుని నేను బయటకు వస్తూ మా ఆవిడా అమ్మాయీ ఎక్కడున్నారా అని వాళ్ళకోసం చూచాను.వాళ్ళు స్టాల్ దగ్గర నిలబడి ఏదో చూస్తున్నారు.

సరే అక్కడకు దారితీశాను.

'ఈ దండ ఆరోగ్యానికి చాలా మంచిది.దీన్ని సన్ స్టోన్ అంటారు. కాలేజిలో ఉన్నపుడు నేను వేసుకునేదానిని.' అంటూ కౌంటర్లో ఉన్న ఆవిడ ఏమో చెబుతున్నది.

ఆమెను చూస్తే అంత ఆరోగ్యమైన మనిషిలా అనిపించలేదు.ఆ దండ అవసరం కాలేజీరోజులలో కంటే ఇప్పుడే ఆమెకు ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది.కాని ఆమె ఆ దండను ప్రస్తుతం వేసుకొని లేదు.

అమ్మాయి కొనబోతుంటే 'అన్ని రాళ్ళూ అన్ని జాతకాలకూ మంచివి కావు.అలా తీసుకోకూడదు' అంటూ నేను సున్నితంగా వారించాను.

'పోనీ ఇది చూడండి.ఇది మూన్ స్టోన్.ఈ దండ వేసుకుంటే ఒంట్లోని వేడిని లాగేస్తుంది.'అంటూ ఒక స్ఫటికమాలను చూపించింది.

'మొత్తం వేడిని అంతా లాగేసి ఒళ్ళు చల్లబడిపోతే ప్రమాదమేమో?' అన్నమాట నోటిదాకా వచ్చి ఆగిపోయింది.బాగుండదని ఆమాటను మింగేశాను.

'పోనీ ఈ పుస్తకం చూడండి'- అంటూ 'మరణానంతర జీవితం' అనే ఒక పుస్తకాన్ని ఆవిడ చూపించింది.

'అది అసలే తీసుకోవద్దు.' అన్నాను.

ఆమే మా అమ్మాయీ కొద్దిగా కోపంగా నావైపు చూచారు.

'ఇలాంటి పుస్తకాలు వ్రాసినవారిలో చాలామందికి మరణానంతర జీవితం గురించి ప్రత్యక్ష అనుభవం ఉండదు.ఇదంతా 'స్పెక్యులేటివ్ రైటింగ్'.కొనవద్దు.' అన్నాను.

'మీరీ పుస్తకం చదివారా?' ఆమె అడిగింది.

'చదివాను.చదవడమే కాదు.అలాంటి అనుభవాలు పొందిన మనుషులతో కలిసి తిరిగాను' అన్నాను సాధ్యమైనంత సున్నితంగా.అప్పటికే ఎక్కువగా చెప్పానేమో అనుకుంటూ.

ఇక ఆమె ఏమీ మాట్లాడలేదు.

మరణానంతర జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు.బ్రతికి ఉండగానే దానిని ఫీల్ అయ్యే టెక్నిక్స్ నాకు తెలుసు.వాటిని నేను ముప్పై ఏళ్ళ క్రితమే అభ్యాసం చేశాను.కావాలంటే వాటిని ఇతరులకు నేర్పడానికీ నేను సిద్ధమే.అయితే వాటిని ఫీల్ అవడం కోసం సిన్సియర్ గా ప్రయత్నించే మనుషులూ,అలాంటి అభ్యాసాలకు కావలసిన గుండెధైర్యం ఉన్న మనుషులూ ఇప్పటివరకూ నాకు తారసపడలేదు.

ఊరకే మాటలు చెప్పి ఏమీ కొనకపోతే బాగుండదని కొన్ని మంచి అగర్బత్తీ పేకెట్లు కొనుక్కుని ఆలయం నుంచి బయటకు వచ్చేశాము.

తిరుగు ప్రయాణంలో మౌనంగా డ్రైవ్ చేస్తున్నాను.

'నాన్నా.నీకు మనుషులూ నచ్చరు.పాటలూ నచ్చవు.గుడులూ నచ్చవు. పుస్తకాలూ నచ్చవు.ఏదీ అంత త్వరగా నచ్చదు.ఎందుకలా?' అంది మా అమ్మాయి.

నాకు నవ్వొచ్చింది.

తనకు ఎలా జవాబు చెప్పాలా అని ఒక క్షణం ఆలోచించాను.

'అవునమ్మా.పుల్లారెడ్డి నేతిస్వీట్లు రుచి చూచినవాడికి రోడ్డుపక్కన వేసే జిలేబీ నచ్చకపోవడం వింత కాదుగా?' అన్నాను.

తనేమీ మాట్లాడలేదు.

మళ్ళీ నేనే నవ్వుతూ 'ఎక్కువ తెలియడం వల్ల వచ్చే ఇబ్బందులమ్మా ఇవన్నీ' అన్నాను.

ఇస్కాన్ వారిని నేను విమర్శించడం లేదు.వారు చేస్తున్నది మంచిదే.వారి విధానాలూ మంచివే.కానీ అందరికీ అన్నీ సరిపడవు.నచ్చవు. ప్రతిదానిలోనూ 'క్లాస్' అనేది వేరుగా ఉంటుంది.దాని ఫీల్ వేరుగా ఉంటుంది.మనుషులలోగానీ,సంస్థలలోగానీ,వ్యవహారంలోగానీ అది కనిపించనప్పుడు కనిపించలేదనే నేనంటాను.ఉంటే ఉందంటాను.లేనప్పుడు లేదనే అంటాను.

ఇలా ముక్కుసూటిగా వెళ్ళడం వల్లనే అనేక సంస్థలతో గతంలో నాకు విభేదాలు వచ్చాయి.చివరకు రామకృష్ణా మిషన్ లో కూడా అనేకమంది పోకడలు నాకు నచ్చక వారితో గతంలో విభేదించిన కారణం కూడా ఇదే.

కట్టడాలలో కనిపించే 'క్లాస్',వ్యవహారంలో కూడా ఉండాలని నేను ఆశిస్తాను. అలా లేనప్పుడూ,నేను ఆశించిన స్థాయి వారిలో కనిపించనప్పుడూ,నేను నమ్మినవారినీ చాలాకాలంపాటు గట్టిగా అనుసరించినవారినే నిర్మొహమాటంగా వదిలేశాను.ఇలా నా జీవితంలో చాలాసార్లు జరిగింది.

దైవం ఉత్త కట్టడాలలోనూ, మాటల్లోనూ, పటాటోపంలోనూ, ప్రవచనాలలోనూ, విగ్రహాలలోనూ మాత్రమే లేదుగా?