“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

22, మే 2014, గురువారం

నరేంద్రమోడి ప్రమాణస్వీకార కుండలి-ముహూర్త విశ్లేషణ

నూతన ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం 26-5-2014 సాయంత్రం 6 గంటలకు అని వార్తలొస్తున్న నేపధ్యంలో ఈ ముహూర్తాన్ని ఒక్కసారి క్షుణ్ణంగా పరికించవలసిన అవసరం కనిపిస్తున్నది.

ఎందుకంటే నరేంద్ర మోడీ మీద దేశం అంతా ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నది.స్వర్ణయుగం రాబోతున్నదని ఆశగా ఎదురుచూస్తున్నది.

ప్రమాణస్వీకార ముహూర్తాల మీద భిన్నాభిప్రాయాలున్నాయి.

ఆ సమయానికి వేసిన కుండలి ఆ ప్రమాణస్వీకార కార్యక్రమం ఎంత సజావుగా జరుగుతుంది అన్న విషయాన్ని మాత్రమె సూచిస్తుంది అని కొందరంటారు.

ఇంకొంతమంది ఆ నాయకుని పదవీకాలం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మాత్రమే అది సూచిస్తుంది అని నమ్ముతారు.

మూడోవర్గం వారు ఇలా అంటారు. ప్రమాణస్వీకార సమయంలో ఆయన చేసిన ప్రమాణం ఎంతవరకూ నెరవేరుతుంది?ఎంతవరకూ ఆయన దానిని నేరవేర్చగలడు?అన్న విషయాన్ని మాత్రమె ఆ సమయానికి వేసిన కుండలి సూచిస్తుంది అనేది కొందరి అభిప్రాయం.ఇందులో కూడా కొంతనిజం లేకపోలేదు.

సామాన్యంగా ప్రతి ప్రమాణస్వీకార ఉత్సవమూ బాగానే జరుగుతుంది.ఏవో చిన్నచిన్న అపశ్రుతులు అందులో ఉన్నప్పటికీ మొత్తమ్మీద అవి బాగానే ముగుస్తాయి.పైగా ఒక గంటో రెండుగంటలో జరిగే కార్యక్రమం గురించి అంత తల పగలగోట్టుకోవాల్సిన పనిలేదని నా అభిప్రాయం.కనుక ముహూర్త కుండలి ఆ కాస్త కార్యక్రమం వరకే వర్తిస్తుంది అనే నమ్మకం కరెక్ట్ కాదని నేనూ అంటాను.

కనుక రెండవ అభిప్రాయమే సరియైనది అని నాకనిపిస్తుంది.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ,నరేంద్రమోడీని ప్రధానమంత్రిగా నియమిస్తూ పత్రాన్ని ఆయనకు అందజేసిన సమయమే అసలైన సమయమనీ ఆ సమయానికే కుండలి వేసి చూడాలనీ కొందరి ఊహ.ఇందులో కూడా కొంత నిజం లేకపోలేదు.

నిజానికి ఆ సమయానికే ఆయన ప్రధానమంత్రి అయ్యారు. అందుకు రాష్ట్రపతి ఆమోదముద్ర చాలు.ప్రమాణస్వీకారం అనేది లాంఛనంగా జరిపే ఒక వేడుక మాత్రమే.అయితే ఆయన రాష్ట్రపతినుంచి ఎన్ని గంటలకు ఆమోద పత్రాన్ని అందుకున్నారో ఖచ్చితంగా తెలియదు.మంగళవారం నాడు పార్లమెంట్ లొ సమావేశం ముగిశాక ఇది జరిగింది.ఉజ్జాయింపుగా లెక్కించవచ్చు.దీనిని ఇంకోసారి పరికిద్దాం.

ఈ విభిన్న అభిప్రాయాల నేపధ్యంలో మన ప్రస్తుత ముహూర్త కుండలి పరిశీలన ప్రారంభిద్దాం.

సంఖ్యా శాస్త్రజ్ఞులు ఇలా అంటున్నారు.

26 అంటే 8

నరేంద్రమోడీ జననతేదీ 17=8

కనుక ఆ రోజున బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు.ఇది ఇంత సింపుల్ గా తేలే వ్యవహారం కాదు.ఒక దేశప్రధాని ప్రమాణ స్వీకారానికి ఇంత చిన్న సమీకరణం చాలదు.ఇంకా చాలా కోణాలలో ఈ ముహూర్తాన్ని గట్టిగా పరిశీలించవలసి ఉంటుంది. 

మన సాంప్రదాయం ప్రకారం ఒక మంచిముహూర్తానికి కొన్ని ప్రాధమిక లక్షణాలుండాలి.ఏకవింశతి(21) మహాదోషాలనేవి లేకుండా ముహూర్తాన్ని ఎన్నుకోవాలని ప్రామాణిక గ్రంధాలు చెబుతున్నాయి.అయితే సర్వలక్షణ సంపన్నమైన ముహూర్తం దొరకడం దుర్లభం గనుక 'అల్పదోషం గుణాధిక్యం' అనే సూత్రాన్ని పాటించి తక్కువ దోషమూ ఎక్కువ మంచీ ఉన్న ముహూర్తాన్ని ఎంచుకోవడం తప్ప మనం ఏమీ చెయ్యలేము.ఎవరైనా చేసేది ఇదే.

అన్నీ మంచి లక్షణాలే ఉన్న మనిషి ఎలాగైతే ఉండడో,అన్ని రకాలుగా ఒకరికొకరు సరిగ్గా సరిపోయిన జంట ఎలాగైతే ఉండదో,అలాగే అన్ని రకాలుగా మంచిగా ఉన్న ముహూర్తమూ దొరకదు.ఎక్కడో ఏదో ఒక లోపం ప్రతి ముహూర్తంలోనూ తప్పకుండా ఉంటుంది.

ఏకవింశతి మహాదోషాలను ప్రస్తుతానికి కొద్దిసేపు పక్కన ఉంచితే,ముందుగా పంచాగములైన తిధి,వార,నక్షత్ర,యోగ,కరణాదులను పరిశీలించాలి.

తిధి=బహుళ త్రయోదశి అయింది.రెండురోజుల్లో అమావాస్య పెట్టుకుని ఈ ముహూర్తం ఎందుకు పెట్టినట్లో అర్ధం కాదు.ఇంకొక నాలుగురోజులు ఆగితే అమావాస్య తర్వాత ఇంకా బాగుండేది.

వారం=సోమవారం అయింది.చంద్రుని పరిస్థితి బాగులేదు కనుక వారబలం లేదు.

నక్షత్రం=భరణి అధిపతి యముడు కనుక ఈ నక్షత్రం శుభకార్యాలకు మంచిది కాదు.కానీ నరేంద్రమోడీ నక్షత్రం అయిన అనూరాధకు ఇది క్షేమతార గనుక పరవాలేదు అనుకోవచ్చు.ఏదో సరిపెట్టుకోవడమే గాని పూర్తిమార్కులు పడవు.

యోగం=శోభనయోగం.మంచిదే.

కరణం=వణిజ కరణం.మంచిదే.

పోతే,సూర్యుడు ఆ రోజునుంచీ రోహిణీ నక్షత్రంలో ఉదయిస్తున్నాడు గనుక చాలామంచిది అని కొంతమంది జ్యోతిష్కులు అంటున్నారు.ఈ ఒక్క పాయింట్ ను బట్టి అది అతిగొప్ప  ముహూర్తం అని నిర్ణయించడం కుదరదు.

ఇక ముహూర్త కుండలిని ఒక్కసారి పరిశీలిద్దాం.

లగ్నవిషయం చూస్తే,ఎక్కువకాలం స్థిరంగా నిలిచి ఉండవలసిన పనులైన ఉద్యోగప్రవేశం,గృహప్రవేశం,వ్యాపారప్రారంభం,పెళ్లి మొదలైన ముహూర్తాలకు స్థిరలగ్నాలైన వృషభ,సింహ,వృశ్చిక,కుంభాలను మాత్రమె ఎన్నుకోవాలి. ఇది ముహూర్తభాగంలో ఒక ప్రాధమికసూత్రం.కానీ ఈ ముహూర్తానికి చరలగ్నమైన తులను ఎన్నుకున్నారు.ఇది మంచిది కాదు.

ఇంతకంటే సింహ లగ్నాన్ని ఎంచుకుంటే ఇంకా బాగుండి ఉండేది.ఇంతకంటే మంచి యోగాలు అప్పుడు ముందుకు వస్తాయి.

లగ్నంలో యోగకారకుడైన శనీశ్వరుడు ఉండటం మంచిదే.రాహువుతో కూడి ఉండటం కొంత దోషం.యోగకారకుడు వక్రించి ఉండటం దోషం.దీనివల్ల క్షణం తీరికలేని ప్లానింగూ,నిరంతర కార్యవ్రగ్రతా ఎత్తులకు పైఎత్తులూ సూచితాలు.

'సమాజంలో అత్యంత పేదవానికోసం ప్రభుత్వం పనిచెయ్యాలి' అని పార్లమెంట్ లో మాట్లాడుతూ నరేంద్రమోడీ చెప్పిన మాటకు లగ్నంలోని చతుర్దాదిపతి అయిన ఉచ్చవక్ర శని స్థితి ఖచ్చితంగా సరిపోతున్నది.

'ప్రతిరోజూ ప్రతిక్షణమూ దేశం కోసం కష్టపడి పనిచేస్తాను' అని మోడీ చెప్పిన మాట శనీశ్వరుని కారకత్వానికి ఇంకాబాగా సరిపోతున్నది.

అయితే లగ్నంలో శని రాహువులు కలసి ఉండటం మంచిది కాదు.దేశంకోసం నరేంద్ర మోడీ చాలా కఠిన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుందనీ వాటిని అమలు చెయ్యడంలో ఇంకా ఎన్నో అడ్డంకులు ఉంటాయనీ ఎన్నో ప్రతికూల శక్తులను ఆయన ఎదుర్కోవలసి వస్తుందనీ ఈ యోగం సూచిస్తున్నది.

ఎన్ని చెప్పుకున్నా మనం చివరికి నిజం మాట్లాడుకోక తప్పదు.దేశంలో ప్రజలందరూ మంచివాళ్ళూ ఉత్తములూ సంస్కారవంతులూ ఏమీకారు. చాలామంది దగ్గర నల్లధనం విపరీతంగా ఉన్నది.అవకాశం వస్తే ప్రతివాడూ చట్టాన్ని ఉల్లంఘించేవాడే.మన ట్రాఫిక్ రూల్స్ ను ఎందరు పాటిస్తున్నారో గమనిస్తే చాలు.మన ప్రజలకు ఎంత క్రమశిక్షణ ఉన్నదో మనకు చక్కగా అర్ధమైపోతుంది.

మరి ఇలాంటి అవకాశవాద ప్రజలున్న దేశంలో,ఆర్ధిక రంగాన్నిగనుక మోడీ కట్టుదిట్టం చేసి సంఘంలో ఉన్న నల్లధనాన్ని వెలికితీసే కార్యక్రమం మొదలు పెడితే,దానిని ప్రప్రధమంగా వ్యతిరేకించేది ఇదే ప్రజలే అవుతారు.మంచి మాట్లాడితే ప్రజలు వింటారుగాని ఆచరణలోకి వచ్చేసరికి ఎవ్వరూ సహకరించరు.ఇదే మన దేశపు దౌర్భాగ్యం.ఒకవేళ బలప్రయోగం చేస్తే అప్పుడు ప్రజావ్యతిరేకత తప్పకుండా వస్తుంది.

ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి.ఒళ్ళు వంచి కష్టపడి పని చెయ్యమని గట్టిగా చెప్పినందుకేగా పదేళ్ళక్రితం చంద్రబాబుకు ఉద్యోగులు వ్యతిరేక ఓటువేసి పదవినుంచి దించేశారు.ఇది నిజమే గనుక దీనిని ఎవరూ కాదనలేరు.కనుక క్రమశిక్షణా నీతీ నేర్పాలంటే వాటిని నేర్చుకోడానికి మన ప్రజలు అంత త్వరగా ముందుకు రారు.లొంగరు.

కనుక అవినీతి ప్రజలకు నీతిని నేర్పడం ప్రస్తుతం నరేంద్రమోడీ ముందున్న అతిపెద్ద సమస్య అని నేనంటాను.ఇంకొక పక్కన,పార్టీలో అవినీతి లేకుండా చూచుకోవడం ఇంకొక పెద్దసమస్య.అధికారం చేతిలోకి వచ్చాక అందులోనూ అడ్డు లేని అధికారం అయినప్పుడు ఎవరు ఎలా మారతారో ఊహించడం కష్టం.నరేంద్రమోడీ నిజాయితీగా ఉండవచ్చు.కాని ఆయన జంబో మంత్రివర్గంలో అందరూ అలాగే ఉంటారంటే అనుమానమే.కనుక ఇంటా బయటా నీతీ నిజాయితీతో కూడిన వాతావరణాన్ని ప్రాదుకొల్పే క్రమంలో ఆయన ఎంతో శ్రమించవలసి ఉంటుంది.

ఇవన్నీ చెయ్యడానికి ఆయన ఎదుర్కొనబోయే ఆటుపోట్లనూ,ఆయన అనుసరించబోయే వ్యూహాలనూ లగ్నంలోని శని రాహువులు సూచిస్తున్నారు.

లగ్నాధిపతి శుక్రుడు సప్తమంలో కేతువుతో కలిసి ఉండటం మంచిది కాదు.దశమాధిపతి క్షీణచంద్రుడు కావడమూ మంచిది కాదు.ఆయన సప్తమంలో ఉండటమూ అంత మంచిసూచన కాదు.దీనివల్ల,ఎప్పుడూ శత్రువులతో యుద్ధమూ,పరిపాలనలో గొడవలూ ఆటుపోట్లూ సూచితాలు.

2,7 అధిపతి కుజుడు ద్వాదశంలో ఉండటం ఒకరకంగా మంచిదే.శత్రువులు ఈయన చేతిలో ఎప్పుడూ ఓడిపోతూ ఉంటారు.కాని ఆర్ధిక రంగానికి మంచిది కాదు.

లాభాదిపతి సూర్యుడు అష్టమంలో ఉండటం దేశానికి మంచిది కాదు.లాభదాయకంగా ఉండదు.ఇలాంటి కార్యక్రమాలకు ప్రధానంగా చతుర్ధ అష్టమశుద్ధిని పరిశీలించాలి.ఇక్కడ చతుర్ధ శుద్ధి ఉన్నది.కాని అష్టమ శుద్ధి లేదు.అదే సింహలగ్నానికి అయితే రెండూ ఉన్నాయి. 

నవమంలో గురుబుధులు ఉండటం మంచిదే.కాని విదేశాలతో విరోధాలు రావచ్చు.అంటే,స్వదేశీ వ్యాపారులను ప్రోత్సహించి విదేశీ వ్యాపారులను కట్టడి చెయ్యడం జరుగవచ్చు.ఇదే గనుక పూర్తిస్థాయిలో జరిగితే విదేశాల నుంచీ MNC ల నుంచీ తీవ్ర ప్రతిఘటన ఎదురు కావచ్చు.

మంచి ముహూర్తానికి ఎప్పుడూ లగ్నబలం ఉండాలి.అలా ఉండాలంటే ఆ పనికి సరిపోయే సరియైన లగ్నాన్ని ఎంచుకోవాలి.అదికూడా వర్గోత్తమం అయి ఉండాలి.ఈ కార్యక్రమానికి ఆ లక్షణాలు సింహలగ్నానికి మాత్రమే మద్యాహ్నం 12.23 నుంచి 12.38 వరకు మాత్రమె ఉన్నాయి.ఆ సమయంలో సింహలగ్నం వర్గోత్తమంగా నిలిచి ఉన్నది.కనుక ఆ సమయంలో ప్రమాణస్వీకార ముహూర్తం ఎంచుకుని ఉంటె బాగా ఉండేది.

అభిజిత్ లగ్నం కావడం కూడా బాగా ఉపయోగపడేది.దీనిని పల్లెటూళ్ళలో 'గడ్డపార(పలుగు)ముహూర్తం' అంటారు.గడ్డపలుగు భూమిలో పాతి దాని నీడ మాయమయ్యే మిట్టమధ్యాహ్న సమయాన్ని మంచి ముహూర్తంగా స్వీకరించడం చాలా పల్లెల్లో ఉన్నది.పాతకాలపు బ్రాహ్మణులు ఈ మంచి అలవాటును పల్లెప్రజలకు చేశారు. దీనివల్ల,పంచాగం చూడటం రానివారు కూడా ఎక్కువ గందరగోళపడకుండా స్థూలమైన ఒక మంచి ముహూర్తాన్ని ఎంచుకోవచ్చు.ఎందుకంటే ఇలా చేసినప్పుడు సూర్యుడు దశమకేంద్రంలో ఉంటాడు.ఈ యోగం ముహూర్తంలోని చాలా దోషాలను పోగొడుతుంది.

ఏదేమైనా ఈ ముహూర్తాన్ని ఏ జ్యోతిష్కుడు నిర్ణయించాడో నాకు తెలియదు కాని ఇది అంత మంచిముహూర్తం కాదని నా ఉద్దేశ్యం.ఇంతకంటే మంచి ముహూర్తాన్ని ఆరోజున(ఒకవేళ అదేరోజు కావాలి అనుకుంటే) నిర్ణయించవచ్చు.అది సింహలగ్నం మాత్రమే అవుతుంది.

బీజేపీ వంటి పార్టీకి జ్యోతిష్కులు ఉండరు అంటే నేను నమ్మలేను.వారు మనలాంటి మామూలు జ్యోతిష్కులు కూడా అయి ఉండరు.మంచి పేరుమోసిన వాళ్ళే ఉంటారు.మరి అలాంటి జ్యోతిష్కులు ఇటువంటి ముహూర్తాన్ని ఎందుకు నిర్ణయించారో నాకు అర్ధం కావడం లేదు.

ఇంకొంతమంది ఇంకొక మాట చెబుతున్నారు.ఇది పొలిటికల్ సర్కిల్స్ కోసం పెట్టిన ముహూర్తం మాత్రమె.అసలైన ముహూర్తం మధ్యాహ్నం సింహ లగ్నంలోనే ఉండవచ్చు.అతి కొద్దిమంది సమక్షంలో అది జరుగవచ్చు. సాయంత్రానికి అందరికోసం ఈ ఫంక్షన్ జరుపుతూ ఉండవచ్చు అని కొందరు నాతో అన్నారు.అది కూడా నిజమే కావచ్చు.ఎందుకంటే అధికారపరంగా అత్యున్నతస్థాయిలో ఉన్నవారికి జ్యోతిష్కుల కొదవా సలహాదారుల కొదవా ఉండదు.

మరి అన్నీ తెలిసి ఇలాంటి ముహూర్తానికి ఈ ఫంక్షన్ ఎందుకు చేస్తున్నారో దానిని ప్లాన్ చేసినవారికే ఎరుక.మనంమాత్రం అంతా మంచే జరగాలని కోరుకుంటూ భవిష్యత్తులో దేశంలో ఏం జరుగబోతున్నదో వేచి చూద్దాం.