Spiritual ignorance is harder to break than ordinary ignorance

30, మే 2014, శుక్రవారం

కాంతిపధంలో....

లోకపు వేసట కావల
శోకపు దారుల కావల
అంతులేని కాంతిసీమ
రారమ్మని పిలుస్తోంది

ఇంద్రధనుసు అంచులలో
జారుబండపై జారుచు
దూరపు లోకాల చేర
ఆహ్వానం అందుతోంది

నీలపు నింగిని తేలుచు
విశ్వపుటంచుల తాకగ
వీనుల విందగు విన్నప
మొక్కటి రమ్మని పిలిచింది

నక్షత్రపు మండలాల
సువిశాలపు వీధులలో
విశ్రాంతిగ నడవమనెడు
పిలుపొక్కటి అందుతోంది

సౌరమండలపు అంచుల
మౌనసీమలను జారే
నాదపు జలపాతంలో
స్నానమాడ మనసైంది

నన్ను నేను మరచిపోయి
నిశ్శబ్దపు నిశిదారిని
నింగి అంచులను దాటగ
నిష్ఠ ఒకటి సలుపుతోంది

దేహదాస్య శృంఖలాల
తెంచుకొనే శుభఘడియల 
దైన్యతలెల్లను తీర్చెడు
లాస్యమొకటి విరుస్తోంది

క్షుద్రలోక మాయలొసగు
రొచ్చునంత అధిగమించి
నిద్రలేని సీమలలో
స్వచ్చత రమ్మంటోంది

వెలుగు సంద్రమున దూకి
సుడిగుండపు లోతులలో
విశ్వపు మూలాన్ని చేర
వింత కోర్కె మొదలైంది

దేహపంజరాన్ని వీడి
ఆకాశపు దారులలో
స్వేచ్చమీర తేలాలని
కాంక్ష కనులు తెరుస్తోంది

కాంతిలోన కాంతినగుచు
వెలుగు తెరల వెల్లువలో
విశ్వంలో కరగాలని
వెర్రి మనసు వెదుకుతోంది

చీకటి సంద్రపు లోతుల
అంతులేని వెలుగుసీమ
ఆహ్వానాన్నందిస్తూ
చెయ్యి సాచి పిలుస్తోంది

యుగయుగాల వెదుకులాట
అంతమయే ఘడియలలో
నిశ్చల చేతనమొక్కటి
నింగినంటి వెలుగుతోంది