“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

6, మే 2014, మంగళవారం

ఎన్నికల కుండలి 7-5-2014


రేపు మన రాష్ట్రంలో ఎన్నికలు.

ఉదయం 7 కి పోలింగ్ మొదలు అవుతుంది.ఆసమయానికి ఉన్నట్టి గ్రహస్థితులు ఏమంటున్నాయో ఒకసారి తిలకిద్దాం.దీనికోసం జ్యోతిష్య శాస్త్రాన్నీ సంఖ్యాశాస్త్రాన్నీ కలిపి ఉపయోగిద్దాం.


7-5-2014 తేదీలో శుక్రుడు, బుధుడు,సూర్యుడు రాహు కేతువులున్నారు.శూన్యం అనేది రాహువుకూ సూర్యునికీ మధ్యన ఉన్నది.

సూర్యుడు రాహువుకంటే కేతువుకు దగ్గరగా ఉన్నాడు.ప్రస్తుత గ్రహస్తితి లో కూడా సూర్యుడు కేతువుతోనే కలసి ఉండటం చూడవచ్చు.ఇదొక మార్మిక సూచన.మొన్న వచ్చిన సూర్య గ్రహణం కూడా ఇందుకే వచ్చింది. అయితే అది మనకు కనపడలేదు. అయినా సరే దాని సంధ్యాప్రభావం ఎంతోకొంత మనమీద కూడా ఉంటుంది.అది వేరే సంగతి.

రూట్ నంబర్ 10 అవుతుంది.అంటే ఒకటి తర్వాత శూన్యం.ఆ తర్వాత ఒకటి అవుతుంది.సూర్యుడిని సూచిస్తుంది.

అధికారంలో ఉన్నవారికి అది జారిపోతుందన్న సంకేతాన్ని సంఖ్యాశాస్త్రం స్పష్టంగా ఇస్తున్నది.నవాంశలో సూర్యుడు దినసూచకుడైన శుక్రునితో కలసి నీచలో ఉండటం దీనిని ధృవపరుస్తున్నది.

లగ్నాధిపతి శుక్రుని లాభస్తాన ఉచ్ఛబలీయస్థితి వల్ల పోలింగ్ శాతం ఇంతకు ముందటి పోలింగ్ కంటే ఎక్కువగా ఉంటుందని తెలుస్తున్నది.ప్రజలు ఈసారి చురుకుగా పోలింగ్ లో పాల్గొంటారు.మనకెందుకులే అని పోలింగ్ కి దూరంగా ఉన్నవారు కూడా ఇప్పుడు ఇంటినుంచి బయటకొచ్చి ఓటేస్తారు.

బుధవారం బుధ నక్షత్రమైన ఆశ్లేష నడుస్తూ ఉన్నది.లగ్నంలో బుధుడున్నాడు.ఈ బుధునివల్ల ఏమి తెలుస్తున్నది?

ఉత్సాహంగా పౌరులు ఓటింగ్ లో పాల్గొంటారనీ,ఓటు వెయ్యకపోతే దేశం నష్టపోతుంది తద్వారా మనమూ నష్టపోతాం అన్న భావన ప్రజలలోకి చొచ్చుకుని పోయిందని సూచిస్తున్నది.

అంతేగాక,నడుస్తున్న సర్పనక్షత్రాన్ని బట్టి,ఎన్నికలలో అవినీతీ డబ్బుపంపిణీ విచ్చలవిడిగా జరిగాయని కూడా రూడిగా తెలుస్తున్నది. 

హోరానాధుడైన చంద్రుడు స్వక్షేత్రంలో ఆరోహణ క్రమంలో ఉండటం కూడా బలపడిన ప్రజాభిప్రాయాన్ని సూచిస్తున్నది.ఇంటర్ నెట్ వల్లా,మొబైల్ ఫోన్ల వల్లా సమాచారవేగం చాలా పెరిగింది.దీనితో మారుమూల గ్రామాలలో ఉన్నవారికి కూడా ఎక్కడ ఏమి జరిగినా తెలిసిపోతున్నది.ప్రజలకు తెలియని విషయం అంటూ ఇప్పుడు ఏదీ లేదు.ఈ అవగాహన వల్ల కూడా నేటి ఓటింగ్ ఎక్కువగా ప్రభావితం అవుతుంది.

అంతేగాక,ఎవరు ఏమనుకున్నా,ఎలా ప్రచారాలు చేసుకున్నా,ఎంత డబ్బు పంచినా,ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, చివరకు ప్రజలు తెలివిగా ఓటు హక్కును వాడతారనే సూచన ఉన్నది.

అయితే బుధరాశినుంచి వక్రకుజుడు శుక్రుని వీక్షిస్తున్నాడు.ఇదేమి సూచిస్తున్నది?

ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్ చెయ్యడం వెనుక కొన్నివర్గాల ప్రలోభాలూ కుట్రలూ కొండొకచో బెదిరింపులూ తీవ్రంగా ఉన్నాయన్న విషయం తెలుస్తున్నది.ప్రజలందరూ నిజాయితీ పరులు కారన్న విషయమూ స్పష్టంగా కనిపిస్తున్నది.

ఇదే గ్రహస్తితి వల్ల ఇంకొక విషయం కూడా సూచింపబడుతున్నది.గెలిచే పార్టీకి ఏకైక మెజారిటీ రాదనీ ప్రత్యర్ధులకు కూడా బాగానే సీట్లు వస్తాయనీ సూచన ఉన్నది.ఇది మన రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది.

ద్వాదశంలో సూర్యుడు కేతుగ్రస్తుడవడం వల్ల అధికారంలో ఉన్నవారు ప్రజాతీర్పు వల్ల పరాజయం పాలవుతారని స్పష్టంగా కనిపిస్తున్నది.

ఆరింట రాహుశనుల వల్లా,వారిపైన ఉన్న గురుదృష్టి వల్లా--ప్రజాస్వామ్య ప్రక్రియను చెడగొట్టాలని ఎన్ని శక్తులు ఎన్ని ప్రయత్నాలు జరిపినా చివరకు దైవానిదే అంతిమనిర్ణయం అన్న విషయం స్పష్టంగా తెలుస్తున్నది.నవాంశలో లగ్నంలో ఉన్న గురువు ఈ సూచనకు బలాన్ని చేకూరుస్తున్నాడు.

పోలింగ్ సమయంలో రేపు జరగబోయే కొన్ని దౌర్జన్య సంఘటనలను కూడా ఆరింట ఉన్న రాహుశనులు సూచిస్తున్నారు.అయితే గురుదృష్టివల్ల అవి సమర్ధవంతంగా అదుపు చెయ్యబడతాయి.

ప్రస్తుతదశగా వింశోత్తరీ క్రమంలో బుధ/సూర్య/చంద్ర దశ జరుగుతున్నది. బలాన్ని పుంజుకున్న ప్రజాభిప్రాయం వల్లా,తెలివిగా ఓటేసే ప్రజలవల్లా, పదవులలో ఉన్నవారికి అధికారం పోతుందన్న సూచనను నడుస్తున్న దశకూడా ఇస్తున్నది.

ఇప్పటివరకూ అనేకమంది చేసిన కుట్రలకూ వారివారి స్వార్దాలకూ  రాష్ట్రం ఘోరంగా బలైపోయినప్పటికీ ముందు ముందు మంచిరోజులు మళ్ళీ వస్తాయన్న సూచన పన్నెండులోని సూర్య కేతువుల వల్లా,రెంటిలోని గురువు వల్లా కనిపిస్తున్నది.

లాభస్థానంలోని శుక్రుడు నాయకులు చేస్తున్న స్వర్ణాంధ్ర వాగ్దానాలను సూచిస్తున్నాడు.అవి ప్రస్తుతానికి చాలా ఆకర్షణీయంగానే కనిపిస్తాయి.కాని ఆచరణలో ఎంత కష్టమో ముందుముందు తెలుస్తుంది.కొత్త రాష్ట్రాన్ని మొదటినుంచీ నిర్మించడం అంత సులభం ఏమీకాదు.రాశిచక్రంలో బలంగా కనిపిస్తున్న శుక్రుడు నవాంశలో తన నీచస్తితికి దగ్గరలో ఉండటమే దీనికి సూచన.

కనీసం ఈ ఎన్నికలలోనైనా ప్రజల విచక్షణా శక్తి మేలుకొంటుందని,రాష్ట్రానికీ దేశానికీ ముందుముందు మంచి జరుగుతుందనీ ఆశిద్దాం.