“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

3, జూన్ 2009, బుధవారం

భగవాన్ రమణ మహర్షి జాతకం

భగవాన్ రమణ మహర్షి 30-12-1879 తేదీన తమిళ నాడులోని తిరుచ్చులి అనే గ్రామంలో జన్మించారు. గత శతాబ్దపు గొప్ప జ్ఞానులలో ఈయనను అగ్రగణ్యునిగా తలచ వచ్చు. ఈయనను సుబ్రమన్యస్వామి అవతారం గా భక్తులు భావిస్తున్నారు. ఈయనను మహా జ్ఞాని గా తలచినప్పటికీ, భక్తి మార్గాన్ని ఈయన సమానంగా ప్రబోధించారు. "భక్తి, జ్ఞాన మాత" అని ఆయన తరచూ అనేవారు. భక్తి పరిపక్వం చెందినపుడు అద్వైత జ్ఞానం గా పరిణమిస్తుంది అని వీరి భావం. వీరి అసలు పేరు వెంకట రమణన్. తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. అరుణాచలం చేరిన మొదటి రోజులలో ఈయన పేరు ఎవరికీ తెలియక బ్రాహ్మణ స్వామి అని పిలిచేవారు. ఈయన కూడా మౌనంగా ఉంటూ ఎవరితోనూ మాట్లాడేవారు కారు. కావ్య కంఠ గణపతి ముని తొలిసారిగా భగవాన్ రమణ మహర్షి అనే పేరును ఈయనకు పెట్టి పిలిచాడు. అదే లోక ప్రసిద్ధం అయింది. మహర్షి జీవితాన్ని జ్యోతిష పరంగా పరిశీలిద్దాం. వీరిది కన్యా లగ్నం, పునర్వసు నక్షత్రం మూడవ పాదం.

స్థూలంగా జాతక పరిశీలన:
వీరి జాతకంలో కొన్ని ముఖ్య గ్రహ యోగములు ఏవనగా లగ్నమునకు సమాన దూరంలో రవి చంద్రులు రాహు కేతు గ్రస్తులగుట, సప్తమమున శని భగవానుడు గురు కుజులతో మిశ్రార్గలము పట్టి యుండుట,శుక్రుడు డిగ్రీలలో మరియు చంద్రుడు ఆత్మ కారకుడై 28 డిగ్రీలలో బలహీనులుగా ఉండుట. వీనివలన కలిగిన ముఖ్య ఫలితములు:చిన్ననాట తండ్రి మరణం. తల్లి జీవితం అష్ట కష్టాల మయం.వివాహం లేకపోవుట. మౌన చింతన. ఏకాంతవాసం. జీవితం చివరిలో తీవ్ర రోగంతో బాధపడుట.

ఆధ్యాత్మిక చింతనను సూచించు విమ్శాంశ చక్రములో కల ముఖ్య యోగములు: మకర లగ్నం, లగ్నాధిపతి శని భగవానుడు సప్తమ స్థితి. విక్రమ స్థానమున బుధుడు నీచ స్థితి. తద్రాశి నాదుడగు గురువు దశమ కేంద్ర స్థితి తో నీచ భంగ రాజ యోగం. సప్తమమున రాశి చక్రములో వలెనె శని స్థితి. లాభ స్థానములో రాహు కేతువులు. పంచమాదిపతి శుక్రుడు ద్వాదశ స్థితి.నవమాదిపతి బుధుడు మూడింట నీచ భంగం. వీనివల్ల కలుగు ఫలితములు ఏమనగా: కష్టపడి సాధన చేయుట ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతి. నీచ అహం నిర్మూలన ద్వారా బ్రహ్మ జ్ఞాన ప్రాప్తి. ఇతరులతో ఎక్కువగా మాట్లాడక పోవుట. యోగ సిద్ధి. జ్ఞాన మార్గ సాధన ద్వారా సిద్ధి కలుగుట.

జీవిత సంఘటనలు, దశాన్తర్దశలు :
వీరి జన్మ గురు/శుక్ర/శని/రాహు/శని దశలో రవి హోరలో జరిగింది. శని భగవానుడు వీరి జాతకంలో ప్రముఖ పాత్ర వహించినట్లు గోచరిస్తుంది. ప్రత్యంతర, ప్రాణ దశలలో శని పాత్ర స్పష్టంగా ఉంది. రాశి చక్రం, విమ్శాంశ చక్రములో శని సప్తమ స్థితిలో ఉండి అస్తమిస్తూ కర్మ క్షయాన్ని సూచిస్తున్నాడు. కర్మ క్షయం అయితేనే గాని జ్ఞాన ప్రాప్తి కలుగదు అనేది వేదాంత సత్యం.

మొదటి పదహారు ఏళ్ళు వీరి జీవితం మామూలు గా నే సాగింది. మిషనరీ స్కూల్ లో చదువు కొనసాగింది. కాని హఠాత్తుగా కలిగిన మరణ అనుభవం తో ఇల్లు వదలి 16 ఏట అరుణాచలం చేరాడు. అది 1896 సంవత్సరం. శని దశలో రవి అంతర్దశ జరుగుతున్నది. శని రవుల పాత్ర స్పష్టంగా ఉన్నది. ఈయన సాధన అంతా శని దశలోనే జరిగింది. శని లగ్నాదిపతికి చెందిన రేవతి నక్షత్రంలో ఉండి అస్తమిస్తున్నాడు. దీని ఫలితం ఈయన జన్మలు కర్మలు అంతం కాబోతున్నాయి. ఇదే ఆఖరు జన్మ.

1905-22 వరకు జరిగిన బుధ మహా దశలో బుధుని లగ్న దశమాదిపత్యం వల్ల, విమ్శాంసలోని నవమాదిపత్యం వల్ల నీచ భంగ రాజ యోగం వల్ల మహా మౌనం వీడి లోకానికి అవసరం అయినంత వరకు బోధించటం జరిగి గురువుగా లోక ప్రసిద్దుడైనాడు. 1922-29 వరకు జరిగిన కేతు మహా దశ లోకానికి కనిపించని ఆంతరిక మార్పులు, అత్యంత సూక్ష్మ అనుభవాలు, ఆత్మిక ఔన్నత్యం కలిగించింది.

1929-49 వరకు జరిగిన శుక్ర దశలో ప్రపంచ ఖ్యాతి, ఆశ్రమ నిర్మాణం, దేశ విదేశీయుల రాక పోకలు, ప్రముఖులు శిష్యులవటం, బోధన, రచనా వ్యాసంగం కలిగింది.దీనికి ప్రమాణం పంచమారూడం వృషభం కావటం, పన్చామ్శలొ శుక్రుడు స్వస్థానంలో సప్తమ కేంద్రంలో ఉండి లగ్నాన్ని సూటిగా చూడటం. విమ్శామ్శలో శుక్రుడు ద్వాదశ స్థాన గతుడై షష్ట గతులై ఉన్న రవి కుజుల దృష్టి పొందటం వల్ల ఆధ్యాత్మికంగా ఇతరుల కర్మలు స్వీకరించి ఘోర రోగాన్ని శరీరం మీదకు ఆహ్వానించటం జరిగింది. 14-4-1950 రవి/రాహు దశలో ఆయన శరీరాన్ని వదలి మహాసమాధి చెందారు. రవి రాహువులు ఆత్మ కారకుడైన చంద్ర లగ్నాత్ రాశి చక్రంలో సప్తమ మారక స్థానంలో ఉండుట చూడవచ్చు.

జాతకంలోని ముఖ్య సంఘటనలు:
1892 లో హఠాత్తుగా తండ్రి మరణం ఆయన 42 ఏట జరిగింది.అప్పుడు శని/కేతు దశ జరుగుతున్నది. ద్వాదశాంసలో లగ్నాత్ నవమ స్థానం అయిన మీనంలో కేతువు ఉండటం, దానికి మారక సప్తమ స్థానంలో శని రాహువులు ఉండటం చూడవచ్చు. రాహువు స్పర్శతో ఊహించని ఘటన జరిగింది.

జూలై 17, 1896 మరణానుభవం, శరీరం తాను కానన్న అనుభవం కలిగింది. అప్పుడు సరిగ్గా శని/రవి/శని దశలు జరుగుతున్నవి. తిరిగి రెండు గ్రహముల పాత్ర ఇక్కడ చూడవచ్చు. తరువాత అరుణాచలం చేరటం ఇతర సంఘటనలు లోక ప్రసిద్ధములు.

మహర్షి తల్లి గారు 19-5-1922 దేహ త్యాగం చేసారు. అప్పుడు మహర్షి జాతకంలో కేతు/కేతు/శని దశ జరుగుతున్నది. ద్వాదశాంశ చక్రములో లగ్నాత్ చతుర్థం నుండి కేతువు ఆరింట (రోగ స్థానం), శని మాత్రు స్తానాదిపతిగా పన్నెండింట ఉండుట చూడవచ్చు.

ఆయన ఏప్రియల్ 14 1950 8.47 PM కి దేహాన్ని వదలి పెట్టారు. అప్పుడు రవి/రాహు/రాహు దశ జరుగుతున్నది. చంద్రుని నుంచి రవి రాహువులు సప్తమ మారక స్థానంలో ఉండుట చూడవచ్చు.