“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

27, జూన్ 2009, శనివారం

కాళీ తత్త్వం-2

కాళి అనగా ఒక క్షుద్ర దేవత అని తప్పుడు భావన ప్రపంచంలో ఉంది. దీనికి చాలా వరకు మన కథలు, సినిమాలు నమ్మకాలు కారణం. పాశ్చాత్యుల తప్పుడు ప్రచారం కూడా ఒక కారణం. కాని అసలు నిజం అది కాదు.

కాళి
గురించి తెల్సుసుకోవాలంటే తాన్త్రికులను అడగాలి. ఎందుకంటే ఆమె తాన్త్రికులకు ఇష్ట దేవత. ఆమె గురించిన రహస్యములు అన్నీ తంత్ర గ్రంథములలో నిక్షిప్తములై ఉన్నాయి.

నవీన కాలములో కాళీ ఉపాసన ను పునరుజ్జీవింప చేసిన వారు శ్రీ రామకృష్ణ పరమహంస. ఆయన ఇచ్చిన వివరణలు వేద, వేదాంత, తంత్ర, పురాణములకు అనుగుణంగా ఉన్నాయి. సర్వ ఆమోదయోగ్యం గా ఉన్నాయి.

ఒకరోజు హజరా అనేవాడు కాళి తామసిక దేవత అని విమర్శిస్తాడు. అది విని శ్రీ రామకృష్ణుడు బాధ పడి కాళీ మాతనే అడుగుతాడు. అప్పుడు మాత ఆయనతో "వాడి మాటలు పట్టించుకోకు నాయనా. వాడొక మూర్ఖుడు. వాడికేమి తెలుసు? అని ఓదారుస్తూ తామసిక, రాజసిక, సాత్విక గుణములూ తానేనని, అలాగే గుణాతీత నిరాకార నిశ్చల పరబ్రహ్మమూ తానె అన్న అనుభవాన్ని దర్శనాన్ని ఆయనకు కలిగిస్తుంది.

శ్రీ రామకృష్ణ పరమహంస కాళీ మాతగురించి ఇలా చెప్పారు.

బ్రహ్మము నిశ్చలము. త్రిగుణాతీతము. శక్తి చలన శీలము మరియు త్రిగుణాత్మిక. బ్రహ్మము శక్తీ ఒకటే. ఒక కోణమున అదే బ్రహ్మము. ఇంకొక దృష్టిలో అదే శక్తి.

దీనికి
ఆయన మూడు ఉదాహరణలు ఇచ్చారు.
మొదటి ఉదాహరణ: నిశ్చల సముద్రము. కల్లోల మైన అలలతో ఘోషిస్తున్న సముద్రము. మొదటిది బ్రహ్మము. రెండవది శక్తి.
రెండవ ఉదాహరణ: అగ్ని మరియు దాని కాల్చే శక్తి. అగ్ని బ్రహ్మము. దాని కాల్చే స్వభావము శక్తి.
మూడవ ఉదాహరణ: చుట్టగా చుట్టుకొని పడుకొని ఉన్న సర్పము. మరియు చర చరా కదులుతున్న సర్పము. మొదటిది బ్రహ్మము. రెండవది శక్తి.

వేదములు దేనిని బ్రహ్మము అంటున్నవో, తంత్రము దేనిని పరమశివుడు అంటున్నదో, పురాణము దేనిని భగవంతుడు అంటున్నదో దానినే ఆయన కాళి అని పిలిచారు. త్రిగుణములను ఆధారముగా చేసుకొని లోకములను సృష్టి స్థితి లయములు చేస్తున్నది కనుక శక్తి అని పిలువబడుతున్నది. అదే శక్తి పనులు చేయకుండా గుణములకు అతీత స్థితిలో నిశ్చల స్థితిలో ఉన్నపుడు పరబ్రహ్మము అని అంటున్నాము.

ఇంకొక
విధముగా శక్తి మరియు శివుడు అని తంత్రము వీనినే పిలిచింది. అందుకనే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని స్తుతించటం జరిగింది. పార్వతీ పరమేశ్వరులు జగత్తుకు తల్లి తండ్రులు అన్న అద్భుత భావనకు ఇది వివరణ. నిజమునకు కాళి, శివుని కంటే వేరు కాదు. స్థితిలోనే భేదము. తత్వ భేదము లేదు.