“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

6, జూన్ 2009, శనివారం

తంత్ర విద్య

"తన్యతే విస్తార్యతే ఇతి తంత్రం" -- దేనివల్ల అయితే తెలియబడుతుందో దేనివల్ల అయితే వ్యాపిస్తుందో అది తంత్రము. ఈనిర్వచనము కొంత అర్థంకానిదిగా ఉంటుంది.

జ్ఞానము మానవఅనుభవానికి అతీతంగా ఉన్నప్పటికీ అందుబాటులోనే ఉంటుంది. దానిని అందుకొనడానికి ఒక ప్రక్రియ అవసరం. ఆప్రక్రియే తంత్రం అని పిలువబడుతుంది. ఏమీ చెయ్యకుండా ఊరకేఉండే జ్ఞానమార్గసాధన గాని, బుద్దుని విపస్సానధ్యానంగాని అవీ ఒకప్రక్రియలే. కనుక అవీ తంత్రమార్గము యొక్క పద్ధతులే అనిచెప్పవచ్చు.

సృష్టినియమాలను అర్థంచేసుకొని ఆయాపద్ధతుల ద్వారా ఆయా శక్తులను సాధించుట, ఆయా అలౌకిక అనుభవాలను, శక్తులను పొందటానికి తంత్రము ఉపయోగపడుతుంది. తాంత్రికజ్ఞానము ఒక బలీయమైన శక్తి. దానిని మంచికీ వాడవచ్చు, చెడుకూవాడవచ్చు. లేక ఆత్మజ్ఞానప్రాప్తికీ వాడవచ్చు. లేక దేవతాసాక్షాత్కారానికి, సిద్ధులసంపాదనకూ వాడవచ్చు. మనము ఉపయోగించుకునే విధానాన్నిబట్టి తిరిగికర్మను మనమే సృష్టి చేసుకుంటాము. కనుక దానినివాడిన తీరునుబట్టి మనం మళ్ళీ ఖర్మ అనుభవించవలసి వస్తుంది.


తంత్రము పరమశివప్రోక్తము. ప్రపంచానికి ఆదిగురువు పరమశివుడు. ఆయన శక్తికి ఉపదేశించినవే అరవై నాలుగుతంత్రములు. ఇవి అన్నీ పరమరహస్యములు. రహస్యంగా ఎందుకు ఉంచాలి?-- అలాఉంచి బ్రాహ్మణులు అంతా నాశనం చేసారు అని ఒక పిడివాదన ఉన్నది. 

మనచరిత్ర మనంమర్చిపోయి ఇంగ్లీషువాడు తన అసూయతో వ్రాసిన చెత్తచరిత్ర చదువుతూ అదేనిజమని నమ్ముతున్న స్థితిలో ఇటువంటి భావాలుకలగడం సహజమే. బ్రాహ్మణులు దేనినీ దాచిపెట్టలేదు. అర్హులైనవారికి అన్నీ ఉపదేశించారు. తమ కులంఏమిటో తెలియకపోయినా ఋషుల శిష్యులై వేదవేదాంగాలను నేర్చుకున్న సత్యకామజాబాలివంటివారు వేద సాహిత్యంలో ఎందఱో కనిపిస్తారు. మంచినడవడికా, మంచిప్రవర్తనా ఉన్నవారికి అన్నీ అందుబాటులోనే ఉంటాయి. నలందా విశ్వవిద్యాలయంలో ఎన్నిరకాలైన సబ్జెక్టులు బోధింపబడేవో ఎక్కడెక్కడినుంచి విద్యార్ధులు వచ్చి అక్కడ నేర్చుకునేవారో ఆలోచిస్తే బ్రాహ్మణులు దాచిపెట్టారు అన్న వాదన అసంబద్దం అనితేలిపోతుంది. ముస్లిముల దండయాత్రలవల్లా, వారి రాక్షసచర్యలవల్లే మన విలువైన సాహిత్యం అంతా నాశనమైంది. అంతేగాని బ్రాహ్మణులు దాచిపెట్టినందువల్ల కాదు. ఇంకాచెప్పాలంటే వేదాలను తమమస్తిష్కాలలో నిక్షిప్తం చేసుకొని తరతరాలుగా వాటిని అందిస్తూ కాపాడుతూ వస్తున్న అద్భుతప్రక్రియ వల్లే ఈనాటికీవేదాలు నిలబడిఉన్నాయి అంటే దానికి బ్రాహ్మణులే కారకులని ఘంటాపదంగా చెప్పవచ్చు.


అదీగాక అన్నింటినీ రోడ్డుమీద వ్యాపారానికి పెట్టలేము. తెలుసుకొని అందరూ చెయ్యగలిగేదికూడా ఏమీఉండదు.  అర్హులైనవారికి అన్నీ నేర్పించబడతాయి. ఇది ప్రక్రుతిధర్మం. ఆటంబాంబు ఎలా తయారుచెయ్యాలో థియరీపరంగా మనకు తెలుసు. కాని దానిని తయారు చెయ్యవలసి వస్తేమాత్రం, ముందుగా, యురేనియం ప్లుతోనియం వంటి ఆయా పదార్ధాలు సంపాదించాలి, వాటిని శుద్ధిచెయ్యాలి, ఆయాపరికరాలు ఉండాలి, ప్రక్రియావిధానం మెట్టుమెట్టుగా తెలియాలి, ప్రయోగవిధానం తెలియాలి, తీరా ప్రయోగంలో తేడావస్తే ఎలా దానిని నిగ్రహించాలో తెలియాలి. ఇన్ని మెలికలు అందులో ఉన్నాయి.

అలాగే తంత్రవిద్య ఊరకే పైపైన తెలిస్తే చాలదు. దానికి కొన్ని మూలికలు, ద్రవ్యములు, వస్తువులు, ఉపకరణాలు కావాలి. వాటిని ఉపయోగించే విధానం తెలియాలి. సమర్థుడైన గురువు దొరకాలి. సాధన చేయాలి. సాధనలో ఆటంకాలు ఏర్పడితే ఎలావాటిని అధిగమించాలో తెలియాలి. అన్నిటినీమించి సాధకునికి కొన్నిఅర్హతలు ఉండాలి. జీవితంలో కొన్నికొన్నింటిని తనంతట తాను వదులుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడే తంత్రసిద్ధి కలుగుతుంది.

అసలు ఇంత గొడవ ఎందుకు? ఎందుకొచ్చిన మంత్రతంత్రాలు? హాయిగా మనబతుకు మనం బతికితే పోలా? అనుకుంటే ఏ సమస్యా లేదు. అయితే, మన అవగాహనారాహిత్యంతో ఇటువంటి భావాలు కలుగుతాయి. సివిల్ సర్వీస్ సాధించటానికి ఎంత కష్టపడి చదువుతుంటారో మనకు తెలుసు. ఐఐటీ సీటు కోసం రాత్రింబగళ్ళు చదువుతారు. దేశంగానిదేశాలు, అమెరికా, ఆస్ట్రేలియా పోయి వాళ్లచేత తన్నులు తింటూ అవమానాలు భరిస్తూ ఎందుకు బతుకుతున్నారు ? ఇవన్నీ ఎందుకు? తిండి కోసమేగా? హాయిగా పల్లెటూళ్ళో చెట్టుకింద నులక మంచం వేసుకొని చద్దన్నం తింటూ చీకూచింతా లేకుండా కాలం గడపవచ్చుగా? తిండికోసం ఇన్నిదేశాలు తిరగడం ఎందుకు? ఇన్ని చదువులెందుకు? ఇన్ని బాధలెందుకు? ఇన్ని టెన్షన్ లెందుకు? మనం తినే ఒకముద్ద అన్నంకోసం ఇన్ని బాధలు పడాలా -- అంటే ఎలా ఉంటుంది? ఇదీ అంతే. మనిషికి ఏదో సాధించాలనే తపన అంతర్లీనంగా ఉంటుంది. కొందరు లౌకికప్రయోజనాలు ఆశిస్తారు. ఇంకొందరు పారలౌకిక ప్రయోజనాలు కోరతారు. తంత్రం రెండూ ఇవ్వ గలదు. ప్రక్రుతి శక్తులను తన చేతిలోకి తీసుకొని వాటితో పనులు సాధించటం తంత్రం లో ఒక భాగం.

తంత్రసాధనవల్ల ప్రపంచంలో సాధించలేనిది లేదు. తంత్రసిద్దుల వల్ల మానవుడు కోరుకునే సమస్తమూ ప్రకృతి నుంచి సాధించవచ్చు. మానవుని తీరనికోరికలు తంత్రసాధనవల్ల, దేవతానుగ్రహం వల్ల తీరుతాయి. కావాలి అనుకుంటే కోరికలకు అతీతమైన స్థితీ అందుకోవచ్చు. అకుంఠిత దీక్షా, సాధనా ఒక్కటే కావలసింది.

మనిషి ఎంతకష్టపడినా, పాకులాడినా దేవతాఅనుగ్రహం లేకుంటే ఏమీ సాధించలేడు. సివిల్ సర్వీస్ పరీక్షలోఇంటర్వ్యూ స్థాయి దాకా వెళ్లి నెగ్గినవాడికీ, నెగ్గని వాడికీ తెలివిలో పెద్దతేడా ఉండదు. కాని మొదటివాని జీవితం అనూహ్యంగా మారుతుంది. రెండవవాని  జీవితం మామూలుగా ఉంటుంది. ఏమిటీ తేడా? శక్తిఅనుగ్రహం లోనే తేడా ఉంటుంది. అదిఉంటే అన్నీ సాధ్యమే. అది లేకుంటే మానవుడు ఏదీ సాధించలేడు. శక్తి అనుగ్రహాన్ని పొందే విధానమే తంత్రం. 

శక్తిఅనుగ్రహం లేకపోతె శివుడుకూడా కదలలేడు అని శంకరులు తన "సౌందర్యలహరి" లో అంటారు. శక్తిసహాయం తోనే శివుడు సృష్టి చెయ్యగలుగుతున్నాడు. శక్తిఅనుగ్రహాన్ని పొందిన సిద్ధుడు సృష్టినియమాలను  మార్చగలడు. శక్తి అనుగ్రహసాధనే తంత్రం.