“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

17, ఆగస్టు 2023, గురువారం

పరమహంస యోగానంద గారి జాతకం - Part 6 (Nirad Ranjan Chowdhury)

అమెరికాలోని యోగదా సంస్థ (Self Realization Fellowship) ను నిలబెట్టడంలో ముఖ్యపాత్రను పోషించిన వారిలో శ్రీ నిరోద్ ముఖ్యుడు. ధీరానంద 1929 లో ఈ సంస్థనుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత నిరోద్ ను సంస్థల్లోకి వచ్చి పనిచెయ్యమని ఆహ్వానించాడు యోగానంద. ఏమంటే, యోగ-వేదాంత సంప్రదాయం పైన మంచి పట్టు ఉండి, చక్కగా మాట్లాడి ప్రచారం చెయ్యగలిగే కార్యకర్తలు అప్పటికాయనకు ఎంతో అవసరంగా ఉంది. ఒక్కడే ఎంతని ప్రచారం చెయ్యగలడు అమెరికాలో?

ఇకపోతే, ఈ నిరోధ్ కథ ఏంటో చూద్దాం. ఈ పేరును వింటే నేటి తరానికి నవ్వొస్తుంది. ఇలాంటి పేర్లు కూడా పెట్టుకుంటారా అని. కానీ బెంగాలీలలో ఈ పేరు చాలా సామాన్యంగా ఉంటుంది. అరబిందో శిష్యులలో కూడా నిరోద్ బారన్ అనే ఆయన ఉన్నాడు.

కలకత్తా దగ్గర పఱైకోరాలో, 1887 లో నిరోధ్ జన్మించాడు. ఆ సంవత్సరంలో శని వక్ర స్థితిలో ఉంటూ మిధున, కర్కాటక రాశులలో సంచరించాడు. గురువు తులారాశిలో ఉన్నాడు. ప్రశ్న చార్ట్ సహాయంతో జననకాలసంస్కరణ విధానాన్ని ఉపయోగించి చూడగా, శని కర్కాటకంలో వక్రించి ఉన్నాడని, గురువు రుజుగమనంలో తులలో ఉన్నాడని తెలుస్తోంది. రాహుకేతువులు కర్కాటక మకర రాశులలో ఉన్నారు. కనుక నవంబర్ నెలలో ఈయన పుట్టాడని ఊహిస్తున్నాను. జాతకంలో ఉన్న శపితయోగం కర్కాటక రాశిలో ఉంది. శని వక్ర స్థితి వల్ల మిధునం లోకి పోతూ, శాపం నుండి బయటపడి (యోగానందతో విడిపోయి) అమెరికాలో జీవితం సాగిస్తాడని ఖచ్చితంగా సూచిస్తున్నాడు. తులలోని గురువు, న్యాయం కోసం పోరాడతాడని సూచిస్తున్నాడు. ఈ జాతకచక్రాన్ని ప్రక్కన ఇచ్చాను చూడండి. దానిలో శని గురువులు, రాహుకేతువులు తప్ప మిగతా గ్రహాల స్థానాలను, లగ్నాన్ని లెక్కించకండి. ఇది స్థూలంగా చేసిన జననకాల సంస్కరణ మాత్రమే. రోజు, గంట, నిముషం వరకూ చేసినది కాదు. ఎలా చేశాను? అనిమాత్రం అడక్కండి. నా జవాబు మామూలే. చెప్పను.

ధీరానంద లాగా ఈయనకూడా బ్రాహ్మణ కుటుంబంలోనివాడే. ఈయన అసలు పేరు నిరాద్ రంజన్ చౌధురీ. బెంగాలీ బ్రాహ్మణులకు చౌధురీ అనే పేరుంటుంది, సౌత్ లో శర్మ, శాస్త్రి ఉన్నట్లు. అమెరికా వెళ్ళాక సులభంగా ఉండటం కోసం ఈ పేరును నిరోద్ గా యోగానంద మార్చాడు.

నేటి ఇండియా పార్లమెంట్ లో కాంగ్రెస్ నాయకుడైన అధీర్ రంజన్ చౌధురీ కి ఈయనకు ఏదైనా బంధుత్వం ఉందొ లేదో మనకు తెలియదు. కానీ పేర్లు ఒక్కలాగే ఉన్నాయి. 

వీరి వంశంలోని తాతముత్తాతలు అందరూ యోగులే.  వీరిది యోగకుటుంబం. వీరి యోగసంప్రదాయం క్రియాయోగా కంటే భిన్నమైనది. కాకపోతే ప్రాణాయామం, కుండలినీ శక్తి, షట్చక్రాలు మొదలైన సాధనలు దాదాపుగా అన్ని దారులలోనూ ఒకేవిధంగా కలుస్తూ ఉంటాయి. వీరికొక ఆశ్రమం ఉండేది. దానిపేరు సాధనా కుటీర్ ఆశ్రమం. చిన్నతనంలోనే తన తాత గోవిందచంద్ర రాయ్, మేనమామ ప్రసన్నకుమార్ రాయ్ ల దగ్గర యోగాభ్యాసాన్ని నేర్చుకుని అభ్యాసం చేసేవాడు.

అప్పటిలోనే ఈయన కలకత్తా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్. ఇంగిలీషు చదువుతూనే సంస్కృతం కూడా అభ్యసించాడు. జీన్స్ లో ఉన్న ఆధ్యాత్మిక భావాలతో వైరాగ్య పూరితుడై, ఇల్లు వదలి సంచారయోగిగా దేశమంతా సంచరిస్తూ, బర్మా, దక్షిణ చైనా దేశాలలో కూడా సంచరించాడు. ఆ క్రమంలో ఎందరో యోగులను కలసి వారివద్ద యోగరహస్యాలను నేర్చుకున్నాడు. 1919 లలో అమెరికాకు వచ్చి హార్వర్డ్ యూనివర్సిటీ, బర్కీలీ యూనివర్సిటీలలో చదివాడు. అంటే యోగానంద కంటే ముందే ఈయన అమెరికా వెళ్ళాడు.

అమెరికాలో ఉన్నప్పుడే బోస్టన్ లో యోగానంద ఉపన్యాసాలు వినడానికి వెళ్ళాడు. ఆ విధంగా ఒకసారి బోస్టన్ లోను, మరొకసారి సాన్ ఫ్రాన్సిస్కో లోను యోగానంద గారిని కలిశాడు. కానీ ఇండియాలో ఉన్న ఈయన బంధువులకు యోగానంద అంటే మంచి అభిప్రాయం లేదు. యోగమార్గంలో ఆయన అంత గొప్ప ప్రజ్ఞావంతుడు కాదని వారు భావించారు. కనుక యోగానందతో చేరవద్దని నిరాద్ ను వారించారు. కానీ నిరాద్ వినలేదు.

యోగానందకూడా నిరాద్ లోని పాండిత్యాన్ని, అతని యోగసాధనను చూచి, తనకు ఉపయోగిస్తాడని భావించి, తన సంస్థలోకి ఆహ్వానించాడు. ఇతనికి 'బ్రహ్మచారి నిరోద్' అని నామకరణం చేసి 1928 లో డెట్రాయిట్ యోగదా సెంటర్ కు ఇతన్ని ఇంచార్జ్ గా ఉంచాడు యోగానంద. సమర్ధవంతంగా దాన్ని నడుపుతూ తన సొంత రచనలను ప్రచురించాడు నిరోద్. ఆలివర్ బ్లాక్, ఫ్లోరినా డార్లింగ్ ( సిస్టర్ దుర్గామాత ) మొదలైన ప్రముఖులకు మొదట్లో నిరోధే క్రియాయోగాన్ని నేర్పించినవాడు.

ఆ విధంగా నిరాద్ 1928 లో డెట్రాయిట్ యోగా సెంటర్ ను మొదలుపెట్టాడు. అప్పట్లోనే ఈయన Wings of Bliss అనే పద్యాలతో కూడిన పుస్తకాన్ని వ్రాశాడు. ఆ తరువాత అమెరికా అంతా పర్యటిస్తూ, క్రియాయోగాన్ని బోధిస్తూ, అనేకమంది అమెరికన్స్ ను సాధకులుగా గురువులుగా తీర్చిదిద్దాడు. యోగదా సంస్థకు ఎనలేని సేవ చేశాడు.

యోగానందకు తన శిష్యురాళ్ళతో ఉన్న అతి చనువు, అప్పటికే యోగదా సంస్థలో రెండవ స్థానంలో ఉన్న ధీరానందకు నచ్చలేదు. పైగా సంస్థ డబ్బు విషయంలో వీరిద్దరికీ గొడవలొచ్చాయి. ఫలితంగా, ధీరానంద యోగదా సంస్థనుండి నిష్క్రమించాడు. ధీరానంద నిష్క్రమణతో, మౌంట్ వాషింగ్టన్ లో ఉన్న ముఖ్య కార్యాలయంలోని డైరెక్టర్ పోస్టు ఖాళీ అయింది. దానిలో చేరి పనిచెయ్యమని నిరోద్ ను ఆహ్వానించాడు యోగానంద. ఆ పదవిలో చేరి 1932 వరకూ చాలా చురుకుగా పనిచేశాడు నిరోద్. దాదాపు పదివేల మంది అమెరికన్స్ కు క్రియాయోగ దీక్షనిచ్చాడు.

ఒక హౌస్ కార్ ను నిరాద్ కు ఇచ్చి దానిలో అమెరికా అంతా తిరుగుతూ ప్రచారం చెయ్యమని పురమాయించాడు యోగానంద. అప్పటికే నిరాద్ కు పెళ్లయింది. యాగ్నేస్ స్పెన్సర్ అనే ఒక అమెరికన్ వనితతో ఆ పెళ్లిని తనే జరిపించాడు యోగానంద. ఆ కారులో తన భార్యతోను, కుమారుడు అనిల్ తోను అమెరికా అంతా తిరిగి క్రియాయోగ ప్రచారం చేశాడు నిరోద్. మిన్నెసోటా నుండి ఫ్లోరిడా వరకు,  టెక్సాస్ నుండి న్యూయార్క్ వరకు ఈ విధంగా ప్రయాణిస్తూ, ఎంతో మందిని యోగమార్గం వైపు ప్రభావితం చేశారు నిరోధ్ కుటుంబం.

ఆ సమయంలో SRF లో చాలామంది వైస్ ప్రెసిడెంట్లు ఉండేవారు. వారిలో నిరోద్ కూడా ఒకడు. పండిట్ జీ అని ఇంకొకాయన ఉండేవాడు. హమీద్ బే అని ఇంకొకాయన ఉండేవాడు. ఈయన కాప్టిక్ మార్మిక సాధకుడు. అప్పట్లో ఈ విధంగా అనేకమందిని తన సంస్థలో ప్రచారకులుగా ఉంచుకుని సంస్థ ప్రచారాలను అమెరికన్స్ లోకి తీసుకెళ్లాడు యోగానంద. తరువాత కాలంలో హమీద్ బె, యోగదా సంస్థను వదిలేసి Coptic Fellowship of America ను స్థాపించుకున్నాడు. ఆ సంస్థ ఇప్పటికీ కొనసాగుతోంది.

హమీద్ బే గురించి తెలియాలంటే ఇక్కడ చూడండి.

పండిట్ జీ కి యోగానంద మీద చాలా అనుమానాలుండేవి. విసుగుతో ఆయన కూడా ఆ సంస్థను వదలి వెళ్ళిపోయాడు. చివరకు యోగానంద, నిరోద్ ఇద్దరే మిగిలారు. అప్పట్లో తామంతా సంస్థలో సమాన భాగస్వాములమని యోగానంద వారికి చెప్పేవాడు. అందుకనే తన సంస్థకు Self Realization Fellowship అని పేరు పెట్టాడు. అలా వద్దని 'యోగదా సత్సంగ సభ' అనే పేరును దానికి పెట్టమని యుక్తేశ్వర్ గారు అన్నారు. కానీ యోగానంద వినలేదు. ఫెలోషిప్ అంటే, సమానస్థాయి సభ్యులున్న సంస్థ అని అర్ధం. రకరకాల సంప్రదాయాలున్న సభ్యులు ఒకే సంస్థలో ఉంటూ సెల్ఫ్ రియలైజేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నామని ఆ పేరుకు అర్ధం వస్తుంది. అది నిజమని వీళ్ళందరూ కూడా అనుకున్నారు. 

వీరందరూ కలసి యోగానంద స్థాపించిన East West అనే పత్రికలో వ్యాసాలు పద్యాలు కవితలు వ్రాస్తూ ఉండేవారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు స్నేహితులుగా ఉన్నారు. వీళ్ళు ఎన్నడూ యోగానందను గురువుగా భావించలేదు. వీళ్ళలో రోమన్ ఎస్టోజా అని ఒక విదేశీయుడు కూడా ఉండేవాడు. వీరందరూ తమ తమ భావాలను ప్రచారం చేస్తూ,  తమతమ మీటింగులలో యోగానంద గారి సాహిత్యం కూడా అమ్మిపెట్టేవారు. వాటిలో ఎక్కువ శాతం ధీరానంద వ్రాసినవే.

1940 సంవత్సర సమయానికి, ఇంతకుముందు ధీరానంద ఎలా అయితే SRF అంటే విరక్తి చెందాడో, అదే విధంగా నిరోద్ కూడా విరక్తి చెందాడు. 1940 లో యోగానందతో విడిపోయిన నిరాద్, అమెరికా అంతటా పర్యటిస్తూ తనదైన యోగమార్గాన్ని ప్రచారం చేస్తూ గడిపాడు. 1950 వరకూ ఇలా జరిగింది. చివరకు చికాగోలో స్థిరపడి 1983 లో తను చనిపోయేవరకూ యోగా గురువుగానే ఉన్నాడు నిరోద్. ఈయన భార్య కూడా ఈయన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ 1995 వరకూ యోగాను నేర్పించేది. చికాగో ప్రాంతాలలో ఈయనకు చాలామంది శిష్యులు ఈనాటికీ ఉన్నారు. వారందరూ నేటికీ అమెరికాలో యోగా గురువులుగా ఉన్నారు. ఈయనను ఒక మహాయోగిగా వారు భావిస్తారు.

యోగానందతో కలసి జీవించిన శిష్యురాళ్ళలో ఇద్దరు, దుర్గామాత (Fiona Darling), జ్ఞానమాత (Edith Bissett) లు నిరోద్ గురించి ఎంతో గొప్పగా చెప్పేవారు. దుర్గామాతను యోగానంద దగ్గరకు చేర్చినది నిరోధే. అందుకని జీవితాంతం నిరోధ్ అంటే ఎంతో అభిమానాన్ని చూపించేది దుర్గామాత.

1925-26 ప్రాంతంలో East West పత్రిలలో వ్రాస్తూ, నిరోధ్ కు తాను దీక్షనిచ్చానని బ్రహ్మచారి నిరోద్ అని పేరుపెట్టానని యోగానంద వ్రాశాడు. దీనికి నిరోధ్ అభ్యంతరం చెబుతూ, తనకు వేరే గురువులున్నారని, దయచేసి ఈ 'బ్రహ్మచారి' టైటిల్ ను తన పేరునుండి తొలగించమని, బ్రహ్మచారిగా ఉండాలని సన్యాసం తీసుకోవాలని తనకేమీ కోరిక లేదని యోగానందను కోరాడు. అందరికీ గురుత్వం వహించాలన్న దుగ్ద యోగానందలో చాలా ఎక్కువగా ఉండేదని దీనినిబట్టి అర్ధమౌతుంది.

విచిత్రం ఏంటంటే, 1939 లో నిరోద్ ను SRF నుండి తొలగిస్తూ యోగానంద చేసిన అభియోగాలతో ఒకటి - అప్పటి చట్టాల ప్రకారం ఒక హిందువు ఒక అమెరికన్ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు - కాబట్టి సంస్థ నియమాలను, దేశ చట్టాన్ని నిరోద్ ఉల్లంఘించాడని అన్నాడు. కానీ, ఆ పెళ్లిని 1931 లో, మౌంట్ వాషింగ్టన్ మెయిన్ సంస్థ లాన్స్ పైన, దగ్గరుండి మరీ చేయించింది యోగానందే. ఆ పెళ్లిని సినిమా కూడా తీసి, అప్పట్లో అమెరికా సినిమా హాళ్లలో చాలా గొప్పగా ప్రదర్శించారు. ఆ ఏర్పాటు కూడా యోగానందే చేశాడు. అదొక బిజినెస్ ను పెంచుకునే ట్రిక్. కానీ నిరోద్ ను సంస్థనుండి తొలగించే సమయంలో అదే పెద్ద నేరంగా చూపించాడు యోగానంద. ఇది యోగానంద చేసిన ఘోరమైన తప్పులలో ఒకటి.

ఫ్లోరిడాలో ఒక యోగదా టెంపుల్ ను కట్టడానికి నిరోద్ కు ఇవ్వమని పదివేల డాలర్లను యోగానందకు పంపించాడు జేమ్స్ జె లిన్. కానీ ఆ డబ్బును నిరోద్ కు ఇవ్వకుండా తానే ఉంచుకున్నాడు యోగానంద. నిరోద్ ను ఫ్లోరిడా నుండి వెనక్కు వచ్చేసి మౌంట్ వాషింగ్టన్ లోనే ఉండమని ఆజ్ఞాపించాడు. బహుశా తనకంటే నిరోద్ ఎదిగిపోతున్నాడని యోగానంద భయపడి ఉంటాడు. బయటకు రాని ఇలాంటి సంఘటనలు SRF లో చాలా జరిగాయి. చివరకు నిరోద్ సంస్థనుండి బయటకు పంపబడ్డాడు.

యోగానంద నుండి విడిపోయిన తర్వాత కూడా నిరోధ్ యోగమార్గంలో నడవడం ఆపలేదు.  ఏమంటే యోగానంద పరిచయం కాకముందే ఆయన ఒక యోగిగా ఉండేవాడు. వాళ్ళ కుటుంబ గురుసంప్రదాయం వారికుంది. దానినాయన అనుసరించేవాడు. వేలాదిమంది అమెరికన్స్ కు యోగదీక్షనిస్తూ ఆ తర్వాత దాదాపు 40 ఏళ్ళు ఆయన అమెరికాలోనే ఉండిపోయాడు. యోగానందకు చాలా దగ్గర వ్యక్తి అయిన సిస్టర్ జ్ఞానమాత చివరివరకూ నిరోధ్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగిస్తూనే ఉంది. ఆయనను అభిమానిస్తూనే ఉంది.

అప్పట్లోనే యోగదా లెసన్స్ ను ప్రిసెప్టా లెసన్స్ అనే పేరుతో యోగానంద మొదలుపెట్టాడు. ఇది ఒక కరెస్పాండెన్స్ కోర్స్. ఈ లెసన్స్ ఈనాటికీ YSS లో ఉన్నాయి. 1982 లో నా స్నేహితులు కొంతమంది ఈ లెసన్స్ తెప్పించుకుని క్రియాయోగాను అభ్యాసం చేసేవారు. నన్ను కూడా ఆ కోర్సు తీసుకోమని వారు కోరారు. కానీ అప్పటికే నాదైన యోగమార్గం నాకు ఉండటంతో నేనా ప్రతిపాదనను తిరస్కరించాను, ఆ కథను మరో పోస్ట్ లో వ్రాస్తాను.

క్రియాయోగాను కరెస్పాండెన్స్ కోర్సులో అమ్మడం యుక్తేశ్వర్ గిరిగారికి నచ్చేది కాదు. కానీ యోగానంద తన ధోరణిలో తను వెళ్ళేవాడు. ఒకటి మనసులో పెట్టుకున్న తర్వాత ఎవరిమాటా వినని తత్త్వం యోగానందలో ఉండేది. పైగా, తనకు దైవాదేశం ఉన్నదని, తను ఏది చేసినా అది రైటే అని ఆయన భావించేవాడు. యోగానంద ఇండియా వచ్చినపుడు కూడా నిరోద్ అమెరికా అంతా తిరుగుతూ యోగప్రచారంలోనే ఉన్నాడు. 1936 లో యోగానంద ఇండియానుండి అమెరికాకు తిరిగి వెళ్ళాడు. అప్పడు 1937 లో కాలిఫోర్నియాలో ఏర్పాటు చేసిన యోగానంద అభినందన సభలో మాట్లాడటానికి మాత్రమే నిరోడ్ తన ప్రచారాన్ని ఆపి కాలిఫోర్నియాకు వచ్చాడు. అంత నమ్మకంగా ఈయన యోగదా సంస్థకు పనిచేశాడు.

1937 East West Magazine మార్చి సంచికలో ఈ విధంగా వ్రాయబడింది, ' గత కొన్నేళ్లుగా శ్రీ నిరోధ్ ఒక్కడే, తన నిరంతర కృషిలో దాదాపు పదివేలమంది అమెరికన్స్ ను క్రియాయోగా వైపు ఆకర్షించి, వారికి దీక్షలిచ్చాడు. ఇది ఎంతో ప్రశంశాపాత్రమైన పని' అంటూ యోగానందకు స్టెనోగా పనిచేసిన రిచర్డ్ రైట్ వ్రాశాడు.

ఒకరకంగా చెప్పాలంటే, తొలిదినాలలో అమెరికాలో SRF సంస్థను నిలబెట్టినవాళ్లలో నిరోధ్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు. కానీ ఈరోజున SRF గాని, యోగానంద మూఢభక్తులు గాని నిరోధ్ పేరే అనుకోడం లేదు. ధీరానందను కూడా అందరూ మర్చిపోయారు. నేటి మోడ్రన్ క్రియాయోగా అనుయాయులకు ఈ కథలన్నీ తెలియవు. అదంతా 'ఆటో బయోగ్రఫీ ఆప్ ఏ యోగి' పుస్తకం ప్రభావం. అందులో అన్నీ కాకమ్మకధలు తప్ప, వాస్తవికమైన ఇలాంటి విషయాలేమీ కనిపించవు. అదంతా ఒక ఏకపక్ష బుర్రకథ.

1935 లో అమెరికా నుండి యోగానంద ఇండియాకు వెళ్ళిపోయినపుడు కనీసం నిరోధ్ కు చెప్పనుకూడా చెప్పలేదు. యోగానంద ఇండియా వెళ్లిపోయాడని, మౌంట్ వాషింగ్టన్ ఆశ్రమ ఇంచార్జ్ అయిన సిస్టర్ జ్ఞానమాత చెబితేనే నిరోధ్ కు తెలిసింది. యోగానందలో ఈ లక్షణం చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. తనకు ఏది అనిపిస్తే అది చెయ్యడమే గాని, తన నమ్మకస్తులతో కూడా దాని గురించి చెప్పాలన్న ఊహ ఆయనలో ఉండేది కాదు. 

అంతెందుకు? 1920 లో ఇండియా నుండి అమెరికా వచ్చినపుడు కూడా, తనకేదో దర్శనం కలిగిందని చెబుతూ హడావుడిగా ఓడ టికెట్లు కొనుక్కుని బయల్దేరాడు గాని, తన గురువైన యుక్తేశ్వర్ గిరిగారికి ఒక్కమాట చెప్పాలని కూడా యోగానందకు తోచలేదు. యోగానంద ఫలానా రోజున బయలు దేరుతున్నాడన్న విషయం ఎవరి ద్వారానో తెలుసుకున్న యుక్తేశ్వర్ గారు కలకత్తాకు వచ్చి, ఓడలోకి వెళ్ళడానికి స్పెషల్ పర్మిషన్ సంపాదించుకుని, ఓడనెక్కి యోగానందకు సెండాఫ్ ఇచ్చాడు. అప్పుడు మాత్రం యోగానంద చాలా అవమానం ఫీలయ్యాడు. యోగానందలోని ఈ పోకడ చాలా విచిత్రంగా కనిపిస్తుంది.

స్వామి యోగానంద గిరిగా ఇండియాకు వెళ్లిన యోగానంద, పరమహంస యోగానంద అనే పేరును పెట్టుకుని అమెరికాకు తిరిగి వచ్చాడు. ఈ పేరును యుక్తేశ్వర్ గిరిగారు తనకు ప్రసాదించారని యోగానంద చెప్పుకున్నాడు. కానీ అలా చేసినట్లు ఎక్కడా రుజువులు లేవు. ఈ విషయాన్ని యోగానంద సమకాలీకుడైన శైలేంద్ర బిజయ్ దాస్ గుప్తా గారు తన పుస్తకంలో వ్రాశారు.

ధీరానందతో కోర్టు కేసు నడుస్తున్న సమయంలో, యోగానందకు 'స్వామి' అని పేరు పెట్టుకునే అర్హత లేదని ధీరానంద వైపు లాయర్ వాదించాడు. ఆయనకు సన్యాసదీక్షా మంత్రాలు రావని, వస్తే చెప్పమని కోర్టులో ఛాలెంజ్ చేశాడు. యోగానంద గారు చెప్పలేకపోయాడు. బహుశా మర్చిపోయి ఉండవచ్చు. నీ 'స్వామి' టైటిల్ డ్రాప్ చెయ్యమని జడ్జి యోగానంద గారికి సూచించాడు. అందుకని, ఇండియా నుండి తిరిగి వచ్చేటప్పుడు 'పరమహంస' అనే టైటిల్ తో తిరిగి వచ్చాడు యోగానంద. ఈ టైటిల్ ఎలా వచ్చింది అన్న విషయం పైన ఒక కధ ఉంది.

ఇండియా వచ్చిన సమయంలో ఒకనాడు సేరంపూర్ ఆశ్రమంలో ఉన్నపుడు, రోడ్డు పక్కన సైడుకాలవలో ఒంటేలు పోస్తున్నాడు యోగానంద. ఆ రోజులలో ఇది మామూలే. చాలామంది ఇలా చేసేవారు. మొన్నమొన్నటిదాకా కూడా పల్లెల్లో చాలామంది ఇలాగే చేసేవారు. యుక్తేశ్వర్ గిరిగారు తన ఇంటి బాల్కనీ నుండి దీనిని చూశారు. ఆయనకు ఇలాటి చేష్టలు నచ్చేవి కావు. అందుకని, ఎగతాళిగా, 'అబ్బో, యోగానంద పరమహంస అయిపోయాడే' అని చమత్కారంగా అన్నారట. పరమహంస అంటే, విధినియమాలకు, సమాజపు కట్టుబాట్లకు అతీతుడైనవాడని అర్ధం. ఆ కామెంట్ ను యోగానంద కూడా విన్నాడు. అక్కడే ఉన్న ఆనందమోహన్ లాహిరీ (లాహిరీ మహాశయుల మనుమడు), దాస్ గుప్తా లతో యోగానంద, 'చూశారా, గురువుగారు నన్ను పరమహంస అన్నారు' అన్నాడట. ఇక అదే నిజమని అనుకున్న యోగానంద, ఆ టైటిల్ ను వాడటం మొదలుపెట్టాడు. యోగానంద పరమహంసగా మారడం అలా జరిగింది. ఈ విషయం కూడా దాస్ గుప్తా గారు వ్రాసిన 'పరమహంస యోగానంద జీవితం' అనే పుస్తకంలో ఉంది. దాస్ గుప్తా గారు యుక్తేశ్వర్ గిరిగారి ప్రియశిష్యుడు. యోగానంద అంటే ఎంతో గౌరవం ఉన్నవాడు. దాదాపు యోగానంద స్నేహితుడే. కనుక ఆయన అబద్దాలు వ్రాయవలసి అవసరం లేదు.

యోగానంద ఇండియా నుండి అమెరికాకు తిరిగి వచ్చాక నిరోధ్ కు ఆయనకు మెల్లిగా గొడవలు మొదలయ్యాయి. 1939 లో నిరోధ్ జీతాన్ని సగం తగ్గించాడు యోగానంద. అప్పట్లో యోగదా సంస్థ మేనేజిమెంట్ అందరికీ నెలకింత అని ఖర్చులకోసం  జీతంగా ఇవ్వబడేది. అదే విధంగా నిరోధ్ కూ ఉండేది. దానిని సగానికి కోత పెట్టాడు యోగానంద. కారణం తెలియదు. తన చుట్టూ ఉన్న సిస్టర్స్ చెప్పుడు మాటలు వినడం వల్ల అయి ఉండవచ్చు. ఆ తర్వాత కొన్ని నెలలకు నిరోధ్ ను సంస్థనుండి తొలగిస్తూ యోగానంద నిర్ణయం తీసుకున్నాడు.

వెంటనే నిరోధ్, యోగానంద కు ఒక ఉత్తరం వ్రాస్తూ, SRF అనేది ఒక felloship కనుక అందులో తామంతా పార్ట్ నర్స్ అని, కనుక తనను తీసివేస్తే, తన వాటాను తనకు చెల్లించమని అడిగాడు. అలాంటి వాటాలేమీ లేవని యోగానంద బదులిచ్చాడు. అప్పుడు, 23-10-1939 న యోగానందపైన కేసు వేశాడు నిరోధ్. ఈ ఆధ్యాత్మిక సంస్థ కొచ్చే లాభాలలో అందరికీ వాటా ఉందని యోగానంద 1934 లో తనతో ఒక అగ్రిమెంట్ చేశాడని నిరోధ్ వాదించాడు. 1925 ప్రాంతాలలో కెప్టెన్ రషీద్ కూడా ఇలాగే వాదించాడు. ఆ కేసు వెంటనే తేలిపోయింది. కెప్టెన్ రషీద్ చేసిన ఆరోపణలు వేరు. అవి కేవలం డబ్బు గురించినవి మాత్రమే. కానీ నిరోధ్ చేసిన అభియోగాలు ఇంకా చాలా ఉన్నాయి.

సంస్థ పెరిగేకొద్దీ, తానే దేవుడినన్న భ్రమలలోకి యోగానంద వెళ్లిపోయాడని నిరోధ్ వాదించాడు. అంతేగాక, మౌంట్ వాషింగ్టన్ మెయిన్ సెంటర్లో, తానుండే మూడవ అంతస్తులోని తన ప్రక్క రూములలో యువతులైన శిష్యురాళ్ళను ఉంచుకుని, రెండవ అంతస్తు, మొదటి అంతస్తులోని రూములను వయసుమళ్ళిన శిష్యురాళ్ళకు ఇతర శిష్యులకు ఇస్తాడని, రాత్రంతా ఆ అమ్మాయిలు ఆయన గదిలోకి వస్తూ పోతూ ఉంటారని,వారిని ఎవరితోనూ కలవనివ్వడని, బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తనతోనే వారిని ఉంచుకుంటాడని, ఇదంతా తనకు నచ్చలేదని, ఇదంతా హిందూ సాంప్రదాయానికి యోగసంప్రదాయానికి విరుద్ధమైన పోకడలని నిరోధ్ వాదించాడు. 

వారి ధ్యానపు గదులన్నీ చాలా డెకరేషన్ తో రిచ్ గా ఉంటాయని, ఇది యోగ సంప్రదాయానికి విరుద్ధమని, సాధనాకుటీరాలు అంత రిచ్ గా ఎందుకుండాలని ఆయన వాదించాడు. అంతేగాక, యోగానంద తన శిష్యురాళ్ళకు  పారదర్శకమైన గౌనులు తొడిగి, ఆ తరువాత వారిని నగ్నంగా చేసి ఒక గాజుతొట్టిలో స్నానం చేయిస్తాడని, ఆ తరువాత ఏవేవో రహస్యమైన తాంత్రిక దీక్షలుంటాయని ఇదంతా కూడా తనకు నచ్చలేదని ఆయన వాదించాడు.

ఇదంతా పిచ్చివాగుడని, డబ్బుకోసం ఇలా నిరోధ్ ఆరోపిస్తున్నాడని, అబద్దపు ఆరోపణలు చేస్తున్నాడని యోగానందవైపు లాయర్ వాదించాడు. కానీ చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు ఇదంతా తాను చూచానని, తన తండ్రి చెప్పినవి నిజాలేనని, పెద్దయిన తర్వాత, నిరోధ్ కుమారుడైన అనిల్ నిరోధ్ వ్రాశాడు.  అనిల్ నిరోధ్ పెద్దవాడైన తర్వాత కార్నెల్ యూనివర్సిటీలో గణిత శాస్త్ర ప్రొఫెసర్ గా రిటైరయ్యాడు. అలా ఆరోపించడానికి ఈ అనిల్ నిరోధ్ అనే ఆయన పిచ్చివాడేమీ కాదు. ఇతనొక బాలమేధావి. అయిదేళ్ల వయసులో ఇతను అమెరికాలోని 12th గ్రేడ్ పాసయ్యాడు. 16 ఏళ్ల వయసుకే యూనివర్సిటీ ఆఫ్ చికాగో గ్రాడ్యుయేట్ అయ్యాడు. నిరోధ్ కుమారుడు గనుక అలాంటి మేధస్సు అనిల్ లో ఉండటం ఆశ్చర్యం లేదు.

అనిల్ నిరోధ్ ఒక డిస్కషన్ ఫోరమ్ లో చెప్పిన ఈ విషయాలన్నీ SRF కు మహాకోపం తెప్పించాయి. ఆ డిస్కషన్ ఫోరమ్ తర్వాత మూతపడింది. 'మనకెందుకులే ఈ గోల, యోగానంద బ్యాచ్ ను వాళ్ళిష్టం వచ్చినట్లు అబద్దాలు చెప్పుకొని చావనీ' అని అనిల్ అనుకోని ఉండవచ్చు.

యోగదా సంస్థ సభ్యులు పెళ్లి చేసుకోకూడదని, ఏమంటే వారి జీవితంలో దేవుడే ముఖ్యమైన గమ్యం కావాలి గాని, పెళ్లి పిల్లలు గమ్యాలు కాకూడదని, దేవుడి తర్వాత తనకే (యోగానందకే) అంత ప్రాముఖ్యతనివ్వాలి గాని ఇక ఏ విషయాన్నీ పట్టించుకోకూడదని యోగానంద చెప్పేవాడని నిరోధ్ ఆరోపించాడు. భర్తకంటే భార్యకంటే తననే ఎక్కువగా చూడాలని యోగానంద కోరేవాడని కూడా ఆయనన్నాడు. ఈ పోకడ నేటి బ్రహ్మ కుమారి, ఈషా యోగా వంటి అనేక కల్ట్ పోకడలను ప్రతిబింబిస్తోంది.

హిందూ యోగ సంప్రదాయాన్ని తన స్వార్ధపు ప్రయోజనాల కోసం యోగానంద వాడుకుంటున్నాడని, తనను తాను ఒక అవతారంగా ప్రోమోట్ చేసుకోడానికి హిందూయోగాన్ని వాడుతున్నాడని నిరోధ్ ఆరోపించాడు. భగవంతుడు తన ద్వారా మాత్రమే మాట్లాడతాడని, ఆయన్ను తన ద్వారా మాత్రమే, క్రియాయోగం ద్వారా మాత్రమే అందుకోగలుతారని ఆయన భావించేవాడని, అది నిజం కాదని నిరోధ్ అన్నాడు.

అంతేగాక, తనుగాక ఇంకా ఎందరో యోగదా సంస్థకు పనిచేస్తే, ఆ ఫలితమంతా యోగానంద ఒక్కడే పొందాలని చూస్తున్నాడని, డొనేషన్స్ ను తన సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నాడని కూడా ఆయన ఆరోపించాడు. యోగానంద బోధనలకు అసలైన యోగసాంప్రదాయానికి చాలా వ్యత్యాసం ఉందని, తనను తాను ప్రోమోట్ చేసుకోడానికి హిందూమత సిద్ధాంతాలను యోగానంద చాలా వక్రీకరించాడని తన జీవితాంతం వరకూ నిరోధ్ నమ్మేవాడు.

వీటిలో ఒకటి - బాబాజీ, జీసస్ ఇద్దరూ స్నేహితులని, జీసస్ కు బాబాజీ క్రియాయోగ దీక్ష నిచ్చాడని ప్రచారం చేయడం, అమెరికాలో నిలదొక్కుకోడానికి, క్రైస్తవ ఫాదర్ల దాడులనుంచి కాపాడుకోడానికి, హిందూ క్రైస్తవ బోధనలు ఒకటే అని ప్రచారం చేస్తూ, క్రియాయోగ పరమగురువులలో జీసస్ ను కూడా ఒకడిగా పెట్టడం - ఇదంతా ఆ వక్రీకరణలో భాగమని నిరోధ్ చాలామంది తన అనుయాయులతో అనేవాడు. 

ఈ కేసు గెలవడానికి, బ్రిఘం రోస్ అనే ఒక అతి ఖరీదైన క్రిమినల్ లాయర్ని యోగానంద పెట్టుకున్నాడు. నిరోధ్ దగ్గర అంత డబ్బు లేదు గనుక, ఆయనొక మామూలు లాయర్ని పెట్టుకున్నాడు.  ఈ వాదోపవాదాలన్నీ అప్పటి న్యూస్ పేపర్లకు పండగ అయ్యాయి. ప్రతిరోజూ ఈ వాదోపవాదాలు పేపర్లలో వచ్చేవి. అమెరికా జనం విరగబడి చదివేవారు. అయితే బ్రిఘం రోస్ కోర్టులో దాఖలు చేసిన ఒకేఒక్క కాగితంతో నిరోధ్ కేసు ఓడిపోయాడు.

అదేంటంటే, 3 మే 1929 న, న్యూయార్క్ సెంటర్ ను వదిలేసి మౌంట్ వాషింగ్టన్ కు రాబోయేముందు, నిరోద్ సంతకం చేసిన ఒక డిక్లరేషన్. అందులో, సంస్థనుండి గాని , సంస్థ పుస్తకాల సేల్స్ లో వాటాను గాని, ఎటువంటి ప్రతిఫలాన్నీ తను ఆశించను, ఆశించకుండా పనిచేస్తాను. కేవలం ఒక రూము ఇచ్చి, తిండి పెట్టడంతో తను సరిపెట్టుకుంటాను' అని వ్రాసి ఉంది. ఈ నోటరీ చెయ్యబడిన పేపర్ను యోగానంద లాయరు, కోర్టులో ప్రెజెంట్  చెయ్యగానే, జడ్జి 'ఇంగ్రామ్ బుల్' ఈ కేసును కొట్టేశాడు. ఏమంటే, అందులో నిరోధే స్పష్టంగా వ్రాశాడు, 'సంస్థనుండి నేనేమీ డబ్బు ఆశించను' అని. ఇప్పుడు వాటాకోసం అడగడం దానికి వ్యతిరేకం గనుక కేసు కొట్టివేయబడింది.

అంతకు ముందు ధీరానంద పెట్టిన కేసుతో కళ్ళు తెరుచుకున్న యోగానంద, ఆ తర్వాత చేరిన మేనేజిమెంట్ సభ్యులందరి దగ్గరా అలాంటి డిక్లరేషన్ సంతకం పెట్టించేవాడు. అయితే అది, సన్న అచ్చులో ఉండి, ఇప్పుడు మనం ఎన్నోచోట్ల చూచే 'స్టాట్యుటరీ వార్నింగ్' లాగా ఉండేది. చూచీ చూడకుండా అలాంటి ఎన్నో కాగితాలను తను సంతకం పెట్టానని, ఇలాంటి డిక్లరేషన్ మీద యోగానంద తన సంతకం తీసుకుంటాడని తాను ఊహించలేదని, అలా తెలిస్తే అసలీ కేసును తానెందుకు వేస్తానని నిరోధ్ వాపోయాడు. మొత్తం మీద, క్రిమినల్ లాయర్ బ్రిఘం రోస్ దెబ్బకు, నిరోధ్ కేసును ఓడిపోయాడు.

ధీరానంద గురించి తెలియాలంటే ఆయన వ్రాసిన Glimpses of Light మరియు Philosophic Insight అనే పుస్తకాలను చదవండి.

నిరోధ్ గురించి తెలియాలంటే ఆయన వ్రాసిన Twins of Heaven మరియు The Master In You అనే పుస్తకాలను చదవండి.

ఇవన్నీ Amrita Foundation, PO Box 190978, Dallas, Texas నుండి లభిస్తాయి.

తన యోగమార్గం, క్రియాయోగానికంటే భిన్నమైనదని నిరోధ్ ఎప్పుడూ చెప్పేవాడు. అయితే లాహిరీ మహాశయులను ఒక గొప్ప యోగిగా ఎంతో గౌరవించేవాడు. SRF లో ఉండగా తన మార్గాన్నే అమెరికన్స్ కు భోధించేవాడు. అది మా 'పంచవటి' విధానం లాగా, వేదాంత-యోగ సంప్రదాయాల సమ్మిళితంగా, క్రియాయోగానికి కొంత భిన్నంగా ఉండేది. యోగానంద నుండి విడిపోయాక 1940 నుండి 1950 వరకూ అమెరికా అంతా తిరుగుతూ తన మార్గాన్ని ప్రచారం చేశాడు నిరోధ్. తరువాత చికాగో లోని హైడ్ పార్క్ దగ్గర ఒక ఇల్లు కొనుక్కుని అక్కడ సెటిలయ్యాడు. వేలాదిమంది అమెరికన్స్ ఈయనను గురువుగా నేటికీ భావిస్తారు. 1983 లో 95 ఏళ్ల వయసులో చనిపోయేవరకూ ఆరోగ్యంగానే ఉన్నాడు. ఈయన అమెరికన్ శిష్యులు చాలామంది ఇప్పటికీ మిడ్ వెస్ట్ లో యోగాను బోధిస్తున్నారు.

యోగాచార్య శ్రీ నిరోధ్ స్థాయి ఏమిటో తెలుసుకోవాలంటే డోనాల్డ్ కేసలానో హెవిట్ వ్రాసిన  American Yogi-Christ Sri Nerode: Restoring His Long-Lost Teachings of East-West Magazine అనే పుస్తకాన్ని అమెజాన్ నుంచి ఇక్కడ కొని చదవండి అర్ధమౌతుంది.