“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

10, ఆగస్టు 2023, గురువారం

పరమహంస యోగానంద గారి జాతకం - Part 4 (కర్మను జయించడం అసాధ్యం)

జ్యోతిష్యశాస్త్రం ఆషామాషీది కాదు. అది దైవజ్ఞానం. దైవమంటే విధియే. విధిని గ్రహింపజేసేది గనుక ఈ శాస్త్రం దైవశాస్త్రమైంది. జాతకచక్రం అనేది కూడా అద్భుతమైనదే. గతజన్మల కర్మఫలాన్నంతా అది ఒకచోట చూపిస్తుంది. చూచే జ్ఞానదృష్టి జ్యోతిష్కునికి ఉండాలి. క్రైస్తవం, ఇస్లాం మొదలైన అజ్ఞానపూరిత మతాలు అనేటట్లు ఇది డెవిల్ వర్షిప్ కానే కాదు. వాళ్లకు సరియైన అవగాహన లేక అలా అనుకుంటారు. ఒక్క హిందూమతం మాత్రమే జ్యోతిష్యశాస్త్రాన్ని సరిగ్గా అర్ధం చేసుకోగలిగింది. అంతేకాదు. దానిలో అద్భుతమైన రీసెర్చి జరిగింది కూడా మనదేశంలోనే.

యోగసాధనకూ జ్యోతిష్యశాస్త్రానికీ సూక్ష్మమైన సంబంధాలు ఉంటాయి. అవి అర్ధం కావాలంటే, జ్యోతిష్యశాస్త్రంలో మంచి ప్రజ్ఞతో బాటు యోగమార్గంలో మంచి సాధనాబలం ఉండాలి. లేకపోతే ఆ రహస్యాలు అర్ధం కావు.

లౌకిక కోరికలు తీరడానికి జ్యోతిష్య శాస్త్రాన్ని ఎక్కడ చూచినా వాడుతుంటారు. కానీ, దీని అసలు ప్రయోజనం ఆధ్యాత్మిక రంగంలో ఉంటుంది.

ఒకరి జాతకాన్ని చూచి, ఆ వ్యక్తి ఆధ్యాత్మిక సాధనకు పనికి వస్తాడా, లేదా, ఒకవేళ పనికివస్తే, అతనికి ఏ సాధన సరిపోతుంది? ఏవి సరిపోవు? ఏయే కాలసమయాలలో అతనికి సాధన సిద్ధిస్తుంది? వంటి సూక్ష్మవిషయాలను గ్రహించవచ్చు. ప్రాచీన గురువులు ఇలా చేసేవారు. శ్రీ యుక్తేశ్వర్ గిరిగారికి ఈ ప్రజ్ఞ ఉండేది. నేటి గురువులలో ఎవరికీ ఈ శక్తి లేదు. సోకాల్డ్ తాంత్రిక గురువులతో సహా, శిష్యుని జాతకాన్ని పరిశీలించి అతని ఇష్టదేవతను నిర్ణయించడం, ఏ మంత్రం, ఏ సాధన అతనికి సరిపోతుంది అన్న విషయాన్ని నిర్ణయించడం, సాధనా క్రమంలో వచ్చే ఆటంకాలను ఎలా తొలగించాలి? దానికి ఏయే విధానాలను ఉపయోగించాలి? మొదలైన విషయాలను ఎవరూ పాటించడం లేదు. ఏమంటే, అంతటి ప్రజ్ఞా, శక్తీ నేటి బిజినెస్ గురువులలో ఎవరికీ లేవు. అంతటి శుద్ధమైన శిష్యులు కూడా నేడు లేరు. అందుకే నేటి ఆధ్యాత్మిక ప్రపంచం అంతా  గురువులు శిష్యులు అనబడే జోకర్లతో నిండి నవ్వు పుట్టిస్తోంది.

యోగానంద గారి కుటుంబ జ్యోతిష్కుడు తప్పు చెప్పలేదు. యోగానంద గారి జాతకంలో మూడు పెళ్లిళ్లు ఉన్నాయి. నవాంశ చక్రాన్ని గమనించండి. మేషలగ్నంలో బుధుఁడున్నాడు. సప్తమంలో సూర్య, కుజులున్నారు. సుఖస్థానంలో శపితయోగం ఉంది. లగ్న, సప్తమాలలో ఉన్న మూడు గ్రహాలను బట్టి ఈయనకు మూడు పెళ్లిళ్లు ఉన్నాయనడం సరియైనదే. అయితే, సప్తమం మారకస్థానం గనుక, అందులో నీచ రవి ఉన్నాడు గనుక, సూర్యుడు, కుజుడు సూచిస్తున్న ఇద్దరు భార్యలు చనిపోవాలి. లగ్నంలో ఉన్న బుధుడు సూచిస్తున్న ఒకే భార్య బ్రతకాలి. సుఖస్థానంలో ఉన్న శపితయోగం దీనిని బలపరుస్తుంది. కనుక ఆ జ్యోతిష్కుడు ఆ విధంగా వ్రాసి ఉంచాడు. ఆయన వ్రాసినది సరిగానే ఉంది.

అయితే, జీవితం అనేది ఏదో శక్తి చేత పూర్తిగా ముందే వ్రాయబడి, మార్పుకు అవకాశం లేకుండా రాయిలాగా ఉండదు. సంకల్పశక్తితో దానిని మార్చుకునే వీలు కూడా ఉంటుంది. అయితే అంత సంకల్పశక్తి అందరికీ ఉండదు. కోటానుకోట్ల మానవులందరూ గాలివాటానికి ఎగురుతున్న గాలిపటాలవంటివారే. గాలికి ఎదురీది, తమ దిశను మార్చుకునే శక్తి గాలిపటానికి ఉండనట్లే, తమ గతకర్మను మార్చుకునే శక్తికూడా అందరు జీవులకూ ఉండదు. అలా చెయ్యాలంటే గొప్పదైన సాధనాబలం అవసరమౌతుంది. అప్పుడు మాత్రమే గతకర్మను మార్చుకోవడం సాధ్యమౌతుంది.

అలాంటి మార్చుకున్న పరిస్థితిలో కూడా, గతకర్మ పూర్తిగా క్షయించి పోదు. దాని రూపాన్ని మార్చుకుంటుంది అంతే. ఇదంతా చాలా సూక్ష్మంగా ఉంటూ, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధంగా జరుగుతుంది. కనుక, గ్రహశక్తులను పూర్తిగా ఓడించడం మనిషికి దాదాపుగా అసాధ్యమని విజ్ఞులంటారు.

యోగానందగారు గొప్ప యోగి గనుక, తన సంకల్పశక్తితో, తన జాతకంలో వ్రాసిపెట్టి ఉన్న మూడు పెళ్ళిళ్ళను రద్దు చేసుకోగలిగారు.  అయితే, గతకర్మ అంత తేలికగా వదిలేది కాదు. అది ఆయనను ఇంకో రూపంలో పట్టుకుంది.

గ్రహాలకు, భావాలకు అనేక కారకత్వాలుంటాయి. అంటే, అవి ఒకేసారి జీవితంలోని అనేక విషయాలను శాసిస్తూ ఉంటాయి. ఆ కారకత్వాలలో ఒకదానిని మనం మార్చుకుంటే, గత కర్మబలం ఇంకో కారకత్వం వైపు పోతుంది. అంటే, జాతకం అనే భవనంలో ఒక తలుపును మనం మూస్తే, వెంటనే ఇంకొక తలుపు తెరుచుకుంది. అంతేగానీ, గతకర్మ పూర్తిగా నశించదు. అన్ని తలుపులూ ఒకేసారి మూసుకోవు. కర్మను అలా పూర్తిగా తొలగించాలంటే సాధన ఒక్కటే దారి. రెమెడీలతో అది సాధ్యం కాదు. ఆ సాధన కూడా సర్వపరిపూర్ణమైన సాధన అయి ఉండాలి. అలాంటి సాధన, దానిని చేయించే గురువు దొరకడం, దానిని సాధించడం నూటికో కోటికో ఒక్కరు మాత్రమే చేయగలుగుతారు గానీ అందరికీ అది కుదరదు. కనుక, కర్మ తీరదు. ఇది సత్యం.

జాతకంలో సప్తమభావం అనేది వివాహాన్ని సూచిస్తుంది. అదే సప్తమభావం ఇంకా ఇతర అనేక విషయాలను కూడా సూచిస్తుంది. సప్తమభావం అనేది  ప్రధానంగా భాగస్వాములను, ప్రత్యర్థులను సూచిస్తుంది. జీవిత భాగస్వామినీ ఇదే సూచిస్తుంది, వ్యాపార భాగస్వాములనూ ఇదే సూచిస్తుంది. ఆ జాతకుడు ఒక గురువైతే, గట్టి నమ్మకంతో తనను అనుసరించి నడిచే శిష్యులను కూడా ఇదే సూచిస్తుంది. భార్యను కూడా సహధర్మచారిణి అనే కదా మనం అంటాము. అంటే, తనతోబాటు, తన ధర్మాన్ని అనుసరిస్తూ నడిచే మనిషి అని అర్ధం. గురువు విషయంలో అయితే శిష్యులు కూడా అంతే కదా !

పెళ్లిళ్ల విషయంలో యోగానందగారు తన కర్మను మార్చుకోగలిగారు. కానీ, అదే కర్మ, శిష్యుల రూపంలో, అనుచరుల రూపంలో వచ్చి తను చేయవలసిన పనిని చేసింది. పెళ్లి చేసుకుంటే భార్య రూపంలో వచ్చి వేధిస్తుంది. పెళ్లి చేసుకోకుంటే, అదే కర్మ శిష్యుల రూపంలో వచ్చి వేధిస్తుంది. అదే ఈయన జాతకంలో జరిగింది. ఇదీ రహస్యం.

యోగానందగారు అమితంగా ప్రేమించి, ప్రాణప్రదంగా నమ్మిన శిష్యులు ముగ్గురున్నారు. వారిలో ఇద్దరు ఆయనకు వెన్నుపోటు పొడిచారు. దూరమయ్యారు. వారిద్దరి పేర్లు స్వామి ధీరానంద, నిరోధ్ లు. ఊరకే దూరమవ్వడం కాదు, ఆయనపైన కోర్టు కేసులు వేసి చాలా వేధించారు. అనేక నిందలు వేశారు. మీడియా కెక్కారు. ఇదంతా అమెరికాలో జరిగింది. వాళ్ళను అమెరికా తీసికెళ్ళింది యోగానంద గారే.  తన సంస్థలో ఉన్నతస్థానాలను ఇచ్చింది యోగానందగారే. వాళ్లేమో అలా ప్రవర్తించారు. ఇవి రెండూ, రెండు పెళ్లిళ్లతో సమానమే. వాళ్లిద్దరూ అలా దూరం కావడం, ఇద్దరు భార్యలు చనిపోవడంతో సమానమే. యోగానందగారు చాలా సున్నితమైన మనస్సున్నవాడు. ఈ నమ్మకద్రోహ సంఘటనలతో యోగానందగారు చాలా క్రుంగిపోయారు. మూడవ శిష్యుడైన  జేమ్స్ జె లిన్ మాత్రం యోగానందగారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా, కష్టాలలో ఆయనను అంటిపెట్టుకుని ఉండి, సాధనలో గొప్ప స్థితులను అందుకుని, ఆయన తర్వాత SRF కు ప్రెసిడెంట్ అయ్యాడు. సంస్థను నిలబెట్టాడు. మూడవ భార్య బ్రతికి, ఈయనతో చక్కగా కలసి ఉండటమంటే ఇదే.

కనుక తన కర్మను యోగానందగారు మార్చుకున్నారు, కానీ ఓడించలేకపోయారు. అలా ఓడించడం ఎవరికీ సాధ్యం కాదని నా పరిశోధన చెబుతోంది. కనుక Outwitting the stars అంటూ తన పుస్తకంలోని అధ్యాయానికి యోగానందగారు పెట్టిన టైటిల్ అలంకారికంగా బాగుంటుంది గాని,  అది సత్యం కాదు. సంభవమూ కాదు. గ్రహాలను జయించామని మనం అనుకుంటాం. అవేమో మనల్ని మన జ్యోతిష్యాలను చూచి మౌనంగా నవ్వుకుంటాయి. ఇది సత్యం.

వీళ్ళు ముగ్గురి కధలను వచ్చే పోస్ట్ లలో చూద్దాం.