“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

9, ఆగస్టు 2023, బుధవారం

పరమహంస యోగానంద గారి జాతకం - Part 3 (Outwitting the stars)

భూమిని నడిపిస్తున్నది కర్మనియమమే. జంతుస్థాయిలో అదే దైవం. జంతువంటే  నాలుగు కాళ్ళ జంతువులు మాత్రమే కాదు. మనకు తెలిసిన చాలామంది మనుషులు కూడా అదే కోవలోకి వస్తారు. మానసికంగా, అలవాట్ల పరంగా జంతువుల స్థాయిలో ఉన్న మనుషులు కూడా జంతువులే. కనుక జంతువులెలా అయితే కర్మను తప్పుకోలేవో, మనుషులూ తప్పుకోలేరు. తప్పుకోగలమని భ్రమించడం వాళ్ళ పిచ్చి భ్రమ. చేసిన కర్మకు ప్రతిఫలం అనుభవించడం ఎవరికైనా తప్పదు. అందుకే శ్రీ శారదామాత ఇలా అనేవారు, 'మనిషి ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలి. తెలిసి చేసినా, తెలియక చేసినా, కర్మఫలితాలను ఎవరూ తప్పుకోలేరు'.

యోగులు సాధకులు కూడా అంతే. వాళ్ళు సామాన్య మానవులకంటే తప్పకుండా ఉన్నతులే. కానీ వారు కూడా కర్మవలయంలో ఉన్నవారే. దానిని పూర్తిగా దాటినవారు కారు. కాబట్టి వారి వారి కర్మఫలితాలను వారు కూడా అనుభవిస్తారు. అయితే ఒక మామూలు మనిషి స్థితికీ వారి స్థితికి చాలా భేదం ఉంటుంది గనుక, సామాన్య మానవులు ఏడుస్తూ తిట్టుకుంటూ కర్మఫలాన్ని అనుభవించినట్లు వారు అనుభవించరు. తమ కర్మను వారు మార్చుకోగలుగుతారు. కానీ పూర్తిగా మాత్రం తప్పుకోలేరు.

యోగానందగారి గారి జీవితం కూడా దీనికి అతీతమేమీ కాదు. పిచ్చిదైన ఎమోషనల్ భక్తిని కాస్త ప్రక్కన పెట్టి వాస్తవిక కోణంలో చూస్తే వాస్తవాలు అర్ధమౌతాయి.

తల్లిగారి మరణం తర్వాత హిమాలయాలకు పారిపోదామన్న కోరిక యోగానందగారిలో తీవ్రంగా మారింది. ఇది 1904 తర్వాత జరిగింది. అప్పుడు ఆయనకు పన్నెండేళ్ళు ఉంటాయి. అప్పుడాయన జాతకంలో శుక్ర - రాహు దశ జరుగుతున్నది. రాహువు పర్వతాలను అడవులను సూచించే మేషంలో ఉన్నాడు. అది నవమస్థానం అయింది. రాహువు దుందుడుకు కార్యకలాపాలకు సూచకుడు. మేషం చరరాశి. కనుక ఇంకొక ఇద్దరు స్నేహితులతో కలసి ఇంటినుండి హిమాలయలకు పారిపోయాడు. అయితే శుక్ర రాహువుల షష్టాష్టక స్థితి వల్ల ఈ ప్లాను బెడిసి కొట్టింది. వాళ్ళ నాన్నగారు BNR (Bengal Nagpur Railway) లో ఉన్నతోద్యోగి కనుక, పోలీసుల సాయంతో హరిద్వార్ స్టేషన్లో వీళ్ళను పట్టుకుని వెనక్కు తెచ్చుకోగలిగాడు. దశమాధిపతిగా శుక్రుడు తండ్రిని సూచిస్తూ చతుర్థంలో ఉంటూ దశమాన్ని చూస్తున్నాడు. కనుక తండ్రిగారికి దొరికిపోయాడు.

అందరికీ ఉన్నట్లే వీళ్ళ కుటుంబానికీ ఒక కుటుంబ జ్యోతిష్కుడున్నాడు. అయితే, నేటి తూతూమంత్ర జ్యోతిష్కుల లాగా అతను మోసగాడు కాదు. అప్పట్లో జ్యోతిష్కులు చాలా నియమనిష్టలతో ఉండేవారు. నేటి జ్యోతిష్కుల లాగా ధనవ్యామోహపరులు కారు. యోగానందగారు ఈ విధంగా ఇంటినుండి పారిపోతాడని ఆ జ్యోతిష్కుడు ముందే వ్రాసి పెట్టాడు. అది అక్షరాలా జరిగింది. అదే జ్యోతిష్కుడు ఇంకొక విషయం కూడా ఈయన జాతకంలో వ్రాశాడు. అదేంటంటే, యోగానందగారు మూడు పెళ్లిళ్లు చేసుకుంటాడని, అందులో ఇద్దరు భార్యలు చనిపోతారని, మూడవ భార్య మాత్రం మిగులుతుందని వ్రాశాడు.

యోగానందగారు సన్యాసం తీసుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళ అన్నగారు ఈ జాతకచక్రాన్ని ఆయనకు చూపించి, 'చూశావా? నువ్వు హిమాలయాలకు పారిపోతావని మన కుటుంబ జ్యోతిష్కుడు ముందే వ్రాసి ఉంచాడు. కానీ మాకు దొరికిపోతావని కూడా వ్రాశాడు. అలాగే జరిగింది. అదే జాతకంలో నీకు మూడు పెళ్లిళ్లు వ్రాసిపెట్టి ఉన్నాయని కూడా వ్రాశాడు. కనుక అదీ జరుగుతుంది. కాబట్టి నువ్వు నీ సన్యాస ప్రయత్నాలను ఆపు' అన్నాడు. 

యోగానందగారు జ్యోతిష్యాన్ని నమ్మేవారు కాదు. తన గురువూ, గొప్ప జ్యోతిష్య శాస్త్రవేత్తా అయిన స్వామి యుక్తేశ్వర్ గిరి గారిని కలుసుకునేవరకూ అదే నమ్మకంతో ఆయన ఉన్నాడు. అన్నగారు అలా హెచ్చరించిన తర్వాత కొన్నాళ్ళకు యోగానంద గారికి ఒక దర్శనమో, సూచనో ఏదో అందింది. ఒకరోజున తన జాతకచక్రాన్ని తగులబెట్టేశాడు. ఆ పొడిని ఒక సంచిలో ఉంచి, దానిపైన ఒక కాగితం అంటించాడు. దానిపైన, 'దివ్యజ్ఞానంలో కాలి బూడిద అయిన గతకర్మ విత్తనాలు తిరిగి మొలకెత్తలేవు' అని వ్రాసి ఉంచాడు.

దానికి వాళ్ళన్నయ్య ఇలా అన్నాడు, 'నువ్వు నీ జాతకపు కాగితాన్ని కాల్చి బూడిద చెయ్యవచ్చు. కానీ నీ గతకర్మను మార్చలేవు'.

యోగానందగారి సంకల్పశక్తి బాగానే పనిచేసింది. ఆయన ఒక్క పెళ్లి కూడా చేసుకోలేదు. సన్యాసి అయ్యాడు. గొప్ప గురువయ్యాడు. ఆ విధంగా గ్రహాలను ఆయన ఓడించాడు. కానీ కర్మ కూడా తనపనిని తను చేసింది. ఆ జోస్యం ఇంకొక విధంగా నిజమైంది. అంతిమంగా గ్రహాల చేతిలో యోగానందగారు ఓడిపోయారు. ఈ విషయాలు ఏ పుస్తకం లోనూ మీకు దొరకవు.

అదెలా అయిందో వచ్చే పోస్ట్ లో చదవండి.

(ఇంకా ఉంది)