“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

13, ఆగస్టు 2023, ఆదివారం

పరమహంస యోగానంద గారి జాతకం - Part 5 (స్వామి ధీరానంద కధ)

స్వామి ధీరానంద అసలు పేరు బసు కుమార్ బాగ్చి. ఈయన కూడా బెంగాలీ వాడే. ఈయన 1895 లో జనవరి 7 న  బెంగాల్ లోని శాంతిపూర్ లో పుట్టాడు. ఈయన జాతకాన్ని ఇక్కడ చూడండి.

జననసమయం తెలియదు. జననకాల సంస్కరణ చేసి రాబట్టవచ్చు. కానీ అంత అవసరం లేదు. జీవిత సంఘటనలను బట్టి స్థూలంగా చూస్తే, ఉదయం 7. 30 నుండి 9. 30 లోపు పుట్టినట్లు తెలుస్తోంది. కనుక చంద్రుడు మేషంలో ఉన్నాడు. కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో ఈయన జన్మించాడు. ఇదెలా చెయ్యాలి అన్నది మాత్రం అడక్కండి. చెప్పను.

సప్తమాధిపతిగా శుక్రుడు దశమంలో ఉంటూ దూరదేశంలో వృత్తిని సూచిస్తున్నాడు. దశమాధిపతి శని ఉచ్ఛస్థితిలో సప్తమంలో ఉండటం కూడా దీనినే సూచిస్తున్నది. లాభాధిపతి, బాధకుడూ కూడా అయిన శని సప్తమంలో ఉచ్చస్థితిలో ఉండి, దూరదేశంలో ఉన్నతస్థానంలో ఉన్న స్నేహితుడిని కూడా సూచిస్తున్నాడు. అతనితో శత్రుత్వం వస్తుందని కూడా సూచిస్తున్నాడు. నవమ ద్వాదశాధిపతిగా విదేశనివాసాన్ని సూచిస్తున్న గురువు అమెరికాను సూచించే మిధునంలో ఉన్నాడు. కానీ వక్ర స్థితిలో ఉండటం వల్ల, ఏ పనిమీద అక్కడకు వెళ్ళాడో దానిని వదిలేసి వెనక్కు వస్తాడన్న సూచన ఉన్నది. ఉన్నత విద్యను సూచిస్తున్న సూర్యుడు నవమంలో బుద్ధికారకుడైన బుధునితో కలసి ఉంటూ, ఆధ్యాత్మిక విద్యకు కారకుడైన గురువుతో చూడబడుతూ ఫిలాసఫీలో ఉన్నతవిద్యను సూచిస్తున్నాడు. అయితే, గురువు వక్రత్వం వల్ల దానిని వదిలేసి వేరే లైన్ లో ముందుకు వెళతాడని కూడా సూచన ఉన్నది. ఇవన్నీ ఈయన జీవితంలో జరిగాయి. 

1911 లో శాంతిపూర్ మునిసిపల్ హై స్కూల్లో మెట్రిక్ పాసై, 1916 లో కలకత్తా స్కాటిష్ చర్చ్ కాలేజీలో MA ఫిలాసఫీ పూర్తి చేశాడు. యోగానందా ఈయనా కాలేజీ లో స్నేహితులు. ఇద్దరూ కలసి ధ్యానం చేసేవారు. మహాత్ములను దర్శించేవారు. ఫిలాసఫీ చర్చించుకునేవారు. మంచి వేదాంతిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా, సేవా తత్పరునిగా ఈయనకు పేరుంది.

బసుకుమార్ కుటుంబం అంతా భాదురీ మహాశయ (నాగేంద్రనాధ్ భాదురీ) శిష్యులు. ఈయన ధ్యానంలో కూర్చుని గాలిలోకి లేచేవాడని తన పుస్తకంలో యోగానంద వ్రాశారు. కానీ యోగానంద పరిచయం అయ్యాక భాదురీ మహాశయ దగ్గరకు పోవడం ధీరానంద తగ్గించాడు. యోగానంద సలహా మేరకు శాస్త్రిమహాశయ (స్వామి కేవలానంద) దగ్గర క్రియాయోగ దీక్ష స్వీకరించాడు బసుకుమార్.

యోగానంద కాలేజీ రోజులలో భాదురీ మహాశయను తరచుగా దర్శించేవాడు. అమెరికా వెళ్లి యోగప్రచారం చెయ్యమని యోగానందకు అప్పట్లో చెప్పినది భాదురీ మహాశయులే. ఈయన హఠయోగంలో మంచి నేర్పరి. ప్రాణాయామసిద్ధుడు. ఈయన భస్త్రికా ప్రాణాయామము చేసేటప్పుడు ఆ గదిలో ఒక తుఫాన్ వచ్చినట్లు ఉండేది. వాయుకుంభకం చేసి అమాంతం గాలిలోకి లేచే శక్తి ఈయనకు ఉండేది.

యోగానంద స్థాపించిన రాంచి బ్రహ్మచర్య విద్యాలయలో అధ్యక్షుడుగా బసుకుమార్ ఉండేవాడు. 1917 లో ఈయనకు సన్యాసం ఇచ్చి స్వామి ధీరానంద అని పేరు పెట్టాడు యోగానంద. ఆ సమయంలో జననకాల చంద్రునిపైన గోచార గురువు సంచరించాడు. ఇది యోగకారక కాలం. అయితే అర్ధాష్టమ శని జరిగింది. కనుక ఒక రకంగా యోగమూ, ఒక రకంగా అవయోగమూ అయిన సన్యాసాన్ని యోగానంద ద్వారా స్వీకరించాడు.

ఆ సమయంలో స్వామి సత్యానంద కూడా వీరితోనే ఉండేవాడు. ఆ విధంగా కొన్నేళ్లపాటు రాంచీ విద్యాలయాన్ని సమర్ధవంతంగా నడిపాడు ధీరానంద. తనకు తోడుగా ఉంటాడని ధీరానందను అమెరికా తీసికెళ్ళాడు యోగానంద. అప్పుడు రాంచీ బ్రహ్మచర్య విద్యాలయను స్వామి సత్యానంద చూచుకునేవాడు.

ధీరానందకు యోగానంద అంత చనువివ్వడం, జ్యోతిష్యశాస్త్రంలో మంచి పండితుడైన స్వామి యుక్తేశ్వర్ గిరిగారికి నచ్చేది కాదు. ధీరానందతో స్నేహం తగ్గించమని ఆయన యోగానందకు సలహా ఇచ్చాడు. కానీ యోగానంద వినలేదు. ధీరానందను అమెరికా తీసికెళ్ళడం కూడా యుక్తేశ్వర్ గిరిగారికి ఇష్టం లేదు. 'ఈ ప్రయాణం మంచికి కాదు. భవిష్యత్తు బాగుండదు' అని యుక్తేశ్వర్ గిరిగారు హెచ్చరించారు కూడా. అయినా, ఆయనమాటను యోగానంద వినలేదు.

ధీరానంద, సత్యానందలలో ఒకరిని అమెరికాకు రమ్మని, అక్కడ ఉంటూ పనిలో తనకు సాయం చెయ్యాలని యోగానంద కోరాడు. 'నేను అమెరికాకు రాన'ని సత్యానంద తిరస్కరించాడు. కనీసం ధీరానందనైనా పంపమని యోగానంద మళ్ళీ ఉత్తరం వ్రాశాడు. 1922 లో ధీరానంద అమెరికాకు వెళ్ళాడు. ఆ సమయంలో శని గురువులు కన్యా రాశిలో రాహువుతో కలసి ఉన్నారు. గురువు నవమ ద్వాదశాధిపతి. శని దశమ లాభాధిపతి. రాహువు పూర్వకర్మకారకుడు. ముగ్గురూ పన్నెండో రాశిని చూస్తున్నారు. కనుక స్నేహితుని ద్వారా, మతసంబంధమైన పనిమీద విదేశీయానం కలిగింది. అయితే అది షష్ఠమ భావం నుంచి గనుక గతకర్మ సంబంధమైన ఫలితంగా అమెరికాకు వెళ్ళాడు.

అమెరికా వెళ్ళాక మొదట్లో అంతా బాగానే ఉంది. బోస్టన్ లో ఉంటూ యోగప్రచారం చేశారు ఇద్దరూ. తమ సంస్థకు 'యోగదా సత్సంగ సభ' అని పేరు పెట్టమని యుక్తేశ్వర్ గిరిగారు చెప్పారు. కానీ వీళ్ళిద్దరూ ఆయన మాటను వినకుండా  'యోగదా శిక్షణా ప్రణాళి' అనే  పేరును ఆ సంస్థకు పెట్టారు. ఆ తర్వాత దానిని 'సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్' గా మార్చారు. యుక్తేశ్వర్ గారు బాధపడినా, మౌనంగా ఉండిపోయారు.

1925 లో లాస్ ఏంజెల్స్ లోని మౌంట్ వాషింగ్ టన్ పైన ఉన్న ఒక పెద్ద హోటల్ ను కొనేసి, దానిని తమ సంస్థ ప్రధాన కార్యాలయంగా మార్చాడు యోగానంద. దానిని చూసుకోడానికి రమ్మని ధీరానందను కోరాడు. కానీ, అప్పటికే బోస్టన్ లో ధీరానంద మంచి పేరును సంపాదించాడు. ఫిలాసఫీకి తోడు ఆయన గణితశాస్త్రాన్ని కూడా భోధించేవాడు. అయినా సరే, యోగానంద కోరిక మేరకు బోస్టన్ ను వదిలేసి లాస్ ఏంజెల్స్ కు చేరుకున్నాడు. 1925 లో ధీరానంద గురించి పొగుడుతూ చాలా గొప్పగా వ్రాశాడు యోగానంద.

దాదాపు నాలుగేళ్లు అక్కడ రెసిడెంట్ స్వామిగా ఉండి ఎంతో సేవ చేసి, ఎంతో పేరు సంపాదించుకున్న ధీరానంద 1929 లో స్వామి యోగానందతో విభేదించి విడిపోయాడు.

అది గ్రేట్ డిప్రెషన్ సమయం. డబ్బుల్లేక కటకటగా ఉంది. ఆశ్రమం నడవడమే గగనంగా ఉంది. ఆ సమయంలో సంస్థనుండి ధీరానంద విడిపోయాడు. కారణం ఏమిటో ఎవరికీ తెలీదు. డబ్బు  ఒక కారణం కావచ్చు. పైగా, యోగదా సంస్థలోని రాజకీయాలు, అమ్మాయిల గొడవలు ధీరానందకు నచ్చలేదని కొందరంటారు.  అసలు కారణం తెలీదుగాని, యోగదా సంస్థతో విడిపోదామని ధీరానంద నిశ్చయించుకున్నాడు. విడిపోయాడు. ఎందుకు అనేది మాత్రం ఎవరికీ చెప్పలేదు.

మనసులో కోరికలు మిగిలి ఉన్నపుడు క్రియాయోగమే కాదు, ఏ యోగమూ మనిషిని రక్షించదు. అది యోగానంద కావచ్చు. ధీరానంద కావచ్చు. ఎవరైనా కావచ్చు.  ఇది వాస్తవం.

ఈ మాటను నేను ఉబుసుపోక చెప్పడం లేదు. 1982 నుంచే క్రియాయోగం నాకు తెలుసు. దాని లోతుపాతులూ తెలుసు. దాని అభ్యాసులు ఎంతోమంది నా స్నేహితులున్నారు. వాళ్ళను దగ్గరగా చూసి ఈ మాటను చెబుతున్నాను. క్రియాయోగా వల్ల ఎన్ని  కుటుంబాలు ఎలా విచ్చిన్నమయ్యాయో వచ్చే పోస్ట్ లలో వ్రాస్తాను.  

ఆ సమయంలో గురువు జననకాల చంద్రుని పైన సంచరించాడు. కనుక అంతా ఆశాజనకంగా కనిపించింది. SRF తనకు అవసరం లేదనుకున్నాడు. సొంతగా బ్రతకగలనని అనిపించింది. శని నవమస్థానంలో సంచరించాడు. బాధకునిగా లాభస్థానాన్ని చూశాడు. కనుక స్నేహితుడైన యోగానందతో విడిపోయాడు.

ఎవరెన్ని చెప్పినా, ఈ ప్రపంచాన్ని నడుపుతున్న శక్తి డబ్బు అనేది వాస్తవం. 'మనుషుల మధ్యన సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే' అని కారల్ మార్క్స్ వ్రాసినది చాలావరకు సత్యమే. అన్నదమ్ముల మధ్యన, స్నేహితుల మధ్యన, సంస్థల మధ్యన, చివరకు భార్యాభర్తల మధ్యన కూడా గొడవలు రావడానికి ప్రధానకారణం డబ్బే అయి ఉంటుంది. ఇది వాస్తవం. అన్నీ వదిలేసి సన్యాసి అయినవాడు కూడా డబ్బును వదలలేడు. ఏమంటే, డబ్బు లేనిదే పూట గడవదు. ఆశ్రమాలు నడవాలన్నా డబ్బు ఉండాలి. ఆశ్రమాలలో వచ్చే గొడవలన్నీ డబ్బు కోసం అధికారం కోసమే వస్తాయి. లేదా అమ్మాయిల గొడవలతో వస్తాయి. ఈ విషయాన్ని, గత ఏభై ఏళ్లుగా నాకు పరిచయం ఉన్న అనేక ఆశ్రమాలలో, సంస్థలలో గమనించాను.

ధీరానంద వెళ్ళిపోయినపుడు యోగానంద చాలా డిప్రెషన్ కు గురయ్యాడు. ఎంతో  బాధపడ్డాడు. దాదాపు 14 ఏళ్ల అనుబంధం వీరిది. ఇండియాలో కాలేజీ రోజులనుంచి వీళ్ళు స్నేహితులు. కలిసి ఒకే మార్గంలో నడుద్దామని అనుకున్నారు. అమెరికా వెళ్లారు. కలిసి మతప్రచారం చేశారు. ఉన్నట్టుండి ధీరానంద అలా చేసేసరికి తట్టుకోలేక యోగానంద మెక్సికో పర్యటనకు వెళ్ళిపోయాడు.

ఆ తర్వాత మూడేళ్ళ వరకూ యోగానంద ఈ షాక్ నుంచి తేరుకోలేదు. 1932 లో జేమ్స్ జె లిన్ పరిచయం అయ్యేవరకూ ఈ బాధలోనే ఆయన ఉన్నాడు. ఆయనిలా అనేవాడు, 'ధీరానందకు నేనెంతో చేశాను. ఎంతో అతని నుంచి ఆశించాను. కానీ చివరకు ఆశాభంగాన్నే నాకు మిగిల్చాడు'.  

అసలలా ఆశించడమే తప్పని నేనంటాను. ఆశ ఉంది కాబట్టి ఆశాభంగం కలిగింది. ఆశే లేకపోతే ఆశాభంగం ఎలా కలుగుతుంది?

ఇద్దరూ కలసి అమెరికాలో క్రియాయోగాను బాగా ప్రచారం చేసి ఎన్నో ఆశ్రమాలను పెట్టాలని యోగానంద భావించాడు. తన టాలెంట్ ను యోగానంద ఫ్రీగా వాడుకుని, తన సొంత ఇమేజిని మాత్రం పెంచుకుంటున్నాడని, చివరకు తనకేమీ మిగలడం లేదని, సమాన టాలెంట్ ఉన్నప్పటికీ చివరకు తనొక సేవకునిగా మిగిలిపోతున్నానని ధీరానంద భావించాడు. ఎవరి గోల వారిది !

నిజానికి యోగానందకు శాస్త్రాలలో అంత పాండిత్యం లేదు. ధీరానంద అలా కాదు. అతను ఫిలాసఫీలో MA చేశాడు. మంచి  పండితుడు, వక్త కూడా. కనుక అతని పాండిత్యాన్ని తమ సంస్థ కోసం ఉపయోగిద్దామని యోగానంద అనుకున్నాడు. కానీ ధీరానంద ఆలోచనలు వేరేగా ఉన్నాయి. ఆయనెందుకు హర్ట్ అయ్యాడో, అసలు గొడవ ఎక్కడ వచ్చిందో, బయటకు ఎవరికీ చెప్పలేదు. తనలోనే ఉంచుకున్నాడు. అంతవరకూ అతను ఉత్తముడే అనిపిస్తుంది. 

యోగానంద వ్రాసినట్టుగా నేడు లభిస్తున్న పుస్తకాలన్నీ నిజానికి ధీరానంద వ్రాసినవే అని, యోగానందకు అంత పాండిత్యం లేదని చాలామంది భావిస్తారు. ఒకరకంగా  చెప్పాలంటే, ధీరానంద అనే వ్యక్తి యోగానందకు ఘోస్ట్ రైటర్ అని అనుకోవచ్చు.

అలా యోగానంద నుండి విడిపోయిన ధీరానంద లాస్ ఏంజిల్స్ లో తనదైన వేరే యోగసంస్థను స్థాపించాడు. ఈ చర్య, అమెరికన్ భక్తులలో పెద్ద గందరగోళం అయోమయాలను రేపింది. వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్? అసలైన సంస్థ ఈ రెంటిలో ఏది? అని అమెరికన్లు సందేహించడం మొదలైంది. కానీ ధీరానంద సంస్థ అభివృద్ధి చెందలేదు.  ఎందుకంటే, యోగానందకున్న జనసమ్మోహకశక్తి ధీరానందకు లేదు. యోగానందకు మాస్ హిప్నాటిజం వచ్చు. ఎదుటిమనిషిని తన ఆరాతో ఆకట్టుకునే శక్తి ఆయనకుండేది. అది ధీరానందకు లేదు. ఈయన మంచి పండితుడు, శాస్త్రాలు తెలిసినవాడు, సాంప్రదాయ వాది. అంతేగాని జనాన్ని ఆకర్షించే శక్తి యోగానందకున్నంతగా ఈయనకు లేదు. క్రమేణా ధీరానంద సంస్ధనెవరూ  పట్టించుకోలేదు. 1933 వరకూ దానిని  ఏదో విధంగా నడిపాడు ధీరానంద. తరువాత అది మూత పడింది.

ఆ సమయంలో గోచార గురువు జననకాల చంద్రుని నుండి దశమంలోకి వచ్చాడు. బాధకుడు గనుక, సంస్థ మూతపడేలా చేశాడు. అయితే వేరే రకంగా స్థిరత్వాన్నిచ్చాడు.

ఈ సంఘటన జరిగిన కొద్ది కాలానికి ఉన్నట్టుండి ధీరానందకు జబ్బు చేసి ఆస్పత్రిలో చేరాడు. మూణ్నెల్లు ఆస్పత్రిలో ఉన్నాడు. ఉంటాడో పోతాడో అన్నంతగా అనారోగ్యం తలెత్తింది. ఆ సమయంలో ఒక అమెరికన్ నర్సు ఈయనకు చాలా శ్రద్ధగా సేవలు చేసింది. ఆమెతో ప్రేమలో పడ్డాడు. అంతటితో సన్యాసానికి తిలోదకాలిచ్చాడు. 1934 లో ఆమెను పెళ్లిచేసుకున్నాడు. 

ఆ తరువాత, 1935 లో అయోవా యూనివర్సిటీ నుండి బయో ఫిజిక్స్ లో Ph.D చేసి మిషిగన్ రాష్ట్రానికి మకాం మార్చాడు. మిషిగన్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో EEG డిపార్ట్ మెంట్ కు చీఫ్ అయ్యాడు. బ్రెయిన్ వేవ్స్ మీద ఈయన రీసెర్చి సాగింది. దశమ శని, సన్యాసవృత్తిని వదిలించి, వృత్తిపరంగా మంచి సక్సెస్ ను ఇచ్చాడు. ఈయన జాతకచక్రములో శని ఉచ్ఛస్థితిలో ఉండటాన్ని గమనించండి. ఇలాంటి జాతకులు వృత్తిలో చాలా ఉన్నత స్థాయిని అందుకుంటారు. ఎన్నో జాతకాలలో ఇది రుజువైంది.

1942 లో మిషిగన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా రిటైరయ్యాడు. యాన్ అర్బర్ అనే ప్రదేశంలో ఈయన నివాసం ఉండేవాడు. డెట్రాయిట్ లో ఉన్నపుడు ఈ చోటకు నేను  చాలాసార్లు వెళ్లాను. ఏమంటే, ఆ ప్రాంతంలో నా శిష్యులు కొంతమంది ఉన్నారు.

ఆ తరువాత రీసెర్చి పనిమీద 1957 లో ఇండియాకు వచ్చాడు. తిరిగి అమెరికాకు వెళ్లి 1977 లో యాన్ అర్బర్ లో చనిపోయాడు. ఆ సమయంలో గోచార గురువు ఆయుష్య స్థానంలో సంచరించాడు. అర్ధాష్టమ శని మొదలైంది. రాశిచక్రంలో కాలసర్పయోగం నడుస్తోంది. కనుక అంత్యకాలం సమీపించింది. జీవితం ముగిసింది. అప్పటికి ఆయనకు 82 ఏళ్లు.

యోగానంద నుంచి విడిపోయినప్పటికీ, యోగసాధనను మాత్రం మానుకోలేదు. యోగానందను తన గురువుగా ఈయనెన్నడూ భావించలేదు. అదే విధంగా బోధనను కూడా మానుకోలేదు. ఈయన శిష్యులు చాలామంది అమెరికాలో ఉన్నారు.

అసలేం జరిగిందంటే,  1929 లో న్యూయార్క్ సిటీలో యోగానందను కలసి, సంస్థలో తన వాటా తనకు ఇవ్వమని కోరాడు ధీరానంద. 1920 నుండి 1929 వరకూ సంస్థకు తాను అందించిన సేవలకు గాను తన వాటాగా తనకు రావలసిన డబ్బుని ఇవ్వమని అడిగాడు. అనేక చర్చలు సంప్రదింపులు అయిన మీదట 8000 డాలర్లు ఈయనకు తాను బాకీ ఉన్నట్లుగా ప్రామిసరీ నోటును వ్రాసిచ్చారు యోగానందగారు.

ఈ ప్రామిసరీ నోటును పెట్టి, 1935 లో ఈయన యోగానంద గారి మీద కోర్టులో కేసు వేశాడు. తామిద్దరూ యోగదా సంస్థలో భాగస్వాములమని తన వాటాగా ఆ డబ్బు తనకు రావాలని వాదించాడు.

అప్పట్లో ఒక డాలర్ 24 రూపాయలుండేది. 8000 డాలర్లు అంటే రెండు లక్షల రూపాయలతో సమానం. 1929 లో రెండు లక్షలంటే ఇప్పుడెంతో అర్ధం చేసుకోవచ్చు.

ఈ కేసులో ధీరానంద గెలిచాడు. యోగానంద గారు ఓడిపోయాడు. ఏమంటే ప్రామిసరీ నోటు క్లియర్ గా ఉంది. అయితే, తమకు చెప్పకుండా దాదాపు ఇరవై వేల డాలర్లను ధీరానంద వాడుకున్నాడని,  కనుక అతనే తమకు డబ్బు బాకీ ఉన్నాడనీ యోగానంద గారి లాయర్ వాదించాడు. కానీ, దానికి రుజువులు లేవు. సంస్థ లెక్కలప్రకారం 1924 నుండి 1929 వరకూ, ఒక రూమ్ ఇచ్చి, తిండి పెట్టడం తప్ప, ధీరానందకు సంస్థ ఇచ్చినది ఏమీ లేదు. కనుక ధీరానంద కేసు వెయ్యడం కరెక్టే అని జడ్జి భావించాడు. ధీరానండకు అనుకూలంగా తీర్పు చెప్పాడు.

తీర్పు వచ్చేనాటికి యోగానందగారు  అమెరికాలో లేరు. యోగానంద ఏకౌంట్లో 22 డాలర్లు మాత్రమే ఉన్నాయని, పరిహారం చెల్లించలేమని  బ్యాంక్, కోర్టుకు చెప్పింది. యోగానంద అమెరికా సిటిజెన్ కాదు. బ్రిటిష్ వీసా మీద ఆయన అమెరికాలో ఉన్నాడు. ఆ సమయానికి ఇండియా వెళ్లిపోయాడు. కారణం? తనకు కాలం సమీపించిందని యుక్తేశ్వర్ గారికి తెలిసింది. వెంటనే ఇండియా రమ్మని యోగానందకు సమాచారం పంపాడు. అందుకని యోగానంద ఇండియాకు వెళ్ళిపోయాడు.

అప్పటికి ధీరానంద, స్వామిగా లేడు.  యోగదా సంస్థ అంటే విరక్తి పుట్టింది. సన్యాసాన్ని వదిలేశాడు. ఆస్పత్రిలో తనకు సేవలు చేసిన నర్సుని పెళ్లి చేసుకున్నాడు. డిసెంబర్ 1935 లో యోగానంద ఇండియా వచ్చారు. తిరిగి 1936 వరకూ ఏడాది పాటు ఆయన ఇండియాలోనే ఉన్నారు. ఆ సమయంలోనే  అమెరికాలో తీర్పు వెలువడింది. ఇండియాలో ఏడాది పాటు ఉండి, తిరిగి అమెరికా వెళ్లేసరికి ధీరానంద తన Ph.D పూర్తి చేసుకుని, హార్వర్డ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ రీసెర్చర్ గా ఉన్నాడు. కేసు మళ్లీ మొదలైంది. ఎట్టకేలకు 4,200 డాలర్లు చెల్లించే ఒప్పందం కుదిరింది. జేమ్స్ జే లిన్  అండతో యోగానందగారు ఆ డబ్బును చెల్లించారు. అది లాయర్ ఖర్చులకే చాలలేదు. చివరకు ధీరానందకు ఏమీ పరిహారం అందలేదు.  యోగానందతో విడిపోవడం మాత్రం జరిగింది.

ఈ విధంగా, ఆధ్యాత్మిక వ్యాపారం అనేది ఇద్దరు ప్రాణ స్నేహితులని విడదీసింది. ఒక ఆధ్యాత్మిక సంస్థకు చెడ్డ పేరును తెచ్చింది 

చాలా చిన్నవయసు నుండీ ఆధ్యాత్మిక చింతనలో పెరిగి, యోగానందకు స్నేహితునిగా ఉండి, అమెరికా వెళ్లి యోగప్రచారం చేసి, చివరకు యోగానందతో గొడవపడి, సన్యాసాన్ని వదిలేసి, అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకుని, మళ్ళీ యూనివర్సిటీలో చేరి చదివి, PhD సంపాదించి, చివరకు మిషిగన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా రిటైరయ్యాడు ధీరానంద అనబడే బసు కుమార్ బాగ్చి. బ్రెయిన్ వేవ్ రీసెర్చిలో ఈయన పయనీర్ గా ఉన్నాడు. తన రీసెర్చి మీద దాదాపుగా నూరు పేపర్స్ ప్రెజెంట్ చేశాడు.

యోగానంద గారు 1952 లో పోయారు. తరువాత 25 ఏళ్లు బ్రతికాడు ధీరానంద. 28 ఆగస్టు 1977 న యాన్ ఆర్బర్ లో చనిపోయాడు.

తనను తాను జీసస్ గా భావించుకుంటూ, 'నా జీవితంలో ఇద్దరు జుడాస్ ఇస్కరియేట్ లున్నారు' అనేవాడు యోగానంద గారు. జుడాస్ అనే శిష్యుడే జీసస్ ను రోమన్ సైనికులకు పట్టిస్తాడు. అందుకని నమ్మకద్రోహం చేసినవారిని జుడాస్ అనడం  లోకంలో పరిపాటి అయ్యింది.

తన జీవితంలో, అటువంటివారిలో ఒకడు ధీరానంద. రెండవవాడు నిరోధ్ అని యోగానంద అంటాడు. ధీరానంద, నిరోద్ ల గురించి బాగా తెలిసిన వాళ్ళు అది అబద్దమని, వాళ్ళు దుర్మార్గులు కాదని, యోగానందలో చాలా లోపాలున్నాయని  'ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఏ  యోగి' పుస్తకం మాయలో అవన్నీ నేడు మరుగున పడిపోయాయని, అది ప్రచారం మాయ అని అంటారు. 

నిరోధ్  కథ వచ్చే పోస్ట్ లో చూద్దాం.