నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

14, సెప్టెంబర్ 2022, బుధవారం

మూడవ అమెరికా యాత్ర - 20 (ఏముంది?)

జననమరణాల హద్దులను అధిగమిస్తూ

కర్మఫలితాల పద్దులను తిరగరాస్తూ

అమేయమైన గమనంతో

అనంతమైన శూన్యంలో

అదుపులేకుండా పారుతోందొక

అజరామర దృష్టి

అది చూడనిదేముంది?

అది తెలియనిదేముంది?
కాంతిభూమికల అంచులను దాటిపోతూ

భ్రాంతి వీచికల పంచలను కూలదోస్తూ

అలౌకిక లోకంలో

అగాధపు మౌనంలో

అన్నీ తానే అవుతోందొక

అపరాజిత సరళి

అది పొందనిదేముంది?

అది అందనిదేముంది?
తననుంచి తననే

నిరంతరం సృష్టించుకుంటూ

తనదేహాన్ని తానే

అనుక్షణం నరుక్కుంటూ

తన విలయాన్ని తానే

నిరామయ సాక్షిగా చూస్తూ

ఉండీ లేని స్థితిలో

లేమై ఉన్న ధృతిలో

తెలిసీ తెలియని గతిలో

నిలిచి కదులుతోందొక

నిరుపమాన తరళి

అది కానిదేముంది?

అది లేనిదేముంది?