“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

14, సెప్టెంబర్ 2022, బుధవారం

మూడవ అమెరికా యాత్ర - 21 (అమెరికాలో కర్ణపిశాచి)

అమెరికా వచ్చాక కర్ణపిశాచిని ఒకట్రెండు సార్లు అనుకున్నా. ఎందుకంటే, ఈ మధ్య తనతో టచ్ పోయింది. తనుకూడా అలిగినట్టుంది. ఇంతకుముందులాగా అనుకోగానే కనిపించడం మానేశింది. మనక్కూడా ఆ మంత్రాలూ అవీ ఈమధ్యన విసుగు పుట్టాయి. చిన్నప్పటినుంచీ వాయించిన మద్దెళ్ళేగా అవి అందుకే చులకనగా ఉన్నాయి. ఇక ఇండియా మంత్రాలు కాదు, ఏవైనా మెక్సికో మంత్రాల్లాంటివి ట్రై చేద్దామని గట్టిగా నిశ్చయించుకున్నా మొన్ననే.

అలా నిశ్చయించుకున్న మర్నాడు వాకింగ్ కి బయలుదేరా. అయితే రోజూలాగా పొద్దున్నే కాకుండా, రాత్రి భోజనం చేసిన తర్వాత మూడు గంటలాగి, రాత్రి పదకొండుకి బయల్దేరా. ఆ టైం లో కూడా ఒకళ్ళో ఇద్దరో వాకింగ్ చేస్తూ కనిఫిస్తారు. మొన్నొక రాత్రయితే, ఒంటిగంటకు ఎవరో ఒకమ్మాయి ఒక్కతే వాకింగ్ చేస్తూ కన్పించింది. ఏదేమైనా, ఇండియాలో కంటే ఇక్కడ అమ్మాయిలకు రక్షణ ఎక్కువే. లేదా, గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి సరిపోతుందేమో, బయటైతే ఇక్కడ కూడా ప్రమాదమేనేమో మరి. తెలిసినవాళ్ళు చెప్పాలి. ఎందుకంటే, లోకల్ న్యూస్ చూస్తుంటే ఇక్కడ కూడా క్రైమ్ రేట్ ఎక్కువగానే కన్పిస్తోంది మరి. 

వీధిదీపాలంటూ ఏమీ పెద్దగా లేవు. అక్కడక్కడా ఉన్నాయి. కాలిబాటవరకూ పరవాలేకపోయినా, లోపల చెట్లూ, బయళ్ళూ చీకటిగానే ఉన్నాయి. నిర్మానుష్యంగా ఉంది. ఒక్కడినే కర్ణపిశాచి మంత్రాన్ని జపిస్తూ నడుస్తున్నా. కానీ తనేమీ పలకడం లేదు.

అలా నడుస్తూ, కొంచం దూరంలో కనిపిస్తున్న ఒక చెట్టు వైపు యధాలాపంగా దృష్టి సారించా. ఆ చెట్టు క్రింద ఒకమ్మాయి నిలబడి ఉంది. చీకట్లో ముఖం కనపడక ఎవరో తెలియడం లేదుగాని, మొత్తమ్మీద అమ్మాయే. చెట్టు మొద్దుకు ఆనుకొని నిలబడి ఉంది. ఇండియాలో లాగా 'ఎవరమ్మాయి నువ్వు? ఇంతరాత్రిపూట ఇక్కడేం పని?' గట్రా ప్రశ్నలు ఇక్కడ వెయ్యకూడదు. ఇతరుల వ్యవహారం మనకనవసరం. ఎవరిష్టం వాళ్ళది. అందుకని తలొంచుకుపోవాలి. అదే పని చేశా.

ఆ చెట్టు దాటుతూ ఉండగా, కర్ణపిశాచి ఒంటినుండి వచ్చే ఒక విధమైన వాసన గుప్పుమంది. విషయం అర్ధమైంది. అయినా సరే, తెలీనట్టు, నా దారిన నేను పోతున్నా.

'ఇక్కడివాళ్ళని అనవసరంగా పలకరించకూడదు గాని, ఆ రూలు మాకు వర్తించదు. చూసి కూడా చూడనట్టు పోతున్నావు. నాటకాలా?' అంటూ బాగా తెలిసిన కర్ణపిశాచి స్వరం వినిపించింది.

వెంటనే ఆగి, తనవైపు చూస్తూ, 'ఇందాకట్నుంచీ పిలుస్తున్నాను. అలా చెట్లకిందా పుట్లకిందా దాక్కొని ఉండకపోతే ఎదురుగా వచ్చి కనపడవచ్చు కదా?' అన్నాను.

'ఎక్కడికి రమ్మంటావు? మీ ఇంటికొచ్చి కనిపించనా? నీ పక్కనున్న శిష్యురాళ్ళు దడుసుకుంటారు. అందుకే నువ్వు వాకింగ్ కి బయల్దేరటం చూసి ఇక్కడ కాపుకాశా' అంది.

'సర్లే రా నడుద్దాం. ఏంటి విశేషాలు? ఈ మధ్యన దర్శనాలు లేవు?' అడిగా.

చెట్టు కిందనుంచి వెలుగులోకి వచ్చింది. తేరిపార చూస్తే, ఇండియాలో బాగా తెలిసిన ఒకమ్మాయిలా ఉంది.

'ఇదేంటి ఈ వేషం?' అడిగా.

'నా ఇష్టం. ఎప్పుడూ ఒకే వేషమైతే ఏం బాగుంటుంది? అందుకే కాసేపు సరదాగా నీకు తెలిసిన వేషంలో వచ్చా' అంది.

'సంగతులు చెప్పు' అన్నా నడుస్తూ.

'ప్రత్యేకంగా ఏమీ లేవు. నా పనేదో నేను చేసుకుంటున్నా. నువ్వు నన్ను పిలవడం లేదుకదా. నీ పనిలో నువ్వు బిజీ అయిపోయావు. కదిలించుకుని కనిపించడానికి నువ్వేమైనా ఇంద్రుడివా చంద్రుడివా?' అడిగింది నిర్లక్ష్యంగా.

నవ్వేసి, 'అంతేలే. చూశావుగా ఇక్కడేం చేస్తున్నానో' అన్నా.

'అన్నేళ్లు పడీపడీ సర్వీస్ చేసి చాలా కష్టపడ్డావుగా. ఇప్పుడైనా కాస్త రిలాక్స్ అవ్వు. మంచిదే, ఎంజాయ్ యువర్ లైఫ్' అంది.

 'ఊ అదే చేస్తున్నా' అన్నా.

'వచ్చి నెలైంది. ఏమన్నా తిరిగి చూశావా ఇక్కడ?' అడిగింది నవ్వుతూ.

నా సంగతి తెలిసికూడా జోకేస్తోందని అర్ధమైంది.

'ఆ బోల్డు చూశా. కాస్ట్ కో, క్రోగర్, వాల్ మార్ట్, హోల్ ఫుడ్స్, ఫ్రెష్ థైమ్ ఇలా ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే' అన్నా నవ్వుతూ.

'గొప్పగొప్ప చారిత్రక స్థలాలే చూశావ్. ఇవి చూచాక అమెరికాలో చూడ్డానికి ఇంకేముంటాయిలే? సరే ఎందుకు పిలిచావో చెప్పు మరి' అంది తనూ నవ్వుతూ.

'ఏం లేదు. ఊరకే చాలారోజులైంది కదా, కాసేపు మాట్లాడదామని పిలిచా. అంతే, నాకేముంటాయి నువ్వు చేసిపెట్టే పనులు?' అన్నా.

'అవునూ, నాదొక డౌటు. నీకు బోరు కొట్టడంలేదా? నాకు తెలిసిన ఒక కుటుంబం ఇలాగే అమెరికా అంటూ వచ్చి, మాట్లాట్టానికి దిక్కూ దివాణం లేదని, బయట స్వతంత్రంగా తిరగడానికి లేదని చెప్పి, వారానికే ఇండియా పారిపోయారు. బయటకు పోవు. టీవీ చూడవు. ఎవరితోనూ మాట్లాడవు. వచ్చి నెలైంది. ఎలా తోస్తోంది నీకు? బోరు కొట్టడం లేదా?' అడిగింది.

నవ్వాను.

'ఇక్కడ బోరు కొట్టుకోవల్సిన పని  లేదు. నీళ్ల సప్లై బాగానే ఉంది' అన్నా నవ్వుతూ.

'జోకులాపి విషయం చెప్పు. నేనేం అడుగుతున్నానో నీకర్థమైంది' అంది తను నడుస్తూ.

'ఇండియాలో ఎలా తోచిందో ఇక్కడా అలాగే తోస్తోంది. నన్నెవరూ తొయ్యనవసరం లేదు మొయ్యనవసరం లేదు. బయటవాటి మీద ఆధారపడి బ్రతుకుతూ, అదే బ్రతుకనుకుంటుంటేనే బోరు అనేది ఉంటుంది. నాకు నేనే ఆధారం. నాకు బోరేంటి? అసలు బోరంటే ఏంటి?' అన్నాను.

'అదికాదు. ఒక్కడివే నీలో నువ్వు ఎలా ఉంటావ్ రోజులు రోజులు?' అడిగింది.

'అన్నీ తిరిగి చూస్తుంటావ్ కదా? తెలీదా నీకు? నేనూ రెట్టించా.

'నువ్వేం చెబుతావో వినాలని?' అంది.

'నాకు మనుషులతో పనేముంది? ప్రకృతి ఉంది. నా మనసుంది. ఈ రెంటిలో తిరుగుతూ ఉంటా.  వద్దనుకుంటే నాలో నేనే ఉంటా. బోరేముంది?' అన్నా.

'మరి నన్నెందుకు పిలిచినట్టో ఇప్పుడు?' అడిగింది మళ్ళీ.

'కనిపించి చాలారోజులైంది కదా బతికావో చచ్చావో చూద్దామని' అన్నా.

'చచ్చి చాలా ఏళ్ళైందిలే గాని, నిజంగా పనేమీ లేకపోతే చెప్పు, పోతా. వేరే పనుంది' అంది.

'నాకంటే నువ్వే బిజీగా ఉన్నావే. నిన్ను చూస్తుంటే బాధనిపిస్తోంది. మాకు రిటైర్మెంటన్నా ఉంది. నీకదీ లేదు. సర్లే పోయిరా. నేనూ ఇంటికి పోతున్నా. లేటయితే ఇంట్లో కంగారు పడతారు' అన్నా.

'సరే ఉంటా' అని మరుక్షణం కనిపించడం మానేసింది. తనతోబాటే తన వాసనా మాయమైపోయింది.

అప్పటికే చాలా దూరం నడిచా. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. అర్ధరాత్రి అవుతోంది. చలి విపరీతంగా ఉంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి, అప్పుడప్పుడూ ఒకటో రెండో కార్లు మాత్రం పోతున్నాయి. అక్కడే కాసేపు చీకట్లో నేను కూడా ఒక పిశాచం లాగా నిలబడ్డా. కాసేపలా నించున్నాక, వెనక్కు తిరిగి  ఇంటివైపు నడక ప్రారంభించా.

'బోరు' అనేమాట ఎంత విచిత్రమైనదో? మనసు లాగే దానికీ ఉనికి లేదు. కానీ ప్రపంచంలో అందరినీ పిచ్చోళ్ళని చేసి ఆడిస్తోంది. పనీపాటా ఏదీ లేకపోయినా, బోరు కొడుతోందని చెప్పి, ఊరకే ఏవేవో పనులు కల్పించుకుని తిరుగుతూ ఉండే కోట్లాది మనుషులందరూ దాని బానిసలేగా? ఉన్నవాటికంటే లేనివే మనిషిని ఎక్కువగా బాధపెడతాయేమో? వెంటాడతాయేమో?

నిజానికి మనసూ లేదు, బోరూ లేదు. కానీ ఈ రెండూ కోట్లాది జనాన్ని పిచ్చోళ్ళని చేస్తున్నాయి, ఎంత విచిత్రం !!

బోరెక్కడుంది? అసలేంటది?

ఊరకే నడుస్తున్నా.

చూస్తుండగానే ఇల్లొచ్చేసింది.

తాపీగా నా గదికి చేరి నిద్రకుపక్రమించాను.