“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

21, సెప్టెంబర్ 2022, బుధవారం

మూడవ అమెరికా యాత్ర - 22 (డెట్రాయిట్ స్పిరిట్యువల్ రిట్రిట్ విజయవంతం)

సెప్టెంబర్ 14 బుధవారం నుండి, 18 తేదీ ఆదివారం వరకూ అయిదు రోజులపాటు డెట్రాయిట్ లో జరిగిన పంచవటి  స్పిరిట్యువల్ రిట్రిట్ విజయవంతమైంది.

డెట్రాయిట్ రాష్ట్రంలో వెస్ట్ బ్లూంఫీల్డ్ అనే ఒక టౌన్ ఉంది. దాని దగ్గరలో వోల్వరీన్ లేక్ అని ఒక సరస్సు ఉంది. ఆ సరస్సు చుట్టూ వెకేషన్ హోమ్స్ ఉంటాయి. అంటే, సిటీలలో ఉండేవాళ్ళు వీకెండ్స్ లోనో, లేకపోతే సరదాగా కొన్నాళ్ళు గడపడానికో, కొండలలోనో, సర్సస్సుల ఒడ్డునో, వెకేషన్ హోమ్స్ కట్టుకుంటారు. మిగతా రోజులలో అవి ఖాళీగానే ఉంటాయి. అప్పుడప్పుడూ వాళ్లొచ్చి సరదాగా కొన్ని రోజులు ఇక్కడ గడిపి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళలో చాలామందికి వాటర్ స్కూటర్లు, మోటార్ బోట్స్ ఉంటాయి. వాటిల్లో ఎక్కి ఆ సరస్సులో సరదాగా తాగుతూ, తింటూ, డాన్సులు చేస్తూ విహరిస్తూ ఉంటారు. 

అలాంటి ఒక వెకేషన్ హోమ్ ను మా స్పిరిట్యువల్ రిట్రీట్ కోసం ఐదురోజులపాటు తీసుకున్నాం. ఈ ఇల్లు వాల్వరీన్ లేక్ ఒడ్డున ఉన్నది. కనీసం నూరేళ్ళ క్రితం కట్టిన ఇల్లని కొందరన్నారు. ఇంటి పక్కనే ఉన్న ఆకాశాన్నంటుతున్న పైన్ వృక్షాల వయసు లెక్కిస్తే కనీసం 150 ఏళ్ళుగా వచ్చింది.  

ప్రస్తుతం మేముంటున్న ట్రాయ్ సిటీ (డెట్రాయిట్) నుండి అది కేవలం గంట ప్రయాణదూరంలో ఉంది. బుధవారం సాయంత్రం డెట్రాయిట్లో ఉన్నవాళ్ళం అక్కడకు చేరుకున్నాం. అప్పటినుంచీ మిగతా మెంబర్స్ రావడం మొదలుపెట్టారు. డల్లాస్, హ్యూస్టన్, సాల్ట్ లేక్ సిటీ, శాక్రమెంటోల నుండి వచ్చిన మెంబర్స్ అక్కడకు చేరుకున్నారు. డెట్రాయిట్ నుండి లోకల్ గా మేమున్నాం. అందరం కలసి ఒక కుటుంబంగా ఐదురోజులపాటు అక్కడ గడిపాము.

ఈ అయిదురోజులలో అందరమూ, కుటుంబ బాధ్యతలు, ఆఫీసు బాధ్యతలు, అక్కడి చిరాకులు, మిగతా వ్యాపకాలన్నింటినీ మర్చిపోయి పూర్తిగా శాంతియుతమైన ఆశ్రమ జీవితాన్ని గడిపాము.  ఆశ్రమమంటే మళ్ళీ ఏవో రూల్స్ తో కూడిన సీరియస్ జీవితమనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. కలసిమెలసి మాట్లాడుకుంటూ, జోకులతో సరదాగా ఈ ఐదురోజులు గడిచాయి. మళ్ళీ పూర్తిగా సరదా అనుకున్నా తప్పే.  పైకి సరదాగా ఉన్నట్లే కనిపించినా, అంతర్లీనంగా ఆధ్యాత్మిక సరస్వతి ప్రవహిస్తూనే ఉంటుంది.

అసలైన ఆధ్యాత్మిక జీవితమంటే ఎలా ఉంటుందో ఈ అయిదు రోజులలో అమెరికా పంచవటి మెంబర్స్ రుచిచూచారు.

పరిమిత ఆహారం, ప్రతిరోజూ పంచవటికి ప్రత్యేకమైన యోగాభ్యాసం, ధ్యానం, చెట్లదారులలో వాకింగ్, ఆధ్యాత్మికచర్చలు, సందేహాలు సమాధానాలు, అందరూ కలసి వంట చేసుకోవడం, మాట్లాడుకుంటూ తినడం, పనులన్నీ పంచుకుని చేసుకోవడం - ఈ అయిదురోజులు ఎప్పుడు గడిచిపోయాయో తెలియలేదు. ఒక కుటుంబ సభ్యుల మధ్యలో కూడా అలాంటి అవగాహన, ప్రేమ, సరదా ఉండదు. అలా గడిచాయి.

నలభైఏళ్ల సుదీర్ఘ సాధనామార్గంలో నడుస్తూ నేను ప్రాక్టికల్ గా నేర్చుకున్న, డిజైన్ చేసిన సాధనావిధానాలలో ఒక ముఖ్యమైన ధ్యానవిధానాన్ని వీరికి ఉపదేశించాను. సాధన చేయించాను. అంతేగాక, పంచవటి సాధనా మార్గాన్ని స్పష్టంగా వీరికి వివరించాను. దానితో మొదటిసారి వచ్చిన కొందరు కొత్తవాళ్లకు నేనంటే ఉన్న అనుమానాలు, భ్రమలు, భయాలు పటాపంచలై పోయాయి.

తిరిగి వచ్చే నెలలో డెట్రాయిట్ గాంగెస్ లో జరుగబోతున్న రిట్రీట్ లో కలుసుకుందామన్న నిశ్చయంతో అందరం ఆదివారం సాయంత్రానికి తిరుగుప్రయాణం మొదలుపెట్టారు. మళ్ళీ సోమవారం ఎవరి ఉద్యోగాలకు వాళ్ళు పోవాలికదా !

మేము కొంతమంది లోకల్ వాళ్ళం మాత్రం ఆదివారం రాత్రి కూడా అక్కడే ఉండి, సోమవారం ఉదయం బయల్దేరి వెనక్కు వచ్చేశాము. జనసంచారం లేని పెద్ద పెద్ద ఇళ్లలో రాత్రిళ్ళు ఒక్కడినే ఉండటం నాకిష్టం కాబట్టి రాత్రికి నేనక్కడే ఉన్నాను.  ఇందులో  కొసమెరుపేంటంటే, మనుషులు ఉండని మూడంతస్తుల ఈ ఏకాంతగృహంలో, నాకేమీ దయ్యాలు భూతాలు కనిపించలేదు. బహుశా నెనొచ్చానని పారిపోయాయేమో తెలియదు. మొత్తం మీద ఇంటి ఆరా బాగుంది. ఒక్క రూమ్ లో మాత్రం కొంచం నెగటివ్ ఆరా ఉంది. కానీ అది ఆత్మ కాదు.

ఇంతటితో మూడవ అమెరికా యాత్రలో మొదటి రిట్రీట్ విజయవంతంగా ముగిసింది.

రిట్రీట్ ఫోటోలలో కొన్నింటిని ఇక్కడ చూడండి.