“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

13, జులై 2022, బుధవారం

UG గారి పుట్టినరోజు - ఆధ్యాత్మిక సంభాషణ - 6

'సరే. ఇవాళ UG  గారి పుట్టినరోజు కదా. ఆయన గురించి నీకు తెలిసిన విశేషాలు చెప్పు' అడిగాను.

'జిల్లెళ్ళమూడి అమ్మగారు పోయాక, ఆమె భక్తులలో కొంతమంది UG గారి దగ్గరకు చేరారు. నెల్లూరు డాక్టరు గారు, వాళ్ళ అబ్బాయి వారిలో ఉన్నారు' అన్నాడు.

'అవునా? అదంతా మామూలే. సగటు మనుషులకు కావలసింది ఒక మానసికఆసరాయే గాని సత్యం కాదు. సత్యాన్వేషకులు అలా గురువులను మార్చరు. అది సరే, అమ్మగారి గురించి UG ఏమనేవారు?' అడిగాను.

'నాకు తెలీదు. బహుశా చంద్రశేఖర్ గారికి తెలిసుంటుంది' అన్నాడు.

'ఆయనతో నేను గతంలో మాట్లాడాను. నీకు పరిచయం ఉందా?' అడిగాను.

'ఉంది. నేను కూడా ఆయనతో మాట్లాడాను. ఆయన వీడియో మీటింగ్స్ పెడుతూ ఉంటారు. ఒకరి రెండు అటెండ్ అయ్యాను. ఒక విచిత్రాన్ని గమనించాను. మహనీయులు పోయాక వారితో ఉన్నవాళ్లు వేరే వాళ్ళ దగ్గరకు షిఫ్ట్ అవుతూ ఉంటారు. అమ్మగారు పోయాక భరద్వాజగారు జిల్లెళ్ళమూడి వదిలేశారు. అమ్మ భక్తులు చాలామంది అరుణాచలం చేరుకున్నారు. లేదా కొంతమంది UG గారిని ఆశ్రయించారు. రమణమహర్షి పోయాక ఆయన భక్తులందరూ అరుణాచలం వదిలి వెళ్లిపోయారు' అన్నాడు.

'కానీ చలం ఒక్కడే అక్కడ ఉండిపోయాడు' అన్నాను.

'చలమూ, సౌరిస్ గారూ UG కి చాలా ఆకర్షితులైనారు. UG నడుస్తుంటే సాక్షాత్తు శివుడే నడుస్తున్నాడని వాళ్ళు అనుకునేవారు' అన్నాడు.

'మరి వాళ్ళు UG గారినెందుకు అనుసరించలేదు? సౌరిస్ గారు కూడా తన మార్గంలో తాను నడిచారు గాని UG గారి మార్గంలో పోలేదు. UG గారు కూడా, ఇండియా వచ్చినప్పుడల్లా, చలాన్ని చూడటం కోసమని బెంగుళూరు నుంచి అరుణాచలం చాలాసార్లు వెళ్లేవారని చంద్రశేఖర్ గారు నాతో అన్నారు' అన్నాను.

'తలైయార్ ఖాన్ అనే ఆమె రమణమహర్షి భక్తురాలు. అరుణాచలం కొండ పక్కనే ఒక ఆశ్రమాన్ని కట్టించింది. ఆ డాబాపైకెక్కితే, అరుణాచలం కొండ ప్రక్కనే కనిపిస్తుంది. ఆ ఆశ్రమాన్ని UG కి ఇస్తానని, అక్కడ సెటిలవ్వమని తలైయార్ ఖాన్  UG గారిని అడిగింది.

దానికి UG, 'ఒక్కరోజులో ఈ ఆశ్రమాన్ని prostitution center గా మారుస్తాను' అన్నాడు. ఆ మాటతో తలైయార్ ఖాన్ నిర్ఘాంతపోయింది. UG ఆ ఆశ్రమాన్ని తీసుకోలేదు. తరువాత ఆమె అక్కడే చనిపోయింది. ప్రస్తుతం ఆమె సమాధి అక్కడే ఉంది' అన్నాడు వెంకట్.

'ఆయనెందుకలా అన్నారు?' అడిగాను.

'తెలీదు. ఆయన కొన్నిసార్లు అలా మాట్లాడేవారు' అన్నాడు.

'గురువులందరినీ ఆయన తెగ తిట్టేవారు కదా?' అన్నాను నేను.

'అవును. మామూలు మాటలు కాదు. బూతులు వాడేవాడు. అంతేకాదు ఆయన దగ్గరకు చాలామంది నాడీ జ్యోతిష్కులు వచ్చి ఆయన పూర్వజన్మలగురించి నాడీగ్రంధాలు చదివేవారు' అన్నాడు.

'అవును. విన్నాను. అందులో ఏమొచ్చేది?' అడిగాను.

'ఒకానొక జన్మలో UG గారు రామానుజాచార్యులవారి శిష్యుడని, ప్రస్తుతం ఈ జన్మలో ఈయనదగ్గరకొచ్చే ఇంకొకాయన శైవుడని, అప్పట్లో వైష్ణవులకూ శైవులకూ గొడవలొస్తే, వీరిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి వాటిని చక్కదిద్దారని, అందుకే మళ్ళీ ఈ జన్మలో కలిశారని ఒక నాడీగ్రంధం చెప్పింది. ఎక్కువగా భువనేశ్వరీ అమ్మవారు ఆ నాడీ లోకి వచ్చి, UG గారి గురించి ' ఇతను నా బిడ్డ. ఇతని స్థితి చాలా గొప్పది' లాంటి మాటలు చెప్పేది' అన్నాడు.

'ఊ. బాగానే ఉంది' అన్నాను.

'శ్యామల అని ఒకామె ఉండేది. UG గారిని అనుసరించేది. UG గారు చనిపోకముందే ఆమె యాక్సిడెంట్ లో చనిపోయింది. 'శ్యామల ఎందుకలా చనిపోయింది?' అని UG చాలాసార్లు అడిగేవారు. తాను చనిపోబోయేముందు చంద్రశేఖర్ గారిని కూడా చాలాసార్లు ఇదేమాట అడిగారని అంటారు' అన్నాడు వెంకట్.

'అదేంటి? తన భార్య ఇండియా వెళ్లిపోతున్నా UG గారు అమెరికాలోనే ఉండిపోయారు. ఆమె పిచ్చెక్కి ఇండియాలో చనిపోయినా ఆయన యూరప్ లోనే ఉండిపోయారు. బాధకూడా పడలేదు. అలాంటివ్యక్తి, ఎవరో భక్తురాలు చనిపోతే  అంతగా ఎందుకు ఫీలయ్యారు? ఆఫ్ కోర్స్ భక్తురాలు అనే మాట ఆయనకు నచ్చదనుకో. మాటవరసకు మనం అలా అనుకోవాలి మరి' అడిగాను.

'తెలీదు. కానీ ఆయన యూరప్ లో ఉన్నపుడు ఒక రాత్రి ఒక యూదువనితతో పడక పంచుకున్నాడు. ఆ తర్వాత ఎందుకలా చేశానా అని చాలా మధన పడ్డాడు. అందుకే తన భార్యను అలా వదిలేసి ఉండవచ్చు' అన్నాడు.

నేను నవ్వాను. 'అదేంటి? దానికీ దీనికీ సంబంధం ఏంటి? ఎవరో యూదు అమ్మాయితో ఒక రాత్రి గడిపితే, భార్యను  వదిలేయాల్సిన పనేంటి? అది కరెక్ట్ కాదుకదా? అదే రూలైతే, ప్రపంచంలో అందరు మొగాళ్ళూ పెళ్లాలను వదిలేయాల్సి ఉంటుంది. చాలామంది పెళ్లాలు కూడా తమ మొగుళ్లను వదిలేయాల్సి ఉంటుంది' అడిగాను.

'ఏమో నాకు తెలీదు' అన్నాడు.

'అంటే, ఆయనకు అర్ధం కాని విషయాలు కూడా చాలా ఉన్నాయనే కదా మీరు చెప్పినవాటి అర్ధం?' అన్నాను.

'కావచ్చు. ఆయన చనిపోబోయే ముందు ఒక తెల్లని బట్టలలో ఉన్న దేవత ఆయనకు కనిపించి, 'నీకు ఆయుస్సు ఇంకా కావాలా? ఇంకా కొన్నాళ్ళుంటావా? పెంచమంటే చెప్పు పెంచుతాను' అందట. దానికి UG 'వద్దు. నాకు ఉండాలని లేదు' అన్నాడట' చెప్పాడు వెంకట్.

'ఇది నేను వినలేదు. మరి వెంటనే UG చనిపోతే, ఈ విషయం బయటకెలా తెలిసింది? మూడోవ్యక్తి ఎవరు విన్నారు? ఎవరు చెప్పారు?' అడిగాను.

'అంటే, వెంటనే UG చనిపోలేదు. ఇంకా కొన్ని రోజులలో పోతాడనగా ఈ సంఘటన జరిగింది. ఆయనే ఈ విషయం చెప్పాట్ట' అన్నాడు.

'నేను విన్నదేమంటే, ఆయన బాత్రూం లో బక్కెట్టు లేపబోతూ కాలుజారి పడ్డాడు. కాలు ఫ్రాక్చర్ అయింది. అలా జరగడం అది రెండోసారి. ఆ తరువాత ఆయన తిండి తినడం మానేశాడు. చావును ఆహ్వానించాడు. వారానికో రెండు వారాలకో పోయాడు. ఈ మధ్యలో ఈ దేవత కనిపించిందా?' అడిగాను.

'ఏమో మరి. కానీ ఆయన సమక్షంలో చాలా మహాత్యాలు జరిగాయి. UG గారు కొన్ని కేన్సర్ కేసులను కూడా తగ్గించారు. కేన్సర్ తో బాధపడుతున్న ఒక వ్యక్తి తలమీద చెయ్యిపెట్టి ఒక అరగంటో ఏమో ఉన్నాడాయన. అతని కేన్సర్ మాయమైంది. కానీ అందరికీ ఆయనలా చెయ్యలేదు' అన్నాడు.

'ఎందుకని?' అడిగాను.

'ఏమో నాకు తెలీదు' అన్నాడు.

'ఇటలీలో కదా ఆయన పోయింది?' అడిగాను.

'అవును'

'మహేష్ భట్ ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. ఆయన అంత్యక్రియలు చేసింది మహేషే' అన్నాను.

ఇదంతా వింటున్న మా అమ్మాయి ఇలా అంది 'UG గారి ఫోటో పెట్టి, నిన్న పూజా భట్ మెసేజ్ పెట్టింది నాన్నా, 'The father my father never had' అని. 

'అవును. వాళ్ళ ఫేమిలీకి UG గారంటే చాలా భక్తి' అన్నాను.

'UG గారంటే మహేష్ భట్ కి చాలా భక్తి. UG గారు కూడా మహేష్ భట్ తో చాలా చనువుగా ఉండేవారు. UG గారు ఎక్కడుంటే అక్కడకు ఆత్మలు వచ్చి ఆయనకు కనిపిస్తూ ఉండేవి. త్రాచుపాములు కూడా ఆయనెక్కడుంటే అక్కడకు వచ్చేవి. ఒకసారి UG ఏదో విషయంలో చాలా కోపంగా ఉన్నాడు. అప్పుడు జిడ్డు కృష్ణమూర్తి యాస్ట్రల్ ట్రావెల్లో వచ్చి UG కి కనిపించి Cool down Old man అని అన్నట్లుగా జరుగుతుంది. అది చూచి UG కి మరీ కోపం వచ్చి ఆ రోజంతా జిడ్డుని తిడుతూనే ఉన్నాట్ట' అన్నాడు వెంకట్.

'జిల్లెళ్ళమూడి అమ్మగారు కూడా 'వాడిని ఇక్కడకు తీసుకురండి ఒకసారి' అన్నారట. చంద్రశేఖర్ గారూ, శ్రీపాద గారూ ప్రయత్నం చేశారట కూడా. కానీ UG జిల్లెళ్ళమూడికి రాలేదు'  అన్నా నేను.

'గురువులందరినీ జిడ్డు తిడుతున్నాడని ఎవరో అమ్మతో అంటే, 'జిడ్డును పోగొట్టడానికి ఉప్పొస్తుందిలే' అందిట. UG ఇంటిపేరు ఉప్పులూరు కదా ! తరువాత కొంతకాలానికి UG వచ్చి జిడ్డును తిట్టడం మొదలుపెట్టాడు' అన్నాడు.

నేను మౌనంగా ఉన్నాను. 

'జిడ్డును ఉప్పు పోగొట్టింది. మరి ఉప్పు ఘాటును తగ్గించడానికి ఇంకెవరు రావాలో?' అని మనసులో అనుకున్నా.

'తనకు కలిగిన కెలామిటీ కూడా a-casual అని UG అనేవారు. ఇది ఎవరికైనా కలగవచ్చు అని కూడా ఆయన అనేవారు. అలాగే, Karl Renz అనే ఆయనకీ కూడా ఈ కెలామిటీ కలిగింది. ఆయనక్కూడా చీకట్లో ఉన్నపుడు చర్మం కాంతితో వెలగడం, ఒంటినుండి బూడిద రాలడం మొదలైన విచిత్రాలు జరిగేవి. UG గారికి కూడా ఇవి జరిగేవి. 'నాలో ఆలోచన పుట్టీపుట్టగానే నాశనమైపోతుంది. అలా నాశనమైన ఆలోచన ఒంటిమీద బూడిదగా రాలుతుంది' అని UG దానికి వివరణనిచ్చేవారు' అన్నాడు వెంకట్.

'అవును. ఇంతకీ ఈ Karl Renz అనే ఆయన ఉన్నాడా ఇప్పుడు' అడిగాను.

'ఉన్నాడు. ఏడాదికి ఆర్నెల్లు అరుణాచలంలో ఉంటాడు. మిగతా ఆర్నెల్లు విదేశాలలో ఉంటాడు. ఆయన మీటింగ్స్ అరుణాచలంలో పెట్టినపుడు ఫ్రీగా అందరినీ రానిస్తాడు. బయటైతే టికెట్ ఉంటుంది. యూట్యూబ్ లో ఆయన ప్రసంగాలున్నాయి' అన్నాడు వెంకట్.

'టిక్కెట్టా? ఆ ఖర్మేంటి? సరేలే ఆయనిష్టం ఆయనది. ఆయనకూడా బ్రతకాలిగా మరి ! వేరే ఆదాయం లేదేమో?' అన్నాను.

కాసేపాగి, UG గారికి అసలేం జరిగిందో, Calamity అనేది ఎందుకొస్తుందో, ఆయనెందుకలా విచిత్రంగా ప్రవర్తించేవాడో, అసలు సాధనామార్గంలో ఉన్నవారికి ఎందుకలా జరుగుతుందో వెంకట్ కు వివరించాను. ఈ వివరాలు యోగరహస్యాలు, ఇవి అందరికీ చెప్పేవి కానందున ఇక్కడ  వ్రాయడం లేదు.

ఆ తరువాత, 'శ్రీవిద్యారహస్యం' 'లలితా సహస్రనామ రహస్యార్థ ప్రదీపిక' అనే రెండు పుస్తకాలు తనకు గిఫ్ట్ గా ఇచ్చి, 'చదువు. డౌట్లుంటే అడుగు. ఇక బయల్దేరు' అని సాగనంపాను.

(అయిపోయింది)