“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

11, జులై 2022, సోమవారం

UG గారి పుట్టినరోజు - ఆధ్యాత్మిక సంభాషణ - 3

'నీ సమస్య నాకర్ధమైంది. చెప్తా, జాగ్రత్తగా అర్ధం చేసుకుంటూ విను' అని చెప్పడం మొదలుపెట్టా.

మన వేదాంతతత్త్వంలో, విధివాదము, కర్మవాదము అని రెండు వాదాలున్నాయి. అందులో విధివాదాన్ని నువ్వు చెప్పావు.  అంటే - 'ముందే అంతా నిర్ణయించబడి ఉంటుంది, ఇక్కడ నీ పాత్ర ఏమీ లేదు, నీ జీవితంలో కూడా నీ పాత్ర ఏమీ లేదు', అని.

రెండవది కర్మవాదం. దీనిప్రకారం, 'నువ్వు చేసినదే నీకు తిరిగి వస్తుంది. నువ్వు చేసుకున్నదే నువ్వు అనుభవిస్తావు. అది ఈ జన్మలో రావచ్చు. లేదా మరుజన్మలో రావచ్చు' ఇది కర్మవాదం.

ఈ రెండూ ఒకదానికొకటి పరస్పర విరుద్ధములైన సిద్ధాంతాలుగా కనిపిస్తాయి. ఒకటి నిజమైతే మరొకటి నిజం కాదని అనిపిస్తుంది' అన్నాను.

నన్ను మధ్యలో ఆపుతూ, 'జిల్లెళ్ళమూడి అమ్మగారు కూడా, 'అంతా వాడు చేయిస్తున్నాడనైనా అనుకో, లేదా అంతా నువ్వే చేస్తున్నావనైనా అనుకో' అన్నారు కదా' అన్నాడు వెంకట్.

'అవును. అన్నారు. అదేంటో చెప్తా విను. అంతా వాడు చేస్తున్నాడనో, చేయిస్తున్నాడనో అనుకున్నపుడు నీ 'అహం' నాశనమౌతుంది. ఎందుకంటే నీ పాత్ర ఏమీ లేదు కాబట్టి. ఇప్పుడలా అనుకోవడానికి అడ్డుపడుతూ, ఇబ్బందిపడుతోంది నీ అహమే.  అలాకాకుండా, 'అంతా నేనే చేస్తున్నాను'  అనుకుంటే, అప్పుడు నీ పనులకు బాధ్యత నీదే. నువ్వు పడుతున్న బాధలకు వేరెవరూ కారకులు కారు. నువ్వే కారకుడివి.  కాబట్టి అప్పుడూ నీకు బాధపడాల్సిన అవసరం ఉండదు. ఇంకెవరినీ నిందించవలసిన పని కూడా లేదు.

మొదటిదాంట్లో నీ అహమే అదృశ్యమౌతుంది. రెండో దాంట్లో నీ బాధ అదృశ్యమౌతుంది. బాధకికూడా అహమే కదా కారణం ! ఎలా చూచినా, నీ జీవితం ఎలాంటి బాధా లేకుండా సాఫీగా సాగుతుంది. అందుకని అమ్మ అలా చెప్పారు. కానీ అందరూ ఆమె మాటలని కోట్ చేసేవారేగాని ఆచరించేవారేరీ? ఇతరులకి చెప్పడం తేలిక, మనం ఆచరించడం కష్టం కదా !

ఈ రెండూ కాకుండా ఇంకొక సిద్దాంతం కూడా ఉంది. అదేంటో చెప్తా విను.

సృష్టి pre determined కాదు. దీనికి స్క్రిప్ట్ రైటర్ అంటూ ఎవడూ లేడు. నువ్వే ఆ రైటర్ వి. ఈ క్షణానికి ఇలా జరుగుతుంది.  అంతే, ర్యాండమ్ గా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. వీటికి ముందూ ఉండదు, వెనుకా ఉండదు. ఆ క్షణానికి వచ్చిన ఆలోచనను బట్టి ఆ ఈవెంట్ జరుగుతుంది. అంతే ! మిగతాదంతా నువ్వు అల్లుకునే కధ. దానిచుట్టూ నీ మనసు అల్లుకునే కధ. సృష్టిలో అంతా a-casual మాత్రమే. సృష్టికొక రీజనూ రైమూ ఏమీ ఉండవు. అంతేకాదు వరుసగా జరిగే రెండు Events మధ్యన connecitivity కూడా ఉండదు. ఉందని నువ్వు ఊహించుకుంటావు. దీనినే UG గారు చెప్పారు. అయితే, ఇది జీర్ణం కావడం చాలా కష్టం. ఇంకా, ఇది సంపూర్ణసత్యమా కాదా అనేది తర్వాత చెబుతా. 

ఉదాహరణకి, 'చనిపోయాక మనం ఉంటామా?' అని UG గారిని ఒకరడిగారు. ఆయనిలా అన్నారు, 'అసలిప్పుడున్నావా నువ్వు?' అని.

'ఉన్నాను కదా?' అంటాడు వాడు.

'నువ్వు లేవు, 'ఉన్నాను' అని అనుకుంటున్నావు' అంటాడు UG.

ఎలా అర్ధం చేసుకుంటావు దీన్ని? 

నీ దృష్టిలో నువ్వు సత్యం. కానీ UG దృష్టిలో నువ్వు సత్యం కాదు. నీ ఉనికి ఆయనకు సత్యం కాదు. నీకిలా అనిపిస్తున్నది. ఆయనకు అలా కనిపిస్తున్నది. అదాయన దర్శనం. ఆ standpoint నుంచి ఆయన మాట్లాడతాడు. అది నీకు అయోమయంగా అనిపిస్తుంది.

గతంలో 'రా' అని ఒకమ్మాయి నాతో మాట్లాడుతూ ఉండేది. చాలా పెద్ద వేదాంతం మాట్లాడేది. ప్రతివారినీ విమర్శించేది. తన గురించి బ్లాగులో రాస్తే మాత్రం గోలగోల చేసేది, 'మీరు రాసేవన్నీ మా బంధువులు నా స్నేహితులు చదువుతారు, ఎందుకు నా గురించి రాస్తారు? అవన్నీ తీసెయ్యండి' అంటూ మెయిల్సిచ్చేది.

ఆమెతో నేనిలా అన్నాను, 'ఆత్మంటావు, పరమాత్మంటావు. ఇంకేదో అంటావు. మళ్ళీ లోకానికి భయపడతావెందుకు?' 

దానికామె, 'నాకు సంసారం ఉంది, మొగుడు పిల్లలు ఉన్నారు' అన్నది. 

'మరి సంసారానికి అంత భయపడేదానికి ఆధ్యాత్మికం ఎందుకు? అంత హై ఫిలాసఫీ మాట్లాడేవాళ్ళకు లోకభయమేంటి?' అని నేనడిగాను.

జవాబు లేదు.

నలుగురిలో ఒక గురువుగా చెలామణీ కావాలన్న కోరిక ఆమెలో ఉండేది. తన అసలు స్థితేంటో బ్లాగులో నేను వ్రాస్తే ఆమె తట్టుకోలేకపోయేది. నలుగురిలో, ముఖ్యంగా ఆమె సర్కిల్లో చులకన అయిపోతానని ఆమె భయం.

చాలామంది ఇంతే, జీవితం కంటే ఆధ్యాత్మికం భిన్నమని అనుకుంటారు. రెండూ ఒకటే అని నేనంటాను. 'ఇంతకంటే ఇంకేదో ఉందని నేననుకోవడం లేదు నాన్నా' అని జిల్లెళ్ళమూడి అమ్మగారు అనేవారు. నాదీ అదే మాట.

జరిగే ఈవెంట్స్ కి ఒక రూలూ రైమూ పాస్థూ ఫ్యూచరూ లేకపోతే, అది pre determined కాకపోతే, శ్రీరామ్ సార్ లాంటివాళ్లు భవిష్యత్తును ఎలా చెప్పగలుగుతారు మరి? అని నీకు డౌటు రావచ్చు. ఆయనెలా చెబుతారో నాకనవసరం. వాళ్లకు సర్దిఫికెట్ ఇవ్వాల్సిన పని నాకేంటి? అనేకరకాలుగా అలా చెప్పవచ్చు. కర్ణపిశాచి సిద్ధి ఉన్నా చెప్పవచ్చు. లేదా ఆధ్యాత్మికంగా పూర్ణసిద్ధి ఉన్నా చెప్పవచ్చు. ఈ రెండు బిందువుల మధ్యలో ఉన్న అనేక లెవల్స్ లో అనేక పద్ధతులను ఉపయోగించి అలా చెప్పవచ్చు. భవిష్యత్తును దర్శించడం పెద్ద గొప్పేమీ కాదు. నిజమైన సాధనామార్గంలో అది చాలా చిన్నవిషయం.

ఒక విధానంలో, అంటే, హయ్యెస్ట్ స్పిరిట్యువల్ విధానంలో, అదెలా జరుగుతుందో చెబుతా విను.

యూనివర్సల్ విల్ అనేది ఒక పెద్ద వృత్తం అనుకో. నీ ఇండివిడ్యువల్ విల్ అనేది అందులో ఉన్న చిన్న వృత్తం అనుకో. పెద్ద వృత్తానికి పాస్టు, ప్రెసెంట్, ఫ్యూచరూ ఏవీ లేవు. చిన్నదానికి ఉన్నాయి. ఇప్పుడు, మనుషులకయ్యే జ్ఞానోదయం లేదా Enlightenment అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, నిదానంగా మెట్టుమెట్టుగా జరిగే జ్ఞానోదయం రెండు, హఠాత్తుగా జరిగే జ్ఞానోదయం. వీటిని gradual enlightenment, sudden enlightenment అంటారు. రెండో రకంలో నడిచేవారు ఉన్నట్టుండి చిన్న వృత్తంలోనుంచి పెద్ద వృత్తంలోకి టాంజెన్షియల్ గా వెళ్ళిపోతారు. వారికేమౌతుంది? అప్పటిదాకా ఉన్న గతం, వర్తమానం, భవిష్యత్తులు వారికి ఉన్నట్టుండి ఒకటే అయిపోతాయి. ఇదంతా వినడానికి సైన్స్ ఫిక్షన్ సినిమా లాగా , టైం ట్రావెల్ లాగా అనిపిస్తుంది. కానీ ఇది నిజంగా జరుగుతుంది. వాళ్ళ టైం లో ఈ మూడు డివిజన్స్ ఉండవు. అంతా ఒకేసారి జరుగుతున్నట్లు వాళ్ళు చూస్తారు. యూని డైమెన్షనల్ నుండి వారి దృష్టి మల్టి డైమెన్షనల్ అవుతుంది. కనుక మీరనుకుంటున్న భవిష్యత్తు కూడా వాళ్లకు ఇప్పుడే ఇక్కడే జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది.  దాన్ని నీకు చెప్పారనుకో, లేదా ఒక కాయితం మీద వ్రాసి పెట్టారనుకో, నీ టైం ఫ్రేములో ముందుముందు ఆ సంఘటన జరిగినప్పుడు నువ్వా కాయితం తెరచి చూచి బిత్తరపోతావు.  నీకది ఎంతో అద్భుతంలాగా కనిపిస్తుంది. కానీ వాళ్ళకది మామూలుగా ఉంటుంది. అందులో వాళ్ళకేమీ అద్భుతం కనపడదు. 'అద్భుతం' అనే భావమే వారికి ఉండదు. శ్రీరామ్ సార్ స్థితి ఏమిటో నాకు తెలీదు. ఇదే విధానంలో ఆయన చూచి చెప్పాడో లేక ఇంకోవిధంగా చెప్పగలిగాడో నాకు తెలీదు. నాకనవసరం కూడా.

నువ్వు చెప్పిన వేదవ్యాస, భరద్వాజ లాంటివాళ్ళు మహిమలు, మహత్యాలు, లోకాలు, ఆత్మలు, పునర్జన్మలు, దర్శనాలు, పనులు కావడాలు, రోడ్లపక్కన తిరిగే అవధూతలు మొదలైన చెత్తకు చాలా ప్రాముఖ్యతనిచ్చారు. సాయిబాబాను దేవుడిగా ప్రొజెక్ట్ చేసి హిందూసమాజాన్ని చెడగొట్టడంలో వీళ్ళ పాత్ర ఎంతో ఉంది. అలాగే, శ్రీరామ్ సార్ గురించి చెప్పబడే పై ఈవెంట్ ను వాళ్ళు సంభ్రమాశ్చర్యాలతో చూశారు. వాళ్ళ అనుచరులూ అలాగే అయ్యారు. ఇప్పటికీ ప్రచారాలు చేసుకుంటూ మురిసిపోతున్నారు. ఇది అసలైన ఆధ్యాత్మికత కాదు. 

ఇంకా విను. సృష్టినీ జీవితాన్నీ నువ్వెలా తీసుకున్నా, అంటే, pre-determined గా తీసుకున్నా, నీ self effort గా తీసుకున్నా, లేదంటే, random happening గా తీసుకున్నా, ఒకటి మాత్రం నిజం. నువ్వు బ్రతుకున్న విధానంలో తప్ప వేరే విధంగా నువ్వు బ్రతకలేవు. ఒకవేళ వేరే విధంగా బ్రతికినా, అలా కాకుండా ఇంకో విధంగా బ్రతకలేవు. పోనీ అలాగే అనుకున్నా, అలా ఎన్ని విధాలుగా బ్రతకగలవు? ఎలా బ్రతికినా తేడా ఏమీ ఉండదు. బ్రతకడం తప్పదు కదా. చావడం తప్పదు కదా. కనుక నువ్వు నువ్వుగానే బ్రతకాలి. వేరే దారి నీకు లేదు.

ఒకవేళ జీవితాన్ని pre determined కోణంలోనే నువ్వు చూచావనుకో. దేవుడో దయ్యమో లేదా ఇంకెవరో వ్రాసిన ఆ స్క్రిప్ట్ ఏంటో నీకెలా తెలుస్తుంది? అది తెలిసేటంతవరకూ బాత్రూం కెళ్లకుండా బిగబట్టుకుంటావా? కుదరదు కదా. ఈలోపల నీ ప్యాంట్ తడిసిపోతుంది. జీవితాన్ని నువ్వెలా తీసుకున్నప్పటికీ, నీ ఆలోచన ప్రకారమే, నీ అనుభూతి ప్రకారమే నువ్వు పోవాలి. ఆ ఆలోచన నీదైనా, లేక, దేవుడు ముందే స్క్రిప్ట్ రాసినదైనా, ప్రస్తుతం నువ్వేమీ చెయ్యలేవు. పోనీ, నువ్వు నువ్వులా కాకుండా ఇంకోలా ఆలోచించగలవా? ప్రయత్నించి చూడు. నీ వల్లకాదు. ఆ 'ఇంకోలా' అనేది కూడా ముందే నిర్ణయింపబడి ఉందేమో? నీకెలా తెలుస్తుంది?

శ్రీరామ్ సార్  చెప్పినా, నేను చెప్పినా, ఇంకోరు చెప్పినా, నీకున్నది రెండే మార్గాలు. ఒకటి, ఒక నిజమైన గురువును ఆశ్రయించి ఆయన చెప్పినట్లు సాధన చెయ్యడం. ఎదగడం. ఆత్మానుభూతిని పొందటం. అలా చెయ్యలేకపోతే, ఆయుస్సున్నంతవరకూ ఒక మామూలు మనిషిగా నీ బ్రతుకును నువ్వు బ్రతకడం, తరువాత చావడం. అంతే, ఇంతకంటే ఎవరయినా సరే ఏమీ చెయ్యలేరు.

కనుక, 'అంతా ముందే నిర్ణయింపబడి ఉన్నదనే విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను' అనుకోకు. నువ్వు జీర్ణించుకున్నా, జీర్ణించుకోలేకపోయినా తేడా ఏమీ రాదు. నీకోసం సృష్టి మారదు. చేతనైతే నువ్వే మారాలి, లేదా ఇలాగే చావాలి. అంతే. వెరీ సింపుల్. ఇందులో అంత అర్ధంకానిది ఏముంది?' అన్నాను.

(ఇంకా ఉంది)