“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

10, జులై 2022, ఆదివారం

UG గారి పుట్టినరోజు - ఆధ్యాత్మిక సంభాషణ - 2

అనుకున్నదానికంటే పావుగంట ముందే అతను తలుపు  తట్టాడు. లోపలకొచ్చి కూర్చున్నాక సంభాషణ మొదలైంది.

తనకు మా అబ్బాయి వయసుంటుంది.

'ఎక్కడుంటావు?' అడిగాను.

'కార్ఖానా దగ్గరలో ఉంటాను. డిఫెన్స్ లో ఆడిటర్ గా పనిచేస్తున్నాను'  అన్నాడు.

'పెళ్లయిందా?' అడిగాను.

'అయింది. రెండేళ్ల పాప ఉంది' అన్నాడు.

'ఇంత చిన్నవయసులో ఈ ధోరణి ఏంటి? ఎప్పటినుంచీ ఇది?' అడిగాను.

'చిన్నప్పటినుంచీ ఉంది' అన్నాడు.

'ఎలా మొదలైంది?' అడిగాను, ఎలా మొదలౌతుందో తెలిసినప్పటికీ.

'చిన్నప్పుడు వివేకానంద పుస్తకాలు చదివేవాడిని. 'రాజయోగం' అనే పుస్తకం చదివి అందులోని ప్రాణాయామం చేస్తుంటే  కొంతమంది, 'గురువు లేకుండా వాటిని చేస్తే వికటిస్తాయి. వద్దు చెయ్యకు' అన్నారు. ఆ తర్వాత ఓషో పుస్తకాలు చదివాను. చాలావరకు ఆయన పుస్తకాలను చదివేసానని అనుకున్నాక ఒక అనుమానం వచ్చింది. ఆయన, ఒకే విషయాన్ని రెండుచోట్ల రెండువిధాలుగా చెప్పేవాడు. ఒకదానికి ఇంకోదానికీ సంబంధం ఉండేది కాదు. అసలీయన చెబుతున్నది నిజమేనా? అనే అనుమానం వచ్చేది. అందుకని ఓషోను ఎవరు విమర్శించారు? అని వెదికితే జిడ్డు కృష్ణమూర్తి  దొరికాడు. 'అన్నన్ని రోల్స్ రాయిస్ కార్లేంటి?' అని జిడ్డు ఓషోని విమర్శించేవాడు. ఓషో కూడా జిడ్డుని విమర్శించేవాడు. అందుకని జిడ్డును చదవడం మొదలుపెట్టాను. కొన్నాళ్ళకు జిడ్డు కూడా డొల్లే అని అర్ధమైంది. ఆయనేదో choiceless awareness అంటూ పెద్దపెద్ద మాటలు వాడతాడు. కానీ విషయమేమీ ఉండదు. అంతా చదివితే చివరకు అక్కడేమీ కనపడదు. పెద్ద వాక్యూమ్ లో మనల్ని వదిలేస్తాడు. ఆయనకంటే ఓషోనే కొంత నయం. ఆయన ఫాలోయర్స్ కి తాంత్రిక్ సెక్స్ అన్నా ఆసరాగా ఉంది. దాంట్లో ఏదో కొంత ఆనందాన్ని వాళ్ళు పొందుతారు. ఒక యుఫొరియాలో ఉంటారు. కానీ జిడ్డు దగ్గర ఒక పెద్ద వాక్యూమ్ తప్ప ఏమీ లేదు. అందుకని, జిడ్డును ఎవరు విమర్శించారని వెదికితే UG దొరికాడు. జిడ్డు పెద్ద చీటరని, ఆయనొక మీడియం తప్ప ఇంకేమీ కాదని UG అనేవాడు. 

ఇక UG ఏమో వయసులో ఉన్నపుడు రమణమహర్షి గారిని సందర్శించాడు. అప్పటికే హిమాలయాలలో ఎంతో తపస్సు చేసి ఉన్నాడు. రమణాశ్రమంలో ఏదో ఒరుగుతుందని ఆశించి అక్కడకెళ్లాడాయన. కానీ అక్కడేమీ దొరకలేదు. పైగా ఇంకా ఇంకా ఆయనకు అసంతృప్తి ఎక్కువైపోయింది.

'నీదగ్గరున్నదానిని నాకివ్వ'మని రమణమహర్షిని UG అడిగాడు.

'నేనివ్వగలను. నీవు తీసుకోగలవా?' అని మహర్షి బదులిచ్చాడు.

'ఇప్పటికే ఇంత సాధన చేసి ఉన్నాను, తీసుకోడానికి నాక్కాకపోతే ఇంకెవరికి అర్హతుంది? అయినా నేను తీసుకోగలనో లేనో ఈయనకు తెలీదా? నన్నడగడమెందుకు? ఈయనేం జ్ఞాని?' అనుకుంటూ UG కోపంతో వెనక్కొచ్చేశాడు. 

ఆ రకంగా అక్కడనుంచి రమణమహర్షినీ, UG గారిని తెలుసుకున్నాను' అంటూ ఇంకా చెప్పబోతున్నాడు.

ఆపి, 'ఈరోజు UG గారి పుట్టినరోజు తేదీలప్రకారం' అన్నాను.

'అవునా? నాకావిషయం తెలీదు' అన్నాడు.

'సరే, కొనసాగించు' అన్నాను

'మొదటినుంచీ నాకు రెండు సందేహాలుండేవి. ఒకటి, 'హృదయం అనేది కుడివైపున ఉంటుంది' అని రమణమహర్షి అన్నారు. ఇదేంటి? అని ఒక సందేహం. నేను రెండేళ్లక్రితం అరుణాచలంలో ఎనిమిది నెలలున్నాను. బయట రూమ్ తీసుకుని, ఆశ్రమంలో ధ్యానం చేస్తూ ఉండేవాడిని. ఆ సమయంలో, ఒకరోజున ధ్యానంలో ఉన్నపుడు, ఒక్క క్షణంపాటు ఛాతీలో కుడివైపున ఏదో కరెంట్ షాక్ లాగా కొట్టింది. అప్పుడు నాకర్ధమైంది. స్పిరిట్యువల్ హార్ట్ అనేది కుడివైపే ఉంటుంది అని.  ఆ విధంగా ఆ సందేహం నివృత్తి అయింది.

రెండు, సృష్టిలో ప్రతిదీ  ముందే నిర్ణయింపబడి ఉంటుంది అంటారు  కదా ! ఉదాహరణకు, ముదలియార్ అనే ఆయన రమణమహర్షిని ఇదే ప్రశ్న అడిగారు. దానికి మహర్షి 'నిజమే' అన్నారు. అప్పుడు  ముదలియార్ తన ముందున్న కాఫీకప్పునో గ్లాసునో ప్రక్కకు జరిపి 'నేను ఇలా జరుపుతానన్నది కూడా ముందే నిర్ణయింపబడి ఉంటుందా?' అనడిగాడు. దానికి కూడా మహర్షి 'అవును' అన్నారు. దీనిని చదివినప్పుడు నాకస్సలు మింగుడు పడలేదు.

ఇదంతా చెబుతూ, 'మీకు ఎక్కిరాల భరద్వాజ, వేదవ్యాసలు తెలుసా?' అన్నాడతను.

నేను నవ్వి, 'తెలుసు, నువ్వు కొనసాగించు' అన్నాను.

'వేదవ్యాస  ఒకబ్బాయిని చదివిస్తూ ఉండేవారు. ఒకరోజున ఆ అబ్బాయిని ఇలా అడిగారు.

'నీకు భవిష్యత్తును చెప్పడం వస్తుంది కదూ"

దానికా అబ్బాయి, 'లేదండి నాకు రాదు' అన్నాడు.

అప్పుడు వేదవ్యాస, 'చూడు. నీకు  వస్తుందని నాకు తెలుసు. నిజం చెప్పు' అన్నాడు

అప్పుడా అబ్బాయి 'నిజమే నాకు అలా చెప్పడం వస్తుంది' అని ఒప్పుకున్నాడు.

'ఎంత ఖచ్చితంగా చెప్పగలవు?' అన్నాడు వేదవ్యాస.

ఒక కాగితం తెప్పించి దానిపైన ఏదో వ్రాసి కవర్లో ఉంచాడు ఆ అబ్బాయి. ఆ కవర్ని సీల్ చేసి ఫలానా తేదీన తెరచి చూడమని చెప్పాడు. వేదవ్యాస IAS ఆఫీసర్ కనుక,  ఏదో పని మీద ఫారిన్ ట్రిప్ వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చేసరికి ఆ డేట్ అయిపొయింది. సోఫాలో కూచుని ఆ కవర్ తెరవబోతుంటే పెంపుడు కుక్కపిల్ల ఆయన ఒళ్ళోకి దూకింది. కవర్ తెరచి, అందులో ఉన్న కాగితాన్ని చదివాడాయన.

'అనుకున్న తేదీన మీరీ కవర్ని తెరవలేరు. ఫారిన్ ట్రిప్ అడ్డొస్తుంది. తిరిగొచ్చాక సోఫాలో కూచుని తెరవబోతుంటే మీ కుక్కపిల్ల మీ ఒళ్ళోకి  దూకుతుంది' అని దాంట్లో ఉంది' అన్నాడు.

'అవునా ! ఆ అబ్బాయి పేరు?' అడిగాను.

'ఆయన పేరు శ్రీరామ్ సార్' అన్నాడు.

'విన్నాను ఆయన గురించి' అన్నాను.

'ఆయనిక్కడే మాదాపూర్ లో ఉంటారు'  అన్నాడు.

'ఆదిత్య అనే శిష్యుడు వాట్సాప్ గ్రూపులతో ఈయనను ప్రోమోట్ చేస్తుంటాడు కదూ?' అడిగాను.

'అవును. శ్రీరామ్ సార్ కి చాలామంది ఫాలోయర్స్ ఉన్నారు కానీ ఆదిత్య ఎక్కువగా ఈయన్ను ప్రోమోట్ చేస్తుంటాడు' అన్నాడు.

'మీరాయన ఫాలోయరా?' అడిగాను.

'కాదు. ఒకటి రెండుసార్లు వీళ్ళిద్దర్నీ కలిశాను' అన్నాడు.

'శ్రీరామ్ సార్ అనే ఆయన వేంకటేశ్వరస్వామి అవతారమని ఆయన ఫాలోయర్స్ ప్రచారం చేస్తుంటారు కదా' అడిగాను.

'అవును, కొంతమంది అలా నమ్ముతారు' అన్నాడు.

అప్పుడిలా అడిగాను.

'సరే, నాదొక డౌట్. శ్రీరామ్ సార్ లో అంతటి శక్తి ఉందని వేదవ్యాస రుజువులతో సహా గ్రహించినప్పుడు ఆయన్ను ఎందుకు ఒప్పుకోలేకపోయాడు? ఎందుకు అందరికీ ఆయన గురించి అప్పుడే చెప్పలేకపోయాడు? పైగా, నామాలు పెట్టుకుని తానే వెంకటేశ్వరస్వామినని ప్రచారం చేసుకుని భక్తబృందంతో భజన చేయించుకున్నాడు వేదవ్యాస.  ఇదేంటి  మరి?' అన్నాను.

'ఏమో నాకు తెలీదు. అహంకారం ఆయనకు అడ్డుపడి ఉండవచ్చు. కానీ ఆ సమయంలో ప్రక్కనున్న ఎక్కిరాల భరద్వాజ మాత్రం, 'నీవు భవిష్యత్తులోకి ఎంతదూరం అలా చూడగలవు?' అని శ్రీరామ్ సార్ ని అడిగాడు.

దానికి శ్రీరామ్ సార్, 'రాబోయే పదిరోజులలో ఏదో ఒక న్యూస్ పేపర్ హెడ్ లైన్స్ ఏమొస్తాయో ఇప్పుడే వ్రాసి ఇవ్వగలను. మీరు సరిపోయినన్ని కాయితాలు నాకు తెచ్చివ్వండి. ఎటర్నిటీ వరకూ ఏం జరుగబోతున్నదో వ్రాయగలను' అన్నాడు.

దానికి భరద్వాజకు కోపమొచ్చి, 'నువ్వు నాన్ బ్రాహ్మిన్ వి, నీకంత శక్తి ఎలా వస్తుంది?' అని కోప్పడ్డాడు. భరద్వాజగారికి స్పిరిట్యువల్ ఈగో చాలా ఎక్కువగా ఉండేదని ఈ విషయం గురించి విన్నతర్వాత నాకర్ధమైంది' అన్నాడు వెంకట్.

నేను నవ్వాను.

'అక్కడ స్పిరిట్యువల్ ఏమీ లేదు. ఉన్నది 'ఈగో' ఒక్కటే. నా దృష్టిలో ఎక్కిరాల బ్రదర్స్ ఆంధ్రాలో ఆధ్యాత్మికతను చాలా పాడు చేశారు. వాళ్లలో EK కొంచం బెటర్. అంతే' అన్నాను.

'మీరు భరద్వాజ గురించి ఇంకోటి వ్రాశారు. 'అన్నేళ్లు అమ్మ దగ్గర జిల్లెళ్ళమూడిలో ఉండి, బయటకెళ్లిపోయాడు భరద్వాజ. తప్పు చేశాడు' అని. అదికూడా నాకు నచ్చింది' అన్నాడు.

'ఎందుకెళ్ళిపోయాడో కూడా వ్రాశా కదా అందులోనే' అన్నా నవ్వుతూ. 

'కాకపోతే ఒకటి. శ్రీరామ్ సార్ ఇలా చెప్పడం వల్ల నాకొకటి అర్ధమైంది. Everything is predetermined in this universe అని. The first script of God is the last script' ప్రతివాడి జీవితంలోనూ జరిగేదంతా ఎప్పుడో డిసైడ్ అయింది, అందులో మార్పేమీ ఉండదు' అని శ్రీరామ్ సార్ కూడా అంటారు' అన్నాడు మళ్ళీ.

'సో వాట్? దీనిలో శ్రీరామ్ సార్ క్రొత్తగా చెప్పేదేముంది? ఇదంతా మన శాస్త్రాలలో ముందే చెప్పబడే ఉందికదా? కొత్తేముంది?' అన్నాను.

'అదికాదు. అంటే మన సోకాల్డ్ థాట్స్ కూడా ముందే డిసైడ్ అయి ఉంటాయనే కదా అర్ధం? ఇది నాకస్సలు డైజెస్ట్ కాలేదు. ఈ ఆలోచనతో, నా మైండ్ పోయినంత పనైంది. రోజువారీగా జరిగే సంఘటనలే గాక, మనం ఏం ఆలోచిస్తాం? ఎలా ఆలోచిస్తాం? అన్నది కూడా ముందే డిసైడ్ అయి ఉంటే, స్క్రిప్ట్ అంతా ముందే వ్రాయబడి ఉంటే, ఇక మనమేముంది? జీవితమేముంది? మనమంటూ సొంతగా చేస్తున్నదేముంది? అని నాకు దిగ్భ్రమ కలిగింది.

ఈ సందేహం నాలో ఇంకా మిగిలి ఉంది. దీనికి జవాబు మీ దగ్గర దొరుకుతుందేమోనని వచ్చాను.

ఇప్పటికి మనకు తెలిసిన మహనీయులలో రమణమహర్షి. UG కొంచం సరిగ్గా ఉన్నట్లు నాకనిపించారు. కానీ అందరూ UG గారిని తిడతారు. ఆయనకు కోపమెక్కువ. అరుస్తాడు. తిడతాడు' అంటారు. అంతకోపం ఉన్నవాడు జ్ఞాని ఎలా అవుతాడు? అంటారు. UG గారి గురించి మంచిగా మీరొక్కరే రాశారు. ఆయనమీద ఎనిమిది పోస్టులు రాశారనుకుంటా. ఆ తరువాత మధ్యలో ఆపేశారు. అందుకే మీకు మెయిలిచ్చాను. ఇప్పుడు మీ దగ్గరకొచ్చాను' అన్నాడు వెంకట్.

ఈలోపల మూర్తీ, సంధ్యా పల్నాడు ఎక్స్ప్రెస్ దిగి ఇంటికొచ్చారు.  'ఇతనే మూర్తి, పంచవటి ఇండియా ఫౌండేషన్ సెక్రటరీ. ఈమె సంధ్య, ఈయన సతీమణి, ఇద్దరూ ఎంతో పుణ్యాత్ములు, కారణజన్ములు' అని  వారిని వెంకట్ కు పరిచయం చేశాను. 

అతను చెప్పినదానిని బట్టి,  పుస్తకాలను బాగా చదివాడని, సరియైన దారికోసం బాగా వెదుకుతున్న ఒక అన్వేషకుడని నాకర్ధమైంది. పాపం అన్వేషణలో ఉన్నాడు, విషయాన్ని అర్ధమయ్యేలా చెబుదానుకున్నాను.

ఆ తరువాత చాలాసేపు, అంటే దాదాపు అరగంటసేపు, అందరం మౌనంగా ఉన్నాం.

చివరకు గొంతు సవరించుకుని ఇలా చెప్పడం మొదలుపెట్టాను.

(ఇంకా ఉంది)