“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

11, జులై 2022, సోమవారం

నేను మీ ఆశ్రమంలో చేరాలనుకుంటున్నాను

ఈ రోజున ఒక మెయిలొచ్చింది.

'నా పేరు ఫలానా. నేను మీ ఆశ్రమంలో చేరాలనుకుంటున్నాను' అన్నది దాని సారాంశం.

నాకర్ధం కాలేదు.

'సారీ మాది అనాధాశ్రమం కాదు' అని తిరిగి మెయిలిచ్చాను.

ఈసారి సుదీర్ఘమైన మెయిలొచ్చింది. ఆయనకు కోపం వచ్చిందని అర్థమౌతోంది.

'మీకెలా కనిపిస్తున్నాను? నేను స్టేట్ గవర్నమెంట్ లో పనిచేసి ఈ మధ్యనే రిటైరయ్యాను. పదేళ్లనుంచీ మీ బ్లాగు ఫాలో అవుతున్నాను. నాకు డొంకతిరుగుడు నచ్చదు. మీరంటే నాకు నమ్మకం కలగలేదు. మీరు మధ్య మధ్యలో రాసే కామెడీ పోస్టులే దానికి కారణం. నిజంగా ఆధ్యాత్మికం ఉంటే అలాంటి కామెడీ చెయ్యరని నా నమ్మకం. ఆధ్యాత్మికమంటే సీరియస్ వ్యవహారం. కామెడీ కాదు.

పైగా, మీకు ఆశ్రమం లేదు. అందుకే మిమ్మల్ని నేనిన్నాళ్ళూ నమ్మలేకపోయాను. ఇప్పుడు మీరు ఆశ్రమం పెట్టారు. అందుకే కొద్దిగా మీరంటే నమ్మకం కుదిరింది. మా ఆవిడ రెండేళ్ల క్రితం గతించింది. పిల్లలు సెటిలయ్యారు.  అందుకే ఇప్పుడు మీ ఆశ్రమంలో వచ్చి ఉందామనుకుంటున్నాను, ఎంత కట్టాలి? వగైరా గైడ్ లైన్స్ చెబుతారా?' అంటూ మెయిల్ ఇచ్చాడు.

నవ్వొచ్చింది. ఆయనకిలా మెయిలిచ్చాను.

గైడ్ లైన్స్ చెప్పడం నాకు చాలా ఇష్టం. వినండి.

1. పిచ్చోళ్లకు మా ఆశ్రమంలో చోటు లేదు. అందుకని, 'నేను పిచ్చోడ్ని కాను' అని ఒక రాగిరేకును మీ మెడలో కట్టుకోవాలి. ఆర్నెల్లకోసారి డాక్టర్ చేత దానిని సర్టిఫై చేయించి మాకు చూపిస్తూ ఉండాలి.

2. ఇది వృద్ధాశ్రమం కాదు. మీకస్సలు ప్రవేశం లేదు. వయసులోనూ మనసులోనూ వృద్ధులను మా ఆశ్రమంలో అనుమతించం. కానీ ఆ రూలు మాకు వర్తించదు.

3. మీ ఇష్టం వచ్చినట్లు ఇక్కడికొచ్చి ఉండటానికి అస్సలు కుదరదు. ఎందుకంటే, మా లైఫ్ స్టైల్ మీరు ఒక్కరోజు కూడా తట్టుకోలేరు. మా లైఫులో స్టైలే ఉండదు.

4. ఇప్పుడు ముఖ్యమైన గైడ్ లైన్ వినండి. ఎంత కట్టాలి? అని అడిగారు కదా. మేము చిన్నచిన్న ఎమౌంట్స్ తీసుకోము, మీ ఆస్తి మొత్తం మా ఆశ్రమానికి రాయాలి. ఆ తరువాత, మాకిష్టమైతే మీకింత ముద్ద పెడతాం. లేదంటే మాతోబాటు పస్తు ఉంచుతాం. మీరు నోరెత్తకూడదు. ఎత్తినా జవాబు ఉండదు.

5. ఒకసారి మీ ఆస్తి మొత్తం మాకు రాసిచ్చాక, మీ వారసులకు నచ్చక, ఏవైనా లీగల్ మేటర్స్ ఉంటే, అన్నీ జెనీవా కోర్టులోనే తేల్చుకుంటాం. ఇండియా కోర్టులంటే మాకు నమ్మకం లేదు.

6. ఉన్నట్టుండి మా ఆశ్రమంలో అందరమూ కనపడకుండా పోవచ్చు. మళ్ళీ ఎప్పుడొస్తామో, అసలొస్తామో లేదో ఎవరికీ చెప్పం. అప్పటిదాకా ఆ అడవిలో మీరొక్కరే ఉండవలసి వస్తుంది. దిక్కూ దివాణం ఉండదు.

7. ఆశ్రమంలో ఎన్నాళ్ళున్నా బోధనలేమీ ఉండవు. పైగా మధ్యమధ్యలో పిలిచి 'ఏం నేర్చుకుంటున్నావ్?' అని పరీక్షలు పెడుతూ ఉంటాం. ఫెయిలయితే పనిష్మెంట్ ఉంటుంది.

8. నాతో ఎవరేది మాట్లాడినా దానిని బ్లాగులో రాసేస్తాను. అది నా అలవాటు. ఇప్పుడు మీ మెయిల్ని కూడా రాయబోతున్నాను. మీరు హర్టయితే నాకు  సంబంధం లేదు.

ఇన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. మీకు నచ్చితే చేరవచ్చు. ఇందులో కామెడీ ఏమీ లేదు. చాలా సీరియస్' అని మెయిలిచ్చాను.

ఇంకా రిప్లై రాలేదు. 

I am still waiting...