“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

23, జూన్ 2022, గురువారం

సిస్టర్ శివాని గారి మీటింగ్ ఉంది వస్తారా?

నిన్న మా కొలీగ్ ఆఫీసర్ ఒకాయన ఫోన్ చేశాడు. తను ఎప్పుడోగాని నాతో మాట్లాడడు.  ఏంటా? అనుకుంటూ  ఫోనెత్తా.

ఉన్నట్టుండి ఎంతో ఆప్యాయంగా కుశలప్రశ్నలు వేస్తున్నాడు. అన్నింటికీ ఓపికగా జవాబులిస్తూ, అసలు విషయం ఏంటా? అని ఆలోచిస్తున్నా. చాలామంది ఇంతే. విషయంలోకి రాకుండా బీటింగ్ ఎరౌండ్ ద బుష్ చేస్తుంటారు. మనకేమో ఈ  వేషాలంటేనే చిరాకు.

ఆయన మాత్రం ఎంతసేపు సోది మాట్లాడగలడు పాపం? విషయంలోకొస్తూ, 'రేపు శుక్రవారం నాడు మీరుంటారా?' అన్నాడు.

'ఎలా చెప్పగలమండీ? ఆయుష్షు మన చేతుల్లో లేదుగా?' అన్నా

'ఆబ్బె నా ఉద్దేశం అదికాదు.  ఫ్రీగా ఉంటారా?' అన్నాడు.

'లంచాలు తీసుకోవడం నాకిష్టం ఉండదు' అన్నా.

'భలే జోకులేస్తారండి మీరు. అదికాదు. సిస్టర్ శివాని మీటింగ్ ఉంది, మీక్కూడా పాస్ తీసుకుంటా మీరొస్తానంటే?' అన్నాడు.

'ఎవరామె?' అన్నా తెలిసినా తెలీనట్టు. 

ఈ మధ్యన ఇదొక ట్రెండ్ ఎక్కువైంది. ఆఫీసులోకూడా చేపలుపట్టేవాళ్ళు ఎక్కువయ్యారు. ఒకడేమో బ్రహ్మకుమారీస్ అంటాడు, ఇంకొకడు రామచంద్రా మిషన్ అంటాడు, మరొకడు ఈషా అంటాడు. ఈ పిచ్చోళ్ళని చూస్తుంటే నాకే పిచ్చెక్కేలా ఉంది. ప్రతివాడూ ఒక వలేసుకుని వేటకి బయల్దేరుతున్నాడు. అసలైన హిందూమతాన్ని, సనాతనధర్మాన్ని మాత్రం అందరూ మర్చిపోతున్నారు. కలిమాయ అంటే ఇదేనేమో?

'అదేంటండి ఆమె తెలీదా? బ్రహ్మకుమారీస్ లో పెద్ద స్పీకర్' అన్నాడు.

'ఏంటి లౌడ్ స్పీకరా?' అన్నా ఆశ్చర్యాన్ని నటిస్తూ.

నామాట పట్టించుకోకుండా, 'ప్రెసిడెంట్ అవార్డు కూడా తీసుకుంది' అన్నాడు.

'అక్కడే ఆమె విలువ పోయింది' అన్నా.

'అదేంటి? అంతమాటన్నారు?' అన్నాడు ఆశ్చర్యంగా.

'వినండి, 40 ఏళ్ల క్రితం, పద్మశ్రీ బిరుదునిస్తామని ప్రభుత్వం అంటే,  రంగనాథానందస్వామి తిరస్కరించారు. నాకున్న 'స్వామి' అన్న బిరుదు చాలు. దానిముందు మీరిచ్చే బిరుదులకు విలువలేదన్నారాయన. అయినా, రాజకీయులిచ్చే బిరుదులతో అవార్డులతో ఆధ్యాత్మికులకు విలువ పెరుగుతుందా?' అన్నాను.

కొంచం షాకయ్యాడు నా మాటలకి,

'అదికాదు, బ్రహ్మకుమారీస్ గురించి మీకసలు తెలుసా?' అడిగాడాయన.

ఇక విశ్వరూపం చూపించక తప్పదనిపించి, 'సిస్టర్ శివాని వయసెంత?' అన్నా.

'దాదాపు 50 ఉంటాయి' అన్నాడు.

'ఆమెకు పదేళ్ల వయసున్నపుడు నేను మొదటిసారి బ్రహ్మకుమారీస్ సంస్ధకెళ్ళాను. బోధలకోసం కాదు. 'రాజయోగం' అనే బోర్డుచూసి, అసలు వాళ్లకెంత తెలుసో  తెలుసుకుందామని, గుంతకల్లో గీతాటాకీస్ సందులో ఉన్న వాళ్ళ ధ్యానకేంద్రానికి 1982 లో వెళ్లాను' అన్నా. 

'ఆమ్మో 40 ఏళ్ళక్రితమే మీకు తెలుసా?' అన్నాడు.

'తెలుసు. అంతేకాదు. వాళ్లకేమీ తెలీదని అప్పుడే నాకర్ధమైంది. ఎందుకంటే, అప్పటికే నేను పతంజలి యోగసూత్రాలను గట్టిగా అధ్యయనం చేసేవాడిని. వాళ్ళు రాజయోగం అంటున్నది రాజయోగం కాదని అప్పుడే నాకర్ధమైంది. నేనడిగిన ప్రశ్నలకు ఆ సెంటర్ వాళ్ళు సంతృప్తికరమైన జవాబులు చెప్పలేకపోయారు, ఏదేదో సోది మొదలుపెట్టారు. మీది భ్రమపూరిత సోది మాత్రమేనని వాళ్ళకప్పుడే చెప్పాను' అన్నా

'పోనీ ఇప్పుడడిగి చూడండి, సిస్టర్ చెప్పగలరు' అన్నాడు.

'ప్రస్తుతం నాకేమీ సందేహాలు లేవు. ఆమెకేమైనా సందేహాలుంటే నన్నడగమనండి  తీరుస్తాను, బ్రహ్మకుమారీస్ భ్రమల్లో ఉన్నారు. వాళ్ళు చెప్పేది అసలైన హిందూమతం కాదు. వాళ్ళ బోధనలు కరెక్ట్ కావు. ఆమె మీటింగ్ కి నేను రావడం కాదు.  నా దగ్గరకి  ఆమెనే వచ్చి నేర్చుకోమనండి. అసలైన  జ్ఞానం బోధిస్తాను' అన్నాను.

'ఆమె ఇంటర్నేషనల్ స్పీకరండి' అన్నాడు కోపంగా.

'అయిదేళ్లక్రితం అమెరికాలో నేనిచ్చిన ఉపన్యాసాలు యూట్యూబ్ లో ఉన్నాయి వినండి' అన్నాను

'అవునా? మరి ఇన్నాళ్లూ చెప్పలేదే?' అన్నాడు ఆశ్చర్యపోతూ.

'ఇంకొక్క నెలాగండి. ఇంకా తీరిగ్గా ఆశ్చర్యపోదురుగాని' అన్నా నవ్వుతూ. 

'అయితే రానంటారు?' అన్నాడు పట్టువదలని విక్రమూర్కుడిలాగా.

'వద్దులెండి. ఆ సోది నేను వినలేను. నేనడిగే ప్రశ్నలకు ఆమె జవాబులు చెప్పలేక అందరిలో అవమానపడుతుంది. ఆ ఖర్మ నాకెందుకు? కానీ మీకొక్క సలహా ఇస్తాను. బ్రహ్మకుమారీస్ పైత్యం తలకెక్కించుకోకండి. అది అసలైన హిందూమతం కాదు. అది అజ్ఞానమేగాని జ్ఞానం కాదు. ఆ విషం తలకెక్కించుకుంటే మీరు పిచ్చోళ్ళయి పోతారు, జాగ్రత్త' అన్నాను.

ఆయన కోపంగా ఫోన్ పెట్టేశాడు.

మంచి చెబితే ఎవడు వింటున్నాడు ఈ రోజుల్లో? ఎవరిఖర్మ వారిది. పడండి.