నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

29, జూన్ 2022, బుధవారం

మా ఆశ్రమం మొదలైంది - 7 (గురువు - సద్గురువు)

ఆదివారంనాడు జిల్లెళ్ళమూడిలో ఉన్నపుడు వర్ధని అక్కయ్య ఒక మాటంది.

అమ్మ ఎప్పుడూ 'నేను గురువును' అని చెప్పలేదు. 'నాకు శిష్యులు లేరు అందరూ శిశువులే' అనేది. అయితే ఒక సందర్భంలో మాత్రం, ఎవరో ఏదో అడిగితే, 'నేను గురువును కాదన్నాను గాని, సద్గురువును కాదనలేదుగా?' అన్నది.

ఈ మాటను వినడంతో నాకు చాలా సంతోషం కలిగింది.

అమ్మ సాహిత్యంలో ఈ మాటను నేనెక్కడా చదవలేదు. అయితే, ఆ విధంగా చెప్పినా చెప్పకపోయినా, అమ్మ సద్గురువే అని నేనెప్పుడూ అనుకుంటాను. మాతృభావంతో, 'నేను తల్లిని మీరు నా పిల్లలు' అని అమ్మ అని ఉండవచ్చు. కానీ, ఆ విధంగా చూచినా  కూడా,తల్లిని మించిన గురువెవరుంటారు? ప్రతి మనిషికీ మొదటి గురువు తల్లే కదా !

ఇంతకీ గురువుకూ సద్గురువుకూ భేదం ఏమిటి?

దేనిని నేర్పించేవాడైనా గురువే. 'సత్' ను గురిగా చూపించేవాడే సద్గురువు.

ఇంతే ఈ మాటలకున్న భేదం.

'సత్' అంటే? 'సత్' అంటే సత్యమని, 'ఉన్నది' అని, బ్రహ్మమని అర్ధాలు. దానికి దారిచూపేవాడు సద్గురువు. అమ్మ చెప్పిన మాటలలో సత్యం తొణికిసలాడుతూ ఉంటుంది, మరి అమ్మ సద్గురువు కాకుండా ఎలా ఉంటుంది?

'సద్గురు' అని మనకి మనం పేరు పెట్టుకోవడం కాదు. అలా పెట్టుకున్నంతమాత్రాన మనం సద్గురువులం అయిపోము. 'మహాత్మా' అని ఎవరో మనకి బిరుదునిస్తే మనం మహాత్ములం అయిపోతామా? బెంగాలీలు 'చక్రవర్తి' అని పేరు పెట్టుకుంటారు. అంతమాత్రాన వారందరూ చక్రవర్తులైపోతారా? ఇదీ అంతే.

సత్యాన్ని గురిగా చూపించేవాడే సద్గురువు. అలా చూపాలంటే, ముందు అదేంటో అతనికి తెలిసి ఉండాలి. దానిని అతడు చేరుకొని ఉండాలి. అనుభవంలో తెలుసుకుని ఉండాలి. అప్పుడే ఇంకొకరికి గురిగా, గురుతుగా దానిని చూపించగలుగుతాడు.

అతని యోచనలలో, మాటలలో, చేతలలో, సత్యం తప్ప ఇంకేదీ ఉండకూడదు. అతడు సత్యస్వరూపుడై, సత్యంతో నిండినవాడై ఉండాలి.

అలాంటివాడే 'సద్గురువు' అనిన పదానికి అర్హుడు.

(ఇంకా ఉంది)