“Self service is the best service”

19, జూన్ 2022, ఆదివారం

మా క్రొత్త పుస్తకం 'యోగరహస్యం' విడుదలైంది

నా కలం నుండి వెలువడుతున్న 45 వ పుస్తకంగా 'యోగరహస్యం' నేడు విడుదలౌతున్నది. ఇది దత్తాత్రేయులవారు అలర్కమహారాజుకు బోధించిన యోగశాస్త్రం. ఇది మార్కండేయపురాణం నుండి మనకు లభిస్తున్నది. మనకున్న 18 పురాణములు, 18 ఉప పురాణములలోని కేవలం ఒకేఒక్క పురాణంయొక్క కొంతభాగంలోనే ఇంతటి జ్ఞానసంపద లభిస్తున్నది. అన్నింటిలో చూస్తే ఎంత విజ్ణానమున్నదో అర్ధం చేసుకోండి! తురకల విధ్వంసాలలో  తగలబెట్టబడిన గ్రంధాలలో ఎంతటి విజ్ఞానసంపద నాశనమైపోయిందో గ్రహించండి !

అలర్కమహారాజు  రామాయణకాలం కంటే కొంచెం ముందటివాడు. అంటే, దాదాపుగా నేటికి 9000 ఏళ్ల క్రితం వాడు. మన ప్రాచీనుల చరిత్రలను పూర్తిగా మరచిపోయిన నేటితరం వారికోసం ఈయన చరిత్రను ఇందులో వివరించాను.

దత్తాత్రేయులవారి గురించి భారతీయులకు చెప్పవలసిన పనిలేదు. ఆయన సాక్షాత్తూ భగవంతుడే. మహనీయులైన అత్రిమహర్షి అనసూయల కుమారుడీయన. త్రిమూర్తిస్వరూపుడైన ఈయన సాక్షాత్తూ పరశురామునకే గురువు. యోగ, జ్ఞాన, తంత్రములు ఈయనలో పరిపూర్ణమైన సిద్ధిని అందుకున్నాయి. సాక్షాత్తు పరమాత్మగా మనం ఈయనను ఆరాధిస్తాం. ఈనాటికీ భూమిపైన సజీవంగా ఉన్న అవతారపురుషులలో ఈయనొకరు.

యోగసూత్రములను వ్రాసిన పతంజలిమహర్షి, బుద్ధుని తరువాత 400 ఏళ్లనాటి వాడు. అంటే నేటికి 2000 ఏళ్ల నాటివాడు. యోగశాస్త్రమునకు పతంజలిమహర్షి ఆద్యుడు కాదు. తనకంటే ఎన్నోవేల ఏండ్లనుండీ మనదేశంలో ఉన్న యోగశాస్త్రమును ఆయన ఒక క్రమపద్ధతిలో పెట్టినాడు. దత్తాత్రేయులవారు పతంజలీమహర్షి కంటే ఎంతో ప్రాచీనుడు. పతంజలిమహర్షి కంటే వేలాది ఏళ్లక్రితమే యోగశాస్త్రమును బోధించినవాడు.

ఈ గ్రంధంలో చెప్పబడిన యోగశాస్త్రము,  పతంజలిమహర్షి యొక్క 'యోగసూత్రముల' కంటే కొంత భిన్నంగా, అంతకంటే ప్రాచీనమైన విధానంగా గోచరిస్తున్నది. రెంటినీ పోల్చి చూచినవారికి ఆయా తేడాలు బాగా అర్ధమౌతాయి. రెంటికీ నేను వ్యాఖ్యానములు వ్రాశాను గనుక అదంతా మరలా ఇక్కడ వివరించబోవడం లేదు.

యోగాభిమానులకు, యోగసాధకులకు, ఈ పుస్తకం ఎంతో నచ్చుతుందని నా నమ్మకం. ఈ పుస్తకం ఒక్కదానిని మీ గైడ్ గా పెట్టుకుంటే చాలు. జన్మ ధన్యమౌతుంది. దైవసాక్షాత్కారం లభిస్తుంది. మోక్షసిద్ధి కలుగుతుంది. అంతటి గొప్ప పుస్తకం ఇది.

యధావిధిగా, నేనుగాక ఇంకా ముగ్గురి పాత్ర ఈ పుస్తకం వెనుక ఉన్నది. వారు నా శిష్యురాలు అఖిల, శిష్యుడు ప్రవీణ్ మరియు నా శ్రీమతి సరళాదేవి. వీరికి నా కృతజ్ఞతలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. నేను చేస్తున్న అంతులేని ఈ జ్ఞానయజ్ఞంలో వీరు నా నిరంతర సహచరులు.

ప్రింట్ పుస్తకంగా ఇది వచ్చేలోపు, Google Play Books నుండి 'ఈ-బుక్' ను ఇక్కడ పొందవచ్చు.