“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

4, మార్చి 2022, శుక్రవారం

మా క్రొత్త 'ఈ బుక్' శంకరాచార్యులవారి "ఆత్మబోధ" విడుదలైంది

ఈ రోజు శ్రీరామకృష్ణులవారి 187 వ జయంతి. ఈ సందర్భంగా 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్'  నుండి ఒక క్రొత్త పుస్తకం విడుదలౌతున్నది. అది, ఆదిశంకరుల వారి 'ఆత్మబోధ. కేవలం 68 శ్లోకములతో కూడిన చిన్నపుస్తకమే అయినప్పటికీ, ఇందులో వివరింపబడిన అద్వైతవేదాంతపు లోతులను బట్టి చూస్తే చాలా పెద్ద పుస్తకమని చెప్పాలి. ఇప్పటివరకూ విడుదలైన మా గ్రంధాలలో ఇది 38 వ గ్రంధం. యధావిధిగా ఇదికూడా గూగుల్ బుక్స్ నుండి లభిస్తుంది.

శ్రీరామకృష్ణులవారి బోధనలు ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతములను సమన్వయపరుస్తూ, అతిసరళమైన విధానంలో జీవితానికి అన్వయించుకునే విధంగా ఉంటాయి. అసలైన సత్యంకూడా అదే. వేదములకు, ఉపనిషత్తులకు కేవలం ద్వైతపరంగానో, విశిష్టాద్వైతపరంగానో, అద్వైతపరంగానో భాష్యాన్ని చెప్పడము, వీటిలో ఏదో ఒకటే సరియైనదంటూ, మిగిలినవి తప్పులని ఖండించడమే అసలైన పెద్దతప్పు. ఇలా అనడం సాహసమైనప్పటికీ, త్రిమతాచార్యులు చేసిన తప్పు అదేనని చెప్పక తప్పదు. దానినే వారి అనుయాయులు నేటికీ కొనసాగిస్తూ వస్తున్నారు. ఆ  చీకటియుగాన్ని దాటి చాలా ముందుకొచ్చిన మనకు, అవే విభేదాలను 'శైవం, వైష్ణవం, శాక్తేయం' అంటూ మళ్ళీ కొందరు ఆచార్యులు నూరిపోస్తున్నారు. శివుడే దేవుడని, విష్ణువే దేవుడని, ప్రజలను మళ్ళీ వర్గాలుగా చీలుస్తూ విభేదాలను సృష్టిస్తున్నారు. సమాజాన్ని చీకటియుగాలలోకి మళ్ళీ తీసుకుపోతున్నారు. ఇది పూర్తిగా తప్పు. ఈ తప్పును సరిదిద్దవలసిన బాధ్యత నిజమైన ఆధ్యాత్మిక గురువులపైన ఉన్నది.

సత్యమేమిటంటే, అసలైన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ మూడుమతాలూ మూడుమెట్లు మాత్రమే. ఒకే సత్యాన్ని మూడు భిన్నములైన కోణాలలోనుంచి చూచినప్పుడు అది మూడు విధాలుగా కనిపిస్తుంది. కానీ ఏ ఒక్క కోణమూ పరిపూర్ణసత్యం కాదు.  అన్ని కోణాలనుంచీ ఒక విషయాన్ని చూచి, దానిని సమగ్రంగా అర్ధం చేసుకోవడమే పరిపూర్ణ సత్యమౌతుంది. శ్రీ రామకృష్ణులవారు చెప్పినది ఇదే. వివేకానందులవారు బోధించిందీ ఇదే. ఆ తరువాత రమణమహర్షి, జిల్లెళ్ళమూడి అమ్మగార్లు చెప్పినది కూడా ఇదే.

నా మార్గం కూడా ఇదే. నా ' శ్రీవిద్యా రహస్యం'  గ్రంధంలో దీనినే వివరించాను.

త్వరలో  రాబోతున్న నా సంచలనాత్మక గ్రంధం, 'త్రిమత సమన్వయము' కు ముందస్తుగా కొన్ని శంకర,  రామానుజ, మధ్వ సాంప్రదాయాలకు చెందిన గ్రంధములను విడుదల చేయాలన్నది నా ఆలోచన. ఆ ఒరవడిలో ఒక ప్రయత్నమే శంకరాచార్యులవారు రచించిన ఈ 'ఆత్మబోధ' పుస్తకం. 

ఎంతోమంది పండితులు, జ్ఞానులు ఇప్పటికే ఈ గ్రంధానికి వ్యాఖ్యానాలను వ్రాశారు. నా చింతనాధోరణిలో ఇప్పుడు నేనూ దీనిని వ్యాఖ్యానించాను. అద్వైతాభిమానులకు నా వ్యాఖ్యానం తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను.

దానికి తోడుగా, ఈ రోజుకు ఇంకొక ప్రత్యేకత ఉన్నది.

ఈరోజున మా ఒంగోలు ఆశ్రమం పనులు మొదలయ్యాయి. ఆశ్రమస్థలాన్ని దున్నించడం, స్థలం హద్దులను సరిచూడడం, బోరింగ్ పాయింట్ ను గుర్తించడం మొదలైన ప్రాధమికపనులను ఈరోజున చేస్తున్నాము. అందుకని, నా శిష్యులందరి కోరికననుసరించి, మా ఆశ్రమస్థలంనుంచే ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నాను. ఈ విధంగా, మా ఆశ్రమస్థలం నుండి విడుదలౌతున్న మొదటి పుస్తకం -- శంకరుల 'ఆత్మబోధ' అవుతున్నది.

రాబోయే రెండునెలలలో ఆశ్రమపనులను చురుకుగా కొనసాగిస్తూ, కనీసం రెండు స్పిరిట్యువల్ రిట్రీట్స్ ను మా శిష్యులందరితో కలసి మా ఆశ్రమస్థలంలో జరుపబోతున్నాము. నిజమైన ఆధ్యాత్మికసాధకులకు ఇక పండుగరోజులు మొదలు కాబోతున్నాయి. నలభై అయిదేళ్లుగా సాగిన నా సాధనామార్గంలో నేను అవగతం చేసుకున్న అనేక నిగూఢమైన జ్యోతిష, యోగ, తంత్రరహస్యాలను, ఇన్నాళ్లూ నమ్మకంగా నన్ను అనుసరిస్తూ వస్తున్న శిష్యులకు దగ్గరుండి నేర్పించబోతున్నాను. వారిని యోగ-తంత్ర సాధనాపూర్వకమైన ధ్యానమార్గంలో ప్రాక్టికల్ గా నడిపించబోతున్నాను.

నేనిన్నాళ్ళూ చెబుతూ వస్తున్నది ఇప్పుడు సాకారం అవుతున్నది. గమనించండి !

ఈ ప్రయాణానికి తొలి అడుగుగా, మా ఆశ్రమస్థలం నుండి 'ఆత్మబోధ' ను ఈరోజు విడుదల చేస్తున్నాను. నా సాధనామార్గంలో నడవాలని ఆశించేవారికి ఈరోజు సుదినం. ఆధ్యాత్మిక జీవితపు అనుభవాలను ప్రాక్టికల్ గా పొందాలని ఆశించేవారికి ఇది నూతనాధ్యాయం !

ఇక, ఆనందపు వెల్లువలతో కూడిన నిరంతర అంతరిక ప్రయాణానికి సిద్ధం కండి  !