“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

20, మార్చి 2022, ఆదివారం

పద్యాలతో పరిపుష్ఠమైన ఆత్మబోధ

ఈ మధ్యనే విడుదలైన మా 'ఆత్మబోధ' గ్రంధం అద్వైతాభిమానులైన మేధావుల ప్రశంసలను పొందుతున్నది.

దాని తర్వాత ప్రస్తుతం ఆదిశంకరుల 'అపరోక్షానుభూతి'  అనే మరో గ్రంధం నా వ్యాఖ్యానంతో శరవేగంతో రూపుదిద్దుకుంటోంది. దానికోసం 175 తెలుగు పద్యాలను  వ్రాశాను. వాటిని వ్రాస్తూ ఉండగా, ఇప్పటికే విడుదలైన 'ఆత్మబోధ' గ్రంధానికి కూడా పద్యాలను వ్రాస్తే బాగుంటుందన్న సంకల్పం తలఎత్తింది.  సంకల్పం కలిగినతోడనే, అమ్మ అనుగ్రహంతో, మరొక 70 పద్యాలు ఆశువుగా ప్రవహించాయి. వాటిని 'ఆత్మబోధ' శ్లోకాలకు  జత చేశాను. ఈ విధంగా 'ఆత్మబోధ' కూడా తెలుగుపద్యాలతో పరిపుష్టమై, క్రొత్త సౌందర్యాన్ని సంతరించుకుంది.

మచ్చుకు కొన్ని పద్యాలు.


శ్లో|| ఉపాధిస్థోపి తద్ధర్మైరలిప్తో వ్యోమవన్మునిః

సర్వవిన్మూఢవత్తిష్ఠేదసక్తో వాయువచ్చరేత్ ||


ఆ || ఆశ్రయముల నున్న నాసక్తి గనబోడు

ఆకసమ్ము రీతి యమరు మౌని

మూఢు పగిది జూచు ముల్లోకముల దాను

గాలియంటనట్లు గదలిపోవు


శ్లో|| అనణ్వస్థూలమహ్రస్వమదీర్ఘమజమవ్యయమ్

అరూపగుణవర్ణాఖ్యం తద్బ్రహ్మేత్యవధారయేత్ ||


ఆ || చిన్నపెద్ద గాదు చింతించగా రాదు

పొట్టి పొడుగు గాదు పుట్టబోదు

రూప గుణములెల్ల రూఢిగా లేనట్టి

దాని బ్రహ్మమనుచు దలచవలయు


శ్లో|| జగద్విలక్షణం బ్రహ్మ బ్రహ్మణోన్యన్న కిఞ్చన

బ్రహ్మాన్యద్భాతి చేన్మిథ్యా యథా మరుమరీచికా ||


కం || బ్రహ్మము జగతికి వేరౌ

బ్రహ్మంబున కన్యతమము భాసించదుగా

బ్రహ్మంబున కన్యమైన

బ్రహ్మాండమ్మెండమావి; భ్రమయౌ గాదే !


శ్లో|| దృశ్యతే శ్రూయతే యద్యద్బ్రహ్మణోన్యన్న తద్భవేత్

తత్త్వజ్ఞానాచ్చ తద్బ్రహ్మ సచ్చిదానన్దమద్వయమ్ ||


ఆ || చూడ వినగ వచ్చు చోద్యమ్ము బ్రహ్మంబు

దానికన్యమైన దవ్వులేదు

జ్ఞానగరిమ సత్య మానంద మేకమ్ము

చిత్స్వరూపమనుచు జీరవలయు 

సొగసైన ఈ పద్యాలతో కలిపి మరీ ఆత్మబోధ యొక్క అద్వైతపు గుబాళింపును ఆనందించండి మరి !