“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

20, మార్చి 2022, ఆదివారం

అర్ధమైన ఆట

కులం మతం కుంపట్లు

రాజుకుంటు ఉన్నాయి

స్థలం దేశం వేర్పాట్లు

తగ్గబోమన్నాయి


అహం ఇహం ఎచ్చులన్ని

అరుస్తూనే ఉన్నాయి

మత్తు మదం  మంటలన్ని

ఎక్కువౌతున్నాయి


లేని గమ్యాలకోసం 

సాగిలపడుతున్నాయి

కాని సౌఖ్యాలకోసం

కాట్లకుక్కలయ్యాయి


కాలగతిన జీవితాలు

కాలిపోతున్నాయి

కోరికోరి కష్టాలను

కొనుక్కుంటున్నాయి


ఎటు పోవాలో తెలియని

ఎన్నెన్నో జీవితాలు

ఏమి రాయాలో తెలియని

ఎర్రపూల కాగితాలు


కాలం చెల్లిన బ్రతుకులు

కాటికి పోతున్నాయి 

మిగిలిఉన్న జీవితాలు

బిక్కుబిక్కుమన్నాయి


ఎవ్వరి కోసం ఆగని

కాలం ముందుకే పోతోంది

నవ్వుల మధ్యన దాగిన

మౌనం ఎందుకు నవ్వంది


ఆలోచిస్తే బ్రదుకున

అర్ధం ఏముంటుంది?

అర్ధమైన ఆటలోన

ఆత్రం ఏముంటుంది?