Everything is real, because the seer is real

30, సెప్టెంబర్ 2021, గురువారం

ఆట

ఎన్నోమెట్లను దిగుతూ

వచ్చానీ ఆటలోకి

ఆడి ఆడి అలసిపోయి

పోబోతున్నా ఇంటికి


ఇష్టంగానే దిగాను

ఇష్టంకాని ఊబిలోకి

కష్టమైనా నష్టమైనా

మింగేశా లోలోనికి


అలవాట్లూ అగచాట్లూ

పొరబాట్లూ వెన్నుపోట్లు

సర్దుబాట్లు అనుకుంటూ

నా ఆటను ఆడాను


ఆటకు అంతం లేదని

గెలుపు శాశ్వతం కాదని

ఆటే ఒక భ్రమ అని

త్వరగానే గ్రహించాను


మొదలైన ఈ ఆటను

మధ్యలోనే ఆపలేను

ఆట ముగిసిపోవాలి

ఇల్లు చేరుకోవాలి


చూస్తున్నా ముగింపు కోసం

ఆటను ముగించే తెగింపు కోసం

ఇంకెందుకు కలవడం నేస్తం?

మళ్ళీ మళ్ళీ విడిపోవడం కోసం?