“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

11, ఆగస్టు 2021, బుధవారం

న్యూయార్క్ గవర్నర్ ని కూడా వదలని గ్రహాలు

చాలామంది ఇలా అనుకుంటుంటే చాలాసార్లు విన్నాను, 'గ్రహాలు లేవు గిహాలు లేవు అంతా ట్రాష్ రా, అవి మనలనేం చేస్తాయ్?'. అలా అన్నవాళ్ళే కొన్ని నెలల తర్వాతో, కొన్నేళ్ల తర్వాతో విధి కొట్టిన దెబ్బకు గింగిరాలు తిరిగి నేలకూలిపోయారు. ఇలాంటి వాళ్ళను నా జీవితంలోనే చాలామందిని చూచాను. ఒకప్పుడు విర్రవీగుతూ తిరిగినవాళ్ళు తర్వాత బికారిమొహాలు వేసుకుని తిరగమూ చూచాను. అందుకే అంటారు - ఈరోజు అంతా బాగుందని గర్వం అహంకారం పనికిరాదని. ఎందుకంటే, రేపు మన చేతిలో లేదన్నది వాస్తవం. కాలందెబ్బకు మహారాజులే దిక్కూ దివాణమూ లేకుండా పోయారు మనమెంత?

మహారాజులంటే గుర్తొచ్చింది, న్యూయార్క్ గవర్నర్ యాండ్రూ కోమో రాజీనామా చేశాడు. ఎందుకూ అంటే, సెక్సువల్ హరాస్ మెంట్ అట. ఆయన గురవలేదు. గురిచేశాడట. ఇప్పటికి పదకొండు మంది తనక్రింద పనిచేసే అమ్మాయిల్ని ఇలా వేధించాడట. వాళ్లంతా ఊరుకున్నాళ్ళు ఊరుకుని, చివరకు తిరగబడి కంప్లెయింట్ చేశారు. ఈయన రాజీనామా చెయ్యవలసిన పరిస్థితి ఏర్పడింది.

అమెరికాలో ఈయన చాలా పాపులర్ రాజకీయ నాయకుడు.  2011 నుంచి గవర్నర్ గా ఉన్నాడు. అందులోనూ ప్రస్తుతం న్యూయార్క్ కు. అలాంటివాడు చివరకిలాంటి అల్లరిపాలై రాజీనామా చేశాడు. యధావిధిగా ఆయనిలా అన్నాడు.

'నేనే తప్పూ చెయ్యలేదు. ఇదంతా కుట్ర. అందరితో సరదాగా ఉన్నాను, జోకులేసేవాణ్ని. అంతే. అదే నేరమైతే సరే కానివ్వండి. తప్పుకుంటాను. ప్రభుత్వం కొనసాగనీ'.

పనిచేసేచోట జోకులెయ్యడం కూడా తప్పైతే ఎలా మరి? కళ్ళెత్తి చూడకూడదు, నవ్వకూడదు, మాట్లాడకూడదు, జోకెయ్యకూడదు, మరమనిషిలాగా బిగుసుకుని ఉండాలి. పోనీ అలా ఉంటే కూడా కోపాలే. "నేనింత బాగా తయారై వస్తే కనీసం కన్నెత్తి చూడలేదు, కనీసం ఒక కాంప్లిమెంట్ కూడా ఇవ్వలేదు" అంటారు. ఇస్తే నేరమౌతుంది. ఇవ్వకపోయినా నేరమే. ఇలాంటి చట్టాలతో ఎలా? పాపం పెద్దాయన్ని ఎలా దించేశారో చూడండి అన్యాయంగా !

ఇదంతా చూస్తుంటే నాకొక సామెత గుర్తొస్తోంది. ఈ సామెత నేను సృష్టించినదే. అదేంటో తెలుసా?

'దొరకని దొంగలందరూ కలసి, దొరికిన దొంగని 'దొంగ దొంగ' అన్నారట' ఎలా ఉంది నా సామెత? లేదా, కొంచం మార్చి కూడా చెప్పుకోవచ్చు. 'తెలివైన దొంగలందరూ కలసి, తెలివిలేని దొంగని 'దొంగ దొంగ' అన్నారట', ఇది కొంచం బెటర్ గా ఉంది కదా? పోన్లే ఏదో ఒకటి. మీకు నచ్చింది తీసుకోండి.

ఈ న్యూన్ చూస్తుంటే, పొద్దున్నే కర్ణపిశాచి చెవిలోజేరి ఇలా అంటోంది 'చూశావా కలికాలం? అమ్మాయిల్ని వేధించవచ్చునా అలా?'

నాకు నవ్వొచ్చింది.

'ఒసే పిశాచీ, మీ పిశాచాలకు అస్సలు తెలివి లేదే. నిరూపించావ్ మళ్ళీ ' అన్నాను.

అలిగింది.

మళ్ళీ ఎటుపోయి ఎటొస్తుందో అనుకుంటూ, 'బాబ్బాబు అలక్కు. నా ఉద్దేశ్యం ఏంటో చెబుతా విను' అంటూ ఇలా చెప్పా దానికి.

'అందరూ కలికాలం కలికాలం అంటారు, నువ్వుకూడా అదే అంటే ఎలా? కలికాలం ఇలా ఉండదు. కలికాలంలో అయితే, 11 మంది అబ్బాయిలను సెక్సువల్ గా వేధించిందని అమ్మాయి రాజీనామా చెయ్యాలి.  అదీ కలికాలమంటే. అలాంటి కలికాలం ఇంకా రాలేదు. ముందు ముందొస్తుంది.  అప్పటిదాకా ఆ డైలాగు అట్టేపెట్టుకో. మొన్న చూశావా, బిజీ ట్రాఫిక్ లో రోడ్డు దాటుతూ, తనది తప్పయినా, టాక్సీ డ్రైవర్ని 11 సార్లు కొట్టిన లక్నో అమ్మాయిలాగా అన్నమాట. అదీ కలికాలమంటే.

ఇదసలు కలికాలమూ కాదు, న్యూసూ కాదు. అందులోనూ అమెరికాలో. నేను చెప్పినదైతే న్యూసౌతుంది. అప్పుడను కలికాలమని, ఒప్పుకుంటాను. సరేనా?' అన్నాను.

'సరే నాయనా తప్పుతుందా? న్యూయార్క్ లో పరిస్థితి ఎలా ఉందో పాపం. యాండ్రూ ఇంటికెళ్లి చూసొచ్చి నీకు చెబుతా' అంది. 

'వెళ్తే వెళ్ళావ్ గాని,  కొంచం దూరంగా  ఉండి చూసిరా. మరీ ఆయన దగ్గరకెళ్ళకు' అన్నా.

గుర్రుగా చూసి మాయమైపోయింది కర్ణపిశాచి.

గ్రహాలు పనిచేస్తున్నాయా లేదా మరి? చెప్పినవి జరుగుతున్నాయా లేదా మరి?