“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

8, జూన్ 2020, సోమవారం

మిత్రులారా....

మిత్రులారా.... 
గుళ్ళకు రమ్మని నన్ను పిలవకండి
పానశాలలో పవిత్రత ముందు
గుడి చాలా అపవిత్రంగా కనిపిస్తోంది

మిత్రులారా....
మతవేషాలు వెయ్యమని నన్ను అడక్కండి
నగ్నత్వం అలవాటైన నాకు
మడిపంచెలు మహాకంపు కొడుతున్నాయి

మిత్రులారా....
పూజలు చెయ్యమని నాకు చెప్పకండి
సాకీధ్యానంలో తన్మయుడినైన నాకు
పరధ్యానం కూడా పరధ్యానమే అవుతోంది

మిత్రులారా....
ఎప్పటివో ప్రసాదాలు నాకు పెట్టకండి
నిత్యనూతన మధువును త్రాగే నాకు
ప్రసాదాలు పాచిబట్టి కనిపిస్తున్నాయి

మిత్రులారా....
నేను నాసిరకం నాస్తికుడినని అనుకోకండి
నా సాకీ ముగ్ధసౌందర్యం ముందు
నాస్తికుల అస్థిపంజరాలు నవ్వు పుట్టిస్తున్నాయి

మిత్రులారా....
నా దారిన నన్ను వదిలెయ్యండి
అవస్థలు పడుతూ కూడా మీరు చేరలేని అంచులకు
ఆకాశమార్గాన పయనిస్తూ ఎప్పుడో చేరుకున్నాను...

సాకీ నా దేవత
మధువే నా అమృతం
నేనుండేదే స్వర్గం
మరి నేనెవర్ని?
మిత్రులారా....